అమృత వర్షిణి

గగనవాణి క్రియా కలాపమూర్తులు (అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో ఏర్పడిన అనుభూతి శబ్దాన్ని ఆశ్రయిస్తే మంచి పాటవుతుంది. సుస్వరంతో కలిస్తే సుమధుర నాదంతో గుండెల్లో నిల్చిపోతుంది. మాటల కంటే పాటకు ఓ శక్తి వుంది. మాటల కందని భావాలు పాటతో సుసంపన్నవౌతాయి. అందుకే పాటకు ఆకర్షణ ఎక్కువ. అంతర్ముఖుడై గానం చేసేవారికి అసలు పునర్జనే్మ లేదు. సాహిత్య సరస్వతికి నాదం చీరె. పద సముదాయమంతా దేహం. అర్థం ప్రాణం. భావం ఆత్మ.
పాటలు రాసే కవులెందరు లేరు? కానీ, పాటకు ఒదిగేట్టూ, జనానికి మననానికి పట్టేట్టూ మాటలను సంధించి వదలటం అందరివల్లా కాదు. చాలా కొద్దిమంది కవులకే సాధ్యం.
కవిత్వం జీవితానికి ప్రతిబింబం. సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులైన కవులు ఎందరున్నా రెల్లుపూల పానుపు లాంటి తెలుగు సాహిత్యం మీద నిత్య నూతన స్వాదుగాన జీవసారాన్ని వెనె్నలగా కురిపించిన కవులను తలుచుకున్నప్పుడల్లా ఎవరికైనా వారి పాటలు మనస్సులో నడయాడుతాయి. పాట మనిషి లాంటిది. నడుస్తుంది, పిలుస్తుంది - మనసులోని గాయాలను సైతం మానిపించేది మంచి గేయం.
గేయం అంటే చదవబడేది కాదు. పాడబడితే అదే గీతం. గేయం అనగానే భావకవులందరిలోనూ మన మనసులో మెదిలే పేరు -దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. ఆయన పాటల్లో భావనా బలం, భాషలో సౌకుమార్యం రెండూ పెనవేసుకుని కనిపిస్తాయి.
జక్కన శిల్పంలా చెక్కి గేయాన్ని అందమైన మాటలతో మలచి, మన ముందుంచి, ‘యింక పాడుకో’మంటాడు.
అందుకే ఎందరో భావ కవులకు ఆయన మార్గదర్శి. ఒకప్పుడు లలిత సంగీతానికి ఊపునీ, ఊపిరినీ అందించిన ఆలిండియా రేడియో.. పాటని ఒక ఉద్యమంలా ప్రచారం చేసింది. దీనికి ఆద్యుడు డా.బాలాంత్రపు రజనీకాంతరావు. గురజాడ, రాయప్రోలు, గరిమెళ్ల వారి పాటలతోబాటు నండూరి వారి ఎంకి పాటలు, కృష్ణశాస్ర్తీ భావ గీతాలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం గేయాలూ, జాతీయోద్యమ గీతాలూ రేడియోలో వినబడుతూ శ్రోతల్లో జాతీయ భావాలు నింపేవి.
దేశభక్తిని ప్రచోదనం చేస్తూ శ్రావ్యమైన గళాల్లో వినిపించేవి - ఒక విధంగా చెప్పాలంటే రేడియో గౌరవాన్ని ఈ లలిత గీతాలు మరింత యినుమడింప జేశాయి. తప్పనిసరిగా రేడియో వినేలా చేశాయి. లలిత సంగీతం పట్ల మోజును పెంచి, వందలాది గాయనీ గాయకుల్లో పాడాలనే ఉత్సాహాన్ని కూడా రేకెత్తించాయి.
నేను రేడియోలో చేరిన కొత్తల్లో ‘లలిత సంగీతం’ అనగానే రావులపర్తి భద్రిరాజు, వింజమూరి శివరామారావు, పైడిపాటి సుబ్బరామ శాస్ర్తీ, మధురాంతకం రాజారాం, బోయి భీమన్న, యస్వీ భుజంగరాయశర్మ, కెవిఎస్ ఆచార్యలతో బాటు, అప్పటికే లబ్ధప్రతిష్టులైన సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి మొదలైన వారి పాటలు విస్తృతంగా పాడబడుతూండేవి - వీరిలో అగ్రస్థానం డా.బాలాంత్రపు రజనీకాంతరావుదే. ఒక విధంగా ఆధునిక లలిత సంగీత పితామహుడాయనే.
