డైలీ సీరియల్

పూలకుండీలు - 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైనన్న షవర్‌లోనుండి ఒక్కసారిగా నిశ్శబ్దంగా దూసుకొచ్చిన చల్లటి నీళ్ళు తెప్పలా శాంతమ్మను కప్పేశాయి. అంత చల్లటి నీళ్ళు ఊహించని విధంగా వచ్చి తల నుండి పాదాలదాకా తడిపెయ్యడంతో ఉలిక్కిపడుతూ ఎగిరి గంతేసిన శాంతమ్మ అంతలోనే తనలో తను నవ్వుకుంటూ ‘‘ఎట్లా జుట్టంతా తడిసిపోయింది గదా నెత్తిమీంచే పోసుకుందాం’’ అనుకుంటూ సిగముడి విప్పి తలరా స్నానం చేసింది.
స్నానం చేసొచ్చిన శాంతమ్మ ‘ఆకలౌతుంది ఓ ముద్ద ఎంగిలి చేద్దాం’ అనుకుని అన్నం పొట్లాన్ని తీసుకుని విప్పింది.
పార్శిల్ని విప్పిన శాంతమ్మ అన్నం కలుపుకుని నోట్లో పెట్టుబోతుంటే హఠాత్‌గా పిల్లలు గుర్తుకొచ్చారు. దాంతో అన్నం సహించక లేచి వెళ్లి చెయ్యి కడుక్కుని పార్శిల్ని మడిచి పక్కకే వున్న చెత్తబుట్టలో పడేసింది.
చీర కొంగుకు చెయ్యి తుడ్చుకుంటూ అలాగే బెడ్‌మీద ఒరిగిన శాంతమ్మ ‘‘పిల్లలు ఏం తాగారో? ఏం తిన్నారో? నా కోసం ఎంతేడుస్తున్నారో? అమ్మా నాయినలను ఎంతేడ్పిస్తున్నారో?’’ అనుకుంటూ అనుకుంటూనే నిన్నటి నుండి సరిగా నిద్ర లేకపోవడంతో అలాగే గాఢ నిద్రలోకి జారిపోయింది.
ఆ పడుకోవడం పడుకోవడం సాయంత్రం ఆరు గంటలకు ఎవరో వచ్చి కాలింగ్‌బెల్ కొట్టిందాకా అలా పడుకొనే వుండిపోయింది శాంతమ్మ.
బద్ధకంగా కళ్ళు తెరిచి చూసిన ఆవిడకు ఒక్కసారిగా తను ఎక్కడుందీ వెంటనే అర్థం కాలేదు. కానీ, అంతలోనే మళ్లీ కాలింగ్ బెల్ మోగడంతో చప్పున స్పృహలోకొచ్చి వెళ్లి తలుపులు తీసింది.
ఎదురుగా పొద్దున వచ్చిన వాళ్ళు కాకుండా వేరే ఇద్దరు కొత్త సిస్టర్లు కన్పించారు. వాళ్ళను చూస్తూనే లోపలికి రమ్మనట్టు అప్రయత్నంగా పక్కకు జరిగి వౌనంగా నిల్చుంది శాంతమ్మ.
లోపలికొచ్చిన నర్సులమ్మల్లో కొంచెం లావుగా వున్నావిడ ‘‘శాంతమ్మంటే మీరేనా?’’ అంటూ ఆవిడ ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ అడిగింది.
‘‘ఔను’’ అన్నట్టు తలూపింది శాంతమ్మ.
‘‘ఇలా కూర్చోండీ!’’ వినబడీ వినబడనట్టుగా అంటూ ఆ పక్కనే వున్న కుర్చీ వంక చూపించింది కొంచెం పొట్టిగానూ సన్నగానూ వున్న మరో నర్సులమ్మ.
ఆవిడ చెప్పినట్టే వౌనంగా కుర్చీలో కూర్చుంది శాంతమ్మ.
ఒక సిస్టర్ వెంటనే బిపి మిషన్ ఓపెన్ చేసి శాంతమ్మను చెయ్యి చాచమన్నట్టు సైగ చేసింది.
కుడి చెయ్యి ముందుకు చాచి బెడ్‌మీద పెట్టింది శాంతమ్మ.
చాచిన చేతికి బిపి మిషన్ బెల్ట్ చుడుతూ ‘మీదేవూరు?’ అంటూ శాంతమ్మను ప్రశ్నించిందా సిస్టరమ్మ.
‘పాలొంచ’ అంటూ బదులిచ్చింది శాంతమ్మ.
