ప్రకాశం

ఆర్‌టిసి దోపిడీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 16:సంక్రాంతి పండగ ఆర్‌టిసికి కాసుల వర్షం కురిపిస్తోంది. నష్టాల బాటలో ఉన్న ఆర్‌టిసికి సంక్రాంతి పండగ పెద్ద ఊరట కల్పిస్తుంది. ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమని ఒకపక్క అధికారులు బాకా ఊదుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ప్రయాణికులను నిలువునా దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్‌టిసి అధికారులు కూడా టిక్కెట్ చార్జీలను పెంచి ప్రయాణికుల జేబులను గుల్లచేస్తున్నారు. సంక్రాంతి పండగ పర్వదినాన్ని జరుపుకునేందుకు జిల్లాకు చెందిన ప్రయాణికులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతోపాటు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చారు. వారందరూ మూడురోజులపాటు పెద్దపండగను జరుపుకుని తిరుగుముఖం పట్టారు. కొంతమంది ఆదివారం నాడే వెళ్లగా మరికొంతమంది సోమవారం భారీగా తరలివెళ్లారు. ఆదివారం నాడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు 90 ప్రత్యేక బస్సులను ఆర్‌టిసి అధికారులు నడపగా, సోమవారం కూడా 90 ప్రత్యేక బస్సులను నడిపారు. దీంతో జిల్లాకేంద్రమైన ఒంగోలు ఆర్‌టిసి డిపో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కొంతమందికి ఆర్‌టిసి బస్సుల్లో టిక్కెట్లు దొరక్క ప్రైవేటు బస్సుల వైపు పరుగులు తీశారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సులో 50శాతం చార్జీతో కలుపుకుంటే 587రూపాయలు, హైటెక్‌కు 739రూపాయలు, ఎక్స్‌ప్రెస్‌కు 440రూపాయలు, అల్ట్రా డీలక్స్‌కు 557రూపాయలు, ఒంగోలు నుండి బెంగళూరుకు గరుడా బస్సుకు 1404రూపాయలు, హైటెక్‌బస్సుకు 936రూపాయలు, చెన్నైకు 542రూపాయలను ప్రయాణికుల నుండి ఆర్‌టిసి అధికారులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రయాణికుల రద్దీ మరో రెండురోజులపాటు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేకబస్సులను పెంచుతామని ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే బస్సులకు రద్దీ ఎక్కువుగా ఉండటంతో టిక్కెట్లకు భారీ డిమాండ్ పెరిగింది. ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడా ఎక్కువయ్యాయి.
ఇదిఇలాఉండగా ప్రత్యేకబస్సులను నడపటంతో గ్రామీణప్రాంతాల్లోని కొన్ని బస్సు సర్వీసులను ఆర్‌టిసి అధికారులు రద్దుచేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువశాతంమంది గ్రామీణప్రాంతాల నుండి రావాల్సిఉంది. కాని వారు వచ్చేందుకు బస్సులు లేకపోవటంతో ఆటోల ద్వారా ఒంగోలుకు చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంమీద సంక్రాంతి పండగ ఆర్‌టిసికి కాసుల వర్షం కురిపిస్తుందనే చెప్పవచ్చు.

రద్దీనిబట్టి రోజుకో రేటు
* ప్రయాణికుల జేబులకు చిల్లులు వేస్తున్న ఆర్టీసీ
* లబోదిబోమంటున్న ప్రయాణికులు
మార్కాపురం, జనవరి 16: ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ బస్సుకు ఎంత ధర నిర్ణయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇష్టానుసారంగా రోజుకో టిక్కెట్టు ధర నిర్ణయిస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గిద్దలూరు డిపోకు చెందిన బస్సుకు మార్కాపురం నుంచి చెన్నైకి 527 రూపాయల ధర కాగా ప్రయాణికుల రద్దీనిబట్టి సోమవారం రిజర్వేషన్ చేసుకుంటే 621 రూపాయలు వసూలుచేశారు. అలాగే మార్కాపురం - బెంగళూరు మధ్య 636 రూపాయల ధర కాగా 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఎక్కడైనా పండుగ సీజన్‌లో ప్రైవేటు ఆపరేటర్లు టిక్కెట్టు ధర భారీగా పెంచి వసూలు చేయడం ఆనవాయితీ. అయితే ప్రజల కోసం నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా రోజుకొక ధర నిర్ణయిస్తూ ప్రయాణికుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులకు టిక్కెట్టుపై 50శాతం అదనంగా వసూలు చేయడం ప్రతి పర్యాయం జరుగుతోంది. అయితే రెగ్యులర్ సర్వీసులకు మాత్రం ఎప్పటి ధరే వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పర్యాయం రెగ్యులర్ సర్వీసులకు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆర్టీసీకి ప్రత్యేక బస్సులకు మాత్రం 50శాతం అదనంగా వసూలు చేయడం ఆనవాయితీ కాగా, తెలుగుదేశంప్రభుత్వ హయాంలో రెగ్యులర్ సర్వీసులకు కూడా వారి ఇష్టం వచ్చినట్లు గంటకో రేటు, రోజుకో ధర నిర్ణయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకే టిక్కెట్టు ధరలు నిర్ణయించామని చెబుతున్నారు. అయితే మార్కాపురం ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికుల వద్ద ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం పాత ధరలే వసూలు చేయడం వలన ప్రయాణికులు ప్రైవేటు బస్సుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రైవేటు ఆపరేటర్లతో కుమ్మక్కై ఈవిధంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానం కూడా ప్రయాణికుల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పందించి ప్రయాణీకుల జేబులకు చిల్లులు పడకుండా చూడాల్సి ఉంది.

దేశంలో రహదారి భద్రతా బిల్లును
తీసుకొచ్చేందుకు చర్యలు
ఈనెల 19 నుండి 25వ తేదీ వరకు రహదారి భద్రతా
వారోత్సవాలు
రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడి

ఒంగోలు, జనవరి 16 : దేశంలో రహదారి భద్రతా బిల్లును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. సోమవారం తన నివాసంలో రహదారి భద్రతా వారోత్సవాల నేపధ్యంలో రహదారి భద్రతకు సంబంధించిన గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిద్దా విలేఖర్లతో మాట్లాడుతూ భారతదేశంలో రహదారి భద్రత కోసం దేశ స్థాయిలో మంత్రుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను కూడా ఆ కమిటీలో సభ్యునిగా ఉన్నట్లు తెలిపారు. రహదారి భద్రత గురించి ఆరు రాష్ట్రాల్లో పర్యటించామని త్వరలో ప్రభుత్వానికి రహదారి భద్రతపై నివేదిక ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఈ నెల 19వ తేది నుండి 25వ తేది వరకు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించేందుకు రవాణా శాఖా చర్యలు తీసుకుందన్నారు. ఈ నెల 19వ తేది నుండి 25వ తేది వరకు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో రహదారుల భద్రతపై ఇంజనీరింగ్ కాలేజీల్లో , యూనివర్సిటీల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థులకు డ్రైవింగ్‌పై, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తారన్నారు. గత సంవత్సరం రహదారి భద్రతపై వంద రోజుల పాటు సెమినార్లు నిర్వహించామన్నారు. రహదారులపై భద్రత పెంచేందుకు పది కోట్లతో బ్రీత్ ఎనలైజర్స్, స్పీడ్ గన్స్ కొనుగోలు చేశామన్నారు. రవాణాశాఖ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా రహదారులపై తనిఖీలు చేపట్టి ప్రమాదాలను నివారించినట్లు చెప్పారు. రహదారుల భద్రత పై ప్రజల్లో మార్పు రావాలన్నారు. వాహనదారులు, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపరాదన్నారు. మితిమీరిన వేగం వలన ప్రమాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులకు స్ప్రీడ్ కంట్రోల్ ఉండాలన్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం ద్విచక్ర వాహన ప్రమాదాలు 28.8 శాతం , మద్యం తాగి వాహనాలు నడపడం వలన 42 శాతం, అతి వేగం వలన 62 శాతం, రహదారులు వంకరగా ఉండటం వలన 49 శాతం ప్రమాదాలు జరిగాయన్నారు. ఆర్‌అండ్‌బి, రవాణాశాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి 80 శాతం రహదారులపై బ్లాక్‌స్కాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 20 శాతం భూ సేకరణ సమస్య వలన పూర్తి చేయలేకపోయామని, భూ సేకరణ బాధ్యతలను జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్లకు అప్పగించామన్నారు. త్వరలో మిగిలిన 20 శాతం కూడా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో రహదారుల వెంట మద్యం దుకాణాలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా శాఖాధికారి సుబ్బారావు, ఎంవిఐలు అంకమ్మరావు, గోపినాయక్, శేషురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘నగదు సంక్షోభంపై దేశవ్యాప్త ఉద్యమం’
ఒంగోలు అర్బన్,జనవరి 16: నగదు సంక్షోభంపై తమ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి శ్రీనివాసరావు తెలిపారు. ఆ పార్టీ జిల్లా ప్లీనరీ సోమవారం స్థానిక సుందరయ్యభవన్‌లో రాష్టక్రమిటీ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం, నకిలీకరెన్సీ, నల్లధనాన్ని అరికడ్తామని ప్రధానమంత్రి మోదీ చెప్పారన్నారు. 50రోజుల్లో అద్భుతాలు చూపిస్తామన్నారన్నారని తెలిపారు. మోదీ చెప్పినవి జరగకపోగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికి 15లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంకులకు చేరాయని చెబుతున్నారన్నారు. అంతకంటే ఎక్కువునగదు జమ అయినట్లుగా తెలుస్తుందని, బ్లాక్‌మనీని ఎక్కడ అరికట్టారో ప్రధానమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క బ్లాక్‌మనీ కేసు కూడా నమోదుకాలేదన్నారు. ఆగస్టా కుంభకోణంలో నాలుగువందల కోట్లరూపాయలు చేతులు మారాయన్నారు. ఉగ్రవాదం తగ్గకపోగా ఉగ్రదాడుల్లో ఈ మధ్యకాలంలో 33మంది మరణించారన్నారు. నోట్ల రద్దుతో మోదీ చెప్పిన నాలుగు అంశాలు నెరవేరలేదని ఆ మాటలు అంతా బూటకమేనన్నారు. రెండురకాల ప్రయోజనాల కోసం నోట్లు రద్దు చేశారన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకులను పైకి తేవాలంటే భారీగా జనం డబ్బు జమకావాలని, నోట్ల రద్దుతో అది సాధ్యవౌతుందని ఈ నిర్ణయాన్ని అమలుచేశారన్నారు. జనానికి నగదు రహిత వ్యాపారం అలవాటుచేస్తే దేశ, విదేశీ, బడాకంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతాయని ఇది మరో కారణామని వివరించారు. దీనివలన చిన్నవ్యాపారులు, కుటీర పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. నోట్లరద్దుతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదని అందుకే దీనిపై దేశవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాలు చేపడ్తామన్నారు. రోహిత్ చనిపోయి ఏడాది కావస్తుందని కారకులపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే రోహిత్ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్టక్రార్యదర్శి వర్గసభ్యుడు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో రాష్ట్రంలో 16లక్షల ఎకరాలభూమిని ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తుందని, ఈ మూడుసంవత్సరాల్లో ఒక పరిశ్రమకూడా రాలేదని విమర్శించారు. నిరుద్యోగం పెరిగిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సర్వేనివేదికలే చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి ప్రమాదంలో ఉందని ఆర్థిక మంత్రే చెబుతున్నారన్నారు. బలవంతపు భూసేకరణ ఆపకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాడటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలో తీవ్రమైన కరవు నెలకొందని తాగునీరు దొరక్క పల్లెలు ఇబ్బందులు పడుతున్నాయని సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు పేర్కొన్నారు. నోట్ల రద్దుప్రభావంపై ఈనెల 18న క్యాంపైన్లు నిర్వహించి సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో రైతు మృతి
కొమరోలు, జనవరి 16: రోడ్డుప్రమాదంలో ఓ రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని దద్దవాడ సమీపంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నంద్యాల వైపు నుంచి తర్లుపాడుకు వరిగడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు వస్తున్న లారీ ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న రైతు గాయం రమణారెడ్డి (55) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రమణారెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న భార్య, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.