డైలీ సీరియల్

పూలకుండీలు -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక మీరు తప్పదంటే అట్లాగే ఆ ఆంజనేయ ఫైనాన్స్ వాళ్ళనడిగొస్తా. కాకుంటే తుంటనెత్తేసి మొద్దునెత్తుకున్నట్టు నవభారత్ అనంతరావు వడ్డీ ఏడు రూపాయలయితే వాళ్ళ వడ్డీ ఎనిమిది రూపాయలు. మీకిష్టమైతే చెప్పండీ కనుక్కొని వస్తా’’ తన మాటలనే వడగళ్ళ జడివానతో శాంతమ్మ, ఎల్లయ్యల వెనె్నముఖలనే పచ్చికొమ్మలు ఫళఫళ విరిగి పడేలా చెప్పేశాడు.
‘‘నిండా మునిగినవాడికి చలేమిటి?’’ అన్న పరిస్థితికి బలవంతంగా నెట్టివేయబడిన శాంతమ్మ, ఎల్లయ్యలు ‘‘ఇగ నీ దయ ఏజ్జేసినా నీదే భారం’’ అంటూ ఇంటి కాగితాలు అతని చేతికిచ్చారు.
ఆ కాగితాలు అందుకున్న ఆర్‌ఎంపి లింగయ్య వాటిని పరికించి చూడసాగాడు.
‘‘పక్కా పట్టా కాయితాలన్నా! పోయిన పంద్రాగస్టు జండావందనం నాకు నీకండ్లమందే మన ఎమ్‌ఎల్‌ఏ ఇచ్చిన కాయితాలు’’ అంటూ వివరించాడు ఎల్లయ్య.
‘‘సర్లే చూద్దాంగాని ఇగ పోండి!’’ అంటూ కాగితాలను తన మోటార్ సైకిల్ సైడ్ బాక్స్‌లో పెట్టి తాళం వేశాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘మరి మమ్ముల్నెప్పుడు రమ్మంటావన్నా!’’ బెరుకుగానే అడిగింది శాంతమ్మ.
‘‘అరే! ఇపుడు కాగితాలు నా చేతికిచ్చారో లేదో అప్పుడే ఎప్పుడు రమ్మంటావని అడిగితే నేనేం జెప్పాల? ఇదే మీతోనొచ్చిన చావు. అన్నీ నిమిషాలమీద జరగాలంటారు. ఒకడి జేబులోపైసా ఇంకొకడి జేబులోకి రావాలంటే మామూలు మాటలనుకుంటున్నారా?
అసలా ఫైనాన్సోడు గూడా ఊళ్ళో వున్నాడో లేదో తెలవదు. రేపు సాయంత్రం ఓసారొచ్చిపోండి ఏ సంగతీ చెబుతాను’’ శాంతమ్మ వాళ్ళు భయపడ్డట్టుగానే గాండ్రు గాండ్రుమని అంతెత్తున ఎగిరిపడుతూ మాట్లాడాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘సర్లే కోప్పడకన్నా, ఏదో మా తొందర్లో మేం అడిగినంలే ఏమనుకోకు!’’ అంటూ బ్రతిమాలింది శాంతమ్మ చేతులెత్తి మొక్కుతూ.

6
‘‘రేపు సాయంత్రం ఓసారొచ్చిపోండి చూద్దాం’’ అన్న ఆర్‌ఎంపి లింగయ్య మాట ప్రకారం మరునాడు సాయంత్రం శాంతమ్మ ఒక్కతే అతని ఇంటికి వెళ్లింది.
శాంతమ్మను అంతదూరంనుండే గమనించిన ఆర్‌ఎంపి లింగయ్య ముఖం చిట్లించుకుంటూ ‘‘ఆ ఫైనాన్స్ వాళ్ళు నేను చెప్పినట్టు నిన్ననే తిరుపతి పోయారంట, మూడు రోజులదాకా రారు. వాళ్ళొచ్చినంక డబ్బులు తెచ్చి నేనే మీకు కబురుచేస్తాలే’’ అంటూ బజార్లో దాన్ని బజారునుండే వెనక్కి పంపించేశాడు.
ఆర్‌ఎంపి లింగయ్య మాటలతో ఒక్కసారిగా జావగారిపోయిన శాంతమ్మ ఇంక చేసేదేం లేక ఉస్సూరుమంటూ వచ్చిన దారినే్న ఇంటి ముఖం పట్టింది.
మూడు రోజులన్నది కాస్తా ‘రేపు మాపు’ అంటూ దాదాపు వారం పది రోజులు శాంతమ్మ, ఎల్లయ్యలను పిల్లికూనల్లా తన ఇంటి చుట్టూ తిప్పించుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ఎట్టకేలకు ఎనిమిది రూపాయల వడ్డీ చొప్పున ఓ ముప్ఫై వేలు తీసుకొచ్చి ఇచ్చాడు.
