ప్రకాశం

నమ్మి అధికారం ఇస్తే ద్రోహం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఫిబ్రవరి 23: అనుభవం ఉందని అధికారం కట్టపెడితే బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి నిప్పులుచెరిగారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీజేపీతో పొత్తుపెట్టుకొని రాష్ట్రానికి అన్నీ ఇస్తున్నారు, వస్తున్నాయంటూ ఉద్యమాలు చేస్తే విద్యార్థులను జైలుకు పంపిస్తామని బెదిరించి నాల్గవ బడ్జెట్‌లో కూడా ఏమీ రాకపోవడంతో ప్రస్తుతం ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమాలు చేయమనడం ఏమిటని, ఇది ద్రోహం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన పత్రిక కట్టింగ్‌లను ప్రజలకు చూపుతూ చంద్రబాబు చేసిన ప్రకటనలను పూర్తిస్థాయిలో వివరించారు. కాంగ్రెస్‌పార్టీ పోరాటాలతో పుట్టిందని, నాడు బ్రిటీష్ వారిపై పోరాడి స్వాతంత్య్రం సాధించింది కూడా కాంగ్రెస్‌పార్టీయేనని అన్నారు. ప్రస్తుతం ప్రత్యేకహోదా కోసం పోరాటం సాగిస్తున్నామని, ప్రజలు, యువత, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీన కందుకూరులో, 26న ఒంగోలులో దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 2వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం, 6,7 తేదీల్లో చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే 8న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ తరువాత ఎవరు పోరాటం చేసినా ఫలితం ఉండదని, అందుకే ముందునుంచి ఉద్యమాలు చేసి తమ ప్రత్యేకహోదా, విభజన చట్టంలో పెట్టిన అంశాలను సాధించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడే అధికారంలోకి రావాలనే తపన లేదని, అయితే విభజన చట్టంలో రైల్వేజోన్, దుగరాజుపట్నం పోర్టు, కడప ఉక్క్ఫ్యుక్టరీ, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా లాంటివి పెట్టడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి అవి అమలు చేయకుండా టిడిపితో కలిసి మోసం చేస్తోందని అన్నారు. తిరుపతి సాక్షిగా అప్పటి ప్రధాని అభ్యర్థి మోడి పదేళ్ళపాటు ప్రత్యేకహోదా ఇస్తానంటూ ప్రకటించి అనంతరం హోదాకాదు ప్యాకేజీ ఇస్తానంటూ ప్రకటించడం, అందుకు చంద్రబాబు వత్తాసు పలకడంతోనే ఆంధ్రప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు. రాజధానికి, లోటుబడ్జెట్‌కు సంబంధించిన రెండిటినీ కూడా అమలుచేయకుండా హామీలతో బిజెపి మభ్యపెడితే ఓటుకు నోటు కేసును చూసి చంద్రబాబు నోరుమెదపకపోవడంతో అన్యాయం జరిగిందని అన్నారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని కాగానే మొదటి సంతకం ప్రత్యేకహోదా ఫైల్‌పై పెట్టించడం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రత్యేకహోదాపై కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లు పెడితే ఆర్థిక సంబంధమైన బిల్లుగా చూపి పక్కన పెట్టారని, ప్రస్తుతం 184 కింద నోటీసులు ఇవ్వడం జరిగిందని, దానిపై చర్చ జరిగి ఓటింగ్ జరుగుతుందని, ఆ సమయంలో రాష్ట్రానికి చెందిన 25మంది ఎంపిలు హోదాకు అనుకూలంగా ఓటు వేయకపోతే ప్రజలు వారి సత్తా చూపుతారని అన్నారు. చట్టంలో లొసుగులు ఉన్నాయంటూ బిజెపి ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని, ఉంటే వాటిని సవరణ పెడితే తాము మద్దతు ఇస్తామని సోనియాగాంధీ ప్రకటించారని, అలా చేయకుండా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాకు వరాలైన గుండ్లకమ్మ ప్రాజెక్టు, రామతీర్థం జలాశయం, వెలుగొండ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనని, ఎప్పుడైనా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. మైనార్టీలకు రక్షణ కల్పించే పార్టీ కాంగ్రెస్‌పార్టీ అని, అందుకే ముస్లిం మైనార్టీలు మొదటి నుంచి అండగా ఉన్నారని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వహిద్ అన్నారు.
పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక
వెల్ఫేర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంఆర్‌కె బాషా, గిద్దలూరు నియోజకవర్గంలోని కంభంకు చెందిన వహిద్ తమ అనుచరులతో పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈకార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి షేక్ సైదా అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి, దర్శి ఇన్‌ఛార్జి కొండారెడ్డి, గిద్దలూరు ఇన్‌ఛార్జి చంద్రశేఖర్, కనిగిరి ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, కొండేపి ఇన్‌ఛార్జి రాజ్‌విమల్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజగోపాల్‌రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.