డైలీ సీరియల్

పూలకుండీలు - 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేకపోతే ఆ ఫైనాన్సోళ్లు నా ఇంటిమీదికొస్తారు. అందుకే తెలిసినోళ్ళు శాసామంది డబ్బుల విషయంలో ఎవరికన్నా అడ్డముంటే గడ్డి తిన్నట్టే అంటారు. అంత పని మట్టుకు చెయ్యకండీ! మీకు పుణ్యముంటుందిగాని’’ అదో మాదిరిగా హెచ్చరిస్తూ గట్టిగా చెప్పాడు ఆర్‌ఎంపి లింగయ్య.
నడుస్తున్న వాళ్లల్లా ఆగి ‘‘అయ్యో! అన్నా! నీకు మాటొస్తే ఒకటి, మాకు మాటొస్తే ఒకటా! తల తాకట్టు పెట్టైనా నెల నెలా వడ్డీ పైసలు గట్టకుంటే చూడు మళ్లా’’ అంటూ బదులిచ్చి మరీ ముందుకు కదిలారు శాంతమ్మ, ఎల్లయ్యలిద్దరూ.
పేరుకు ముప్ఫై వేలు. చేతికి వచ్చిందేమో ఇరవై ఎనిమిది వేలు. ఆ ఇరవై ఎనిమిది వేలు ఇంటికి తీసుకుపోతే అందులో నుండి దాదాపు పదివేల దాకా చిల్లర మల్లర అప్పులకు, ఇంట్లో ఖర్చులకు అయిపోయాయి. దాంతో మిగిలిన పద్దెనిమిది వేలతో ఎలాగూ స్లాబ్ పడదని అర్థం కావడంతో ఆలోచన చేసిన శాంతమ్మ, ఎల్లయ్యలు స్లాబ్ బదులు రేకులు వేద్దామని నిర్ణయం తీసుకున్నారు.
అనుకున్నట్టే వారం రోజుల్లో ఇంటి పైకప్పుకు రేకులు తెచ్చి పరిచారు.
సిమెంట్ ద్వారబంధాలకు, కిటికీలకూ రెక్కలు ఎక్కించడానికి కూడా మిగలక, వాటికి ఖాళీ సిమెంట్ బస్తాలతో కుట్టిన పరదాలు అడ్డంకట్టారు.
ఆ తరువాత ఓ పూట మళ్లీ మాలచ్చమ్మగుడి పూజారి దగ్గరికెళ్లి ‘అయ్యగారూ! కొత్తింట్లో పాలు పొంగించుకుంటానికి మంచి రోజెప్పుడుందో కాస్త చూసి చెప్పండయ్యా’’ అంటూ కూర్చున్నారు.
పంచాంగం చేతుల్లోకి తీసుకున్న పూజారి కాస్సేపు పేజీలు అటూ ఇటూ తిరగేసి ‘‘ఎల్లుండి శక్రవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ఇంట్లో కాలు పెట్టి పదిన్నరకల్లా పాలు పొంగించుకోండి. అట్లా చేస్తే ముందు ముందు నీకంతా మేలే జరుగుతుంది’’ అంటూ వివరించాడు.
ఇంతకుముందులాగే మళ్లీ యాభై ఒక్క రూపాయలు అయ్యగారికి దక్షిణ ఇచ్చి అతని కాళ్ళకు దండంబెట్టి దీవెనలందుకొని అటు నుండి అటే హుషారుగా బజారుకెళ్లి గృహప్రవేశానికి కావాల్సిన సామాన్లు కొనుక్కుని ఇంటికి చేరారు శాంతమ్మ, ఎల్లయ్యలు.
అయ్యగారు చెప్పిన సమయానికి, చెప్పిన పద్ధతిలో పాలు పొంగించుకొని కొత్తింట్లో కాపురం మొదలుపెట్టారు.
గ్రీష్మంలో చెట్లమీది ఆకులు రాలిపడినంత వేగంగా రోజులు కూడా గిర్రున తిరిగిపోయాయి.
మొదటి రెండు నెల్లూ చెప్పిన గడువుకి వడ్డీ డబ్బులు ఇచ్చిన శాంతమ్మకు మూడో నెల వచ్చేసరికి వడ్డీ అనేది ఎంత ఎత్తరాని బరువో తెలిసిరావడంతో పాటు ఆర్‌ఎంపి లింగయ్య ముఖం పెద్దపులి ముఖంలా కళ్ళముందు కన్పిస్తుంటే భయంతో గిలగిల్లాడసాగింది.
ఎట్టి పరిస్థితిలోనూ నెల నెలా వడ్డీ డబ్బులు కట్టక తప్పకపోవడంతో నెలలు గడుస్తున్నకొద్దీ ఇంట్లో తిండికి వెళ్లడం కూడా కష్టంగా తయారైంది.
