డైలీ సీరియల్

పూలకుండీలు - 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమయ్యేది లేదు. ఆ డాక్టరమ్మ చెప్పింది నిజమే గదా, మీరే ఏదోవిధంగా బొంబాయి నుండి వాల్లాయన్ని రప్పించండి అన్నాడు చైర్మన్‌కూడా’’ కనుబొమ్మలు పెద్దవి చేసి నొసలు విరుస్తూ చెప్పుకొచ్చాడు వెంకటరెడ్డి.
‘‘ఇక అది కానిపనిలే గాని నేను బోతా’’ నిలబడడానికి కూడా శక్తిలేట్టుగా ఒక్కసారిగా తిరిగి బెడ్‌మీద కూర్చుంటూ అన్నది శాంతమ్మ.
శాంతమ్మ వెంకటరెడ్డిల మధ్య కొంతసేపు వౌనం రాజ్యం చేసింది.
‘‘ఒక పని చేస్తే’’ వౌనాన్ని ఛేదిస్తూ చివరికి నోరు విప్పాడు వెంకటరెడ్డి.
‘‘ఏందది’’ నిరాసక్తిగా అతని వంక చూస్తూ అంది శాంతమ్మ.
‘‘మీ ఆయనకి ఫోన్ చేసి మీ ఆవిడ గర్భసంచికి గడ్డయ్యింది. హైదరాబాద్ హాస్పిటల్లో చేర్చారు. నువ్వు వెంటనే బైలుదేరి వచ్చి కాగితాల మీద సంతకాలు చేస్తేనే ఆపరేషన్ చేస్తారట. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి నేరుగా హైదరాబాద్ వచ్చి సంతకాలు చేసి వెళ్ళమని ఎవరితోనన్నా ఫోన్ చేయిస్తే సరి, దాంతో చచ్చినట్టు రేపీపాటికి అతనిక్కడ దిగకుంటే నా పేరు తీసి మారు పేరు పెట్టుకుంటా’’ ఏదో వశీకరణ మంత్రం వేస్తున్న వాడిలా శాంతమ్మ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలాంటి విషయాలు కాకలు తీరిన బంటులా ఓ పెద్ద పథకాన్ని సూక్ష్మంగా వివరించాడు వెంకటరెడ్డి.
‘‘ఇదేదో బాగనే వుందిగాని, ఒకేల అప్పటికీ ఆయన రాకుంటే’’ తనలోని సందేహాన్ని వ్యక్తం చేసింది శాంతమ్మ.
‘‘అదేంది! పెండ్లానికి సీరియస్‌గుందని తెలిస్తే రాని మొగోడుంటాడా! అట్ల రాకుండా వుండడానికి అతనేమన్న మట్టిగడ్డా? మనుమోతా?’’ వ్యంగ్యానికి విసుగును జోడిస్తూ అన్నాడు వెంకటరెడ్డి.
‘‘లేదు లేదు తనను బొంబాయి నుంచి రప్పించడానికి మేమట్లా నాటకమాడుతున్నామని అనుకోవచ్చుగదా?’’ తన అనుమానం వెనుక వున్న కారణాన్ని వెల్లడిస్తూ అంది శాంతమ్మ.
‘‘ఎంతో సీరియస్‌గా వుండబట్టే హైదరాబాద్ దాకా తీసుకొచ్చుంటా రనుకోవచ్చు గదా?’’ తార్కింగా బదులిచ్చాడు వెంకటరెడ్డి.
‘‘నిజంగా నాకట్లాంటిదేదన్నా జరిగితే ఏ కొత్తగూడెమో అంతగ్గాకుంటే ఖమ్మం దర్మాసుపత్రికో పోతాంగాని హైదరాబాద్ దాకా పోలేం గదా? ఆ సంగతి ఆయనకు తెలవదా? అందుకే అంటున్నా’’ తన మనసులోని మాటను వివరించింది శాంతమ్మ.
శాంతమ్మ మనసులోని సందేహాన్ని అర్థం చేసుకున్న వెంకటరెడ్డి కొద్దిసేపు ఏదో ఆలోచించి చివరికి తలపంకిస్తూ ‘‘మీకు తెల్లకార్డుందా?’’ అరమోడ్పు కళ్ళతో ఆమె వంక చూస్తూ అడిగాడు.
‘‘ఉంది’’ ఎందుకో అప్రయత్నంగా ఊపిరి తీసుకుంటూ చెప్పింది శాంతమ్మ.
