ప్రసాదం

జీవిత లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి జీవితానికి ఓ లక్షణముండాలి.
ఓ లక్ష్యం ఉండాలి. పువ్వు నవనవలాడే తీగమీద పుడుతుంది. ఎందుకు? సోయగాలు అందించడానికా? సుగంధాలు వెదజల్లడానికా? అంతేకాదు. ఓ చక్కనమ్మ జడలోనో, ఆ పరాత్పరుని పాదాల చెంత గుడిలోనో నిలిచిపోవాలని, ఆ పువ్వు తహతహలాడిపోతుంది. ఇక మంచిముత్యం సముద్రంలో పుడుతుంది. ధగధగలతో మెరిసిపోవాలనా? మెరిసిపోయి మురిసిపోవాలనా? అంతేకాదు. మంచి హారంలో తన బ్రతుకు వెలిగిపోవాలని ఆ ముత్యం తపిస్తుంది. ఇదీ- ఓ కవి కడురమ్యంగా ఆవిష్కరించిన ఆతని కవితాత్మ!
ఇక- అలలు ఉన్నాయి. కడలిలో పుడతాయి ఎందుకు? ఎగిరి ఎగిరి పడాలనా? ఎగిసి ఎగిసి పోవాలనా? ఒడ్డుకుచేరిన ప్రతిక్షణం, జావగారిపోయి ఓటమిపాలై వెనక్కిపోతున్నా- మళ్ళీ చెరగని ఆనందంతో చిందులువేస్తూ అలలు మళ్ళీ పైకి లేస్తుంటాయి. ఎందుకు?
ఆ అలల స్వస్థానమైన అనంత సింధువుతో అవి కలిసి పోగలుగుతున్నాయని కరిగిపోగలుగుతున్నామని, కలిసి, కలిసి కరిగిపోయి తన స్వస్థానంలో ఒదిగిపోతున్నామనే ఆనందంలో ఆ అలలు అలాపుడుతుంటాయి... పుడుతూనే ఉంటాయి. ఇక్కడ దాగున్న తత్త్వం స్వస్థానంలో కరిగిపోవడం. కలిసిపోవడం.
మరి మనం ఉన్నాం. జీవిస్తున్నాం. గొప్పగా జీవితాలు గడుపుతున్నాం. దేనికోసం? అర్హతలు పెంచుకోవడానికా? అన్నీ అనుభవించడానికా? అంతస్థులు అందుకోవడానికా? అందలాలు ఎక్కడానికా? అన్నీ సమకూర్చుకుని భోగభాగ్యాలతో అందరిలో మిన్న అని అనిపించుకోవడానికా?
వీటికోసమే మనం, మన జీవితం అని అనుకుంటే, లౌకికంగా ఏం తప్పుకాదది. ఇవన్నీ అవసరం కూడా. కాదనం. కాదనలేం. కానీ.. అంతేనా? అంతకన్నా ఇంకా, ఏమైనా ఉందా? అని విచారణ చేస్తే- పువ్వుకి, ముత్యానికి, అలలకి, ప్రతి ప్రాణికి ఓ లక్ష్యం ఉన్నప్పుడు మరి మన మాటేమిటి? ఉత్కృష్ఠమైన మానవులమైన, మన జీవితాలకి అసలు సిసలు అయిన లక్ష్యముండాలి కదా? గమ్యముండాలి కదా? ఓ గమ్యం ఉండాలి కదా... అని మనల్ని మనమే ప్రశ్నలువేసుకుంటే, ఆ ప్రశ్నల జవాబుకోసం మనం కొంచెం లోతుగా పరిశీలించాలి. పరిశీలన చేయాలి.
మానవులుగా పుట్టేం. ‘నీవు’లుగా చలామణీ అవుతున్నాం. చలామణి అయ్యేక, ఆ ‘నీవు’లో- ముగ్గురు ‘‘నీవు’’లు ఉన్నారు. మొదటిది నీ గురించి నువ్వు అనుకునే ‘నీవు’. నీ గురించి ఇతరులు అనుకునే ‘‘నీవు’’ రెండోది. మూడోది అసలు సిసలైన నికార్సైన ‘‘నీవు’’ అని అంటాడో మహనీయుడు.
