ప్రకాశం

అన్ని వర్గాల వారిని ఆదుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఫిబ్రవరి 16: దేవుడి దయవల్ల మనందరి ప్రభుత్వం రాగానే అన్నివర్గాల వారిని ఆదుకుంటానని వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర శుక్రవారం నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి ఉదయం 8 గంటలకు ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గంలోని కొత్తపేట, పెంట్రాల, వాకమళ్లవారిపాలెం, లింగసముద్రం, రామకృష్ణాపురం, తిమ్మారెడ్డిపాలెం, వెంగళాపురం, అమ్మపాలెం క్రాస్, బంగారక్కపాలెం క్రాస్ వరకు 89వ రోజు పాదయాత్ర సాగింది. కొత్తపేట వద్ద వైకాపా కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తూమాటి మాధవరావుతోపాటు జిల్లాలోని వైకాపా నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఉత్తర కాలువ నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్య ధోరణిని తూమాటి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా లింగసముద్రం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గ్రామగ్రామానా జగన్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలను అడుగడుగునా ఆప్యాయంగా పలుకరించారు. పిల్లలు, చిన్నారులను ఆయన ఎత్తుకుని ముద్దాడారు. ఈసందర్భంగా తల్లులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని, తద్వారా మన తలరాతలు మారతాయని తెలిపారు. మన ప్రభుత్వం రాగానే పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15వేలు నగదు అందజేస్తానన్నారు. ఈసందర్భంగా ముస్లిం మహిళ తనకు దుల్హన్ పథకం కింద నిధులు మంజూరుకాలేదని జగన్‌కు మొరపెట్టుకుంది. జగన్ మాట్లాడుతూ మనందరి ప్రభుత్వం రాగానే దుల్హన్ పథకం కింద పేద ముస్లిం యువతులకు ఈప్రభుత్వం ఇచ్చే రూ.50వేలకు మరో రూ.50వేలు కలిపి లక్ష రూపాయలు ఇస్తానన్నారు. అలాగే రాళ్లపాడు సమస్యతోపాటు పలు సమస్యలపై ప్రజలు జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు పింఛన్లు ఇవ్వాలని జగన్‌ను కోరగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజాసంకల్ప యాత్రకు విశేష స్పందన : ఎంపి మేకపాటి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధిని, ప్రత్యేక హోదాను కాలరాస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు చంద్రబాబునాయుడి మాయమాటలు విని మోసపోయామనే ఆలోచనకు వచ్చారన్నారు. నాలుగు సంవత్సరాలుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేలేని చంద్రబాబునాయుడు బహుసా మోదీ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతున్నట్లుగా గమనించారేమో మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన విధంగా ప్రత్యేక హోదాపై మార్చి 4వ తేదీన వైకాపా ఎంపీలందరం ఢిల్లీకి చేరుకుని 5వ తేదీన ప్రత్యేక హోదా అంశంపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా సుదీర్ఘంగా నెల రోజులు పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ వాణి బలంగా వినిపిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే వైకాపా ఎంపీలందరూ తృణప్రాయంగా తమ పదవులకు రాజీనామా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గిద్దలూరు, పర్చూరు, దర్శి, కనిగిరి, అద్దంకి, కోవూరు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు ఐవి రెడ్డి, జి భరత్, బాదం మాధవరెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్, బి చెంచుగరటయ్య, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు వైకాపా నాయకులు సాయకల్పనారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితర రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు పాల్గొన్నారు.