సబ్ ఫీచర్

వాయిదాల పర్వంతో మొదటికే మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏవండీ..! ఈరోజైనా ట్రైనుకు రిజర్వేషన్ చేయించండి.! నాలుగు రోజుల నుండి చెపుతున్నా మీ చెవికెక్కడం లేదు.’’ ఆఫీసుకు బయలుదేరుతున్న మాధవ్‌తో చెప్పింది భార్య గాయత్రి.
‘‘ఇంకా నాలుగు వారాల సమయం వుంది. అప్పుడే తొందరేంటి...? చేయిస్తాలే...!’’ విసుగ్గా అన్నాడు మాధవ్.
‘‘భలేవారే..! పండక్కి రష్ వుంటుంది..! లేటయితే టికెట్లు దొరకవు. ఆ తర్వాత జనరల్‌లో చచ్చీచెడి ప్రయాణం చేయాలి.’’
‘‘సరే.. చేస్తాలే...!’’అన్నాడే కానీ- తర్వాత ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఏరోజుకారోజు గాయత్రి గుర్తుచేస్తున్నా పెడచెవిన పెట్టి, తీరా రెండువారాల ముందర ప్రయత్నించాడు. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్. యాభై శాతం అదనపు రేటుతో టికెట్లు కొని డొక్కు బస్‌లో ఒళ్ళంతా హూనం చేసుకొని భార్యాబిడ్డలతో అత్తారింటికి చేరిన మాధవ్ తన ముఖాన్ని భార్యకి చూపించలేక తలొంచుకొన్నాడు.
***
గడువు తేదీలోపల కరెంట్ బిల్లు కట్టని రాజు ఆ తర్వాత పెనాల్టీ వేయించుకున్నాడు.
రైల్ టిక్కెట్లు బుక్ చేద్దామనుకుంటూనే సమయానికి తీరిక లేక, ఆ తర్వాత తత్కాల్‌లో కూడా దొరక్క జనరల్ బోగీలో వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి కలిగింది ఆనందరావుకి.
మళ్ళీ సర్దుకుందాంలే అనుకుంటూ ఎక్కడి వస్తువులు అక్కడే వేస్తూ పోయిన వనజ, వారం తర్వాత పర్వతంలా పోగుపడిన వస్తువులు ఒక్కరోజులో సర్దుకోలేక నానా అవస్థ పడింది.
ఆలస్యంగా నిద్ర లేచి హడావుడిగా పరుగెత్తినా సరైన సమయానికి ఇంటర్వ్యూకి వెళ్ళలేక బంగారం లాంటి ఉద్యోగం చేజార్చుకున్నాడు రమేష్. భార్య యిచ్చిన ఇంటి సరకుల పట్టీని జేబులో వుంచుకొని వాయిదావేసుకుంటూ పోయిన సుబ్బారావు భార్య చేత చీవాట్లు తినాల్సి వచ్చింది.
.. ఇక్కడ మాధవ్ గురించో మరొకరి గురించో చెప్పటం కాదు గానీ మన చుట్టుప్రక్కల ఇలాంటివారు కోకొల్లలు. ఏ పనీ సమయానికి చేయరు. రేపుమాపు అంటూ.. వాయిదావేసుకొంటూ పోయి.. చివరకు.. ఆపసోపాలతో, ఆర్థిక నష్టాలతో... గండం గట్టెక్కి.. చివరికి సిగ్గుతో తలొంచుకొంటారు. ఏ రోజు పనిని ఆరోజు, ఎప్పటి పనులు అప్పుడు చేసుకొంటూ పోతే ఎలాంటి టెన్షన్ వుండదు.
గతించిన కాలం తిరిగి రాదు. విలువైన కాలాన్ని, విలువైన సొమ్ముని వృథా చేసుకొంటే తిరిగి రాదు అనేది నగ్న సత్యం. యిలా వాయిదాలు వేయడానికి ప్రధానంగాగల కారణం అలసత్వం. కాస్త నిర్లక్ష్యం. చేద్దాం... చూద్దాం అనే తాత్సార గుణం.
