డైలీ సీరియల్

పూలకుండీలు - 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సిస్టర్ వచ్చి ‘‘ఇంకో అరగంటలో డాక్టరమ్మగారు వస్తున్నారు. నువ్వు లేచి తయారై వుండు’’ అంటూ హెచ్చరించి వెళ్లింది.
తను ఏ పని నిమిత్తమై భర్తకు, అత్తమామలకు కూడా తెలవనివ్వకుండా ఇంత దూరమొచ్చిందో, గత మూడు రోజులుగా వంటరిగా ఆ గదిలో ఎందుకు పడి వుందో ఆ పని కాస్త కార్యరూపం దాల్చబోతుందన్న విషయం తెలిసి రావడంతో ఓ విధమైన భయం కడుపులో జొరబడడంతో బెడ్‌మీద అమాంతంగా కూలబడిపోయింది శాంతమ్మ.
శాంతమ్మ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ సిస్టర్ ‘‘ఏంటి వంట్లో బాగోలేదా’’ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని చూసింది.
‘‘లేదు లేదు బాగానే వుంది’’ కొంచెం సిగ్గుపడుతూ తల వంచుకొని చెప్పిన శాంతమ్మ సిస్టర్ చేతిలోనుండి సున్నితంగా తన చేతిని వెనక్కి తీసుకుంది.
‘‘సరే వుండు మరి’’ అంటూ సిస్టర్ వెళ్లిపోయింది.
సిస్టర్ చెప్పి వెళ్లినట్టే ఖచ్చితంగా అరగంట తరువాత ఓ మధ్య వయసు లేడీ డాక్టర్ మెడలో స్టెతస్కోప్‌తో చకచకా నడుచుకుంటూ శాంతమ్మ రూమ్‌లోకొచ్చింది.
ఆ డాక్టరమ్మను చూసిన శాంతమ్మకు కడుపులో ఎందుకో భయం రెట్టింపౌతుంటే ఆమె వంక ఓ విధమైన భయంతో కూడిన భావంతో వౌనంగా చూడసాగింది.
‘‘శాంతమ్మంటే నువ్వేనా?’’ బండమీద సుత్తిపెట్టి కొట్టినట్టుగా వున్న స్వరంతో ఖంగుమంటూ అడిగింది డాక్టరమ్మ.
‘‘ఔనమ్మా!’’ అంటూ కొంచెం ముందుకు వంగుతూ అణకువగా బదులిచ్చింది శాంతమ్మ.
‘‘రిపోర్టులన్నీ ఓకె. రేపు మీ ఆయనొచ్చి నీ గర్భాన్ని వేరేవాళ్ళకు అద్దెకివ్వడం తనకు ఇష్టమేనంటూ కాగితాలమీద సంతకం చేస్తే నేను వెంటనే నా పని మొదలుపెడతాను’’ నాపరాయిమీద వేరుశనక్కాయలు కొడుతున్నట్టు చట చటమంటూ చెప్పుకొచ్చింది డాక్టరమ్మ.
డాక్టరమ్మ మాటలు వింటూనే ఒకింత ఆశ్చర్యానికి లోనైన శాంతమ్మ ‘‘మా ఆయన యాన్నో బొంబాయిలో వున్నాడమ్మా! ఇప్పుడాయన రావడం కుదరదు. కావాలంటే మా నాయనను పిలిపిస్తా’’ అంటూ బదులు చెప్పింది.
‘‘ఇలాంటి విషయాల్లో భర్త వుండగా తండ్రి సంతకం చెల్లదమ్మా! అతనొచ్చి ఇందుకొప్పుకుంటున్నట్లుగా సంతకం చేస్తే తప్ప కుదరదు. అతనొచ్చేట్టుగా అయితే వుండు లేదా నువ్ చక్కా వెళ్ళిపోవచ్చు. మన ఇష్టమొచ్చినట్టు చెయ్యడానికి ఇక్కడ రూల్సొప్పుకోవు. నువ్వు చెప్పినట్టు చేస్తే మాకు లేనిపోని తలనొప్పులొచ్చి పడతాయి. అవ్వన్నీ మాకెందుకు చెప్పు?’’ ఇక రెండో మాటకు అవకాశమే లేనట్టు చెప్పాల్సిందేదో సూటిగా చెప్పి వచ్చినంత వేగంగా వెళ్లిపోయింది డాక్టరమ్మ.
