ప్రసాదం

నామ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(‘నామస్మరణం’ నిన్నటి సంచిక తరువాయి భాగం )
ఇపుడు ‘నామం’ తాలూకు ప్రత్యేకతను తెలుసుకుందాం.
పూర్వకాలంలో ఓ మహర్షి ఓ పుణ్యకావ్యాన్ని నూరుకోట్ల శ్లోకాలతో రచించేడు. లోకకళ్యాణార్థం ఈ మహాకావ్యాన్ని రచించిన కారణంగా ఈ శ్లోకాలు అన్నింటినీ మూడు లోకాలకు సరి సమానంగా పంచేయమని దేవుడ్ని ప్రార్థించేడట. దేవుడు అలాగే ముల్లోకాలకు సరిసమానంగా పంచేస్తానని ఆ మహర్షికి మాట ఇచ్చేడు. ఆ మహర్షి ఇష్టాన్ని తీర్చడం కోసం మొత్తం శ్లోకాలను మూడు భాగాలుగా చేశాడు. ఒక్కొక్క లోకానికి 33కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకాలను సమంగా పంచేసాడు. ఆ విధంగా పంచిన తర్వాత ఒక్క శ్లోకం మిగిలిపోయింది. అది 32 అక్షరాలతో కూడిన శ్లోకం. ఆ శ్లోకం నుంచి మూడు లోకాలకు ఒక్కొక్క దశాక్షరీ మంత్రాన్ని పంచేసినాడు. ఆ శ్లోకంలోని 32 అక్షరాలలో 30 అయిపోయేయి. రెండు అక్షరాలు మాత్రమే మిగిలిపోయేయి. ఆ రెండు అక్షరాలే రామ, కృష్ణ, హరి, హర, శివ, విష్ణు, రంగ, ఉమ, గౌరి అనే నామంలు అంటే నూరు కోట్ల శ్లోకాలను గుదించి కుదించి మధించి అతి సూక్ష్మరూపానికి వస్తే, అది అతి పవిత్రమైన మహోత్కృష్టమైన దైవనామంగా ఆవిష్కరింపబడింది అనేది అంతరార్థం. ఊహకి మహోన్నతమైన కల్పనను జోడించి మహోత్కృష్టంగా ‘నామ’విశేషాన్ని వివరించిన ఓ మహనీయుని కాల్పనిక సృష్టి ఇది! ఇదీ నామం విశిష్టత, ప్రాముఖ్యత.
ఓసారి తుకారామ్ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, స్మరణ చేస్తూ వెళ్తున్నాడు. అపుడు ఒకడు వచ్చేడు. ‘‘నువ్వు ఈ నామాన్ని ఇలా స్మరిస్తున్నావ్ కదా? ఏమి కోరుకుంటున్నావ్. నీకు కైలాసం కావాలా? వైకుంఠం కావాలా? స్వర్గం కావాలా? ’’ అని తుకారాంని అడిగేడు. ఆ ప్రశ్నకి తుకారాం అంటాడు- ‘‘అయ్యా! నాకు కైలాసం, వైకుంఠం అంటే అర్థం కాదు. ఇక స్వర్గమంటారా? ఈ నామస్మరణ చేస్తున్నపుడు నేను అనుభవించేదే, అనుభవిస్తున్నదే ‘స్వర్గం’ అని బదులిస్తాడు. భగవన్నామం హృదయంలో నినదిస్తే, నినాదాలు చేస్తే అదే స్వర్గం. నామస్మరణ మనసు పడే ఆరాటాన్ని, ఆందోళనని, అశాంతిని అణచివేస్తుంది. ఓ ఇనుప ముక్కను ఓ రాయిమీద రాస్తూ రాస్తూ పోతే వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుప ముక్కతో, రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా, అఖండంగా రాస్తూ పోతే, ‘్భక్తి’ అనే వేడి పుడుతుంది. పుట్టిన భక్తి అనే వేడి, పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది. నారదుని ఉపదేశ కారణంగా రత్నాకరుడు రామనామాన్ని స్మరించిన కారణంగా శ్లోకదాతగా మారాడే. వాల్మీకి మహర్షియై రామాయణ మహాకావ్యానికి సృష్టికర్తయ్యాడు.
అయితే నామస్మరణ, దైవచింతన అని రెండు ఉన్నాయి. నామాన్ని జపించటం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను మహిమలను, మననం చేసుకోవటమే చింతన. కృష్ణా కృష్ణా అని జపించటం స్మరణ. ఆ కృష్ణుడే ఎపుడో చేసిన లీలను మహిమలను మనం ఇపుడు మననం చేసుకోవటం చింతన. నామాన్ని మనోభావంగా ఉచ్చరించాలి. పెదవులనుండి కాక హృదయంలోంచి ఉచ్చరించాలి. ఆర్తితో ఉచ్చరించాలి. అనుభవిస్తూ ఉచ్చరించాలి. అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉచ్చరించాలి. మనసనే సరస్సులో నామం ఓ తామరపూవు. తామరపూవులోని మకరందాన్ని త్రాగడానికి భక్తులు ఐహిక భావనలు వదిలి తుమ్మెదలవలె పరుగుతీయాలి. హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు. *

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669