ప్రకాశం

రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 23: జిల్లాలో రహదారి ప్రమాదాలు నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారి సత్యఏసుబాబు కలిసి జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని రవాణా, పోలీసు, రహదారుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత డిసెంబర్, ఈఏడాది జనవరి నెలలో జరిగిన ప్రమాదాలు, మృతులు, మృత్యేతర కేసులు, గాయపడిన వారి వివరాలు, రహదారి వారీగా విశే్లషించి ప్రమాదాల నివారణకు, మృతుల సంఖ్య తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కాపురం, కందుకూరు, చీమకుర్తి, చీరాల, అద్దంకి, కనిగిరి మునిసిపల్ కమిషనర్ల నుండి రెండేసి చొప్పున మొత్తం ఆరు బ్రీత్ అనలైజర్లు సేకరించి స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగించాలన్నారు. ఎన్‌హెచ్-216, ఎన్‌హెచ్ -16 కమిషనర్లు సత్వరమే రిస్క్యూ ఆపరేషన్ పరికరాలు కొనుగోలు చేసి స్థానిక పోలీసుస్టేషన్లకు స్వాధీనపర్చాలన్నారు. ఎన్‌హెచ్-16 మార్గంలో మేదరమెట్ల వంతెన వద్ద ఆర్‌డిఒ, డిటిసి, డిఎస్‌పిలు ఉమ్మడి తనిఖీలు చేసి రహదారి భద్రతకు చేపట్టాల్సిన శాశ్వతమైన చర్యలపై నివేదిక అందచేయాలన్నారు. హైవే మార్గాల్లో డిఎస్‌పిలు గుర్తించిన 346 బ్లాక్ స్పాట్లు సత్వరమే సరిచేయాలని, అవసరమైన సూచిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. శనివారం థీమ్‌బేస్డ్ ఎన్‌ఫోర్సుమెంటులో భాగంగా పాఠశాలల బస్సులపై ప్రత్యేక దృష్టిసారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్‌హెచ్-216, ఎన్‌హెచ్-16 తదితర హైవేల్లో ఉన్న 72 ఆసుపత్రులకు సంబంధించిన సూచిక బోర్డులు సత్వరమే ఏర్పాటుచేయాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి గాయాలకు చికిత్స పొందటంతో పాటు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. హైవే మార్గంలో వచ్చే గ్రామాల దగ్గర కూడా సూచిక బోర్డులు, చిన్నపాటి వేగనిరోధకాలు ఏర్పాటుచేసి ప్రమాదాలు నివారించాలన్నారు. ఎన్‌హెచ్ -16 హైవేలో ప్రమాదాల నివారణలో భాగంగా డాబా హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్ వారికి కావాల్సిన వాహనాలు పార్కింగ్ ప్రదేశాలు, విద్యుద్దీపాలు వారే ఏర్పాటుచేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చీమకుర్తి -మర్రిచెట్లపాలెం రహదారి సరిగాలేక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆమార్గంలో సిసి రహదారులు నిర్మాణానికి అవసరమైన సమగ్ర అంచనాల నివేదిక వచ్చే సమావేశంలోగా అందచేయాలన్నారు. ఒంగోలు నగరంలో ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ డిఎస్‌పి నివేదిక ప్రకారం రహదారుల్లో వెలిసిపోయిన రంగుల స్థానంలో తిరిగి సూచికలకు రంగులు వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 14వ తేదీన కొమరోలు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన లారీ ప్రమాదంలో నాలుగురు మృతిచెందిన కేసుకు సంబంధించి అధికారులు ఉమ్మడి తనిఖీలు చేసి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపాలన్నారు. రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ 1989లో కొత్తగా 40 మార్పులు చేస్తూ మోటారు వెహికల్స్ డ్రైవింగ్ రెగ్యూలేషన్స్ 2017 నియమ నిబంధల సమాచారం కమిటీ సభ్యులకు పోలీసులు, ఎన్‌జివోలకు పంపాలన్నారు. ఈసమావేశంలో ఉప రవాణా కమిషనర్ కె సుబ్బారావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ దేవదాస్, ఒంగోలు డిఎస్‌పి శ్రీనివాసరావు, రవాణాశాఖ ఎఒ సుశీలతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

జననేత జగన్ పాదయాత్రను జయప్రదం చేయాలి
సంతనూతలపాడు, ఫిబ్రవరి 23 : ఈనెల 28న సంతనూతలపాడు నియోజక వర్గంలో ప్రారంభమైయ్యే జననేత జగన్ పాదయాత్రను నియోజక వర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంతనూతలపాడు నియోజక వర్గ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మండల వైకాపా అధ్యక్షులు దుంపా చెంచురెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 28న పొదిలి మండలం శివారు మర్రిచెట్లపాలెం, ఉప్పలపాడు మధ్య సంతనూతలపాడు నియోజక వర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనున్నదని అక్కడి నుండి మర్రిచెట్ల పాలెం, రామతీర్థం , చీమకుర్తికి చేరుకొని చీమకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే సురేష్ తెలిపారు. జిల్లాలో 9 నియోజక వర్గాల్లో జగన్ పాదయాత్ర జరుగుతుందని, అందులో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో 28 నుండి 1వ తేది నాటికి జగన్ పాదయాత్ర నియోజక వర్గం దాటి వెళ్తుందని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుంపా చెంచురెడ్డి, దుంపా యలమందారెడ్డి, తన్నీరు మోహన్‌రావు, మండల వాణిజ్య విభాగం అధ్యక్షలు వి శ్రీనివాసరావు, జి మస్తాన్, బొడ్డువారిపాలెం సర్పంచ్ ఎం వెంకటరెడ్డి, ప్రేమల బ్రహ్మయ్య, తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.