డైలీ సీరియల్

పూలకుండీలు - 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరువుగల్ల ఆడదీ చెప్పగూడని ముచ్చటే అయినా తోడబుట్టిన లాంటివాడివని నీతో చెబుతున్నా!’’ అంటూ ఏదో చెప్పబోయిందిగాని అంతలోనే ఎందుకో చెప్పడానికి సందేహిస్తున్నట్టుగా ఆగిపోయింది శాంతమ్మ.
‘‘అదేంటో చెప్పు’’ అన్నట్టు శాంతమ్మ వైపు చూశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఏంజెప్పమంటవన్నా! ఉన్న గుడిశ పీకి ఆ చింతచెట్టు కింద కాపురం పెట్టిన ఈ ఆరు నెలల్లో ఒక్కసారన్న ఆలుమగలం కలిసి సంసారం చేసింది లేదు. చెప్పుకుంటే సిగ్గుబాయె, చెప్పకుంటె మానం బాయె అన్నట్టు తయారయ్యిందన్నా మా పరిస్థితి’’ ఈ కారణంగా తన మీద కోపంతో భర్త ఎక్కడన్నా గడ్డిగరుస్తాడేమోనన్న బెంగ ఓ పక్క మనసును కుదిపేస్తుంటే మరోపక్క పరాయి మగవాడికి చెప్పగూడని విషయం చెప్పానన్న సిగ్గుతో తల వంచుకున్న శాంతమ్మ కళ్ళనుండి నిశ్శబ్దంగా రాలిపడుతున్న కన్నీటి బిందువులను చీరకొంగుతో తుడ్చుకోసాగింది.
‘‘అరెరే! ఎందిది? వూకో వూకో ఇట్టాంటి బాదలు మనం పడలేమనే అయ్యాల మా ముసలోల్లు, నేనూ నెత్తి నోరు గొట్టుకొని చెప్పినం. కానీ ఏం లాభం, నువ్ ఇన్పించుకోకుండా గుడిశ పీకించి, చెట్టు కింద కాపురం బెట్టించావు. సర్లే నువ్వు ఏది జేసినా మన కోసమే జేస్తున్నవు గదాని కుక్కిన పేనుల్లెక్క నోరు మూసుకుని రోజులు ఎల్లదీస్తున్నం గానీ మేమెవ్వరం ఒక్కనాడు గూడా నిన్ను ఒక్కమాట అనలేదు కదా ఎందుకు బాధపడతవు?
ఈ బస్తీలో మనలెక్కే ఎంతమంది జనం ఆ లీడర్ల మాటలిని తింటున్న అన్నంలో మన్ను బోసుకున్నట్టు కాపురం ఉంటున్న గడిసెల్ని చేతులారా పీకేసుకొని డాబా ఇండ్ల మోజులో చెట్ల పాలుగాలేదు చెప్పు? వందలమందిలో మనమొకలం. ఇంటి గుట్టు లంకకు చేటన్నట్టు చెప్పగూడని ముచ్చట్లు ఇపుడు బైటికి చెప్పుకొని పిరికిదానిలెక్క ఏడుస్తావెందుకు? ఏడ్సుకుంట కూసుంటే ఇల్లయ్యిద్దా? అయ్యేనాటికి అదే అయ్యిద్దిలే వూకో’’ ఏ మాత్రం చదువు, సంధ్యలేని వాడైనా మనసున్న మనిషిగా, ఓ మంచి భర్తగా శాంతమ్మను గుండెల్లో పొదువుకుంటూ ఓదార్చాడు ఎల్లయ్య.
ఎల్లయ్య మాటలను విన్న ఆర్‌ఎంపి లింగయ్య ఒక్క క్షణం ‘‘అబ్బా వీడు జూస్తే పిచ్చోడి లెక్కేవున్నాడు గాని ఎంత లెక్కెమ్మటి మాట్లాడాడు!’’ మనసులో అనుకుని అతని వంకే చూడసాగాడు.
కొంతసేపటికి తరువాత ‘మాట్లాడవేందన్నా?’ అన్నాడు ఎల్లయ్య.
‘‘ఇప్పుడు నువ్వన్నది రాజామాట ఎల్లయ్య! ఏడుస్తూ కూర్చుంటే ఏ పనీ జరగదు. అనుకున్న పని జరగాలంటే మనమే ఏదో ఒక మార్గం ఎతుక్కోవాలి’’ ఓ పక్క ఏదో ఆలోచించుకుంటూ మరోపక్క అనునయంగా అనుకొచ్చాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘అదేనన్నా! నువ్వైతేనే ఏదో ఒక దారి సూపిస్తావన్న నమ్మకంతో నిన్ను ఎతక్కుంట వచ్చినం. ఇగ పాలల ముంచినా, నీల్ల ముంచినా నీదే భారం. నువ్వే ఏదో విధంగా ఇంటికోసం డబ్బులు ఏర్పాటుచెయ్యాల’’ అంటూ ఆర్‌ఎంపి లింగయ్యను బ్రతిమాలింది శాంతమ్మ.
