డైలీ సీరియల్

పూలకుండీలు - 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని స్థానంలో వచ్చిన ఆర్.ఇ హిందీ ప్రాంతం వాడు. అతనికి తెలుగురాదు. ఎల్లయ్యకు పొడి పొడి మాటలు తప్ప తన మనసులోని బాధను విడమర్చి చెప్పేటంత హిందీ రాదు. పోనీ ఇంటికి ఫోనన్నా చేద్దామంటే ముంబై వచ్చిన మూడవ రోజే సిటీకెళ్ళొస్తుంటే జేబులో ఫోన్ ఎక్కడో జారిపోయింది. పోనీ వేరే ఫోన్‌తో చేద్దామంటే శాంతమ్మ నెంబర్ గుర్తులేదు.
ఇదంతా ఎందుకు ఎవరికీ చెప్పకుండా సైట్ నుండి ఉడాయిద్దామనుకుంటే కంపెనీ వాళ్ళకు తెలియకుండా ఎక్కడికి పోయినా పోలీస్ వాళ్ళ మాదిరిగా వెతికి పట్టుకొస్తారు. ఆ బాధకన్నా అనుకున్న గడుపుదాకా కష్టమో నష్టమో కాలం వెళ్ళదీయడమే మంచిది. ఎట్లాగూ ఇంకో నాలుగు నెల్లాగితే ఓ వారం పదిరోజులు ఇంటికి పొయ్యిరమ్మని వాళ్ళే పంపిస్తారు గదా! అప్పుడే పొయ్యి రావచ్చులే. అప్పటిదాకా అక్కడ ముసలోళ్లతో, పిల్లలతో శాంతమ్మ ఇబ్బంది తప్పదనుకుని కుమిలిపోతూ అలాగే ముంబైలో ఉండిపోయాడు.
****
రోజులు రైలు డబ్బాల్లా ప్రపంచం సమస్తాన్నీ మోసుకుంటూ సాగిపోతూనే వున్నాయి.
దూరమనే నదికి చెరో ఒడ్డున నిలబడిన శాంతమ్మ, ఎల్లయ్యలు ఒకరికోసం ఒకరు ఆర్తిగా పలవరించసాగారు.
ఎల్లయ్య కన్నా శాంతమ్మ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.
తండ్రి ముంబై వెళ్లిపోయిన దగ్గర్నుండి అందరికంటే చిన్న పిల్లకు చీటికి మాటికీ జ్వరం వస్తూ పోతూ వుంది. అయితే అదంతా తండ్రిమీద బెంగతో కావచ్చు అనుకోసాగారు శాంతమ్మ వాళ్ళు.
అక్కడికీ ఆర్‌ఎంపి లింగయ్యకు చూపిస్తూనే వున్నారు.
పిల్లదాని అనారోగ్యంతో విసుగు చెందిన శాంతమ్మ అత్త కమలమ్మకు ఎందుకు బుద్ధిపుట్టిందో ఏమోగాని ఆఖరికి ఓ రోజు ‘తండ్రిమీది గుబులు జరమైతే వారం పది రోజులుంటది. కాకుంటే ఓ నెల రోజులుంటది. కానీ ఇదేంటి! దగ్గర దగ్గర మూడు నెల్లు కావస్తున్నా ఇంకా గుబులు జరమొస్తనే వుంటదా? గుబులు జరం గాదు కాదు, పాడు కాదు పిల్ల వంట్లనే ఏదో రుగ్మతున్నట్టుంది. ఆ లింగయ్యను నమ్ముకుంటే పిల్ల ఆగమయ్యేటట్టుంది. ఎందుకైనా మంచిది పాలొంచ ఆధర్మాసుపత్రికన్నా తీసుకుపోయి చూపించకరాపో..’’ అంటూ కోడల్ని బలవంతంగా పాల్వంచ పంపించింది.
ఆ రోజు మొదలు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ దారిపడేటట్టు తిరిగినా పిల్ల జ్వరం మాత్రం మునుపటి మాదిరిగానే తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తూనే వుంది.
ఇలా లాభం లేదని అనుకున్న శాంతమ్మ ఓ రోజు పిల్లను తీసుకుని నేరుగా డాక్టర్ రామోహన్‌రావు హాస్పిటల్‌కి తీసుకుపోయి చూపించింది.
పిల్లను పరీక్ష చేసిన డాక్టర్ రాంమోహన్‌రావు ‘ఈ అమ్మాయికి పుట్టుకతోనే ఏదో గుండె జబ్బు వున్నట్లుగా అన్పిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఖమ్మం మమతా హాస్పిటల్‌కి తీసుకుపోయి చూపించితే మంచిది’’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
‘‘అమ్మో ఇప్పుడు ఖమ్మం ఆస్పత్రి అంటే మావల్లగాదు సార్! పిల్లను బతికిచ్చినా, సంపినా ఇగ మీదే భారం. అసలే తండ్రిగూడా ఊల్లో లేడు’’ అంటూ తన కథంతా పూసగుచ్చినట్టు డాక్టర్‌కి చెప్పుకొచ్చింది.
