ప్రకాశం కథలు

ప్రమాదమెక్కడో ప్రకాశం అక్కడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాపురుషులు తమ స్వలాభంతో తృప్తిపడరు, ఇతరుల క్షేమాన్ని ఆకాంక్షిస్తారు. దేశంలో శాంతిభద్రతలకోసం, ప్రజా అభ్యున్నతికోసం నిజశక్తులను ఉపయోగిస్తారు. ఏ వ్యక్తి అయినా, సంస్థనైనా సరే కష్టాలలో వుంటే, వారికి ఆశ్రయమిచ్చి ఆదుకుంటారు. ఆపన్న హస్తాన్ని అందిస్తారు. అలాంటి మహనీయుడే మన ప్రకాశం పంతులుగారు. ఉదాహరణలు కోకొల్లలున్నాయి. ప్రకాశంగారు తన స్వీయ చరిత్ర ‘నా జీవిత యాత్ర’లో చేసిన సహాయాన్ని సాయం చేసిన వ్యక్తుల గురించి, అనేకానేకచోట్ల దాపురికాలు లేకుండా విశదీకరించారు. తరువాతికాలంలో వారికి తిరిగి సాయం చేసిన సంఘటనలను, ఋణం తీర్చుకున్న విషయాలను చాలా క్లుప్తంగా వ్రాసుకున్న ధన్యజీవి. ప్రజా హృదయ సామ్రాజ్యానికి పట్ట్భాషిక్తుడు. సూర్యుడు స్వయం ప్రకాశితుడై, ఏ విధంగా ప్రపంచానికి వెలుగునిస్తాడో, ప్రకాశంగారు కూడా అసమాన ధైర్య సాహసాలతో, అశేష త్యాగనిరతతో, దయార్ద్ర హృదయంతో ప్రజలలో దేశభక్తిని, శాంతి, సామరస్యాన్ని కూడా వెలిగించిన అరుదైన నాయకుడు. ఎక్కడ అవసరమో అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు ప్రకాశం ఆపద్బాంధవుడిలా. ఎక్కడ తన ప్రజలు ఆపదలో చిక్కుకుంటారో అక్కడ వారిని ఆదుకునేవారు. ఎక్కడ అధికార దౌష్ట్యం చెలరేగుతున్నదో అక్కడ దానిని ఎదుర్కోవడానికి అవతరించేవారు.
అమ్మ చూపించే ప్రేమ, స్పందన, ఆదరణ, నాన్న కనబరిచే బహుముఖమైన భద్రత, అభినయాలను కొన్ని వాస్తవ ఉదాహరణలు పంతులుగారిలో మనకు సుస్పష్టమవుతాయి. ప్రకాశంగారికి సాహసం, సహాయము ఆజన్మసిద్ధమైనవి. చిన్నతనంలో నాటక రంగంలో ఉత్పన్నమైన ప్రమాదాలను ఎదుర్కోవడం, రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేయడం ప్రమాదమని తెలిసినా ఆనాటి (1903లో) ఉద్దండులని, హేమాహేమీలతో సైతం ఢీకొన్నారు ఆంధ్రకేసరి. ఎందుకంటే స్వలాభం కోసం కానీ, పదవీ వ్యామోహంవలన కానీ కానే కాదు. కేవలం మునిసిపాలిటీలో కూరుకుపోయిన అవకతవకలను, అన్యాయాన్ని తుడిచేసి నగర వాసులకు, రక్షణ, శాంతి భద్రతలు, సుపరిపాలన అందించడం కోసం ఆ రోజుల్లోనే ప్రకాశంగారి ఏకైక లక్ష్యం, సామాన్యుడి క్షేమం. ప్రకాశంగారు మద్రాస్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన కొద్ది రోజులకే (అంటే 1907 మేలో) బెంగాల్ నాయకుడు, నిప్పులు కురిపించే ఉపన్యాసాలు ఇచ్చాడు. దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రభుత్వానికి ప్రతికూల ఉపన్యాసాలు ఇస్తుండడంతో రెండో మీటింగ్‌కు అధ్యక్షత వహించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. భాష్యం అయ్యంగారైతే సభలో కూర్చోడానికే ధైర్యం చాలక బీచ్‌లోనే మామూలుగా షికార్లు చేస్తూ వింటూ ఉండేవాడు. కారణం ప్రమాదం ఎవరికి? తనకి. అధ్యక్షత వహించినవారికి. మళ్లీ ప్రకాశమే దిక్కు. న్యాయమూర్తులు సైతం ‘‘వృద్ధిలోకి రాదలచుకున్న బారిష్టరువి, నీకీ గొడవలెందుకు, నీ సంపాదన, నీ సంసారం చూసుకో’’ అని సలహా ఇచ్చారు. కానీ ప్రమాదమెక్కడో ప్రకాశం అక్కడ కదా! ప్రకాశంగారు ఆ సభకు అధ్యక్షత వహించినందుకు యువతరంపై ప్రకాశంగారి ప్రభావం చెరగని ముద్ర వేసింది. ఇక ప్రధానంగా ప్రజా హృదయాలలో చెరిగిపోని, అద్వితీయ సంఘటన- రండిరా! ఇదె కాల్చుకోండిరా! అని బ్రిటీష్ గుండుకు గుండె చూపిన అసమాన సాహసం. క్షణంలో ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదకరమైన పరిస్థితి అది. ఇదికాక ఆంధ్రకేసరి చేసిన సాహసకృత్యలు చాలానే ఉన్నాయి. అవి కూడా జనహితం కొరకే అని మర్చిపోకూడదు మనం.