ఎందరెందరో కవులు వీరి తర్వాత తరంలో వచ్చారు. రేడియో గౌరవాన్ని తన మధురమైన పాటలతో మరింత పెంచిన వారిలో బహుళ ప్రచారమైన వ్యక్తి, కవి, కథకుడు, సాహితీవేత్త, విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ఈయన పేరు తెలియని వారుండరు.
ముఖ్యంగా లలిత సంగీత ప్రియులకు ఎంతో పరిచయమున్న వ్యక్తి. సాహితీ ప్రియులకు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిచయం అవసరం లేని ప్రముఖుడు.
పాటలు చాలామంది రాస్తారు. కానీ సంగీత హృదయమున్న కవులు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో శ్రీకాంతశర్మ ఒకడు.
కవి హృదయమున్న గాయకులకు యిటువంటి కవులు దొరికితే బంగారానికి పరిమళం అబ్బినట్లే.
శ్రీకాంతశర్మ కేవలం ఓ పాటల రచయితగా మిగిలిపోలేదు.
తెనుగు సాహిత్యంలో తమ రచనల ద్వారా ఆధునికతను వివిధ దశలలో నిర్వచించిన గుడిపాటి వెంకటచలం, దేవులపల్లి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ, శ్రీశ్రీ, బుచ్చిబాబు, తిలక్, రాచకొండ విశ్వనాథశాస్ర్తీ, అజంతా, మొదలైన వారి ప్రభావం ఊరికే పోతుందా?
పైగా తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ అక్షరాలా సంస్కృతంలోనూ, తెలుగులోనూ పాఠాలు చెప్పిన తొలి గురువు.
ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఆస్వాదించాలో నేర్పిన సోషలిస్టు సనాతన గురువు, లక్షణయతిగా ముముక్షువులకు బాగా పరిచయమున్న ముత్తేవి లక్ష్మణదాసు నాకూ ఈయనే గురువు. నన్నూ, నా పాటను మెచ్చి ఉత్తమ ఉపాధ్యాయుడుగా తీర్చిదిద్దాలనుకున్న సద్గురువు-
సహజ కవిత్వంతోబాటు, యక్ష గానాలు, కథలు, కథానికలు, నవలలు, నాటకాలు, నాటికలు, మొ. యిలా వైవిధ్యమైన సాహితీ ప్రక్రియలతో తన విశ్వరూపాన్ని మన ముందుంచాడు. రేడియో జీవితంలో శ్రీకాంతశర్మ వివిధ సందర్భాల కోసం, వివిధ రూపకాల కోసం వ్రాసిన ‘వర్షానందిని’ ‘మాట -వౌనం’ ‘్భమి గీత’, సృజనాత్మక రచనలలో ‘యాత్ర’ పూర్తిగా సంగీత ప్రధానమైన ‘నిశ్శబ్దం - గమ్యం’ జాతీయ స్థాయిలో ఆకాశవాణి బహుమతులందుకున్నాయి. యివిగాక తలుపు, వెనె్నల, వసంతహేల (వోలేటిగారి సంగీతం) జీవన వసంతం, మొదలైన సంగీత రూపకాలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి.
విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మ పెళ్లి’ని రేడియో కోసం సంగీత రూపకంగా మలిచారు.
రేడియోలో లలిత సంగీతం పాడే వందలాది గాయనీ గాయకులు శ్రీకాంతశర్మ పాటలు పాడేందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు.
శ్రీకాంత శర్మ పాటల్లో ఇబ్బంది కలిగించే మాటలుండవు. భావం తిన్నగా హృదయానికి చేరుతుంది.
మరో ముఖ్య విషయం - పాడే వారికి ఏయే అక్షరాలు పొందికగా పలుకుతాయో ముందే ఊహించి పాటల్ని అల్లటం శ్రీకాంతశర్మలోని విశిష్టమైన గుణం.
ఆ పాటల్లోని ఆకర్షణ అదే. వోలేటి, మల్లిక్, కొచ్చర్లకోట సూర్యప్రకాశరావు, కలగ కృష్ణమోహన్, నేనూ, ఈ పాటల్లోని సౌకుమార్యానికి దాసులైన వాళ్లమే.
