ప్రకాశం

మహాకవి గురజాడకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 21: ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి, వ్యవహారిక భాషోద్యమకారుడు గురజాడ అప్పారావు 156వ జయంతి కార్యక్రమం శుక్రవారం స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. తొలుత గౌతమ్ మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన గురజాడ అప్పారావు చిత్రపటానికి పలువురు కవులు, సాహితీవేత్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు మాట్లాడుతూ నాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాల పై ఎక్కుపెట్టిన అస్త్రం కన్యాశుల్కం వంటి కావ్యాలను ఎన్నో సృష్టించి , తెలుగు భాషకు వెలుగునిచ్చిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు అన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఒక ప్రాంతానికి, కాలానికి పరిమితం కాకుండా నిత్యనూతనంగా ఉండేలా దేశమును ప్రేమించుమన్నా వంటి విశ్వగీతాన్ని అందించిన గురజాడ తెలుగువాడు కావడం తెలుగుజాతికే గర్వకారణమన్నారు. విశ్రాంత న్యాయమూర్తి కొరిశపాటి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషగా మారేందుకు మహాకవి గురజాడ చేసిన కృషిని యావత్ తెలుగు జాతి విస్మరించబోదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు మిడసల మల్లికార్జునరావు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, డాక్టర్ నూకతోటి రవికుమార్ , డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, ఉన్నం జ్యోతివాసు, అంగలకుర్తి ప్రసాద్, చింతపల్లి ఉదయజానకి లక్ష్మి, ఆదూరి మనోహర, ఏనుగుల సురేష్ బాబు, యల్‌వియన్ ప్రసన్న కుమార్, నర్సింగోలు శ్రీణివాస ప్రసాద్, కోవెలకుంట్ల బాలకోటయ్య, ఓబులశెట్టి నగేష్ తదితరులు పాల్గొని గురజాడ అప్పారావు కి ఘనంగా నివాళులు అర్పించారు.