విశాఖపట్నం

అంగన్‌వాడీల కలెక్టరేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నగరంలో భారీ ప్రదర్శన
విశాఖపట్నం, నవంబర్ 27: పెరిగిన జీతాల జీవోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. సమస్యలపై తాడో,పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగారు. సమస్య తీరన పక్షంలో పోరాటాల నిర్మిస్తామంటూ హెచ్చరించిన అంగన్‌వాడీ వర్కర్లు విశాఖ నగరంలో డాబాగార్డెన్స్ సరస్వతి పార్కు నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇది జగదాంబ జంక్షన్, కేజిహెచ్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీ వర్కర్లు శుక్రవారం ఉదయానికే నగరానికి చేరుకున్నారు. వీరంతా ఒకేచోటకు చేరుకుని ప్రదర్శన జరపడంతో అనేకచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంగన్‌వాడీ వర్కర్ల భారీ ప్రదర్శన కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ రోడ్డుపైనే బైఠాయించిన అంగన్‌వాడీ వర్కర్లతో ఈ ప్రదేశం నిండింది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ముందుగానే మొహరించిన పోలీసు బలగాలు కలెక్టరేట్ గేట్లను మూసివేయడం, కంచెను అమర్చడం, స్టాపర్లను అడ్డుగా ఉంచడం, తాళ్ళతో అడ్డుకోవడంతో ఆందోళనకారుల్లో ఏ ఒక్కరూ లోపలకు వెళ్ళేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన వర్కర్లు రోడ్డుపైనే బైఠాయించడంతో వీరందర్ని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య వాదనలు నెలకొనడంతో ఒక్కసారిగా ఈప్రాంతం వేడేక్కింది. కొద్దిసేపు ముఖ్య నేతలు ప్రసంగాలు, నినాదాలతో హోరెత్తిన తరువాత పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి చేతికందని వారిని అందినట్టుగానే వ్యాన్‌లోకి ఎక్కించిన పోలీసులు వీరందర్ని ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు.
భారీగా అరెస్టులు
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.కోటీశ్వరరావు, ఎస్.రమేష్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.నాగశేషు, ఎస్.అరుణ, రాష్ట్ర నాయకులు జి.కుమారి, డి.అన్నపూర్ణ, జి.కళావతి, బి.తులసీ, ఎం.రమణమ్మ, ఎం.మంగతాయి, కె.్ఛయాదేవి, బి.సంధ్యశ్రీ తదితరులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌ల్లోకి ఎక్కించారు. వీరితోపాటు నిరసన తెలియజేసిన, అక్కడ నుంచి కదలించేందుకు భీష్మించిన మరికొంతమందిని అరెస్టులు చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మినీవర్కర్లతో వందలాది మంది వర్కర్లు జిల్లా నలుమూలల నుంచి తరలిరావడంతో ఈ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పోరాటం ఆగదు: సిఐటియు
పెరిగిన జీతాల జివో విడుదలయ్యే వరకు పోరాటం ఆగదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నరసింగరావు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపిందని, ప్రకటించిన జీతాల జీవో విదుదల కోసం కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరవధిక నిరాహారదీక్షలు చేస్తుంటే పోలీసు బలగాలు ప్రయోగించి దీక్షలను భగ్నం చేయించిందన్నారు. మండలాల్లో నిరాహారదీక్షలు చేసిన, కలెక్టరేట్ల వద్ద దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో కదలికరాలేదన్నారు. చేసిదిలేక కలెక్టరేట్ ముట్టడికి దిగారని, వచ్చేనెల 3వ తేదీన విజయవాడలో నిరవధిక నిరాహారదీక్షలు, డిసెంబర్ 7న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐసిడిఎస్ పరిధిలో లక్షలాది మందికి అంగన్‌వాడీలు సేవలందజేస్తున్నారన్నారు. తల్లీబిడ్డల మరణాల రేటును తగ్గించడం కోసం, శిశు ఆరోగ్య సంరక్షణ కోసం అంగన్‌వాడీలు కృషిచేస్తున్నారన్నారు. 8 గంటలు పనిచేసే వీరికి ప్రభుత్వం చెల్లించే వేతనాలు నామమాత్రంగా ఉన్నాయని, అందుకు ఎంతోకాలంగా అంగన్‌వాడీలు జీతాలు పెంపుకోసం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఆగస్టులో ప్రభుత్వం జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించిందన్నారు. సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం నాలుగు మాసాలు దాటిపోయినా జీతాలు పెంచే జీవో విడుదల చేయలేదన్నారు. అందువలనే అంగన్‌వాడీ వర్కర్లు న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. వచ్చేనెల ఏడవ తేదీన ఛలో విజయవాడను నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, యూనియన్ ప్రతినిధులు, అంగన్‌వాడీ వర్కర్లు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
ట్రాఫిక్ మళ్ళింపు
నాలుగు వైపుల అంగన్‌వాడీ వర్కర్లతో నిండిన కలెక్టరేట్ మీదుగా వెళ్ళే వాహనాలను దారి మళ్లింపులో నిర్వహించారు. కెజిహెచ్ నుంచి జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం మీదుగా సిటీ సర్వీసులు, వాహనాలు రాకపోకలు జరిగాయి. కలెక్టరేట్ లోపలకి వెళ్ళే సందర్శకులకు సైతం ఎప్పటి మాదిరి ఇబ్బందులు తప్పలేదు. కలెక్టరేట్ వెనుకభాగానున్న పాఠశాల విద్యార్ధులు లోపల నుంచి బయపడేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పిల్లల తల్లిదండ్రులు పోలీసులతో వాదనకు దిగినా ఫలితంలేకపోయింది.

