ప్రకాశం

అనధికార బిఇడి, డిఇడి కాలేజిలపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, మే 14: జిల్లాలోని బిఇడి, డిఇడి అనధికార కాలేజిలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 112 బిఇడి కాలేజిలు, 141 డిఇడి కాలేజిలు ఉన్నాయన్నారు. ఈ కాలేజిల్లో కేవలం 20నుండి 30కాలేజిలు మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయని, మిగిలిన కాలేజి యాజమాన్యాలు అక్రమసంపాదనే ధ్యేయంగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. కాలేజి ఏర్పాటుచేసే సమయంలో అధికారులకు చూపించేది ఒక చోట, కాలేజి ఏర్పాటుచేసేది మరొక చోటన్నారు. ఒక కాలేజి ఏర్పాటుచేయాలంటే ఎకరా భూమితోపాటు 2500 మీటర్లల్లో బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని, పంచాయతీ, మునిసిపల్ అనుమతులు తీసుకున్న తరువాత లైబ్రరీ ఉండాలన్నారు. కాలేజిల్లోమాత్రం ఏలాంటి సిబ్బంది, విద్యార్థులు ఉండరన్నారు. ఆ కాలేజిల నుండి వచ్చే ఉపాధ్యాయులు భావితరాలకు మంచివిద్యను అందించేవారవుతారని అందరూ అనుకుంటుంటే అందుకుభిన్నంగా కేవలం పరీక్షల సమయంలోనే మాత్రమే విద్యార్థులు కనబడుతుంటారన్నారు. ఇప్పటికే జిల్లాలో జరుగుతున్న అనధికార కాలేజిలపై విచారణ చేపట్టామని, త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ నివేదికను కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్‌తోపాటు, జిల్లాకలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖాధికారులకు అందచేస్తామన్నారు. ప్రస్తుతం ఈ కాలేజిల్లో ఎక్కువమంది విద్యార్థులు ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ నుండి పరీక్షల సమయంలో మాత్రమే ఒకవారం ముందుగా వచ్చి పరీక్షలు రాసిన తరువాత సర్ట్ఫికేట్లు తీసుకువెళ్తారన్నారు. ఒక ఇంజినీరింగ్‌కాలేజిలో నాలుగైదు రకాల కాలేజిలను ఏర్పాటుచేస్తున్నారని, వాటిపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న నీరు - చెట్టు కార్యక్రమం జిల్లాలో అవినీతిమయంగా మారిందని విమర్శించారు. ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంపేరుతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. నీటి ఎద్దడిని నివారించేందుకు, భావితరాలకు నీటి ఎద్దడి తీర్చేందుకు కేంద్రప్రభుత్వం నీరు - చెట్టు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందన్నారు. అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చే నిధులపై నిఘా పెడుతున్నామన్నారు. మిత్రధర్మానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని మాట్లాడుతున్నామన్నారు. ఈసందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 25వతేదీన విజయవాడలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటిస్తారన్నారు. ఆరోజున బూత్‌కమిటీల సభ్యులతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా బూత్‌కమిటీ సభ్యులను కలుసుకునేందుకే అమిత్‌షా వస్తున్నారన్నారు. ప్రధానమంత్రిని జగన్ కలవటాన్ని టిడిపి నేతలు విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ తెలుగుదేశంపార్టీకి ప్రధాని కాదని, దేశప్రజలందరికీ అని చెప్పారు. ఆ సీటులో ఎవరు ఉన్నా కలుసుకోవాల్సిన సమయంలో ఎవరినైనా కలుసుకోవాలన్నారు. రాజకీయంగా బిజెపిపై బురద చల్లవద్దని టిడిపి నేతలకు ఆయన హితవుపలికారు. ఈ సమావేశంలో రాష్టక్రార్యదర్శి బి మీనాకుమారి, జిల్లాపార్టీ ప్రధానకార్యదర్శి విన్నకోట సురేష్, మైనార్టీమోర్చా రాష్టక్రార్యదర్శి షేక్ ఖలీపాతుల్లా బాషా తదితరులు పాల్గొన్నారు.