ఆమె సొదంతా ఓపిగ్గా విన్న డాక్టర్ రాంమోహన్‌రావు ‘‘చూడమ్మా! నావల్ల అయ్యేదైతే నువ్వు డబ్బులిచ్చినా ఇవ్వకున్నా పిల్లకు వైద్యం చేసేవాణ్ణే. కానీ ఆ వైద్యం, ఆ చదువు చదువుకున్నవాళ్ళే చెయ్యాలి. పోనీ ఏదో విధంగా చేద్దామన్నా ఆ పరికరాలు మా దగ్గరుండవు. కాబట్టి పిల్ల ఆరోగ్యం బాగుపడాలంటే తప్పనిసరిగా ఖమ్మం తీసుకుపోవాల్సిందే’’ అంటూ నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు.
ఆ మాటలను విన్న శాంతమ్మకు ఏం చేయాలో పాలుపోక ఒక్కసారిగా డాక్టర్ కాళ్ళమీద పడి ‘హోరు’మంటూ పెద్దగా ఏడవసాగింది.
గబుక్కున కాళ్ళు వెనక్కి తీసుకుంటూ ‘ఆగాగు హాస్పిటల్లో ఇలాంటి పన్లు చెయ్యగూడదు, ఇలా ఏడవగూడదు ఆగు’’ అంటూ శాంతమ్మను ఊరడించాడు డాక్టర్ రాంమోహన్‌రావు.
ఆమె ఏడుపు వింటూనే వార్డుల్లో వున్న హాస్పిటల్ సిబ్బంది వెంటనే పరుగెత్తుకొచ్చి ‘‘ముందు డాక్టర్‌గారి దగ్గర్నుండి పక్కకు జరగమ్మా!’’ అని విసుక్కుంటూ శాంతమ్మను పక్కకు తీసకుపోయే ప్రయత్నం చేశారు.
‘‘ఆగండాగండీ!’’ అంటూ సిబ్బందిని వారించిన డాక్టర్ ‘‘చూడమ్మా! నీకు తెల్లకార్డు వుందా?’’ అంటూ ప్రశ్నించాడు.
‘‘వుందిసార్!’’ అంటూ బదులిచ్చింది శాంతమ్మ డాక్టర్ వంక జాలిగా చూస్తూ.
‘‘అయితే నేనో ఉత్తరం రాసిస్తానుగాని దాన్ని తీసుకుని నేరుగా ఖమ్మం మమత హాస్పిటల్‌కి వెళ్లి అక్కడి వాళ్ళకు చూపించు వెంటనే చేర్చుకుంటారు. ఆ తరువాత పిల్లకు అన్ని టెస్టులూ చేసి అవసరమైతే వెంటనే ఆపరేషన్ కూడా చేస్తారు. ఇంక నువ్వు మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేసినా పిల్లకు ప్రమాదం’’ అంటూ వెంటనే తన ఎదురుగా వున్న ప్రిస్కిప్షన్ ప్యాడ్ తీసుకుని దానిమీద చకచకా ఉత్తరం వ్రాసిచ్చాడు డాక్టర్ రాంమోహన్‌రావు.
డాక్టర్ చెప్పినట్టుగానే ఆ మరునాడు పొద్దునే్న శాంతమ్మ పిల్లను తీసుకొని ఖమ్మం మమత హాస్పిటల్‌కి వెళ్లింది. తన మాదిరిగానే తెల్లకార్డులతో వచ్చిన వాళ్ళందరితోపాటు వరుసలో నిలబడి పిల్ల పేరు నమోదు చేయించింది.
పొద్దున పది, పదిన్నర గంటలకు పేరు నమోదు చేయించుకొని వరసలో కూర్చుంటే శాంతమ్మ వంతు వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలయ్యింది.
పిల్లకు చేయాల్సిన పరీక్షలన్నీ చేసిన అక్కడి డాక్టర్ల బృందం ‘‘మీ పాల్వంచ రాంమ్మోహన్‌రావు డాక్టర్ గారు చెప్పినట్టుగానే మీ అమ్మాయి గుండెకు రంధ్రం ఉంది. వెంటనే హాస్పిటల్‌లో చేరిపోతే ఎల్లుండి రెండు గంటలకు ఆపరేషన్ చేస్తాం’’ అంటూ తెలియజేశారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు