ప్రకాశం కథలు

స్ర్తిపాత్రలకు పెట్టింది పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశం పంతులుగారు రెండు చేతులా సంపాదించి గాంధీజీ పిలుపుమేరకు స్వాతంత్య్ర ఉద్యమంలో దూకి గుండ్లకే గుండె చూపి, తెల్లవారి గుండెల్లో సింహస్వప్నమై వారిని గడగడలాడించిన వీరుడుగా మనకి తెలుసు. తను న్యాయవాద వృత్తిలో సంపాదించిన అపార సంపదనూ, జీవితాన్ని, న్యాయవాద వృత్తిని దేశ హితానికి, స్వరాజ్య, స్వరాష్ట్ర సాధనకు ఆహుతి అయిన నిష్కళంక దేశభక్తుడిగా, నిస్వార్థ త్యాగధనుడుగా మనందరికీ సుపరిచితులు. భోగభాగ్యాలను అనుభవించిన భోగి, యోగిగా మారి నిరాడంబరుడై జీవిత సర్వస్వాన్ని ధారపోసిన ధీరుడుగా చాలామందికి తెలుసు.
కానీ పంతులుగారు చిన్నతనంలో అంటే స్కూల్‌లో చదువుకునే రోజులలో నుంచే నాటకాలు వేసేవాడని, ఒక విలక్షణమైన నటుడనీ, గంభీరమైన స్వర కంఠుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. ప్రకాశంగారు ఏ పాత్ర వేసినా భలే రక్తికట్టేదని, ప్రత్యేకించి స్ర్తి పాత్రలు ఆయన కోసమే రాసేవారు ఆనాటి సుప్రసిద్ధ కవులు, నాటక రచయితలునూ. తన 13వ ఏట ప్రకాశం ఒంగోలులో చదువుకుంటున్న రోజులలో ధార్వాడ నాటకాలు చూసి ప్రేరణ పొంది నాటకాలు వేయాలని ఉత్సాహం చూపేవారు. వీరికి ఉండదల్లీ సాహెబ్ అనే ఉర్దూ పండితుడు జోడయ్యారు. ఆయన ఉర్దూలో రాసిన డైలాగులను తెలుగు లిపిలో రాసుకొని కంఠస్థం చేసేవారు. ప్రకాశం రాజమండ్రి చదువు కోసం చేరేటప్పటికి అక్కడ పూనా కంపెనీ వాళ్లు హిందీలో నాటకాలు ప్రదర్శించేవారు. వాళ్లను చూసి తెలుగులో నాటకాలు వేయాలని సంకల్పించుకున్నాడు మన ప్రకాశం.
ఇకనేం? బాలపంతులు సంకల్పానికి దైవానుగ్రహం ఎలాగూ ఎల్లప్పుడూ ఉండనే ఉండింది. ప్రకాశంగారు ఇలా రాసుకున్నారు తన నట జీవితం గురించి ‘నా జీవిత యాత్ర’లో.
‘ఆ కాలంలో రాజమహేంద్రవరంలో కూడా నాటకాల గొడవ ప్రారంభమైంది. నేను రాజమహేంద్ర వరం చేరేసరికే కందూరి వెంకటరత్నం, దాసు మాధవరావు ప్రభృతులు ఇంగ్లీషులో షేక్సిపియర్ నాటకాలు ఆడుతూ ఉండేవారు. మా హనుమంతరావు నాయుడు గారికి ఉండే నాటకాల పిచ్చికి అంతం లేదు గదా! దాంతోపాటు మాకు పిళ్లారిసెట్టి త్రియంబకరావు అనే ఒక కాంట్రాక్టర్ తోడైనాడు. అతడు ఆనాటి నాటకాలకి కావలసిన డబ్బూ హంగూ సమకూర్చేవారు.. అప్పట్లో బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు.. వారి దృష్టి అప్పుడు బాగానే ఉండేది. నాటకాలు వారు రాయడం, మేము ఆడటం జరుగుతూ ఉండేది. కొన్ని నాటకాలు ఆయన మా కోసమే వ్రాశారంటే ఏమీ అతిశయోక్తి లేదు.. ఈ నాటకాల గొడవల వల్ల ‘సంగీతము చేత బేరసారములుడిగెన్’ అన్నట్లు.. మెట్రిక్యులేషన్ పరీక్ష పోయింది... మామూలు సాంసారిక దృష్టిలో కొంచెం శూన్యమైన జీవితంలో పడిపోతున్నానా? అనే స్థితికి వచ్చింది. హనుమంతరావు నాయుడుగారు నన్ను నాటకాలలో ప్రవేశపెట్టినా, నా నైతికాభివృద్ధీ, విద్యాభివృద్ధీ, క్షేమాభివృద్ధీ కాపాడడానికి శక్తివంచన లేకుండా పాటుపడేవారు. నా లోపాలకీ, పతనానికీ ఆయన ఎంత మాత్రం బాధ్యులు కారు.’
ఆనాటి యువ ప్రకాశాన్ని, విద్యార్థి ప్రకాశాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి ‘యువ ప్రకాశం ఠీవి’ పద్య కవితా బృందం చదివి తీరాల్సిందే.
‘యువ ప్రకాశము ఠీవి’
-శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
సీ॥ ఈగ వ్రాలినగాని వేగడారెడునట్లు
ముత్యంపు కురులను దువ్వినాడు
వరలలాటమునందు తిరుచూర్ణ రేఖను
ముద్దుగారెడు భంగి దిద్దినాడు
అరణపల్లవమట్లు కరము రంజిల్లు చెం
గావి వస్త్రంబు గట్టినాడు
చారలంగరభాను జక్కగ ధరియించి
వలెవాటు కండువ వైచినాడు
గీ॥ చెవులసందున గిరజాలు చిందులాడ
మొగము మీదను చిరునవ్వు మొలకెత్త
టంగుటూరి ప్రకాశము రంగుమెరయ
ధవళగిరి తీర్థమునకు దా దరలివచ్చె.
* * *
‘చిలకమర్తిగారు వ్రాసిన పారిజాతాపహరణ నాటకంలో పంతులుగారు సత్యభామ పాత్రలో అద్భుతంగా జీవించారుట. ఆయా రసాల కనుగుణంగా ముఖంలో సాత్విక జలనాన్ని కంఠస్వర మార్పునూ చూసి ప్రేక్షకులు మహదానందాన్ని పొంది కరతాళ ధ్వనులు చేశారట.... సిరియాళ చరిత, పాండవాశ్వమేధం, సారంగధర.. వీరేశలింగ చమత్కార రత్నావళి.. మొదలైన నాటకాలన్నిటిలో స్ర్తి పాత్రలను ప్రకాశంగారే ధరించేవారట. సారంగధర నాటకంలో యరగర్ల సత్యరాజు చిత్రాంగి పాత్రను ధరిస్తే, ప్రకాశంగారు రత్నాంగి పాత్రను - కీచక వధలో నాయుడుగారు భీమ పాత్రను ధరిస్తే, ప్రకాశంగారు ‘ద్రౌపది’ పాత్రను, ‘శ్రీరామ జననం’లో నాయుడుగారు రావణ పాత్రను ధరించగా ప్రకాశంగారు దశరథ పాత్రనూ, నలదమయంతి నాటకంలో దమయంతి పాత్రనూ, ఎంతో ఉత్తమంగానూ, కనుల పండుగగానూ, ప్రదర్శించేవారట. రామాయణ గాథలో కౌసల్య ఆగ్రహం వెళ్లగ్రక్కే దృశ్యం కొంత భయంకరంగా ఉండేదట.. ప్రకాశంగారు ఆ ఆవేశరంగాన్ని ఎంతో ఉద్వేగంతో పోషించి, ఒప్పించి, మెప్పించేవారట’ అని మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తిగారు ఆంధ్రకేసరి శతజయంతి సంచిక కోసమై వ్రాసిన ‘నటకేసరి ప్రకాశం’ వ్యాసంలో వ్యక్తపరచిన వాస్తవాలు.
ఇంకా గయోపాఖ్యానంలో ‘చిత్రలేఖ’ వేషమూ, ఆ వెంటనే అదే నాటకంలో అర్జునుడి వేషమూ పంతులుగారు నయనానందంగా అపూర్వకంగా పోషించేవారు. నాయుడుగారు గయుడు వేషం వేసేవారు. నా నైపుణ్యం చూసి సామాన్య ప్రజలతోపాటు పేరు పొందిన పెద్దలంతా మన్నించి, హర్షించేవారని ప్రకాశంగారు వ్రాసుకొన్నారు.