ఆమె మాటలు విన్న ఆర్‌ఎంపి లింగయ్య మరికొంతసేపు ఏదో ఆలోచిస్తున్నట్టుగా తలపైకెత్తి గాల్లోకి చూసి తిరిగి వాళ్ళవంక చూస్తూ ‘‘ఒక పనిచేస్తారా?’’ అంటూ కావాలనే మధ్యలో ఆపేశాడు.
‘‘ఏందో చెప్పన్నా’’ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అన్నారు రెపరెపలాడుతున్న ఆశ తొంగిచూస్తున్న కళ్ళతో కొంచెం ముందుకు వంగుతూ...
‘‘మన నవభారత్ సెంటర్లో ఫైనాన్స్ నడుపుతున్న అనంతరావు మీలాగే ఇబ్బంది పడుతున్న మన బస్తీలోని చాలామందికి ఇండ్ల స్థలాలు తాకట్టు పెట్టుకొని డబ్బులిస్తున్నడు. ఇక తప్పదనుకుంటే మీరు గూడా మీ ఇంటి స్థలం ఆయన కాడ తాకట్టుపెట్టి తీసుకుంటామంటే చెప్పండి, మాట్లాడి ఓ పాతిక, ముప్ఫై వేలిచ్చే ఏర్పాటుచేస్తాను. అతను వడ్డీ మాత్రం ఏడు రూపాయలు తీసుకుంటాడు’’ వాళ్ళ అవసరాన్ని తన అవకాశంగా మల్చుకుంటూ కనిపించని వలతాళ్ళతో వాళ్ళ కాళ్ళూ చేతులకే కాదు మెదళ్ళకూ ఉచ్చులు బిగిస్తూ చెప్పుకొచ్చాడు ఆర్‌ఎంపి లింగయ్య.
అతని మాటలు వింటూనే ‘‘అమ్మో! ఏడు రూపాయలొడ్డీనా? అది తీర్చే బాకేనా?’’ అనుకుంటూ భయపడిన శాంతమ్మ, ఎల్లయ్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
‘‘అట్లా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిలబడిపోయారేంటి? మధ్యలో నేనేమన్నా కమీషన్ తీసుకుంటా ననుకుంటున్నారా?’’ సందర్భం లేకుండా కోపం తెచ్చుకుంటూ గట్టిగా అన్నాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘అదేంటన్నా! ఒక్కసారే అట్లా మాట్లాడితివేంది!? నిన్నంత మాటంటామా? అంత వడ్డీ మా చేతనైతదా లేదాని ఆలోచిస్తున్నాంగాని’’ సంజాయిషీ ఇస్తున్నట్టుగా మాట్లాడింది శాంతమ్మ పైటచెంగుతో ముఖానికి పట్టిన చెమటను తుడ్చుకుంటూ..
‘‘ఇప్పుడేంబోయింది నిమ్మళంగా ఆలోచించుకొని రేపు గాకుంటే ఎల్లుండొచ్చి చెప్పండీ! సరేనా’’ చల్లగా అన్నాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘సరేనన్నా! అట్లనే ఇంటికిబొయ్యి మా అత్తమామలతోని గూడా ఒకసారి విచారించి వచ్చి ఏ సంగతీ చెబుతామన్నా!’’ అప్పటికి అతని నుండి తప్పుకోవడానికి విషయాన్ని అత్తమామల మీదకు నెడుతూ మెల్లగా చెప్పింది శాంతమ్మ.
ఆ తరువాత వారం రోజులపాటు ఆర్‌ఎంపి లింగయ్య దగ్గరికి వెళ్లకుండా అవే ఇంటి కాగితాలు ఇంకెక్కడన్నా పెడితే అంతకన్నా తక్కువ వడ్డీకి ఓ ముప్ఫై వేలు దొరుకుతాయేమోనని తమకు తెలిసిన చోటల్లా విశ్వప్రయత్నం చేశారు శాంతమ్మవాళ్ళు.
ఎంత ప్రయత్నించినా ఎక్కడా పైసా పుట్టలేదు సరిగదా ‘తలకుమించిన బరువు నెత్తికెందుకెత్తుకున్నరు?’ అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏవేవో ఉచిత సలహాలు ఇవ్వసాగారు.
దాంతో ఇక గత్యంతరం లేక తిరిగి ఆర్‌ఎంపి లింగయ్య దగ్గరికే వెళ్లిన శాంతమ్మ దంపతులు..
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు