ఆంధ్రప్రదేశ్‌

దసరాకు ముహూర్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఏపి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల సమీకరణలతో కసరత్తు చేస్తున్నారు. బాబుకు సెంటిమెంటయిన దసరా రోజునే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఆయా కులాలకు ఉన్న ప్రాధాన్యం ప్రకారం కేబినెట్‌ను విస్తరించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. బీసీ, రెడ్డి వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి సిఎం కుమారుడు లోకేష్ మినహా కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చంటున్నారు. గత ఏడాది నుంచి కమ్మ వర్గం అధిపత్యం పెరిగిందన్న భావన ఇతర కులాల్లో బలంగా నాటుకుపోయింది. దానికితోడు ముద్రగడ దీక్ష తర్వాత ఇలాంటి ప్రచారాన్ని ప్రత్యర్థి సామాజిక వర్గాలు బలంగా ప్రచారం చేశాయి. దీంతో లోకేష్‌కు మినహా ఇతరులకు స్థానం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆ సామాజికవర్గం నుంచి ఎవరినైనా తొలగిస్తే మళ్లీ అదే సామాజికవర్గం వారికి స్థానం ఉంటుందే తప్ప, కొత్తగా చేరికలు ఉండకపోవచ్చని విశే్లషిస్తున్నారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో పుల్లారావును తొలగిస్తే ధూళిపాళ్ల నరేంద్రను తీసుకోవచ్చంటున్నారు. కోడెల తనకు స్పీకర్ పదవి సంతృప్తిగా ఉందంటున్నారు. లోకేశ్‌కు పరిశ్రమలు, ఐటి శాఖ దక్కవచ్చు. కెఇ, అచ్చెన్న, గంటా శాఖలు మారవచ్చంటున్నారు.
ఇక రెడ్లను ఆదరించడం ద్వారా జగన్‌ను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో వెళుతున్న నాయకత్వం సీమ, నెల్లూరు జిల్లాల్లో ఆ వర్గాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కడప నుంచి ఎవరికీ కేబినెట్‌లో చోటు లేదు. ఒకవేళ ఆ జిల్లాకూ స్థానం కల్పించాలని నిర్ణయిస్తే, అక్కడ కౌన్సిల్ వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, లేదా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఇక కర్నూలులో భూమా కుటుంబానికి మంత్రిపదవి ఖాయమంటున్నారు.
నెల్లూరు-ప్రకాశం జిల్లాకు కలిపి ఒక రెడ్డికి ఇవ్వవచ్చన్న చర్చ జరుగుతోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు నుంచి సోమిరెడ్డి, ప్రకాశం నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మాగుంటది నెల్లూరు నేపథ్యమే అయినప్పటికీ, నెల్లూరుకు ఫుల్‌టైమ్ మంత్రి అవసరం ఉందన్న భావన ఉంది. ప్రస్తుతం నారాయణ కూడా పెద్దగా సమయం కేటాయించడం లేదన్న అసంతృప్తి ఉంది. అందువల్ల రెండు జిల్లాలకు కలిపి ఒక రెడ్డికి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అవసరమైతే ప్రకాశం నుంచి మాగుంటకు, నెల్లూరు నుంచి సోమిరెడ్డికీ ఇవ్వాలన్న సూచనలు అందుతున్నట్లు సమాచారం. తాజాగా మాగుంట బాబును కలిసినా అది వ్యాపారానికి సంబంధించిందేనని అంటున్నారు.
ఇక కాపులను కేబినెట్‌లోకి తీసుకునే విషయంలో కుల సమీకరణలు కుదురుతున్నట్లు కనిపించట్లేదు. జ్యోతులనెహ్రును క్యాబినెట్‌లో తీసుకుంటే తూర్పుగోదావరి నుంచి ఇద్దరు కాపులవుతారు. దానివల్ల బీసీలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావుకు ఆయన మరదలు మృణాళిని స్థానంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
కళా బీసీ తూర్పుకాపు. కోస్తాలో కళాను కాపుగా గుర్తించే పరిస్థితి లేదు. అదే రాజప్పకు అధ్యక్ష పదవి ఇస్తే కాపులకు పార్టీ అధ్యక్ష పీఠమే ఇచ్చారని ఆ వర్గాన్ని సంతృప్తి పరచవచ్చని పార్టీ ఆలోచిస్తోంది. దానికి తోడు బీసీ కమిషన్ నివేదిక ఆలస్యం అవుతుండటం వల్ల రాజప్ప మంత్రిగా కంటే, పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నచ్చచెప్పడం వల్ల ఎక్కువ ఫలితాలుంటాయంటున్నారు.
ఇక బీసీలను విస్మరిస్తున్నారన్న అపనింద ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. పశ్చిమగోదావరి, అనంతపురం, శ్రీకాకుళం నుంచి బీసీలకు స్థానం దక్కవచ్చు. అనంతలో బోయ కుల జనాభా ఎక్కువగా ఉన్నందున ఈసారి ఆ వర్గానికి స్థానం ఖాయమంటున్నారు. అందులో భాగంగా చీఫ్‌విప్, బాబుకు విధేయుడయిన కాలవ శ్రీనివాసులు, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరికైనా స్థానం ఖాయమంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు శెట్టిబలిజ కోటాలో బెర్త్ లభించవచ్చు.