ఆ రోజులలో రాజమండ్రి టౌను హాలు ప్రక్కన ఖాళీ స్థలంలో పెద్ద తాటాకుల హాలు నిర్మించి నాటకాలు ఆడేవారు.
ప్రకాశంగారి నాటకాలకు ప్రేక్షకులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. వారి అభినయానికి సుందర విగ్రహానికి ప్రజలు మైమరచిపోయేవారని మిక్కిలినేని రాశారు. ఆంధ్రులే కాక ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ప్రకాశంగారి నటనకు ముగ్ధులైనారు. ఒరిస్సా పేరుగాంచిన పౌరుడు శ్యామసుందర రాజగురువుగారు ప్రకాశానికి ‘రంగస్థల నక్షత్రం’ అనే బిరుదునిచ్చాడు. ప్రకాశంగారు తన నటనతో ఎంతోమంది స్ర్తిల మనస్సులను దోచుకున్నాడట. వారి కలవరంలో ఆయన కొట్టుకుపోయారట కూడా. ఈ విషయాన్ని పంతులుగారే స్వయంగా స్వీయ చరిత్రలో తెలియపరిచారు. 1891 సం.లో ధవళేశ్వరంలో హరిశ్చంద్ర నాటకంలో ప్రకాశంగారు చంద్రమతిగా నటిస్తుంటే చూసి ముగ్గురు తెల్లదొరలు ముగ్ధులై మరుసటి రోజు రాజమండ్రి పనికట్టుకుని వచ్చి ఆ పాత్రల వేషం వేయమని, ఆ ఫొటోలు, ఆ రోజులలోని నాటక విధానాలను ఇంగ్లండ్‌కు పంపిస్తామన్నారు. అంటే ప్రకాశంగారి నటనా నైపుణ్యానికి ఇది నిలువుటద్దం. కానీ ప్రకాశంగారు ఒప్పుకోలేదనుకోండి అది ఆయన అభిమానానికి, సర్వ స్వతంత్ర పోకడకు నిలువెత్తు నిదర్శనం. నాటకాల వలన పంతులుగారు కింది స్థాయి జనులతో, రౌడీమూకలతో, వస్తాదులతో, ఆకతాయి మనుషులతో చిక్కులలో ఇబ్బందులలో పడ్డాడు. ఆ విషయాలు వేరే అంశంలో విశదీకరిస్తాను.
నిజానికి ప్రకాశంగారు పేరు ప్రతిష్టలు గడించడానికి, కీర్తి పొందడానికి వారి నటన అభినయం కారణం అని చెప్పాలి. ఎలాగైతే తరువాతి రోజులలో దేశ విదేశ ప్రముఖుల చరిత్రలలో నటనతో పేరుగాంచి రాజకీయాలలో ప్రవేశించి అగ్రగణ్యులైనారో ప్రకాశంగారు చరిత్రలో వేషధారణ అలాగే ఉపకరించింది. ఉదాహరణకు కీ.శే.ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రోనాల్డ్ రీగన్ మొదలైనవారి జీవితాలు.
కొంతకాలం ఇలా విలాసంగా, ఉత్సాహంగా, నిజానికి నిర్లక్ష్యంగా జీవితం గడిపిన తరువాత (ఏనాడూ చదువు మీద ధ్యాస వదలకుండా, ప్లీడర్ కావాలన్న కోరిక మరువకుండా) రాజమండ్రి మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. న్యాయవాదిగా పట్టం పుచ్చుకున్నారు. అంతటితో నాటకాలలో వేషం వేయడం మానుకున్నారు.
ఈ విధంగా మన ‘రంగస్థల నక్షత్రం’ బిరుదాంకితుడు ప్రకాశంగారు ఆంధ్రదేశ చరిత్రలోనే కాక తెలుగునాటక రంగ చరిత్రలో కూడా చరితార్థులైనారు.

-టంగుటూరి శ్రీరాం.. 9951417344