నువ్వు నీ భార్యకి భర్తవి. నీ కొడుక్కి తండ్రివి. నీ మనవడికి తాతవి. అంటే నువ్వు నిజానికి ‘్భర్తవీ కావు. తండ్రివి కావు తాతవీ కాదు. ఒక్కొక్కరితో నీకు ఉన్న సంబంధం అది. బాంధవ్యమది అని వివరణ ఇస్తాడు ఆ మహనీయుడు.
పదేళ్ళక్రింద నువ్వు లెక్చరర్‌వి. ఇప్పుడు నువ్వు పేరున్న పెద్ద ప్రొఫెసర్‌వి. అంటే- కాలానుగతంలో కాలానుగుణంగా.. లెక్చరర్‌గా ఉన్న ‘నువ్వు’ ప్రొఫెసర్ ‘నీవు’గా మారేవన్న మాట. మారిపోయేవన్న మాట. ఆ మహనీయుని ఆధ్యాత్మికతత్త్వానికి- భౌతికంగా చెప్పుకుంటున్న లౌకిక పరమైన మంచి ఉదాహరణ ఇది.
తరచుగా ‘‘నీవు’’ నా శరీరం అంటుంటావు. అంటే ‘‘నీవు’’ వేరు నీ శరీరం వేరు. రెండూ వేర్వేరు అనే కదా? ఇలా విచారిస్తే... ‘‘నువ్వు’’ నీ శరీరం కూడా కాదు. ఇవన్నీ ‘‘నీకు’’కాకపోతే ఆ - ‘నీవు’కి యితరులు పెట్టినపేర్లు. పుట్టిన పేర్లుకాదని తెలుస్తుంది. తేలిపోతుంది.
‘‘నువ్వు’’ ఎవరివి?
‘‘నీలో అంత స్వరూపంగా- మనలో జ్యోతి స్వరూపంగా ఉన్న ‘‘శ్వాస’’ అనే చైతన్యం నీలో ఉన్నంత కాలం నువ్వు ‘‘శివం’’. ఆ చైతన్యం (శ్వాస) నీ లోంచి వెళ్ళిపోయిన మరుక్షణం నువ్వు శవం’’అని ప్రబోధిస్తాడా మహనీయుడు.
అంటే- నువ్వు చైతన్యానివి. అంత స్వరూపంగా వెలుగుతున్న జ్యోతి స్వరూపానివి ఆత్మచైతన్యానివి.
మనం దివ్యాత్మలం. దివ్య చైతన్యాలం. మన స్వస్థానం ఆత్మచైతన్యమే. అక్కడ్నుంచి వచ్చేం. ఆ ఎరుక మరచి ఎక్కడెక్కడో, ఏమేమో చేస్తున్నాం. ఎన్నో బంధాలలో చిక్కుకుంటున్నాం. బందీలైపోతున్నాం. చావు పుట్టుకలమధ్య గిరగిర కొట్టుకుంటున్నాం.
ఏదిఏమైనా మానవులుగా పుట్టేం కాబట్టి మళ్ళీమళ్ళీ పుట్టవల్సిన అగత్యం తెచ్చుకోకుండా జన్మరాహిత్యం పొందాలి. ఆ యోగంలోకి మనం వెళ్ళగలగాలి. అందుకోసం మనం మన జీవితకాలమంతా ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోడానికి ప్రయత్నించాలి. ఆ శుద్ధచైతన్యంగా మిగిలిపోవడానికి ప్రయత్నం చేయాలి. శుద్ధ చైతన్యంలా మిగిలిపోవాలి. నిలచిపోవాలి లయమై పోవాలి.
ఆ అమరత్వ సిద్ధిపొందటమే- మన ‘జీవిత లక్ష్యం’. జీవన తత్త్వం.
***

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669