ప్రకాశం

టీడీపీ, వైకాపాకు కీలకం కానున్న కొత్తపట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 18: కొత్తపట్నం మండలంలోని తెలుగుతమ్ముళ్లు అంతర్మథనంలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి మండలంలో మెజార్టీ సాధించగలమా, లేక భారీనష్టాన్ని చవిచూడాల్సి వస్తుందా అన్న కోణంలో తెలుగుతమ్ముళ్లు అంచనా వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా మండలంలోని అనేక గ్రామాల్లోని తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో గ్రామాల్లో రెండుగ్రూపులుగా ఏర్పడి నాయకులు ఏవరికివారేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు కొత్తపట్నం మండలంలో స్వల్పమెజార్టీ వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల్లో మండలంలో తెలుగుదేశంపార్టీకి మెజార్టీ వచ్చేదికాదు, కానీ 2014సంవత్సరం ఎన్నికల్లో మాత్రం రికార్డు బ్రేక్‌చేస్తూ మండలంలో టీడీపీకి మెజార్టీ లభించింది. వచ్చే ఎన్నికల్లోనూ మెజార్టీ వస్తుందా, రాదా అన్న సందేహాలు ఆ పార్టీనేతల నుంచే వినిపిస్తున్నాయి.
ప్రధానంగా కొత్తపట్నం మండలంలోని అనేక గ్రామాల్లో పాత, కొత్త తెలుగుతమ్ముళ్లు మధ్య ఎడమొఖం, పెడమొఖంగా ఉంటున్నారు. దీంతో గ్రామాలు, మండలాల్లో గ్రూపురాజకీయాలు ముదురుతున్నాయి. ఈ విషయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మెతకవైఖరి అవలంభిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్తపట్నం మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలను దామచర్ల చేపట్టారు. నల్లవాగుపై, బకింగ్‌హాం కెనాల్‌పై, ఈతముక్కల వద్ద బ్రిడ్జీలను నిర్మించటం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నుంచి కొత్తపట్నం వరకు రోడ్లను సైతం విస్తరించారు. కోట్లాది రూపాయల మేర అభివృద్ధి పనులు జరగటంతో ఆ మండలంలో భారీమెజార్టీ వస్తుందన్న ధీమాలో దామచర్ల ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా కొత్తపట్నం మండల తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాతతరం నేతలను కాదని కొత్తవారికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వటంతోనే ఇలాంటి సమస్యలు మండలంలో వస్తున్నాయనేది జగమెరిగిన సత్యమే. కొత్తగా వచ్చిన కొంతమంది గ్రామ నాయకులు తీరా ఎన్నికల సమయానికి వైసీపీ లేదా జనసేన పార్టీలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదన్న వాదన పార్టీనేతల నుంచి వినిపిస్తొంది.
ఇదిఇలా ఉండగా మండలంలో రెవెన్యూ సమస్యలు కొకోల్లుగా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించటంలో రెవెన్యూ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల మండలస్థాయి అధికారులు, మండల, గ్రామస్థాయికి చెందిన నాయకులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై దామచర్ల ఎదుటే ఎండగట్టారు. కానీ గ్రామస్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఏమేరకు మార్పువస్తుందో వేచిచూడాల్సి ఉంది. ప్రధానంగా టీడీపీకి చెందిన గ్రామకార్యకర్తలకే పనులు జరగటంలేదని, ఏవరైతే ఎక్కువగా డబ్బులు ఇచ్చేవారికే కొంతమంది టీడీపీ నాయకులు పనులు చేయిస్తున్నారన్న ఆపవాదు వినిపిస్తొంది. ఇప్పటికైనా రెవెన్యూ సమస్యలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దృష్టిసారించి ప్రతి కార్యకర్తకు, ప్రజలకు న్యాయంచేస్తే మళ్లీ మెజార్టీ ఖాయమని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. పార్టీకి ఎవరు విధేయులో, ఎవరు విధేయులు కాదో అంతర్గతంగా దామచర్ల సర్వే జరిపించి వారిని గాడిలో పెట్టకపోతే రానున్న ఎన్నికల్లో తీవ్రప్రభావం పడే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా తెలుగుతమ్ముళ్లల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలను సొమ్ము చేసుకోవటంపై వైసీపీ మండల ముఖ్యనేతలు దృష్టిసారించాయి. ఈపాటికే మండలాల వారీగా టీడీపీలోని అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకునే పనిలో వైకాపా నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. గ్రామాల వారీగా నాయకులు, ముఖ్యనాయకుల జాబితాను తయారుచేసి వారిని అన్ని విధాల ఆదుకుంటామని చెబుతూ ఆకట్టుకునే ముమ్మర ప్రయత్నాల్లో వైకాపా నాయకులలు మునిగితెలుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఐదునుంచి ఆరువేల మెజార్టీ వరకు వస్తుందన్న ధీమాలో వైకాపా నేతలు ఉండగా టీడీపీ నేతలు మాత్రం తమ పార్టీకే అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని, అందువలన తమ పార్టీకే భారీ మెజార్టీ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం ఇరుపార్టీలకు కీలకంగా మారింది.