సహజంగా సోమరితనం వుండేవారు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయరు. వారిలోని తాత్సారగుణంవల్ల అనుకొన్న పనికి వెంటనే పూనుకోరు. ఒకరు చెప్పగానే చేసెయ్యాలా.. అనే ఇగోతత్వం. ఇది మరింత ప్రమాదకరం. నాకు తెలియదా.. ఒకరు నాకు చెప్పేదేంటి...? అందునా పెళ్ళాం చెప్పగానే.. చేసెయ్యాలా...! చూద్దాం.. చేద్దాం..! అనుకొంటూ కాలయాపన చేస్తారు.
పనుల ఒత్తిడి అధికంగా వుండేవారు కూడా ఇలా వాయిదాలు వేయటం జరుగుతుంది. ఆఫీస్ వర్క్ బిజీగావున్న కారణంగా కొన్ని ఇంటి పనులు మళ్ళీ చేసుకొందాంలెమ్మని వాయిదా వేస్తుండటం సహజం. కొంతమంది దృష్టిలో కొన్ని పనులు చాలా తేలికైనవి. అవెంత, చిటికెలో అయిపోతాయి అనుకొని, ఆ తర్వాత వాటికే ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ వుంటారు. సమయం, సొమ్ము వృధాకాకుండా..యెప్పటి పనులు అప్పుడు పూర్తిచేసుకొనేలా ప్లాన్ వేసుకోవాలి. దీనికి మొట్టమొదట సోమరితనాన్ని వదిలించుకోవాలి. సోమరితనం యెంతో ప్రమాదకరమైనది.
ఇకపోతే... ఒకరు చెపితే.. చేయాలా అనే చులకన భావం కూడా మంచిది కాదు. అవతలవారు చెప్పేదాంట్లో నిజమెంత. వారు గుర్తుచేయగానే.. వాస్తవం తెలుసుకొని ఆ పనివైపు దృష్టిసారిస్తే.. మంచే పొందగలరు.
పనుల ఒత్తిడి పెరిగి... ఇంటాబయటా ఎప్పుడు యే పని చేయాలో అర్థంకాక, ముందు చేయాల్సినవి వెనక.. వెనకా చేయాల్సినవి... ముందు చేస్తూ... అన్నిపనులూ అస్తవ్యస్తమైపోయే వీలుంది. అలాంటివారు.. తాము చేయాల్సిన పనులను ఒక లిస్ట్‌గా రాసుకొని, వాటిని ప్రాధాన్యతా క్రమంలోకి మార్చుకొని... వాటికి ఖచ్చితమైన టైమింగ్ ఇచ్చుకొని.. ఆ ప్రకారం వాటిని చేసుకొంటూ వెళ్ళాలి. అంతేగానీ... అన్నీ పనులు ఒకేసారి చేసెయ్యాలని, హడావుడి పడితే... ఏ పనీ పూర్తికాక.. టెన్షన్‌కి గురికావాల్సి వుంటుంది.ప్రయాణాలకు అవసరమైన టిక్కెట్లు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే హైరానా తప్పటంతోపాటు ఆర్థికంగాకూడా లాభం పొందవచ్చు. కరంట్ బిల్లులు, ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పెనాల్టీబారినుండి తప్పించుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆయా పనులు వాయిదావేయకుండా చేసుకుపోవడం అలవాటు చేసుకోవాలి. సమయం, సొమ్ము వృధాకాకుండా.. పనులు యెప్పటికప్పుడు పూర్తిచేసుకొనేలా ప్లాన్ వేసుకోవాలి. పని పట్ల అలసత్వం మంచిదికాదు. ఒక్కోసారి ఒక్క క్షణం ఆలస్యం జీవితానే్న మార్చేయగలదు.

- కైపు ఆదిశేషారెడ్డి