కవిత్వానికీ సంగీతానికి విడదీయరాని బంధముంది. పాటలు రాసేవాడికి అసలు లోపల సంగీతముండాలి. రాగాలు తెలుసు అనుకుని సంచీ దులిపేసినట్లు గమక భూయిష్టంగా మాటలు పాడేస్తే రసజ్ఞత కాస్తా కనుమరుగై పోతుంది. పాట బరువైపోయి కూర్చుంటుంది. పాటలోని మాటలకు శబ్దాన్ని (సంగీతాన్ని) ఒక మృదువైన ధోరణిలో కలిపి గానాన్ని పుట్టించి దాన్ని రెక్కల మీద కూర్చోబెట్టి ఎంత దూరమైనా చేర్చగల శక్తి ఒక్క పాటకే ఉంది. సలలిత రాగసుధకు మృదుమధురమైన మాటలే శోభనిస్తాయి. రేడియోలో అవసరానికి కొన్ని పాటలు రాయవలసి వస్తూండేది. శ్రీకాంత శర్మ ఈ విషయంలో ఎంతో జాగ్రత్త పడుతూ రాసేవాడు. ప్రసార మాధ్యమానికున్న శక్తి ఏమిటో రుజువు చేసిన సత్తా కలిగిన మధురకవి శర్మ.
కుటుంబ నియంత్రణ, వాతావరణ కాలుష్యం, మొక్కలను నాటడం, తల్లీబిడ్డల సంక్షేమం, పోషక విలువలతో కూడిన ఆహార ధాన్యాలు పండించటం లాంటి వాటిపై పాటలు వ్రాయవలసి వచ్చిన సందర్భాల్లో కూడా పసందైన మాటలతో పాటలను కట్టిన ఘటికుడు. సాధారణంగా యిటువంటి పాటలకు రంగు, రుచి, వాసన ఏమీ వుండవు.
జాలరి విసిరే వలకు ‘చేపలు ఎలా ఠక్కున లొంగిపోతాయో, అలా నేనిచ్చిన ట్యూన్‌కు మాటల్ని అప్పటికప్పుడు అల్లేసి నా చేతికిచ్చేవాడు. తిన్నగా మైక్ ముందుకెళ్లి ఆర్కెస్ట్రాతో పాడేసేవాణ్ణి.
చక్కని లయతో ఒయ్యారి నడకలతో హొయలు చిందిస్తూ ‘నాదాన్ని మోసుకుని వస్తూ చెవికి శ్రావ్యంగా వినిపించేవి ఆ మాటలు. సాహిత్యానికి అర్థం విడమర్చి చెప్పినంత సులువుగా సంగీతాన్ని వివరించలేం. కానీ అతని మాటల్లోనే సంగీతం ఉంది. కొనే్నళ్లపాటు విజయవాడ ఆలిండియా రేడియోలో నేను అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు యిద్దరు. ఒకరు శ్రీకాంతశర్మ, మరొకరు ఎస్.బి.శ్రీరామమూర్తి (రామం). 1970-90 ప్రాంతాల మధ్య వివిధభారతి కార్యక్రమాలు జోరుగా ప్రసారమయ్యే రోజుల్లో ‘సరాగమాల, సంగీత ప్రియ, ఇంద్రధనుస్సు’ అనే శీర్షికలతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రామం ఓ కార్యక్రమాన్ని సమర్పిస్తే, రాగరాగిణి, రాగరంజని పేరుతో సంగీత ప్రధానంగా నేను కార్యక్రమాలు చేసేవాణ్ణి.
సృజనాత్మక రూపకాల నిర్వహణలో జాతీయ స్థాయిలో ఆకాశవాణి అవార్డుల పంట పండించిన రామం, శ్రీకాంతశర్మలు. సంస్థల పేరు చెప్పుకుని కాదు ఆ సంస్థలకే పేరు తెచ్చే శబ్దబ్రహ్మలు వీరు. ఏకంగా 1982 నుండి 2003 సం. వరకూ రికార్డు స్థాయిలో అవార్డులు దక్కించుకున్న ఈ ఇద్దరూ విజయవాడ ఆకాశవాణి కీర్తిని పెంచేశారనటం అతిశయోక్తి కాదు. అహర్నిశలూ కష్టమైనా ఇష్టపడి కార్యక్రమాలు చేశారే తప్ప, అధికారుల మెప్పు కోసమూ మెహర్బానీ, కుర్బానీ కోసమో చేయలేదు. వీరిద్దర్నీ స్ఫూర్తిగా తీసుకుని వీరి బాటలో నడుస్తున్న వారింకా ఆకాశవాణిలో వున్నారు.