అతని మీద నమ్మకంతో డబ్బులు లెక్క పెట్టుకోకుండానే జేబులో పెట్టుకుంటున్న ఎల్లయ్యను చూస్తూ, ‘‘అదేందయ్య! డబ్బులు లెక్క పెట్టుకోకుండానే జేబులో పెట్టుకుంటావేంది?’’ అంటూ ఆత్మీయంగా మందలించాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘నువ్విచ్చినంక ఇంక లెక్కబెట్టుకునేదేముంటదన్నా!?’’ మొహమాటంగా అంటూ నోట్ల కట్టను అలాగే చొక్కా జేబులో పదిలంగా పెట్టుకున్నాడు ఎల్లయ్య.
‘‘అరే! డబ్బుల దగ్గర నువ్వేంది? నేనేందయ్యా! నేనేమన్న సత్యహరిచంద్రున్నా? నేను కూడా మోసం జెయ్యొచ్చు దాందేముంది? లెక్కబెట్టు, లెక్కబెట్టు’’ అంటూ మరోసారి ఎల్లయ్యను హెచ్చరించాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఇన్నిసార్లు చెప్పినంక కూడా లెక్కబెట్టకుంటే బాగుండదు ఒక్కసారి లెక్కబెట్టరాదు!’’ భర్తనుద్దేసించి కళ్ళతోనే గుసగుసగా చెప్పింది శాంతమ్మ.
భార్య చెప్పింతరువాత జేబులోనుండి డబ్బులు మళ్లీ బైటకు తీసి లెక్కపెట్టాడు ఎల్లయ్య.
అతను ఒకటికి రెండుసార్లు లెక్కబెట్టినా రెండు వేల రూపాయలు తక్కువస్తుండడంతో ఏమనాలో అర్థంగాక తలగోక్కుంటూ బితుకు, బితుకున ఆర్‌ఎంపి లింగయ్య వంక చూస్తూ ‘‘రెండు వేలు తక్కువున్నై గదన్నా!’’ అన్నాడు మెల్లగా.
ఎల్లయ్య మాటలు విన్న ఆర్‌ఎంపి లింగయ్య ముసిముసి నవ్వులు రువ్వుతూ ‘‘లెక్కబెట్టు లెక్కబెట్టని ఎందుకన్నావో ఇప్పుడర్థమైందా? కాగితాల ఖర్చుకని ఫైనాన్సోళ్లు వెయ్యి రూపాయలు తీసుకున్నారు. మిగతా వెయ్యి రూపాయలు నా తిరుగుళ్ల ఖర్చులకింద తీసుకున్నాను. అదీ లెక్క. అందుకే రెండు వేలు తగ్గాయి’’ చల్లగా చెప్పుకొచ్చాడు.
‘‘కాయితాల ఖర్చులంటే పోనీలే అనుకుందాం. మరి నీ ఖర్చులేందన్నా’’ ఆర్‌ఎంపి లింగయ్య వంక విస్తుబోయి చూస్తూ అడిగింది శాంతమ్మ.
‘‘వారం రోజులు నా పన్లన్నీ వదులుకొని, బండిమీద ఆ ఫైనాన్సోడి చుట్టూ తిరిగింది లెక్కజూస్తే ఇంకా ఐదొందలు తీసుకోవాలి. కాని ఎందుకులే పోనియ్యని వెయ్యి రూపాయలే తీసుకున్నా తెలుసా? బస్తీలో జనాలందరికీ ఉచితంగా సేవ జెయ్యడానికి నేనేమన్నా రాజకీయ నాయకున్నా లేకుంటే నా ఇల్లేమన్నా ధర్మసత్రమా?’’ ముసిముసి నవ్వుల స్థానంలో ముఖమంతా కందగడ్డలా గంటు పెట్టుకుంటూ కోపంగా మాట్లాడాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘సర్లేన్నా! ఆడమనిషి తెలిసో తెలియకో ఏదో అన్నదిలే వూకో.. వూకో..’’ అంటూ ఎల్లయ్య చాలాసేపు బ్రతిమాలిన తరువాత ‘‘మరీ ఎక్కువ చేసినా బావుండదులే’’ అనుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ‘‘సర్లేపోండి!’’ అంటూ శాంతించి అంతటితో వ్యవహారానికి ముగింపు పలికాడు.
ఆ మాటలతో ఒక్కసారిగా ‘‘బతుకు జీవుడా!’’ అనుకుంటూ వెనుదిరిగిన శాంతమ్మ, ఎల్లయ్యలను ఉద్దేశించి ‘‘వడ్డీ డబ్బులు మాత్రం నెల నెలా ఖచ్చితంగా ఇవ్వాలి.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు