ప్రకాశం

కిడ్నీ బాధితులకు ఊరట లభించేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 27 : జిల్లాలో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్య, కిడ్నీ బాధితుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర వైద్య బృందం మంగళ, బుధ, గురు వారాల్లో పర్యటించనుంది. ఆ మేరకు వారి పర్యటన ఖరారు అయ్యింది. ఈ బృందంలో ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ వైద్యులు ఎకె సుశీల, డిసి తొటేజా, హైదరాబాద్ నుండి డాక్టర్లు ఎఎల్ కందారే, డాక్టర్ హరి కుమార్, టెక్నికల్ ఆఫీసర్ శంకర్‌రావు, చెన్నై నుండి డాక్టర్ ప్రభదీప్‌కౌర్, డాక్టర్ భవానీ బృందంలో ఉన్నారు. మంగళవారం ఉదయం వైద్య బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సమావేశమై ఫ్లోరైడ్ సమస్య, కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో నెలకొన్న ఫ్లోరైడ్ నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని తాగి కిడ్నీవ్యాధితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 423 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు మృత్యువాత పడ్డారు. అదే విధంగా చాలామంది కనిగిరి మార్కాపురం డివిజన్ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్థులతో బృందం సభ్యులు సమావేశం కానున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ కిడ్నీ వ్యాధిగ్రస్థులను పరామర్శించి వచ్చారు. కాని ప్రకాశం జిల్లాలో ఎక్కువగా కిడ్నీ వ్యాధి గ్రస్థులు ఆ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి భారత ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి , కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో స్పందించిన కేంద్రం వైద్య బృందాన్ని జిల్లాలో పర్యటించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఈ వైద్యబృందం పలు సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కిడ్నీ వ్యాధికి సంబంధించిన మూలకారణాలకు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను బృందం సభ్యులు అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో సురక్షితమైన త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సురక్షితమైన తాగునీటిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే ఇలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. కాగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి అయితే పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు తాగు, సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్తెసురు నిధులు విడుదల చేస్తుండటంతో మూడు అడుగులు ముందుకు - ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా తయారైంది. ఇటీవల కిడ్నీవ్యాధి గ్రస్థులను ఆదుకోవాలని, ఫ్లోరైడ్ సమస్యను తీర్చాలంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కనిగిరి నియోజక వర్గంలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కిడ్నీ వ్యాధి గ్రస్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి కిడ్నీ వ్యాధిగ్రస్థులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లోకిడ్నీ వ్యాధి గ్రస్థులను ఆదుకునేందుకు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం మీద ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధి గ్రస్థుల సమస్యలు, ఫ్లోరైడ్ సమస్యలను వారు అధ్యయనం చేయనున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఖర్చులో
రాష్ట్రంలో జిల్లా మూడోస్థానం