ఆకాశవాణి కోసం ఎన్నో విజయవంతంగా కార్యక్రమాలు రూపొందించిన రామంతో ముచ్చటించాను. శ్రవణ మాధ్యమానికున్న శక్తి తెలిసిన శబ్ద బ్రహ్మ రామం మాటల్లోనే వినండి.
‘శ్రీకాంతశర్మగారూ, నేనూ, ఇద్దరం జెమినీలమే. దానివల్లే ఇద్దరికీ సయోధ్య బాగా కుదిరింది. ఆలోచనా సరళి చక్కగా కలిసింది. నేనో కానె్సప్ట్ చెప్పగానే, వెంటనే అందుకుని, పాదరసంలాగా ముందుకెళ్లిపోయే వారాయన. ‘నిశ్శబ్దం - గమ్యం’ సృజనాత్మక రూపకంలో మామూలుగా చెప్పే వ్యాఖ్యానానికి బదులు.. పదహారు రకాల భావాలతో ద్విపదలు రాసిచ్చారు. వాటిని స్వరపరచి, పదహారు రాగాలలో, మరింత హృద్యంగా, అద్భుతంగా గానం చేశారు మల్లాది సూరిబాబు.
ఒకే కంఠంలో అలా పాడి రక్తి కట్టించటం అందరు గాయకుల వల్లా కాదు. నేను కాని నేను సృజనాత్మక రూపకం, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ముందు తయారై పోయింది. అది సాంతం విని, శ్రీకాంతశర్మ వచన కవితా శైలిలో 16 ఖండికల రూపంలో వ్యాఖ్యానం రాసిచ్చారు.
ముందు ప్రోగ్రాం, అనంతరం వ్యాఖ్యానం, ఒక విచిత్ర శైలిలో జరిగింది. ‘మహా విశ్వ’ సైన్సు ఫిక్షన్ నాటకం. కవి, రచయిత కె.సదాశివరావుగారి కథకు రేడియో అనుసరణ శ్రీకాంత శర్మగారు.
ఆ కథ ఇద్దరం ఒకేసారి ‘ఇండియా టుడే’ (తెలుగు)లో చదివాం. 2,3 దశాబ్దాల కాలంలో తెలుగులో అలాంటి సైన్సు నాటకం రాలేదు’ అన్నారు శ్రోతలు. భూమిని కాలుష్యాన్నుంచి కాపాడండి అనే సందేశంతో రాశారు ఆయన. దీనిక్కూడా ఆకాశవాణి వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి పొందింది. ‘యాత్ర’ సృజనాత్మక రూపకం కూడా శర్మ రచనే.
కేవలం 20 నిమిషాల వ్యవధిలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని వినిపించిన రూపకమది.
నా మనోభావాలను ‘మాట’గా మార్చి అందమైన అక్షర రూపం కల్పించిన శిల్పి శర్మ. అడిగినదల్లా విని ఓపికతో అన్న మాట ప్రతి దానికీ అక్షరీకరణ చేసిన శ్రీకాంత్ శర్మకు ఎప్పటికీ కృతజ్ఞుడనే’ అంటారు రామం.
ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి కారణం ఒక్కటే. వీరికున్న నైజం. ఉద్యోగ ధర్మం కాదు, వీరి వృత్తులు వేరు. ప్రవృత్తులు వేరు. అందుకే సృజనాత్మకత అనేది బయట వస్తువు కాదు. లోపలి గుణం. వీరి సాన్నిహిత్యంలో తిరిగిన నాకు కూడా జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం అదృష్టమే. ఈ సంవత్సరం అక్టోబర్ 31న ఏలూరు గుప్త వారు ‘శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారం’తో శ్రీకాంతశర్మను సత్కరించి గౌరవించటం సంగీత సాహితీ ప్రియులమైన మాలాంటి వారికి గర్వకారణం కాదా మరి?

చిత్రాలు..ఇంద్రగంటి శ్రీకాంతశర్మ *రామం *బాలాంత్రపు రజనీకాంతరావు

- మల్లాది సూరిబాబు 9052765490