ప్రకాశం

గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఏప్రిల్ 23 : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పరిపాలన సాగుతుందని బిజెపి జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి దగ్గుపాటి పురంధ్రీశ్వరి పేర్కొన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని పసల్‌బీమా యోజన పథకంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. జిల్లా బిజెపి అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్రమోదీ పాలన సాగుతుందని తెలిపారు. అత్యధిక బలం కలిగిన పార్లమెంట్ సభ్యులతో అవినీతి రహిత పాలన అందిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. రైతు కష్టమే పెట్టుబడి, నష్టమే దిగుబడిగా సాగుతున్న ఈ రుణంలో రైతు నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ రంగానికి మోదీ పెద్దపీఠ వేశారన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భారతదేశంలో వ్యవసాయ రంగం అగ్రగామిగా నిలబడాలనే లక్ష్యంతో పసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదని, విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు రైతుకు వెంటనే నష్టపరిహారం అందే విధంగా ఆధునిక సాంకేతికను మేళవించి ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి బలపడుతుందనే దానికి నిదర్శనమే దర్శిలో జరుగుతున్న సభ రుజువు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కుంభకోణాల్లో మునిగి తేలితే రెండు సంవత్సరాల బిజెపి పాలనలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పరిపాలన అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్న పెన్షన్ పథకంలో 70 శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ అందుతుందంటే నరేంద్రమోదీ ఘనతేనన్నారు. దీన దయాళ్ విద్యుత్ పథకం కింద 125 రూపాయలకే కరెంట్ మీటర్, స్థంభాలు, ఎల్‌ఇడి బల్బులతో పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేటికీ సిఆర్‌డిఎ అనుమతులు తెచ్చుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఒక రోజు జపాన్ ప్లాన్, ఒక రోజు మలేషియా ప్లాన్, ఒక రోజు సింగపూర్ ప్లాన్‌లతో కాలం వెలుబుచ్చుతూ కేంద్రంపై నెపం మోపడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో నీరు-చెట్టు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్వినియోగం చేస్తున్నారో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలిపారు. బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మిత్ర పక్షం అయినప్పటికీ ప్రజల పక్షాన పోరాటంలో వెనుకంజ వేసేది లేదన్నారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపి ఒంటరిగా పోటీ చేయడానికైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, దారా సాంబయ్య, శాంతకుమారి, జిల్లా అధ్యక్షులు బత్తిన నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

44.7
అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
* భానుడి ప్రతాపంతో అల్లాడిన జిల్లా ప్రజలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఏప్రిల్ 23: భానుడి ధాటికి ప్రకాశం జిల్లా నిప్పులకొలిమిగా మారింది. ఉదయం 9 గంటల నుండే భానుడు నిప్పుల వర్షం కురిపించడంతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10గంటల నుండి ప్రజలు, వాహన చోదకులు బయటకు రావాలంటేనే భయపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్ధాయిలో శనివారం 44.7 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం 40.2సెంటీగ్రేడ్‌కే జిల్లాలోని ప్రజలు ఆందోళన చెందగా ఒక్కసారిగా నాలుగున్నర డిగ్రీలు పెరిగాయి. రానున్నరోజుల్లో ఎండలు మరింత మండే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉదయం నుండి సాయంత్రం వరకు వడగాలులు వీస్తుండడంతో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంమీద ఒక్కరోజులోనే నాలుగున్నర డిగ్రీలు పెరగడంతో ప్రకాశం జిల్లా అగ్రి గుండంగా మారిందనే చెప్పవచ్చు. ఈ ఎండలకు వృద్ధులు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం పొంచి ఉంది. రికార్డు స్థాయిలో ఎయిర్‌కూలర్లు, శీతల పానీయాల విక్రయాలు పెరిగాయి. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లోకి వెళ్ళే రైతులు ఈ ఎండలకు జంకుతూ ఇంటికే పరిమితమవుతున్నారు. కొంతమంది రైతులు వేకువజామున పొలాల్లోకి వెళ్ళి ఉదయం 7గంటలకే ఇళ్ళకు చేరుకుంటున్నారు. ఈ ఎండలకు భూగర్భ జలాలు సైతం పూర్తిగా ఆవిరయ్యే ప్రమాదం పొంచిఉంది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
వైకాపా ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన
ఒంగోలులో కదంతొక్కిన వైకాపా శ్రేణులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,ఏప్రిల్ 23:రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఒంగోలు పట్టణంలో భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన స్థానిక జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ప్రకాశం భవనం వరకు సాగింది. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. రాజకీయపార్టీల నేతలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు అందరిని బాధిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభ్యులను కొనుగోలు చేయటం అనైతికమని వారు ధ్వజమెత్తారు. సేవ్‌డెమోక్రసీ అంటూ వైకాపా కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఒంగోలు నగరంతోపాటు, జిల్లాలోని పలుప్రాంతాల నుండి వైకాపాశ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి సారధ్యంలో జిల్లాలోని నలుమూలల నుండి నాయకులు,కార్యకర్తలు తరలివచ్చి సేవ్‌డెమోక్రసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, పర్చూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జులు గొట్టిపాటి భరత్, బి మధుసూదన్, వైకాపా రాష్టన్రాయకులు కెవి రమణారెడ్డి, వెంకటేశ్వరరావు,జిల్లాపార్టీ నాయకుడు వేమూరి సూర్యనారాయణ, నగరపార్టీ అధ్యక్షుడు కుప్పంప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా
రఘునాయకస్వామి కల్యాణ మహోత్సవం
నాగులుప్పలపాడు, ఏప్రిల్ 23: ప్రముఖ వైష్ణవ క్షేత్రం చదలవాడ శ్రీరఘునాయకస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శనివారం జరిగింది. భక్తుల జైశ్రీరాం నామస్మరణ మధ్య స్వామివార్లను వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో ఆలయం నుండి కల్యాణవేదికకు తీసుకువచ్చారు. ప్రధాన అర్చకులు ఇ రవితేజ ఆచారి ఆధ్వర్యంలో ఉదయం 10.40గంటలకు ఆకాశంలో గరుడపక్షి ప్రదర్శనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణ ఘట్టం జరుగుతుండగా మరోసారి 11.55 గంటలకు గరుడపక్షి ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపంపై మూడు ప్రదక్షణలు చేస్తుండగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఆలయంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆయన సతీమణి లక్ష్మిపద్మావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, ఒంగోలు డిఎస్‌పి జి శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు, గ్రామసర్పంచ్ గూడురు వెంకట్రావు, తహశీల్దార్ పివి రమణారావు, ఎండిఒ జాన్ సామేలు పూజల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. సాయంత్రం రధోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి రూరల్ సిఐ సంజీవ్‌కుమార్, ఎస్‌ఐ రాజమోహన్‌రావు బందోబస్తు నిర్వహించారు.
భవిష్యత్ తరాలకు దర్పణాలు మన గ్రంథాలు
సారస్వతనికేతనాన్ని సందర్శించిన తనికెళ్ల భరణి
వేటపాలెం, ఏప్రిల్ 23: స్థానిక సారస్వతనికేతనం గ్రంథాలయాన్ని సినీ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి శనివారం సందర్శించారు. గ్రంథాలయంలోని అపురూపమైన గ్రంధాలను, గాంధీజి చేతికర్ర, సందర్శకుల అభిప్రాయాలు పరిశీలించారు. అనంతరం తనకు కావాల్సిన పద్య కవితలకు సంబంధించిన పలు గ్రంథాలను ఆయన సేకరించి గ్రంథాలయంలో చదువుకున్నారు. వాటిలో తనకు కావాల్సిన కొన్ని గ్రంథాలను తన వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ వంటి ఎంతో మంది మహనీయులు సందర్శించిన పవిత్ర గ్రంథాలయం సారస్వతనికేతనమన్నారు. భవిష్యత్ తరాలకు దర్పణాలు మన గ్రంథాలన్నారు. గ్రంథాలయంలో సదుపాయాల కల్పన చేయాల్సి ఉందన్నారు. గ్రంధాలయానికి ప్రత్యేకమైన వెబ్‌సైట్ రూపొందించి సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న గ్రంథాలను ఆన్‌లైన్ చేయడం ద్వారా పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రంథాల సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌తరాలకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగకరమైందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రంథాలయంలో వసతుల కల్పన, అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రచించిన పలు గ్రంథాలను గ్రంధాలయానికి బహూకరించారు. ఆయన వెంట సహచరులు సాయివరప్రసాద్, భాస్కర్, వేణు ఉన్నారు.

మది నిండుగా కళా పండుగ
- నేటి నుంచి మార్టూరులో రాష్టస్థ్రాయి నాటిక పోటీలు
మార్టూరు, ఏప్రిల్ 23: మార్టూరులో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్టస్థ్రాయ నాటిక పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 నాటికల ప్రదర్శన పరిషత్ మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పర్చూరు శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు, ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, రోటరీ గవర్నర్ ప్రభాకర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జాస్థి సాంబశివరావు, కార్యదర్శి కనె్నగంటి శ్రీనివాసరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఎఫర్ట్ డైరెక్టర్ జె వి మోహన్‌రావు అధ్యక్షత వహిస్తారు. రాత్రి 8 గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం నాటికల ప్రదర్శన జరుగుతుందని కళా పరిషత్ అధ్యక్షుడు కందిమళ్ల సాంబశివరావు తెలిపారు. రాష్ట్రంతో పాటు కర్ణాటకలో సైతం వ్యాపారం నిర్వహిస్తున్న గ్రామస్థులు ప్రదర్శనలు చూడడానికి స్వగ్రామానికి తరలివస్తారు. పరిషత్ నిర్వహణ, ప్రేక్షకుల ఆదరణ స్వయంగా చూసి స్పందించిన మాజీ సర్పంచి బొప్పూడి శ్రీనివాసరావు నాటకోత్సవాలు జరిగే పంచాయతీ కార్యాలయం ఆవరణలో శాశ్వత కళావేదిక నిర్మాణానికి తన తల్లి రోశమ్మ పేరిట విరాళమిచ్చారు. సాంస్కృతిక వికాసంతో పాటు నాలుగు భాషా ప్రాధాన్యం మరింత విస్తృతం చేయాలనే ఆశయంతో నిర్వాహకులు తమ వంతు కృషి చేస్తున్నారు.
నేడు మార్టూరులో స్పీకర్ పర్యటన
చీరాల : శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు మార్టూరుకు రానున్నారు. ముందుగా ఆయన మార్టూరు మండల పరిధిలోని ఇసుకదర్శిలో అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అదే గ్రామంలో నీరు చెట్టు పథకం కింద ఏర్పాటు చేసిన వాటర్‌షెడ్ పనులను పరిశీలిస్తారు. ఏలూరి క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడి కేంద్రాల ఆధునికీకరణ అంశంపై ప్రసంగించిన అనంతరం మార్టూరులో ఎన్టీఆర్ నాటక పరిషత్ కార్యక్రమంలో పాల్గొంటారు.