‘‘మల్లా ఇదెక్కడి ఖర్మరా దేవుడా! ఈ సంగతి ఎవరికైతే తెలవగూడదని అనుకుంటున్నానో ఆయనొచ్చి సంతకం చేస్తే తప్ప కుదరదని అంటుంది ఎట్లా? ఐనా ఈ రూల్లు గీల్లు అన్నీ ఆ ఆర్‌ఎంపి లింగయ్యకు, ఈ వెంకట్రెడ్డికి ముందు తెలియవా? లేకపోతే తెలిసే నాటకమాడారా? తీరా నోటి ముందుటికొచ్చిన కూడు నేలపాలైనట్టుంది నా పరిస్థితి’’ అనుకుంటూ తీవ్రమైన వ్యాకులతకు లోనయ్యింది శాంతమ్మ.
సరిగ్గా అదే సమయంలో ఎక్కణ్ణుండో వెంకటరెడ్డి వూడిపడ్డాడు.
అతణ్ణి చూడ్డంతోనే చికాకుపడిన శాంతమ్మ అప్పటిదాకా జరిగిన సంగతంతా పూసగుచ్చినట్టు చెప్పి ‘‘ఈ ముచ్చట మీకు ముందే తెలియదా?’’ అంటూ నిలదీసింది.
‘‘తెలిసే ఆ పిచ్చి డాక్టరమ్మను కాకుండా వేరే డాక్టరమ్మను పంపించమని హాస్పిటల్‌లో చైర్మన్‌తో ముందే చెప్పి వుంచాను కూడా, అయినా ఆ పిచ్చిదానే్న ఎందుకు పంపించాడో ఇప్పుడు పొయ్యి కనుక్కుంటాను’’ ఏదైతే జరగ్గూడదని తాను ఆదరా బాదరగా హాస్పిటల్‌కి వచ్చాడో అప్పటికే అది జరిగిపోవడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న వెంకటరెడ్డి ఎవరిమీదో రుసరుసలాడుతూ మాట్లాడాడు
‘‘మరిప్పుడేంది దారి?’’ అన్నట్టు వెంకటరెడ్డి వంక నిరాశగ చూసింది శాంతమ్మ.
‘‘అయినదానికీ, కానిదానికీ లక్షలకు లక్షలు గుంజే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇట్లా రూల్స్ గీల్స్ అనుకుంట కూర్చుంటే ఎట్లా కుదురుద్ది? ఆ డాక్టరమ్మదంతా చాదస్తం కాకపోతే’’ తన్లో తను అనుకుంటున్నట్టుగా పైకే అనేశాడు వెంకటరెడ్డి.
‘‘ఆమె కన్న పెద్ద డాక్టర్‌తోని చెప్పిస్తే?’’ ఆలోచన చేస్తూ అంది శాంతమ్మ.
‘‘ఆమెకన్నా పెద్ద డాక్టర్‌గాదు, స్వయంగా ఈ హాస్పిటల్ చైర్మన్ వచ్చి చెప్పినా ఆమె వినే రకంగాదు. ఆవిడంటే ఈ ఆస్పత్రివాళ్ళకు దేవుడితో సమానం. ఆమె కేసు చేపట్టిందంటే ఎంత పెద్ద రోగమైనా నిప్పులమీద నీళ్ళు జల్లినట్టు తగ్గిపోవాల్సిందే. ఈ ఆస్పత్రికి ఆమె గుండెకాయ లాంటిది. ఆమె మాటంటే ఇంక దానికి తిరుగే లేదు. ఏమైనా ఇగ మీ ఆయన్ని రప్పించక తప్పదు’’ అంటూ ఆ డాక్టరమ్మను గురించి వివరించాడు వెంకటరెడ్డి.
ఆ మాటలు వినడంతోనే ఒక్కసారిగా నిస్పృహకు లోనైన శాంతమ్మ ‘‘మా ఆయన ఇప్పుడు రాడు. ఒకవేళ వచ్చినా దీనికి చచ్చినా ఒప్పుకోడు. ఇగ నేను ఇంటికి పోవుడే మంచిదమో?’’ వెంకటరెడ్డి వంక చూస్తూ అంది.
‘‘ఆగాగు తొందరపడకు, నేను బొయ్యి చైర్మన్‌తో మాట్లాడొచ్చినంక ఏం చెయ్యాల్లో ఆలోచిద్దాంగాని’’ అంటూ గబగబా బయటకు నడిచాడు వెంకటరెడ్డి.
శాంతమ్మ నిస్త్రాణంగా బెడ్‌మీద వాలిపోయింది.
అప్పుడు వెళ్లిన వెంకటరెడ్డి గంట గంటన్నర తరువాత తిరిగొచ్చాడు.
అతను రూమ్‌లోకి రాగానే చప్పున లేచి నిల్చున్న శాంతమ్మ ‘ఏమైంది?’ అన్నట్టు చూసింది.
- ఇంకా ఉంది