ఏడవ వేతన సంఘ సిఫార్సులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
* శ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతులు దగ్ధం
విశాఖపట్నం, నవంబర్ 27: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఏడవ వేతన సంఘం సిఫారసులకు వ్యతిరేకంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతినిధులు నిరసన ప్రదర్శన జరిపారు. భారతీయరైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ఆదేశాలపై భోజన విరామ సమయంలో దొండపర్తి డిఆర్‌ఎం కార్యాలయం వద్ద రైల్వే కార్మికులు, శ్రామిక్ కాంగ్రెస్ ప్రతినిధులతో దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక్ కాంగ్రెస్ డివిజనల్ కో-ఆర్డినేటర్ తమ్మినేని నర్సింగరావు మాట్లాడుతూ ఏడవ వేతన సంఘం సిఫారసులను శ్రామిక్ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రైల్వే కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ దశలవారీ పోరాటాలకు దిగాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సమాఖ్య డిమాండ్ ప్రకారం రైల్వే కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని, ఐదు శాతం ఇంక్రిమెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇక్రిమెంట్‌పై ఎటువంటి షరతులు విదించరాదని ప్రస్తుతం ఇస్తున్న ట్రాన్స్‌పోర్టు ఎలవెన్స్‌ను పెంచాలని, బోనస్ రద్దు చేసే సిఫారసులను సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. దీనికి నిరసనగా ఏడవ వేతన సంఘ సిఫారసుల ప్రతులను ప్రతినిధు దగ్ధం చేశారు. అనంతరం డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీకి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు
* త్వరితగతిన సమాచారం అందివ్వాలి
* అన్ని శాఖల వెబ్‌సైట్‌లో సమాచారం ఉండాలి
* కలెక్టర్ డాక్టర్ యువరాజ్
విశాఖపట్నం, నవంబర్ 27: ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందించే సేవలను ఒకేచోట సులభంగా త్వరితంగా అందించడమే లక్ష్యంగా ఉమ్మడి సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. ఆయా ప్రభుత్వ శాఖాధికారులు తమ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలను గుర్తించి అందుకు అవసరమైన సమాచారాన్ని తక్షణం ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సేవలో కేవలం 30 శాతం మాత్రమే మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా లభిస్తున్నాయని, భవిష్యత్‌లో ప్రభుత్వ సేవలన్నింటిని ఒకేచోట ఈ-సేవా కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. దీనికోసం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్(సిఐపిఎస్) సంస్థలు కలిసి పని చేస్తున్నాయన్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులను కామన్ సర్వీస్ సెంటర్లపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి గ్రామ పంచాయితీలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సేవలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. గనులు, రవాణా, మార్కెట్ కమిటీలు తదితర అన్ని సేవలు భవిష్యత్‌లో ఈ కేంద్రాల ద్వారానే అందనున్నట్టు తెలిపారు. రెవెన్యూ భూముల సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు మీ-్భమి పోర్టర్‌ను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిందని ఇదే తరహాలో అన్ని శాఖలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 డి.వెంకటరెడ్డి ప్రసంగిస్తూ డిజిటల్ ఇండియాలో భాగంగా నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ కింద వీటిని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కిషోర్, అభిషేక్‌సింగ్, బిసి రాజు, కిషోర్ కడియాల, ఎం.కుమార్, ఏవీ రెడ్డి మొబైల్ యాప్స్, ఆర్డీఎస్, వెబ్‌సైట్‌ల రూపకల్పనలో వౌలిక అంశాలు, ఇ-స్కూల్ పర్యవేక్షణ, జీవన్ ప్రమాణ్, డిజిటల్ లాకర్లు, ఆధార్ ఆదారిత పౌర సేవలు తదితర అంశాలపై ప్రసంగించారు.

ఆరు ఏడిఇ పోస్టులు భర్తీ
* మరో ముగ్గురు ఏడిఇలకు బదిలీలు
* ఈపిడిసిఎల్ సిఎండి ఆదేశాలు
విశాఖపట్నం, నవంబర్ 27: కోర్టు వ్యాజ్యం వలన ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్)లో కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆరు ఏడిఇ పోస్టులకు సీనియారిటీ ప్రాతిపదికన ఏఇలను ఇన్‌చార్జి ఏడిఇలుగా నియమిస్తూ సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు, సీనియారిటీతో వారి అభ్యర్ధన, ఎంపికతో నింపడం జరిగింది. ప్రస్తుతం గన్నవరం అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎం.నిరంజన్‌బాబు అమలాపురం కనస్ట్రక్షన్ ఇన్‌చార్జి ఏడిఇగా నియమించారు. అలాగే కొయ్యలగూడెం ఏఇగా పనిచేసే కె.మలాకీని పలాస ఏడిఇగాను, దొండపర్తి ఏఇగా పనిచేసే యన్.వేణుగోపాల్‌ను జీలుగుమిల్లి ఏడిఇగాను నియమించారు. వీరితోపాటు వంగర ఏఏఇ యస్.గోపాలకృష్ణను శ్రీకాకుళం టిఆర్‌ఇ ఏడిఇగాను, ఏలూరు డి-4 సెక్షన్ ఏఇ ఎంఆర్ గోపాలచౌదరిని నెల్లిమర్ల ఎస్‌పియం ఏడిఇగాను, పత్తిపాడు ఏఇ ఎల్.సతీష్‌నాయక్‌ను విజయనగరం ఏడిఇ/డిపిఇగాను నియమించడం జరిగింది. క్రమశిక్షణా చర్యలగానైనా, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని ఇద్దరు ఏడిఇలను పరిపాలనా సౌలభ్యం కోసం ఒక ఏడిఇని బదిలీ చేశారు. ఈ విధంగా బదిలీ అయిన వారిలో ఏడిఇ ఎన్.శ్యామూల్ కాకినాడ హెచ్‌టి మీటర్ల ఏడిఇగాను, పలాస ఏడిఇ కెఏ పరదేశీబాబును విజయనగరం కనస్ట్రక్షన్ ఏడిఇగాను, విజయనగరం డిపిఇ/ఏడిఇ కె.విష్ణుమూర్తిని శ్రీకాకుళం జిల్లా స్టోర్స్ ఏడిఇగాను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీరంతా వారం రోజుల్లోపు కొత్త పదవుల్లో చేరి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా సంస్థ కార్పొరేట్ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్‌డి) ఏవి సూర్యనారాయణరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
* కలెక్టర్ డాక్టర్ యువరాజ్
విశాఖపట్నం, నవంబర్ 27: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా కలెక్టర్ ఎన్.యువరాజ్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమన్వయ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు జరుగనున్న వేడుకుల్లో అన్ని శాఖాధికారులు సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని చేయాల్సిందిగా ఆదేశించారు. దేవాలయ ప్రాంగణంలో నెల రోజులపాటు పోలీసు ఠాణాను ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలోపెట్టుకుని ప్రజలకు అంతరాయం కలుగకుండా వాహనాలను మళ్లించడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు బందోబస్త్‌ను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల మహిళా పోలీసులను నియమించాలన్నారు. భక్తులు అధికంగా వచ్చే గురువారాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలన్నారు. భక్తులకు మైకుల ద్వారా సూచనలను తెలియజేయాలన్నారు. జివిఎంసికి సంబంధించి ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద్య పనులు చేపట్టడం, నిరంతర తాగునీటి సరఫరా తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపుల పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ బ్లీచింగ్‌ను ఎప్పటికపుడు చల్లించాలన్నారు. నాలుగు గురువారాల్లో అగ్నితో కూడిన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించడానికి అగ్నిమాపక శకటాలను ఆలయ పరిసర ప్రాంతాల్లో సిద్దంగా ఉంచాలని అగ్నిమాపకశాఖాధికారులను ఆదేశించారు. మార్గశిర మాసమంతా విద్యుత్‌కు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్‌శాఖాధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు మార్గశిర మాస ఉత్సవాల స్పెషల్ బోర్డును తగిలించి పట్టణంలో అన్ని ముఖ్యమైన కూడళ్ళ నుండి, నగర పరిసర గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గురవారం తెల్లవారు జాము ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన కౌంటర్లకు మందులతో సహా షిప్టు పద్దతిలో వైద్యులను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. 108 వాహనాన్ని ఆలయం వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ఆయల పరిసర ప్రాంతాల్లో మత్తు పానీయాలు అమ్మకుండా వాటిని వినియోగించకుండా స్పెషల్ స్కాడ్‌ను గస్తీని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కార్యనిర్వాహణాధికారిణి జ్యోతి మాదవి మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీహరి సేవ స్వచ్చంధ సంస్థ ద్వారా తాగునీరు, మజ్జిగలను భక్తులకు సరఫరా చేయనున్నామన్నారు. లడ్డు, పులిహోర ప్రసాదాల కౌంటర్లు నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారాల్లో మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఈ నెలరోజుల్లో విశిష్ట దర్శనం రెండు వందలు, ప్రత్యేక దర్శనం వంద రూపాయలు, క్యూలైన్‌లతోపాటు ఉచిత దర్శనం రూ.20లు ఉంటుందన్నారు. విఐపిలకు ప్రత్యేక టికెట్‌తోపాటు దర్శనం క్యూలైన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సమావేశంలో జెసి-2 వెంకటరెడ్డి, ఏసిపి ఆర్.రమణ, ట్రాన్స్‌కో ఇఇ వర్మ, ఆర్టీసీ డిఎం సత్యనారాయణ, జివిఎంసి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.శంకరావు, అగ్నిమాపక అధికారి జె.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాలు నిర్మిస్తాం
* దేశవ్యాప్త పోరాటాలు తప్పవు
* శ్రామిక్ యూనియన్ నేత చలసాని
విశాఖపట్నం, నవంబర్ 27: రైల్వే కార్మికులకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్త ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిందిగా రైల్వేకార్మికులకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే శ్రామిక్ యూనియన్ అధ్యక్షులు చలసాని గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో విశాఖరైల్వేస్టేషన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది దొండపర్తి డిఆర్‌ఎం కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిఆర్‌ఎం కార్యాలయం వద్ద జరిగిన సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏడవ వేతన సంఘం సిఫారసులు కార్మికుకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందువలనే ఈ రోజు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశామన్నారు. జాతీయ కౌన్సిల్ (జెసిఎం) కనీస వేతనాలు 26వేలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తే కేవలం 18వేలు సిఫారసు చేసిందన్నారు. హెచ్‌ఆర్‌ఏను 30, 20, పది శాతాలుగా కోరితే దీనిని 24, 16, 8 శాతాలుకు తగ్గించేసిందన్నారు. ఫెస్టివల్ అడ్వాన్స్, వడ్డీలేని అడ్వాన్సుల విషయంలో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రక్షణ రంగంలోను, పోస్టల్ సేవల్లో విదేశీ పెట్టుబడులకు తాము వ్యతిరేకమని, అలాగే ప్రైవేటీకరణను నిలిపివేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. నియామకాలకు సంబంధించి నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. ఇక్రిమెంట్‌లపై ఎటువంటి షరతులు విధించరాదంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తోన్న రైల్వేకార్మికుల ఆగ్రహానికి గురికాక ముందే ఈ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధి డి.షలీల్, యూనియన్ ప్రతినిధులు పిజెజె రాజు, బి.దామోదరరావు, మహాదేవ్ అప్పారావు, పి.ఆదినారాయణ, జివి రమణరావు, ఆర్‌విఎస్‌ఎస్ రావు, ఏఎస్‌ఆర్ నాయుడులు ప్రసంగించారు. ఆయా బ్రాంచీలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ నినాదాలు జరిపారు. అనంతరం డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీకి వినతిపత్రం అందజేశారు.

ఆరోగ్య పథకాలపై అవగాహన అవసరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సరోజిని
విశాఖపట్నం , నవంబర్ 27 : చిన్నారుల్లో వచ్చే వ్యాధులు, మాతా, శిశు మరణాల నివారణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్ విధానాన్ని మరింత అప్‌డేట్ చేస్తూ నూతనంగా రూపొందించిన శిశు పునరుత్పత్తి ఆరోగ్య పథకం (రీప్రొడక్టివిటీ చైల్డ్‌హెల్త్)లో చిన్నప్లిల ఆరోగ్య విషయం రిజిస్టర్‌పై ప్రత్యేక అవగాహన అవసరమని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ జి. సరోజిని తెలిపారు. శుక్రవారం డి ఎంహెచ్ ఒ సమావేశ మందిరంలో డిప్యూటీ డి ఎంహెచ్ ఒ, వైద్యాధికారులు, హెల్త్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆర్‌సిహెచ్‌లో నమోదు చేయాల్సిన అంశాలపై ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.