‘సవాశేరులో బోడపరాశికం’ అన్నట్టు అప్పటిదాకా స్పాంజ్ ఐరన్‌లో ఎల్లయ్య పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్క్ అయిపోయింది.
సహజంగా ఏ కంపెనీలోనైనా వచ్చిన పని విజయవంతంగా పూర్తిచేసుకుని వెళ్లిపోయేముందు ప్రతి కాంట్రాక్ట్ కంపెనీ కూడా తమ దగ్గర పనిచేసిన వర్కర్లందరికీ ఫైనల్ పేరుతో ఎంతో కొంత అదనపు పేమెంట్ ఇచ్చి పోతుంటుంది. రేయింబవళ్ళు చెమటోడ్చి కష్టించిన కార్మికులు ఆ ఫైనల్ డబ్బుల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు.
కానీ వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లుతూ ఎల్లయ్యవాళ్ళు పనిచేసిన కాంట్రాక్ట్ కంపెనీవాళ్ళు ఓ ‘ఈ వర్క్‌లో మాకు చాలా నష్టం వచ్చింది. నష్టం వచ్చినా సరే కంపెనీ గుడ్‌విల్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనూ, గవర్నమెంట్ కంపెనీలో బ్లాక్‌లిస్ట్‌లో ఎక్కకుండా వుండడం కోసమూ అతి కష్టంమీద వర్క్ పూర్తిచేశాం. అందుకే ఈసారికి ఇక్కడ ఎవ్వరికీ ఫైనల్ ఇవ్వడంలేదు’’ అంటూ చేతులెత్తేశారు.
ఆ వార్త విన్న ఎలయ్య గుండెల్లో పల్లేరుగాయలు గుచ్చుకున్నట్లు ఉక్కిరిబిక్కిరైపోయాడు.
ఆర్‌ఎంపి లింగయ్య అప్పు తమను మింగెయ్యడానికి నోరుతెరచుకువస్తున్న కొండ చిలువలా కళ్ళముందు కనబడుతుంటే ఏం చెయ్యాలో తోచక తమ పరిస్థితి చెప్పుకుని ఎంతో కొంత సాయం చెయ్యండని కంపెనీ వాళ్ళ చుట్టూ పెంపుడు గొర్రెలా తిరగసాగాడు.
ఎల్లయ్య పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ కాంట్రాక్ట్ కంపెనీ రెసిడెంట్ ఇంజనీర్ సుధాకర్ ‘‘చూడు ఎల్లయ్యా! నేను డబ్బులంటే ఇవ్వలేను గాని నువ్వు మాతోపాటు ముంబై సైట్ కొస్తానంటే మాత్రం అక్కడికి తీసుకుపోతాను. పైగా నీకక్కడ వెల్డర్ పోస్ట్ కూడా ఇప్పిస్తా. దానికిష్టమై వస్తానంటే చెప్పు అడ్వాన్స్ కింద ఇప్పుడో రెండు వేలు ఇస్తాను. నీ భార్యాబిడ్డలతో బాగా ఆలోచించుకొని ఏ సంగతీ రేపొచ్చి చెప్పు’’ అన్నాడు సానుభూతిగా అతని వంక చూస్తూ.
ఇంటికొచ్చిన ఎల్లయ్య ఆ రాత్రి అన్నం తిని పడుకున్నపుడు ఆర్.ఇ. సుధాకర్ చెప్పిన విషయం పూసగుచ్చినట్లు శాంతమ్మకు వివరించి ‘‘ఓ ఏడాది రెండేండ్లపాటు అటుపొయ్యొస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇంటిమీద రేకులు తీసి స్లాబ్ వేసుకోవచ్చు. పిల్లల్ని మంచిగ చదివించుకోవచ్చు’’ అంటూ బోధపరిచాడు.
‘‘ఒంటరి ఆడదాన్ని ఇద్దరు ముసలోల్లను, నలుగురు పిల్లగాల్లను పెట్టుకొని అన్నాల్లు వుండడమంటే నా వశమైతదా? బొంబాయికొద్దు ఏమొద్దు తియ్యి. అప్పు ప్రాణం దీస్తదా ఏంది? ఇయ్యాలగాకుంటే రేపు అదే దీరుద్దిలే. కానని రాజ్యం బొయ్యి నువ్వక్కడా మేమిక్కడా ఇబ్బంది పడేదానికన్నా అదేదో అందరం ఇక్కనే్న వుండి మెల్లంగ అప్పు సప్పులుంటే దీల్చుకుందాంగాని రేపు కంపెనీ కాడికి బొయ్యి రానని చెప్పిరా’’ అంటూ ఎల్లయ్య ప్రతిపాదనను అడ్డంగా వ్యతిరేకించింది శాంతమ్మ.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు