ప్రకాశం

ఆకర్షణీయ గ్రామాలను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్ : జిల్లాలోని ఆర్థిక, సామాజిక వాస్తవ పరిస్థితులను, వనరులను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన గ్రామాలు, వార్డులుగా తీర్చిదిద్దేందుకు పటిష్ట ప్రణాళికలు ప్రత్యేక శ్రద్ధతో రూపొందించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహార్‌లాల్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రకాశం భవనంలోని సిపివో కాన్ఫరెన్స్ హాలులో ప్రణాళికశాఖ, ఎపి మాస్ ఆధ్వర్యంలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డులపై జిల్లా అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు భాగస్వాములతో జిల్లాస్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వెనుకబాటుతనం ఉందని, ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో నీటి సమస్యలు ఉన్నాయని, కార్మిక కుటుంబాలు ఉన్నాయని, అక్షరాస్యత తక్కువగా ఉందని, కుటుంబాల సంపాదన శక్తి సామర్థ్యాలు తక్కువని, వలసలు ఉన్నాయన్నారు. అలాగే ఎస్సీ ల జనాభా ఎక్కువగా ఉందని, ఏజెన్సీ ప్రాంతం కాక పోయినా జిల్లాలో 13 వేల కుటుంబాలుండే చెంచుగూడెంలు ఉన్నాయని, నీటి వసతి, రహదార్లు లేని ఎస్సీ కాలనీలు, గూడెంలున్నాయని, ఇందిరమ్మ ఇండ్లు, ఐఎవై ఇళ్ళు లేని గూడేలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని ప్రాథమిక, సామాజిక, ఆర్థిక, వౌలిక సదుపాయాల కల్పనకు పక్కా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అన్నీ గ్రామాలను ఒకే రకంగా అనుకోకుండా ఆయా గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులు, ఉద్యోగులు, వనరులు, అవసరాలు, గ్రామాలను చేరువు అనుకూలత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రత్యేక శ్రద్ధ చిత్తశుద్ధి అవసరమన్నారు. ఇందులో ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రాథమికంగా ముఖ్య భూమిక పోషించాలన్నారు. వారు ప్రజలను చైతన్యపరిచి ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం ఒక యజ్ఞం లాంటిదని, గ్రామం లేదా వార్డుల అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సేవాతత్పరతతో ముందుకు వచ్చే భాగస్వాములు, ఎన్‌జివోలు, సియస్‌వోలను ప్రభుత్వ అధికారులు మరింతగా ప్రోత్సహించాలన్నారు. వారిలో అనుకూల దృక్పథంతో పనిచేసే విధంగా సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజల ఆలోచన విధానాలు, అర్థం చేసుకునే మనస్తత్వం పెరగాలన్నారు. రెండవ సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన 20 అభివృద్ధి సూచికలపై అధికారులను స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. అప్పుడే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పగలమన్నారు. ఏదేని గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న స్థితిగతులు, వనరులు, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని, వాటిని విశే్లషించుకుని పరిష్కార మార్గాలు అనే్వషించాలన్నారు. యువతను ఆకర్షించే విధంగా ముఖాముఖి చర్చించి ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి స్వరూప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్రధారులు, సూత్ర ధారులు భాగస్వాములేనన్నారు. ఉన్న వనరులను వినియోగించుకుని ఆర్థికంగా ఏలా ఎదగాలి అనే దిశగా ముందడుగు వేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తాము చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. భాగస్వాములు తాము గ్రామాభివృద్ధి కోసం చేసిన మంచి పనుల గురించి ప్రస్తావించారు. ఈ కార్యశాలలో ఎపి మాస్ సమన్వయకర్త ఎ కళామణి, బాపట్ల శిక్షణ కేంద్రం ప్రతినిధి మూర్తి, ప్రణాళికాధికారి భరత్‌కుమార్, డిఆర్‌డిఎ, డ్వామా , హౌసింగ్, ఐసిడియస్ పిడిలు మురళి, పోలప్ప, ధనుంజయుడు, లీలావతి తదితర అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు , జన్మభూమి- మా ఊరు కమిటీ సభ్యులు, భాగస్వాములు తదితరులు పాల్గొన్నారు.
రాచర్ల తహశీల్దార్ సస్పెన్షన్..?
రాచర్ల, ఫిబ్రవరి 3: సాంకేతిక కారణాల వలన జరిగిన పొరపాటుకు రాచర్ల తహశీల్దార్ ఇందిరాదేవి సస్పెండ్ అయినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు రాచర్ల తహశీల్దార్‌గా గత ఏడాది పనిచేసిన రత్నకుమారి సస్పెండ్ కావడంతో ఆమె స్థానంలో ఇందిరాదేవి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని ఆకవీడు పంచాయతీ పరిధిలో ఉన్న 1397 సర్వేనెంబర్‌లో ప్రభుత్వభూమిగా గుర్తిస్తూ పాసుపుస్తకాలను అప్పటి తహశీల్దార్ రత్నకుమారి రద్దు చేశారు. రద్దుచేసిన కొన్నిరోజులకు తిరిగి ఆన్‌లైన్ చేయడంతో రత్నకుమారి సస్పెండ్ కాగా అదే సమస్యతో అదే సర్వేనెంబర్‌ను డిజిటల్ సంతకాన్ని ప్రస్తుత తహశీల్దార్ ఇందిరాదేవి చేసినట్లు తెలుస్తోంది. దీనితో జిల్లాకలెక్టర్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతనెలలో ఒకసారి సస్పెండ్ చేసినట్లు పుకార్లు వినిపించగా, ఆమె జిల్లాఅధికారుల వద్ద తన గోడు వెళ్లబోసుకొని సస్పెన్షన్‌ను నిలిపివేయించుకున్నారని, బుధవారం మరల సస్పెన్షన్ అంశం తెరపైకి వచ్చిందని తెలిసింది. జిల్లాకలెక్టర్ సెలవులో నుండి విధులకు రాగానే సస్పెన్షన్ అమలులోనికి రానున్నట్లు సమాచారం. ఈ డిజిటల్ సంతకం కావాల్సి చేసింది కాదని, పొరపాటున చేసి ఉంటారని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా డిప్యూటీ తహశీల్దార్ ఛార్జి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై వివరణ కోరేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించగా వారు అందుబాటులో లేరు.

నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 3 : జిల్లాలో నేటి నుండి 24వ తేది వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ ప్రాక్టికల్స్ పరీక్షలు సజావుగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సదర్భంగా ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలు నాలుగు విడతలు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించడానికి 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు రెండు విడతలుగా జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలకు ఎంపిసికి చెందిన వారు 12 వేల 620 మంది, బైపిసికి చెందిన వారు 3 వేల 592 మంది, వెరసి 16 వేల 212 మంది హాజరు కానున్నారన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 1069 మంది, రెండవ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 632 మంది పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో సమస్యలు వస్తే తెలియజేయడానికి ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూము నెంబర్ 08592-281275ను ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలను తనిఖీ చేపట్టడానికి ప్లయింగ్ స్వ్కాడ్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే ప్రతిరోజూ నివేదికలు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల్లో ప్రాక్టికల్స్ పరీక్షలకు అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్ కో అధికారులను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు హాజరైయ్యేందుకు రూట్లలో అదనపు బస్ సర్వీసులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి నూర్‌బాషా ఖాశీం, ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వి రమేష్, ట్రాన్స్ కో డిఇ చల్లా రమేష్ తదితరులు ఉన్నారు.

నామినేటెడ్ పదవుల కోసం తెలుగు తమ్ముళ్ల ఎదురుతెన్నులు
పార్టీ పదవులతో కొంతమంది నేతల సంతృప్తి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 3:తెలుగుదేశం ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి రెండుసంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంతవరకు నామినేటెడ్ పదవుల భర్తీ ఇంకా పూర్తిస్థాయిలో కాకపోవటంతో పదవులు రాని నేతలు ఆందోళన చెందుతున్నారు. పదవుల రాని నేతలు మాత్రం ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యుల చుట్టు ప్రదక్షణాలు చేస్తునే ఉన్నారు. ఇటీవల జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు స్ధానం దక్కటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది నేతలు మాత్రం తమకు జిల్లాపార్టీ కమిటీలో స్థానం కంటే నామినేటెడ్ పదవులే ముద్దు అంటూ నేతల చుట్టూప్రదక్షణాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పదవుల పందారం కొంతమేర పూర్తి అయినప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం భర్తీకాలేదు. ఇటీవల ఒంగోలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా శింగరాజు రాంబాబుతోపాటు పాలకవర్గ కమటీని రాష్ట్రప్రభుత్వం నియమించింది. శింగరాజుకు చైర్మన్ పగ్గాలు రావటంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ప్రధాన భూమిక పోషించారు. దీంతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దామచర్ల విజయవాడలో కలిశారు. ఈసందర్భంగా ఒంగోలు వ్యవసాయమార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని కూడా ముఖ్యమంత్రికి దామచర్ల పరిచయం చేశారు. మొత్తంమీద ఒంగోలు వ్యవసాయమార్కెట్‌కమిటీ పాలకవర్గం ఎంపికలో దామచర్ల కీలకపాత్రపోషించారనే చెప్పవచ్చు. కాగా ఇటీవలే కనిగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా దారపనేని చంద్రశేఖర్ ప్రమాణాస్వీకారం చేశారు. ఆయన ప్రమాణాస్వీకారానికి కేంద్రమంత్రి సృజనాచౌదరితోపాటు, మరికొంతమంది మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు.కాని శింగరాజు ప్రమాణాస్వీకారానికి మాత్రం తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్‌తోపాటు, రాష్టమ్రంత్రులు హాజరయ్యేవిధంగా దామచర్ల చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.
ఇదిఇలాఉండగా జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పదవి కోసం పలువురునేతలు ముమ్మంగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఈపాటికే రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌రావు, రాష్ట్రబ్రాహ్మణ కార్పొరేషన్‌కు జిల్లాకు చెందిన మాజీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావును నియమించారు. కాగా ఆర్‌టిసి చైర్మన్‌గా రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలో అధికారికంగా ఆయన పేరును రాష్ట్రప్రభుత్వం ప్రకటించనుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కాని ఇంతవరకు ఆయన పేరును అధికారికంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించలేదు. కరణం పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ముచ్చటంగా మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు జిల్లాకు దక్కినట్లే అవుతుంది. అదేవిధంగా రాష్టస్థ్రాయి కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులకోసం తెలుగుతమ్ముళ్లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈపాటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా మన్నం శ్రీ్ధర్ నియమించారు. మరికొంతమంది నేతలకు వివిధ కార్పొరేషన్లల్లో స్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తంమీద కొంతమంది నేతలు మాత్రం భర్తీకాని నామినేటెడ్ పదవులకోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు.

జిల్లాలో త్వరలో ట్రైనింగ్ కం ఇంక్యుబేషన్ సెంటర్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 3: దేశంలో 102ట్రైనింగ్ కం ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటుచేశామని మరొకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేస్తామని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ సి రవీంద్ర ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలోని ఓక్లా ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లో రవీంద్రను ఎంపి వైవి కలిశారు. వెనుకబడిన జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో నిరుద్యోగ యువత ఎక్కువుగా ఉందని, అందువలన యువతకు ఆ సమస్య తీర్చేందుకు ట్రైనింగ్ కం ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్భంగా చైర్మన్ స్పందిస్తూ జిల్లాలో సెంటరును ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగులతోపాటు చుట్టుపక్కల నాలుగుజిల్లాల నిరుద్యోగులకు ఈసెంటరు ఎంతగానో ఉపయోగపడుతుందని చైర్మన్‌కు ఎంపి వివరించారు. ఈ శిక్షణ సెంటరును ఏర్పాటుచేయటం వలన నిరుద్యోగులు స్వతహాగాపరిశ్రమను స్థాపించేందుకు వీలు ఉంటుందన్నారు. పరిశ్రమల్లో వస్తువులు తయారు చేసే విధానం, మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ఎంపి సుబ్బారెడ్డి ఈసందర్భంగా తెలిపారు.

ఇద్దరు మహిళల కిడ్నాప్‌నకు విఫలయత్నం
* కారును అడ్డుకున్న రైతులు
* నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
పొన్నలూరు, ఫిబ్రవరి 3: కందుకూరు పొగాకు వేలం కేంద్రంలో పని చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ ప్రభావతి, ఫీల్డ్ అసిస్టెంట్ అజ్మసుల్తానాల కిడ్నాప్‌నకు బుధవారం విఫలయత్నం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు పొగాకు వేలం కేంద్రంలో పని చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ ప్రభావతి, ఫీల్డ్ అసిస్టెంట్ అజ్మసుల్తానాలు తమ విధులు ముగించుకుని కేంద్రం నుండి కారులో ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యంలో తమ కారులో పెట్రోల్ అయిపోయిందంటూ ఇద్దరు మహిళలు, నలుగురు వ్యక్తులు ప్రభావతి కారును ఆపారు. దీంతో కారు ఆపిన వ్యక్తులు ప్రభావతి, అజ్మసుల్తానాలను వేరే కారులోకి బలవంతంగా ఎక్కించి తీసుకెళుతుండగా స్థానికులు పొగాకు బోర్డు అధికారికి సమాచారమందించారు. దీంతో ఆయన పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. అదేవిధంగా ఆయన పొన్నలూరు మండలంలోని అగ్రహారం వద్ద రైతులకు సమాచారం ఇవ్వడంతో వారు ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. దీంతో కిడ్నాప్‌కు సంబంధించిన కారును రైతులు పట్టుకున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి చేరుకున్న పొన్నలూరు ఎస్‌ఐ ప్రభాకర్ నిందితులను అదుపులోకి తీసుకుని పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కిడ్నాప్ వెనుక ఒక మహిళ కుటుంబ సభ్యుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పర్సంటేజిలు లేనిదే బిల్లులు ఇవ్వడం లేదు
జడ్పి సిఇవో ఎదుట సర్పంచ్‌ల ఆవేదన
దర్శి, ఫిబ్రవరి 3 : అధికారులు పర్సంటేజీలు ఇవ్వనిదే బిల్లులు మంజూరు చేయడం లేదని నియోజకవర్గంలోని సర్పంచ్‌లు జడ్పి సిఇవో బాపిరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి మంచినీటి సమీక్షా సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంటును విడుదల చేసుకోవడానికి అధికారులకు పర్సంటేజీ ఇవ్వక తప్పడం లేదని, దీంతో మంచినీటి సరఫరాకు తగిన న్యాయం చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. పాత పద్దతినే కొనసాగించాలని వారు సిఇవో బాపిరెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచ్‌లు వెంకట్రావు, త్యాగం అంజిరెడ్డి, సర్పంచ్ జైనూల్, గొర్రే సుబ్బారెడ్డి, ఆంజనేయులు, జిసి గురవయ్య, తదితర సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లారుూస్ యూనియన్
విజయఢంకా మోగించడం ఖాయం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్
ఒంగోలు, ఫిబ్రవరి 3: నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 18న జరగనున్న ఎపిఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ విజయఢంకా మోగించడం ఖాయమని ఎపిఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ జోస్యం చెప్పారు. ఎపిఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ప్రకాశం రీజియన్‌స్థాయి సదస్సు బుధవారం స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో జరిగింది. ఈ సదస్సుకు ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ప్రకాశం రీజియన్ అధ్యక్షులు కె నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఎంప్లారుూస్ యూనియన్‌ను రాష్ట్రంలో ఓడించే సత్తా ఏ యూనియన్‌కు లేదన్నారు. గత సంవత్సరం అనేకసార్లు సమ్మెచేసి కార్మికులకు వేతనాల పెంపును సాధించినట్లు చెప్పారు. ఎంప్లారుూస్ యూనియన్ గెలుపొందితే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లారుూస్ యూనియన్ ప్రకాశం రీజనల్ సెక్రటరీ వాకా రమేష్, రాష్ట్ర కోశాధికారి భవాని, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఎస్ కోటేశ్వరరావు, ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర నాయకులు యం హనుమంతరావు, నాయకులు బాబు, కృష్ణారెడ్డి, నారాయణరావు, ఎన్‌ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రకాశం రీజియన్‌లోని 8 డిపోల నుండి కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత స్థానిక ఆర్టీసి డిపో వద్ద నుండి సదస్సు వేదిక అయిన ఆర్యవైశ్య భవన్ వరకు కార్మికుల ప్రదర్శన జరిగింది. ఈ సదస్సులో పద్మాకర్‌ను కార్మికులు ఘనంగా సన్మానించారు.