‘‘హ్హో.. ఇంకేంది మరి? ఆ కార్డు తీసుకొని ఆరోగ్యశ్రీ పథకం కింద ఖమ్మంబోతే అక్కడ లాభం లేదని వాళ్ళే హైదరాబాద్ పంపించారని చెబితే సరి’’ ఇలాంటి విషయాల్లో తానెంత పండిపోయాడో తెలియజేస్తున్నట్టుగా మాట్లాడాడు వెంకటరెడ్డి.
అతని మాటలను విన్న శాంతమ్మ ‘‘అమ్మో! ఈ రెడ్డోడు సామాన్యుడుగాదురా దేవుడో!’’ ఆశ్చర్యంతో తల మునకలవుతూ తన్లో తనే అనుకోసాగింది.
‘‘ఇంకా ఏమాలోచిస్తున్నావు?’’ అడిగాడు వెంకటరెడ్డి అసహనంగా.
‘‘ఇదుగో ఇందులో రాత్రి ఆయన చేసిన నెంబరుంది ఫోన్‌చేసి, ఏం చెబుతారో మీరే చెప్పండి!’’ అంటూ తన ఫోన్ తీసి వెంకటరెడ్డి చేతిలో పెట్టింది శాంతమ్మ.
అంతకుముందే వచ్చిన ఎల్లయ్య ఫోన్ నెంబర్ తీసి చూసిన వెంకటరెడ్డి తన సెల్‌లోనుండి అతనికి ఫోన్ చేశాడు.
‘‘....’’
‘‘నా పేరు వెంకటరెడ్డి. నేనిక్కడ హైదరాబాద్ హాస్పిటల్‌నుండి మాట్లాడుతున్నా. ఇక్కడ మీ ఆవిడ శాంతమ్మ గర్భసంచికి గడ్డయ్యిందంట. వెంటనే ఆపరేషన్ చెయ్యల. లేకుంటే ప్రాణానికే ముప్పని డాక్టర్లు చెబుతున్నారు’’.
‘‘......’’
‘‘అదే మేం గూడా చెయ్యమనే అంటున్నాం. కానీ, నువ్వొచ్చి సంతకం చేసిందాకా ఇక్కడ ఆపరేషన్ చెయ్యమంటున్నారు. అందుకే అర్జంటుగా ఇపుడు మీకు ఫోన్ చేస్తున్నాం’’ ఎలా వుంది నా తెలివి అన్నట్టు శాంతమ్మ వైపు చూస్తూ మాట్లాడసాగాడు వెంకటరెడ్డి.
‘‘....’’
‘‘మేం పక్కబెడ్డువాళ్ళం. మాదిక్కడే చౌటప్పల్ దగ్గర పల్లెటూరు. మా ఆవిడగ్గూడా గర్భసంచికి గడ్డైతే ఇక్కడే ఆపరేషన్ చేయించాము. నేను కూడా సమయానికి ఊళ్ళో లేకుంటే నేనొచ్చిందాకా ఆపి నేనొచ్చి సంతకం చేశాకే ఆమెకు ఆపరేషన్ చేశారు. అందుకే నువ్వు రాక తప్పదని అంటున్నా అర్థమైందా?’’ కనురెప్పలు కొట్టుకునేంత సహజంగా అబద్ధాలమీద అబద్ధాలు ఆడుతూ ఫోన్లో మాట్లాడసాగాడు వెంకటరెడ్డి.
‘‘...’’
‘‘ఆమె ఇక్కడ లేదు. టెస్ట్ వుందనె్జప్పి ఇప్పుడే నర్సులమ్మలొచ్చి లోపలికి తీసుకుపొయ్యారు’’ అన్నాడు వెంకటరెడ్డి.
‘‘.....’’
‘‘నీ ఇష్టం మరి నీ భార్య నీకు దక్కాలంటే వున్న పాటున బయలుదేరిరా!’’ అంటూ కావాలనే ఫోన్ కట్ చేశాడు వెంకటరెడ్డి.
‘‘ఏమంటున్నాడు?’’ వెంకటరెడ్డి ముఖంలోకి చూస్తూ అడిగింది శాంతమ్మ పీలబోతున్న గొంతుకతో
‘‘ఏమంటాడు, ఇంత సీరియస్ అయ్యిందాకా నాకెందుకు చెప్పలేదంటున్నాడు’’ ఆ విషయంమీద అంతకన్నా ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేదన్నట్టు మాట్లాడాడు వెంకటరెడ్డి.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు