ప్రకాశం కథలు

‘ఔరా ప్రకాశం!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బారిస్టర్ ప్రకాశం గారంటారు తన స్వీయచరిత్ర ‘నా జీవిత యాత్రలో’. జీవితమంతా ‘ఆకస్మిక ఘటనావళి’ అని. (లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్). ఈ అభిప్రాయం పంతులుగారి జీవితంలో అక్షరసత్యమైంది. అది రాజమండ్రిలో బోట్ తప్పిపోనప్పుడు కానివ్వండి, గోదావరిలో ఈత కొడ్తున్నప్పుడు తప్పిన ప్రాణాపాయం కానివ్వండి, హనుమంతరావు నాయుడిగారి ప్రేమానురాగాలు దొరకడం కానివ్వండి. అన్ని సంఘటనలలోను దైవ అదృశ్య హస్తం ప్రకాశంగారిని వెన్నంటి ఉండి విజయపథంలో నడిపించింది. మరొక్క అనూహ్య ఆకస్మిక ఘటన వలన ప్లీడర్ ప్రకాశాన్ని బారిస్టర్ ప్రకాశాన్ని చేసింది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియకుండా ఊహాతీతమైన మలుపులు తిరుగుతూ, ఆద్యంతం, ఉత్కంఠభరిత పోరాటం - పంతులుగారి జీవనయానం.
ఏలూరి లక్ష్మీనరసింహం గారి తరఫున ప్రకాశంగారు కేసు నడుపుతూ ట్రాన్స్‌ఫర్ కోసం హైకోర్టులో పిటిషన్ పెట్టారు. హైకోర్టులో డా.స్వామినాథన్ గారిని ప్రకాశంగారు ప్లీడర్‌గా పెట్టి నడిపించదలిచారు, చాలా పట్టుదలతో. బెంచ్ మీదకు కేసు రాగానే డేవిస్ అనే న్యాయమూర్తి చాలా భీకరంగా ‘నో పాయింట్స్ టు ఆర్గ్యూ; కేస్ డిస్‌మిస్డ్’ అన్నాడు. స్వామినాథన్ గారు పెదవి విప్పనైనా విప్పలేదు. వెంటనే కోర్టులోనే ‘ఇదేమి బారిస్టరీ అండీ!.. ఆర్గ్యుమెంట్ చెప్పకుండానే డిస్మిస్ చేస్తే మాట్లాడక ఊరుకున్నారు’ అని కేకలేశారు ప్రకాశంగారు.
‘ప్రకాశంగారూ! రాత్రి మా ఇంటికి భోజనానికి రండి’ అని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు. భోజనం కాగానే స్వామినాథన్ గారు ‘ప్రకాశంగారూ! మీలో మంచి చురుకుదనమూ, ధైర్యమూ కనిపిస్తున్నాయి. మీరు ఎందుకు బారిస్టర్ కాకూడదు’ అన్నారు. పంతులుగారు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా తేరుకొని ఆలోచించారు. రాజమహేంద్రవరంలో సెకండ్ గ్రేడ్ ప్లీడరుగా పనిచేస్తూ, శత్రువులని నిర్జించుకుంటూ తృప్తికరమైన జీవితం గడుపుతున్న వారికి ఆ స్థానం ఇరుకుగా అనిపించేది. విశాలమైన ఆవరణలో విచ్చలవిడిగా సంచారం చేసే మనస్తత్వం కనుక పంతులుగారికి ఈ ఆలోచన బాగా తలకెక్కింది. వెంటవెంటనే స్నేహితులతో సంప్రదింపులు, డబ్బు సమకూర్చుకోవడాలు, తల్లిగారికి ప్రమాణాలు, కుటుంబ సభ్యులను సర్దుబాటు చేసుకోవడాలు అతికష్టం మీద జరిగిపోయాయి. ఇంగ్లండ్ చేరుకున్నారు పంతులుగారు, 12 రోజులు సముద్రయానం చేసి 1904 అక్టోబర్‌లో.
లండన్‌లో ప్రకాశంగారు పట్టుదలతో, శ్రద్ధతో కూడిన కఠోర శ్రమ బారిస్టర్ చదువులో ప్రథమ శ్రేణిలో పాస్ కావడమే కాకుండా ఒక ప్రైజ్ 50 రూపాయలు గెలుచుకునేట్లు చేశాయి. ఆ రోజుల్లోనే ‘లండన్ ఇండియన్ సొసైటీ’లో చేరాడు. తనకు పరిచయమైన దేశభక్తులు, ప్రముఖులలో, దాదాభాయి నౌరోజీ, సి.ఆర్.రెడ్డి, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, లాలా లజపతిరాయ్, శ్వామ్‌జీ కృష్ణవర్మ మొదలగు వారు. వారితో కలిసి, వారి కోసం పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేశభక్తి, స్వాతంత్య్రం గురించి ఉపన్యాసాలను వినేవారు.
అంతేకాకుండా అక్కడ చక్కని గ్రంథాలయం ఉండేది. అందులో ఉన్న గ్రంథాలన్నీ చదివారు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా మొదలైన వివిధ దేశాల స్వాతంత్య్ర పోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలు ఎన్నో చదివారు. ‘రాజకీయమే ప్రధానమైన నా జీవితంలో, రాజకీయ స్వాతంత్య్రం విషయమై ఆకాంక్ష అప్పుడే ఉదయించిన రోజులవి’ అని రాసుకున్నారు. ఇంకా... ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు మొలకెత్తిన రోజులని కూడా ప్రస్తావించారు.
మొదటి టర్మ్ ముగించుకొని రాజమహేంద్ర వరం 1905లో తిరిగి వచ్చారు ప్రకాశం. అందరు తను పూర్తిగా పాడైపోతాడు అనుకున్నారు. ప్రకాశాన్ని చూసి రాజమహేంద్రవరం యావత్తూ ఆశ్చర్యచకితులైందనే చెప్పాలి. ఆ మధ్యకాలంలో మాగంటి బాపినీడు అక్కగారైన రావమ్మగారి కేసును చాలా చాకచక్యంతో నడిపించారు ప్రకాశం. విశేషమేమిటంటే డా.స్వామినాథం గారికి వ్యతిరేకంగా పని చేయడం. కేసు మొదట్లో ఆమె దగ్గర పైకం లేకపోవడంతో తన సొంత ఖర్చుతో అయిదారేళ్లు కిందా మీదా పడి చివరికి ఆమెకు మోక్షం లభించింది. కేసు గెలిచిన తరువాత ఆ సంపన్నురాలు ఆ రోజులలో ప్రకాశంగారికి 70వేల రూపాయల ఫీజు ఇచ్చుకొంది. దాంతో మన పంతులుగారి ప్రతిభ, ప్రతిష్ఠ పలుకుబడి దశదిశలా వ్యాపించింది. మళ్లీ తిరిగి లండన్‌కు వెళ్లి బారిస్టర్ చదువులో డిస్టింక్షన్‌లో పాసైనారు ప్రకాశం. అపారమైన పరిజ్ఞానం, ‘లా’లో అనుభవం గడించిన బారిస్టర్ ప్రకాశం గారికి రాజమహేంద్ర వరం చాలా చిన్నదిగా కనిపించింది. తన స్వేచ్ఛకు, విశాల హృదయానికి, గంభీరత్వానికి మద్రాస్ సరైనదని తోచింది. ఇకనేం మద్రాస్ ప్రయాణం. మద్రాస్ వచ్చాడు. చూశాడు. గెలిచాడు.
1906 చివరిలో ప్రకాశంగారు సకుటుంబ సమేతంగా మద్రాస్ చేరుకున్నారు. హైకోర్టు దగ్గరలో కొండిచెట్టి వీధిలో 25 రూ. అద్దె మీద ఓ చిన్న ఇల్లు తీసుకొని లైబ్రరీ, ఆఫీస్ సరంజామా, హంగూ ఏర్పరచుకున్నారు. అప్పట్లో మైలాపూర్ వకీళ్ల ప్రభ వెలిగిపోతూ ఉండింది. అయ్యర్ల, అయ్యంగార్ల ధాటికి ఎవరూ తట్టుకొనే పరిస్థితి లేదు. తెలుగువారు ఎవ్వరూ వాళ్ల ఎదుట నిలవడానికి కూడా జంకేవారు. ఏకంగా ప్రకాశంగారిని వేరే చిన్న పట్టణంలో ప్రాక్టీస్ పెట్టుకోమని నిరుత్సాహంతో కూడిన హెచ్చరికలు చేశారు. ‘నేను విదేశం వెళ్లి బారిస్టరీ చదివి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో నిర్ణయించుకోలేక పోతే నా చదువు వృధాయే! నేను ఇక్కడే ప్రాక్టీస్ పెడ్తాను.. నాకు పని ఎందుకు రాదో చూస్తాను’ అని బదులు చెప్పి 1907లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం, కఠోర పరిశ్రమ ఈ మూడింటిని విడువకుండా శ్రమించడం వలన దినదినాభివృద్ధి చెందుతూ మద్రాస్‌లో అగ్రశ్రేణి బారిస్టర్‌గా స్థానం సంపాదించారు. ప్రాక్టీస్ చేసి 14 ఏళ్లలో పేరు ప్రఖ్యాతులతోపాటు డబ్బు విపరీతంగా సంపాదించారు. బంగళాలు, దొడ్లు, తోటలు వివిధ ప్రాంతాలలో కొన్నారు. హేమాహేమీల జడ్జీలకు బెదరకుండా చాలా స్వతంత్రం చూపేవారు. సర్ శంకరన్ అనే జడ్జి చాలా తెలివిగలవాడు. ప్రకాశంగారు వాదనలను వినకుండా ఇదివరకు ఇలాంటి కేసుల్లో ఒక తీర్పు వచ్చిందని చెప్పాడు. వెంటనే ప్రకాశంగారు ‘ఇలాంటి కేసు ఎప్పుడూ ఈ కోర్టులో రాలేదు సరికదా మీరు అసలే తీర్పు చెప్పలేదు. మీరు అనుకునే కేసుకు, దీనికి అసలు సంబంధమే లేదు’ అన్నాడు ప్రకాశం. అంతటితో ఆ జడ్జి చల్లబడ్డాడు. తరువాత ఎప్పుడూ ప్రకాశంగారికి అడ్డు చెప్పలేదు ఆర్గ్యుమెంట్‌లో. సరికదా పంతులుగారి వాదనను శ్రద్ధగా విని సరైన తీర్పులిచ్చేవాడు. ఈ వీరోచిత చర్య న్యాయమూర్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించినాయి.
ఇంకోసారి వాలస్ అనే జడ్జి ‘లా’ పాయింట్ గ్రహించడంలో సునిశిత బుద్ధి కలవాడే కానీ యధార్థం గ్రహించడంలో నిదానం. పైగా బెంచీ మీదే నిద్రపోయేవాడు. మరో విడ్డూరం, దుర్దశ ఏమిటంటే ఏ బారిస్టరు అప్పటిదాకా ఆయనను ఎదిరించనే లేదు. పైగా ఓపిగ్గా, తన కర్తవ్యం అనుకొని ఆయన నిద్ర లేచేదాకా వేచి ఉండేవారు. తీర్పులో న్యాయం లేకపోయినా న్యాయవాదులు వౌనంగా ఉండిపోయేవారు. ఒకసారి మన ధీర బారిస్టరుగారితో పడింది కేసు. ప్రకాశంగారు నిదానంగా, నిశితంగా, నికచ్చిగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా వాదించే అలవాటు. అదే వారి విజయానికి ఆయువుపట్టు. పంతులుగారు మాంచి ‘లా’ పాయింట్ పట్టుకొని వాదిస్తుండగా జడ్జి నిద్రపోయాడు. ప్రకాశం గారు కాగితాలు కింద పడేసి కూర్చున్నాడు. కొద్దిసేపటికి నిద్ర లేచి ‘మిస్టర్ ప్రకాశం మనం ఎక్కడ ఉన్నాం?’ అని ఇంగ్లీషులో అడిగాడు. వెంటనే ‘మై లార్డ్! నాకు తెలీదు మనం ఎక్కడ ఉన్నామో’ అన్నారు ప్రకాశంగారు. దానికి జడ్జిగారు చాలా బాధపడి ప్రకాశంగారి కేసుల్లో మాత్రం ఎప్పుడూ నిద్రపోలేదు. ఈ సాహస సమాధానం హైకోర్టు అంతా అగ్ని వ్యాపించినట్లు వ్యాపించింది.
మరొక సందర్భంలో ఒక సీనియర్ జడ్జి ప్రకాశంగారు వాదన పూర్తిగా వినకుండానే ‘ఆ! ఇందులో ఏముంది?’ అని చులనకగా అన్నాడు. ప్రకాశంగారు విసిగిపోయి ‘అయ్యా! నేను పార్టీల దగ్గర చాలా డబ్బు తీసుకున్నాను. న్యాయం చేకూర్చడానికని నేను ఇంత శ్రద్ధగా వివరిస్తుంటే ఇలా కొట్టిపడేయడం న్యాయమూర్తులకి న్యాయమైన పనికాదు’ అన్నారు. అంతటితో ఆయన తట్టుకొని నిదానపడ్డాడు. బారిస్టర్ ప్రకాశంగారి వీరోచిత చర్య వలన ఇతర లాయర్లు లబ్ధి పొందటంతో అందరూ పొంగిపోయారు.
ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక జడ్జి ప్రకాశంగారిని చాలా చులకనగా మాట్లాడుతూ ‘పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వృధా కేసు కోసం. వృధా వాదనలతో కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నావు’ అన్నాడు. అందుకు ప్రకాశం మరుక్షణమే ‘మీరు కూడా మా వాదనలను వినడానికే ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటున్నారు’ అని సమాధానం సంధించేసరికి జడ్జిగారు పెదవి విప్పలేదు. ఈ సమాధానం హైకోర్టు జనరల్ కూడా చేర్చబడింది. ప్రకాశంగారి ధాటికి న్యాయమూర్తులందరి ప్రవర్తనా క్రమంగా న్యాయపట్టాల మీదికి వచ్చేసింది. ఇంకో సందర్భంలో ఇద్దరు జడ్జిల సమక్షంలో ప్రకాశంగారు వాదిస్తుండగా ఒక జడ్జి అడుగడుగునా అతితెలివి ప్రదర్శిస్తూ, అడ్డు తగులుతుంటే ‘మిలార్డ్ నేను మీకు కాకుండా నా వాదన రెండో జడ్జిగారికి వినిపిస్తున్నాను’ అన్నాడు. ఇద్దరు జడ్జిలు మూగనోము పట్టారు అనుకున్నారందరూ.
అతి ముఖ్యమైన ఘట్టం ఇది. ప్రకాశంగారి ధైర్యానికి, ఆత్మగౌరవానికి పరాకాష్ట. ఒక జడ్జిగారు ప్రకాశం వాదిస్తుండగా ‘చాలు! సోది కట్టి పెట్టండి’ అన్నాడు. ప్రకాశం గారు వెంటనే కాగితాలు బల్ల మీద కొట్టి ‘ఆయన అన్న మాట ఉపసంహరించుకుంటే తప్ప ఆర్గ్యుమెంట్ చేయన’న్నాడు. జడ్జిగారు ముఖం ఎర్రగా చేసుకొని లేచి వెళ్లిపోయాడు. బారిస్టర్ల అసోసియేషన్ ఈ సంఘటనను తీవ్రంగా విమర్శించి ప్రకాశంగారి ప్రతిఘటనను సమర్థించింది. అసమ్మతి తీర్మానం పాస్ చేయడంతో ఆ జడ్జి క్షమాపణ చెప్పాక కేసు నడిచింది. ‘ఔరా ప్రకాశం!’ ప్రశంస అంబరాన్ని అంటిం ది.
ఈ విధంగా ప్రకాశంగారు భీతావహం పుట్టించే వ్యక్తిగా ప్రసిద్ధిగాంచారు. జమీందార్లు సైతం కేసు ప్రకాశంగారికి వివరించడానికి సొంత ఏజెంట్లను నియమించుకొని వారివారి బండ్లతో వరుసగా ప్రకాశంగారి ఆఫీసు ముందు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు కాస్తూ ఉండటం స్వయంగా తాను చూశాను అని ప్రకాశంగారి అనుచరుడూ, అభిమాని అయిన ‘గుంటూరు కేసరి’గా బిరుదు గాంచిన నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావుగారు ప్రకాశంగారి గురించి రాశారు.
మహాత్ముడి పిలుపునందుకొని లక్షలు సంపాదించుకొని రోజుకు వెయ్యి రూపాయల దాకా ఫీజు వసూలు చేస్తూ ఉన్న బారిస్టరు ప్రకాశంగారు, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాక్టీస్ వదులుకున్నారు. ఆ రోజుల్లో ప్రకాశంగారు రెండు చేతులా సంపాదిస్తూ పది చేతులా ఖర్చు పెట్టేవారు.

-టంగుటూరి శ్రీరాం.. 9951417344