ఒంగోలు, మార్చి 27 : జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2016-17వ సంవత్సరంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు మార్క్ దాటి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని డ్వామా పిడి పోలప్ప సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు లక్షల 88 వేల 368 మంది కుటుంబాల్లోని ఐదు లక్షల 52 వేల 374 కూలీలకు ఒక కోటి 94 లక్షల 46 వేల 541 పనిదినాలు కల్పించినట్లు చెప్పారు. 51 వేల 331 కుటుంబాల వారికి 100 రోజులు పని దినాలు కల్పించి సరాసరి కూలీ 133 చెల్లించడం జరిగిందన్నారు. ఈ ఏడాది ప్రధానంగా పంట గుంటల తవ్వకం మీద దృష్టి సారించడంతో కూలీలకు అధికంగా పనులు కల్పించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. కూలీలకు వేతనాలు చెల్లించడంలో మూడు రోజుల్లో 96 శాతంతో రాష్ట్రంలో ప్రధమ స్థానం వచ్చిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద జిల్లాలో ఏడు లక్షల 34 వేల కుటుంబాలకు జాబ్‌కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 444.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు కోట్ల 31 లక్షల పని దినాలు కల్పించడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఒక కోటి 94 లక్షల 46 వేల పని దినాలు కల్పించడం ద్వారా మూడు లక్షల 88 వేల 368 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు. నిర్మల్ భారత్ అభియాన్ , గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఈ సంవత్సరం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఒక్కొక్క మరుగుదొడ్డికి 12 వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు జిల్లాలో ఒక లక్షా 37 వేల 495 మంది లబ్థిదారులను గుర్తించి మరుగుదొడ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిలో ఇప్పటి వరకు ఒక లక్షా 21 వేల 425 మరుగుదొడ్లను పూర్తి చేయడం జరిగిందని, 15 వేల 223 మరుగుదొడ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో 60 వేల పంట సంజీవిని నిర్మించేందుకు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 94 వేల 544 ఫారం ఫండ్స్‌కు అంచనాలు తయారు చేసి వాటిలో 81 వేల 993 ఫారంఫండ్స్ పరిపాలనా ఆమోదం పొంది 52 వేల 654 మొదలు పెట్టి 34 వేల 821 ఫారం ఫండ్స్‌ను పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రెండు లక్షల ఇంకుడు గుంతలు నిర్మించడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు రెండు లక్షల 71 వేల 359 ఇంకుడు గుంతలకు అంచనాలు తయారు చేసి వాటిలో రెండు లక్షల 63 వేల 233 ఇంకుడు గుంతల యూనిట్లకు పరిపాలనా ఆమోదం లభించిందన్నారు.
పలు కేసుల్లో నిందితులు అరెస్ట్
ఒంగోలు, మార్చి 27: ప్రకాశం జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండివస్తువులు, వాహనాలు మొత్తం 18 లక్షల 25వేల రూపాయల విలుచేసే చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి త్రివిక్రమవర్మ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్‌పి చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి త్రివిక్రమవర్మ మాట్లాడుతూ పొదిలి మండలం సలకనూతల గ్రామానికి చెందిన పెద్దినేని తిరుపతి స్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటి నేరాల కేసుల వివరాలను ఎస్‌పి వివరిస్తూ ఒంగోలు 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ అయిన సొత్తు మొత్తం 32 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కేజి వెండి వస్తువులు కాగా పోలీసులు 32 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కేజి వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాడి ఫిబ్రవరి 1న ప్రకాశం జిల్లా ఒంగోలు 1వ పట్టణ పిఎస్ పరిధిలోని మామిడిపాలెంలో ఫిర్యాది అయిన గంజం మురళీకృష్ణ ఇంటిలో లేని సమయంలో రాత్రి పూట ఇంటి వరండా గ్రిల్స్ మెయిన్ డోరు, బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, వెండివస్తువులను దొంగిలించుక పోయినట్లు ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా కందుకూరు రూరల్ పోలీసుస్టేషన్ పిఎస్‌లో మొత్తం 150 గ్రాముల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్,10వేల రూపాయల నగదు చోరీకి గురికాగా 150 గ్రాముల బంగారు ఆభరణాలును పోలీసులు స్వాదీనం చేసుకోవడం జరిగిందని ఎస్‌పి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రకాశం జిల్లా కందుకూరు మండల పిఎస్ పరిధిలోని కొండమంజులూరు గ్రామంలో ఫిర్యాధి అయిన బొంది నారాయణ తన కుటుంబ సభ్యులతో రాత్రి ఇంటిలో నిద్రించు చుండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించి బీరువా పగులగొట్టి అందులోని బంగారు వస్తువులు , డబ్బును దొంగిలించిన కేసులో పై మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా సింగరాయకొండ పోలీసు స్టేషన్ పరిధిలో మొత్తం 32 గ్రాముల బంగారపు దండ, స్యామ్‌సాంగ్ మొబైల్ ఫోన్, 2వేల రూపాయల నగదు చోరీకి గురికాగా పోలీసులు 32 గ్రాముల బంగారు దండ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా నెల్లూరు 4వ పట్టణ పిఎస్ కేసు విషయంలో చోరీకి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా గుడి హుండీ పగలగొట్టిన కేసులు, చైన్‌స్నాచింగ్ కేసుల వివరాల గురించి ఎస్‌పి వివరిస్తూ ఈ కేసుల్లో నెల్లూరు జిల్లా కావలి మండలం సంకువారితోటకు చెందిన కొమ్మాలపాటి గోవర్దన్, నడింపల్లి గోపిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. పామూరు పోలీసుస్టేషన్ కేసులో మొత్తం 24 గ్రాముల బంగారు దండ చోరీ కాబడిన సొత్తు కాగా ఈ కేసులో మొత్తం 24 గ్రాముల బంగారు దండను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా పామూరు పోలీసుస్టేషన్ పరిధిలో మరోకేసు లో మొత్తం 24 గ్రాముల బంగారు దండ చోరీకి గురికాగా నిందితులను అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి 24 గ్రాముల బంగారు దండను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా 2వ పట్టణ పోలీసు స్టేషన్ కేసులో మొత్తం 40 వేల రూపాయల నగదు, 3 సెల్‌ఫోన్‌లు చోరికి గురికాగా 3 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. మార్కాపురం పట్టణ పిఎస్ కేసులో మొత్తం 15 గ్రాముల బంగారపు దండ చోరీకి గురికాగా 15 గ్రాముల బంగారపు దండను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. అదే విదంగా పొదిలి పియస్ కేసులో మొత్తం బజాజ్ పల్సర్ మోటారు సైకిల్ చోరీకి గురికాగా బజాజ్ మోటారు సైకిల్‌ను పోలీసులు నిందితులను అరెస్ట్‌చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా పొదిలి పోలీసుస్టేషన్‌కు సంబంధించి మరో కేసులో యమహా - ఫ్యాజర్ మోటారు సైకిల్ చోరీకి గురికాగా నిందితుడిని అరెస్ట్‌చేసి ఆ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ నిందితుల వద్ద నుండి మొత్తం 3 లక్షల 70 వేల రూపాయలు విలువచేసే చోరీ సొత్తును స్వాధీ చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ ముగ్గురు నిందితుల వద్ద నుండి మొత్తం 12 కేసుల్లో 18 లక్షల 25 వేల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. పై కేసులను ఛేదించిన డిఎస్‌పిలు కె ప్రకాశరావు, కందుకూరు సబ్‌డివిజన్ కె వెంకటేశ్వరరావు, సిసి యస్ ఒంగోలు సిఐలు కె నరసింహారావు, కందుకూరు సర్కిల్ బి రాజేష్, పామూరు సర్కిల్ ఎం లక్ష్మణ్, సిసిఎస్ ఒంగోలు ఎస్‌ఐలు హెచ్ ప్రభాకరరావు, కందుకూరు రూరల్ పిఎస్ వి సాంబశివయ్య, పామూరు పిఎస్ ఎ రాజమోహన్, వివి నారాయణ, సిసిఎస్ ఒంగోలు సిసి ఎస్ సిబ్బంది, ఎస్‌ఐలు, వి వెంకటేశ్వరరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ పి వెంకయ్య, కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, సిహెచ్‌వి శేషయ్య, యం సాయిక్రిష్ణ, జి శాంతకుమార్, యస్‌వి కిషోర్‌బాబు, ప్రసాద్ , షేక్ ఖాదర్‌ను ఎస్‌పి త్రివిక్రమవర్మ అభినందించారు.

అత్యాశకు పోతే
15 వేలు మాయం
సంతమాగులూరు, మార్చి 27 : ఒక వ్యక్తి మాయగాడి మాటల్లో పడి 15 వేలు పోగొట్టుకున్న సంఘటన మండలంలోని కొమ్మాలపాడు గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. కొమ్మాలపాడు షంషుద్దీన్ గారిబుడే అనే వ్యక్తి సాయంత్రం ఐదు గంటల సమయంలో వైన్‌షాపు వైపు వద్ద బహిర్భూమికి వెళ్లాడు. వైన్ షాపు నుండి వచ్చిన ఒక వ్యక్తి తాను మంత్రగాడినని, తాను మంత్రించిన జిల్లెడు ఆకులు ఇస్తే కష్టాలన్నీ తొలగిపోయి రోజూ నిధుల రాశులు పోగు అవుతాయని చెప్పడంతో బుడే అతని భ్రమలో పడ్డాడు. బుడేను కొద్ది దూరం పొలాల్లోకి తీసుకెళ్లి తన చొక్కా విప్పి తనకు ఇవ్వాలని, బట్టలు లేకుండా ఉన్నప్పుడే తన మంత్రాలు పనిచేస్తాయని నమ్మబలికాడు. మాయగాడి మాటలు నమ్మినబుడే తన బట్టలను విప్పి మాయగాడి చేతిలో పెట్టాడు. 15 నిమిషాల పాటు కళ్లు మూసుకుని ఉన్నట్లయితే తాను మంత్రోచ్ఛరణ చేస్తానని చెప్పడంతో బుడే కళ్లు మూసుకొని కూర్చున్నాడు. ఇదే అదునుగా భావించిన మాయగాడు బుడే చొక్కాలో ఉన్న 15 వేల రూపాయలు నగదు తీసుకుని అద్దంకి వైపు ఉన్న అడ్డరోడ్డు వద్ద ఆటోలో ఎక్కి పరారైనాడు. ఎంతసేపటికీ మంత్రగాడు కళ్లు తెరవమనకపోవడంతో విసుగు చెందిన బుడే కొంత సమయానికి కళ్లు తెరిచి చూడగా అక్కడ తాను విడిచిన బట్టలు పడేసి ఉండటం, మాయగాడు పరారు అయినట్లు గమనించాడు. వెంటనే బుడే గ్రామంలో వచ్చి గ్రామస్థులకు విషయాన్ని తెలిపాడు. అప్పటికే మాయగాడు వెళ్లిపోయిన విషయాన్ని పలువురు గమనించినట్లు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుడే ఫిర్యాదు చేయగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ రాఘవరావు గ్రామస్థులకు సూచించారు.

పవర్‌వీడర్ల వాడకంతో
వ్యవసాయం సులభతరం
కలెక్టర్ సుజాతశర్మ

ఒంగోలు,మార్చి 27:వ్యవసాయం సులభతరం చేసేందుకు రైతులకు పవర్‌వీడర్లు ఎంతగానో తోడ్పడతాయని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పదిమంది ఎన్‌పిఎం రైతులకు కలెక్టర్ పవర్‌వీడర్లను ఉచితంగా పంపిణీచేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి,మిరప, వంగ, బెండ, క్యాబేజి తదితర పంటలు వేసినప్పుడు కలుపుమొక్కలు తొలగించేందుకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యేవని నేడు పవర్‌వీడర్ల సహాయంతో ఆ పనులు ఎంతో సులువుగా రైతులు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలో పది క్లస్టర్లకు చెందిన ఎన్‌పిఎం షాపు యజమానులైన రైతులకు ఒక్కొక్కటి 50వేల 340రూపాయలు విలువచేసే పవర్‌వీడర్లను జిరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం కింద ఉచితంగా అందచేస్తున్నామన్నారు. ఈ పవర్ వీడర్లను జిల్లాలోని రైతులందరూ తమ పొలాల్లో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బతో భర్త మృతి
మనస్థాపంతో భార్య మృతి
* వెంగళరెడ్డి గ్రామంలో విషాద ఛాయలు
గిద్దలూరు, మార్చి 27: వడదెబ్బకు గురై భర్త మృతిచెందడంతో మనస్థాపంతో భార్య కూడా మృతిచెందిన సంఘటన గిద్దలూరు మండలం వెంగళరెడ్డి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంగళరెడ్డి గ్రామానికి చెందిన ఎడమకంటి వన్నూరురెడ్డి (70) వడదెబ్బకు గురై సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. దీంతో ఆయన భార్య సుబ్బమ్మ (65) తీవ్ర మనస్థాపానికి గురై భర్త చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతిచెందింది. ఈసంఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.