ఎన్టీఆర్ గృహాలకు మోక్షం ఎప్పుడో ?
* లోకేష్ రాకుంటే ఎన్టీఆర్ ముసుగు తొలగదా
మార్కాపురం, నవంబర్ 18: పేదప్రజలకు గూడు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ గృహానిర్మాణ పథకం మార్కాపురం పట్టణంలో జాప్యానికి కారణం ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఇళ్లనిర్మాణం కోసం స్థల సేకరణ జరిపి, లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరించి అర్హుల జాబితా తయారుచేసి సుమారు మూడునెలలు కావస్తోంది. అయినప్పటికీ శంకుస్థాపన ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారని, ఆ సందర్భంగా ఈ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని నేతలు ప్రకటించారు. అయితే 9, 10వ తేదీల్లో వస్తారని చెప్పినప్పటికీ 20వతేదీ వస్తున్నా కనీసం లోకేష్ పర్యటన వివరాలు కూడా ప్రకటించలేదు. ఫిబ్రవరి నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో అసలు ఎన్టీఆర్ గృహానిర్మాణం జరుగుతుందా, లేదా అనే అనుమానం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా వందరోజుల్లో ఎన్టీఆర్ గృహానిర్మాణాలు పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రకటిస్తున్నప్పటికీ మార్కాపురంలో గృహనిర్మాణం ముందుకు సాగడం లేదు. అయితే సేకరించిన స్థలం గృహనిర్మాణాలకు అనుకూలమైనది కాదని, ప్రతిపక్ష పార్టీలవారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
* నారా వస్తేనే తాత ముసుగు తొలగిస్తారా
మార్కాపురం పట్టణంలోని పెద్దదోర్నాల బస్టాండ్‌లో సుమారు నాలుగేళ్ల కిందట దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు యువనేత నారా లోకేష్ రావాలంటూ అప్పటి నుంచి ఇప్పటివరకు భీష్మించుకొని కూర్చున్నారు. ఇటీవల కొందరు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నించారు. కానీ లోకేష్ పర్యటన మార్కాపురం ప్రాంతంలో ఇప్పటివరకు జరగకపోవడంతో ఆ ముసుగు అలాగే ఉండిపోయింది. కనీసం ఎన్నికలలోపు ఈప్రాంతంలో పర్యటించి తాత ముసుగును తొలగిస్తారా అనే అనుమానం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్రగాయాలు
పెద్దదోర్నాల, నవంబర్ 18 : ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మర్రిపాలెం చెంచుగూడెంకు చెందిన జల్లా వెంకటేశం శనివారం మధ్యాహ్నం మర్రిపాలెం నుంచి దద్దనాల చెంచుగూడెంకు వెళ్తుండగా మార్గం మధ్యలో బయ్యన్నచల వద్దకు రాగానే పిల్లలతో ఉన్న ఎలుగుబంటి వెంకటేశంపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో స్పృహ కోల్పోయాడు. ఆదివారం ఉదయం మేకలు తోలుకుని వెళ్లిన కాపరులకు వెంకటేశం గాయాలతో మూలుగుతూ కనిపించడంతో వెంటనే 108 వాహనంలో పెద్దదోర్నాల వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బొమ్మలాపురం బీట్ అధికారి సోమశేఖర్ బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు తరలించారు.

పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విద్య రద్దుకు పోరాడాలి
* న్యూడెమోక్రసీ జాతీయ నాయకుడు చిట్టిపాటి పిలుపు
ఒంగోలు, నవంబర్ 18: పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విద్య రద్దుకోసం పోరాడాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పీడీఎస్‌యు21వ రాష్ట్ర మహాసభ ఆదివారం ఒంగోలులో ప్రారంభమయింది. ఈ మహాసభలను ముఖ్యఅతిథిగా హాజరైన పీడీఎస్‌యు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యారంగంతోపాటు అన్ని రంగాలు, వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయన్నారు. ప్రస్తుత విద్యావిధానంతో సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగాన్ని పెంచాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగం ఒక ఆటంబాంబులా తయారయి పేలడానికి సిద్ధంగా ఉందన్నారు. మరోపక్క హిందూ బ్రాహ్మిణిక భావజాలంతో కేంద్రప్రభుత్వం దేశంలో అసమ్మతిని అణచివేస్తోందని ఆరోపించారు. ప్రజల వౌళికహక్కుల కోసం పోరాడుతున్న మేధావులపై కుట్రకేసులు బనాయించి జైళ్లలో కుక్కుతున్నారని విమర్శించారు. విద్యను కాషాయికరణ చేస్తున్నారని, అందుకు అనుగుణంగా చరిత్ర పటాలను వక్రీకరిస్తూ రచనలు చొప్పిస్తున్నారన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా విద్యార్థిలోకం పోరాటం చేయాలని మహాసభల ప్రతినిధులకు ఆయన పిలుపు నిచ్చారు. మహాసభల ప్రారంభంలో ముందుగా పీడీఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు విద్యార్థి అమరవీరుల సంతాప తీర్మాణాన్ని ప్రతిపాదించగా, ప్రతినిధులు రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎస్‌కే ఖాజావళి మాట్లాడుతూ ఒంగోలు, ప్రకాశం జిల్లా ఉద్యమాలకు నిలయమని, శ్రీకాకుళం పోరాటానికి ప్రకాశం జిల్లానుంచి చాగంటి భాస్కర్, దేవినేని మల్లిఖార్జున్‌లు వెళ్లి అమరులైనారని, వారి స్ఫూర్తిని పుణకి పుచ్చుకుని మరింత ఉద్యమస్ఫూర్తి పొందాలని, అందుకు ఈ మహాసభలు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ అంశాలపై విద్యాగోష్టి నిర్వహించారు. విద్యాహక్కుల చట్టం- పూర్వాపరాలు అనే అంశంపై ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యం.రాఘవరావు, శాస్ర్తియ విద్య అనే అంశంపై ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఎంవీ కృష్ణయ్య, ప్రభుత్వ విద్య పరిరక్షణ- కర్తవ్యాలు అనే అంశంపై డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీ రమణయ్య, ప్రజాస్వామ్యం- హిందూ ఫాసిజం అనే అంశంపై పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాసుందరీ ప్రసంగించారు. ఈ మహాసభలలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు సౌహార్ధ్ర సందేశం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకుడు భట్టాచార్య, సౌరత్ సిన్హా, శిల్పక్ ముఖర్జీ, తమిళనాడు విద్యార్ధి ప్రతినిధులతోపాటు, తెలంగాణా రాష్ట్ర పీడీఎస్‌యు అధ్యక్షుడు పరుశురామ్ సౌహార్ధ్ర సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ మహాసభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మొత్తం 500మంది ప్రతినిధులు హాజరైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు.

ఒంగోలులో ఘనంగా హ్యాపీ సండే కార్యక్రమం
ఒంగోలు, నవంబర్ 18: ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు నగరం 39వ డివిజన్‌లోని మంగమూరు రోడ్డు మర్రిచెట్టు సెంటర్ ప్రాంతంలో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా జరిగింది. వారం అంతా వివిధ రకాల పనుల ఒత్తిడితో, మానసిక సమస్యలతో బాధపడే వారికి వారంలో ఒక రోజైన ఆదివారం కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్ధేశ్యంతో రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఈ హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. ఒంగోలు నగరపాలక సంస్థను కూడా ఈ హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ, నిధులు కూడా విడుదల చేసింది. ప్రతి ఆధివారం జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం మంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ, విద్యార్ధులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హ్యాపీ సండే కార్యక్రమంలోశాస్ర్తియ , పాశ్చాత్య జానపద నృత్యాలు, ఆటపాటలతో పిల్లలు, పెద్దలు సందడి చేశారు. ష్లాబ్‌మాబ్, వైకుంఠపాళి, తాడు లాగుడు, వినోద విజ్ఞానాల మేళవింపుతో జరిగిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆనందాల ఆదివారంలో పాల్గొన్న పిల్లలకు, యువతకు ఒంగోలు నగరపాలక సంస్థ డీఈ అనిల్‌కుమార్, ఏఈ వెంగళదాసు, డివిజన్ నాయకులు బెజవాడ మురళీకృష్ణ, ఎన్.పురంధరదాసు, కె.ఆంజనేయులు, శంకరరావు, సుధారాణి, ప్రిన్సిపాల్ ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొని సర్ట్ఫికెట్లు అందజేశారు.