‘‘పిల్లలెంతమంది?’’ మరో ప్రశ్న వేసింది సిస్టర్ బిపి మిషన్లో పైకి కిందకూ పరుగుల తీస్తున్న పాదరసం సూచికను గమనిస్తూ.
‘నలుగురు’ చెప్పింది శాంతమ్మ.
‘‘మీ ఆయనేం చేస్తాడు’’ ఇంకో ప్రశ్న సంధించిందా సిస్టరమ్మ.
‘‘కంపెనీ పనికి బోతాడు’’ ఓపిగ్గా బదులిచ్చింది శాంతమ్మ.
అంతటితో తన పని అయిపోయినట్టు బిపి మిషన్ బెల్టు విప్పి మడిచి లోపల పెడుతూ పక్కకు తప్పుకుందా సిస్టరమ్మ.
వెంటనే ముందుకొచ్చిన పొట్టి సిస్టరమ్మ సిరంజి బైటికి తీసి శాంతమ్మ ఎడం చెయ్యి నరం దొరకబుచ్చుకొని బ్లడ్ శాంపిల్ తీసుకుంటూ ‘ఒక్కదానివే వచ్చావా?’ అంటూ మాటల్లో పెట్టింది.
సూదిపోటుకు వెరుస్తూ కళ్ళు మూసుకుని ‘ఔను’ అంటూ బదులిచ్చింది శాంతమ్మ.
‘‘ఈ రాత్రికి కూడా నీకు భోజనం ఇక్కడికే వస్తుంది. కడుపునిండా తిని హాయిగా పడుకో, రేప్పొద్దున మాత్రం మేం చెప్పిందాకా ఏదీ తినొద్దు’’ అంటూ వెళ్లిపోయారా నర్సులమ్మలిద్దరూ.
‘సరే’ అంటూ వాళ్ళను పంపించిన శాంతమ్మ మళ్లీ తలుపేసుకుని మంచంమీద కూర్చుంటూ ‘‘ఆ రెడ్డిగాడు పొద్దుననంగా నన్నిక్కడ దించి ఎటుపొయ్యాడో ఏమో? ఇంతవరకు ఇటు తిరిగి కూడా చూడలేదు!’’ అనుకుంటుండగానే కాలింగ్ బెల్ మోగింది.
‘‘ఇందాక ఆ సిస్టరమ్మమలు చెప్పినట్టు ఎవరన్నా భోజనం తీసుకొచ్చారేమో?’’ అనుకుంటూ వెళ్లి తలుపులు తీసింది శాంతమ్మ.
నిజంగానే ఎవరో కుర్రాడు భోజనం పార్శిల్ తీసుకొచ్చాడు.
ఆ పార్శిల్ అందుకుని లోపల పెట్టుకున్న శాంతమ్మ మళ్లీ వెంటనే తలుపులేసుకుంది.
ఇంతలో...
ఫోన్ రింగవ్వడంతో వాగున కొట్టుకపోతున్నవాడికి తుంగ పోచ దొరికినట్టు చుటుక్కున ఫోనెత్తింది.
అవతలనుండి ఆర్‌ఎంపి లింగయ్య మాట్లాడుతూ ‘‘ఏం శాంతమ్మా! అక్కడెలా వుంది. ఆ వెంకటరెడ్డి నీతోనే వున్నాడు కదా?’’ అంటూ పలుకరించాడు.
‘ఎట్లుందంటే ఏం జెప్పాలన్నా?’ ఆ రెడ్డిగారు పొద్దుననంగా నన్ను తెచ్చి ఈ ఆస్పత్రిలో పడేసి ఎటుపోయాడో ఏమో! ఇప్పటిదాకా పత్తాలేడు’’ అంటూ బదులిచ్చింది శాంతమ్మ.
‘‘అట్లాగా.. నేనిప్పుడే అతనికి ఫోన్ చేసి తెలుసుకుంటాలే, నువ్వే భయపడకు. నువ్వైతే హాస్పిటల్లో వున్నావు కదా? అక్కడున్నవంటే సరే, ఇక మీ ఇంట్లో వున్నట్టే లెక్క మరి’’ అంటూ అటునుండి ఫోన్ కట్ చేశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
అంతలో..
పక్కరూమ్‌లోనుండి సందడి సందడిగా ఏవో మాటలు విన్పించసాగాయి.
ఆ అలికిడి విన్న శాంతమ్మ ‘ఎవరో పేషెంట్లు కొత్తగా దిగుతున్నట్టుంది.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు