ప్రకాశం

బకాయిలు చెల్లించాలని పాడి రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 23: పాలరైతుల బకాయిలు చెల్లించాలని, ఒంగోలు డెయిరీని కంపెనీ యాక్టునుండి తప్పించి సహకార చట్టంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఎండి కె రమణారావు ఛాంబర్లకు పాడిరైతులు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేశారు. పాలు పోసిన రైతులకు నగదు చెల్లించకపోవటంతో తాము గ్రామాల్లో తిరగలేకపోతున్నామని ఎండి రమణారావును పాడి రైతులు నిలదీశారు. ఎండి సరైన సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహించిన పాడిరైతులు చైర్మన్ ఛాంబర్‌తోపాటు, ఎండి ఛాంబర్‌కు తాళాలు వేసి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చైర్మన్, డైరెక్టర్లు ఎవరూ సమాధానం కూడా చెప్పడం లేదని వారు మండిపడ్డారు. గత సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీన డెయిరీ సర్వసభ్య సమావేశం జరిగిందని, ఈసమావేశంలో కంపెనీ యాక్టు నుండి సహకార చట్టంలోకి తీసుకువచ్చేందుకు తీర్మానం చేశారన్నారు. ఈవిషయంపై ఎండిని పాడిరైతులు ప్రశ్నించగా సక్రమమైన సమాధానం రాలేదు. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి సమస్య సద్దుమణిగేలా చేయటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కష్టాల కడలిలో ఒంగోలు డెయిరీ
ఇదిలాఉండగా ఒంగోలు డెయిరీ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. లాభాల బాట నడిచిన డెయిరీ క్రమక్రమంగా నష్టాల ఊబిలోకి వెళ్లడంతో పాడిరైతులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉండటంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం మార్చి నుండి పాడి రైతులకు సుమారు 11కోట్ల రూపాయలు, ఉద్యోగులకు జీతాలు 8కోట్ల రూపాయలు, పిఎఫ్‌లు చెల్లించకపోవటంతో ఆ వర్గాల వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు డెయిరీని కాపాడాలని కోరుతూ ఉద్యోగులు, పాడిరైతులతోపాటు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపధ్యంలో జిల్లామంత్రి శిద్దా రాఘవరావు, ఇన్‌చార్జి మంత్రి పి నారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ తదితరులు సమస్య సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో పాడిరైతులతో పాటు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంమీద ఒంగోలు డెయిరీని సంక్షోభం నుండి గట్టెక్కించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. ఆందోళన చేసినవారిలో పాడిరైతులు కాకుమాను శ్రీరాంమూర్తి, గుండవరపు శ్రీనివాసరావు, వేజెండ్ల రామారావు, ఎ వెంకట్రావు తదితరులు ఉన్నారు.