ఎంతటి ప్రతికూల వాతావరణం ఎదురైనా, తీవ్ర విమర్శలు తగిలినా దుర్భర పరిస్థితులు తటస్థపడినా ప్రకాశం చలించేవారు కాదు. సర్దుబాటు ధోరణి అసలే అనుసరించలేదు. 1922లో మహాత్మాగాంధీజీని అరెస్టు చేశారు. అకాలీలు సత్యాగ్రహులు ముమ్మరంగా సాగిస్తున్న రోజులవి. అకాలీలు విజృంభించి అల్లకల్లోలం సృష్టించారు. ప్రకాశంగారు పంజాబ్‌కు వెళ్లి జంకు భయం లేకుండా అక్కడి పరిస్థితులను గమనించి, పరిశీలించి అకాలీలకు ఉత్సాహం రేకెత్తించి శాంతియుతంగా సత్యాగ్రహ నిర్వహణ కావాలని శాంతిదూతగా వ్యవహరించి వచ్చారు. మల్టాన్‌లో హిందూ-ముస్లిం మత కలహాలు జరిగినపుడు అక్కడికి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరీక్షించారు. అసలు అక్కడికి వెళ్ళడానికే ఏ కాంగ్రెస్ కార్యకర్తగానీ, నాయకుడుగానీ సాహసించలేదు. ఉభయ వర్గాలలో రాగద్వేషాలు, కోపతాపాలు, ప్రతీకార కాంక్ష తారాస్థాయికి చేరుకున్న ప్రమాద స్థితిలోనే ప్రకాశంగారు ప్రవేశించి ఉభయులను శాంతిపరచగలిగారు.
కేరళలో ‘మోపెల్లా’ తిరుగుబాటు సందర్భంలో ప్రకాశంగారు ప్రాణాలకు తెగించి, ఆ ప్రాంతాలు తిరిగి రిపోర్టు తయారుచేసి గాంధీగారికి సమర్పించారు. తన స్వీయ చరిత్రలో ప్రకాశంగారు ఈ ఉదంతం గురించి చాలా విపులంగా రాసుకున్నారు. అందులో కొంత.. ‘‘.... సాధారణంగా, ఇలాంటి తిరుగుబాట్లనీ ఎవరూ పట్టించుకోరు. అందులో నూ కాంగ్రెస్ వారా కలుగజేసుకొనేది?... కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యుడైన నేను, నా ప్రాణానికి తెగించైనా ఆ ప్రాంతంలో ఊరికి చేయగలిగిన సేవకు సంసిద్ధుణ్ణి కావడం నా విధేగదా!’’- ఒక దేశభక్తుడిగా, ఒక సైనికుడిగా, ఒక నాయకుడిగా, ఒక సంపాదకుడిగా ప్రజాక్షేమం కోసం ఎంతటి ప్రమాదంలోనైనా దూకడం వారి సేవాతత్పరతకు, కార్యదీక్షకు నిలువెత్తు సాక్ష్యం. తరువాత బ్రిటీష్ ప్రభుత్వం కక్షగట్టి ఊటీలో ఆయన వ్యక్తిగత ఆస్తులను ఆధీనంలోకి తీసుకొంది.
శ్రీ వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాద్‌గారు ప్రకాశంగారి గురించి వ్రాస్తూ వారి చిరస్మరణీయ సంఘటనలో విశదీకరించారు. ఈ సంఘటన నిజంగా తెలుగువారి సమైక్యతకు, పునాదిగా ప్రారంభించబడి ఆంధ్రప్రదేశ్ స్థాపనకు ఉపకరించిన చారిత్రాత్మక సంఘటనగా చిరిత్రకెక్కినది. శ్రీ వాసిరెడ్డి గారు విశదీకరిస్తారు. ‘‘...పంతులుగారి యశస్సు చిరస్థాయి. ఆయన ధన్యజీవి. దరిద్రనారాయణ సేవలోనే ఆనందించెడివాడు. అందుకే ఆయనను ‘వాస్తవ కర్మయోగి’ అంటారు. వారి అనుచరుడిగా వర్తించగల భాగ్యం కలిగినందుకు గర్విస్తున్నాను. హైదరాబాద్‌లో రజాకార్ల దురాగతాలు జరుగుతున్న రోజులవి. దానిని పురస్కరించుకొని మునగాల పరగణాలలో అల్లర్లు సాగినవి. అప్పుడు నేను నందిగామ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడను. పంతులుగారు జగ్గయ్యపేటకు వచ్చి, నాకు కబురు పంపించి మునగాల వెళ్లి అచటివాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. అక్కడి ఎస్‌ఐ, నెహ్రూగారితో సహా మునగాల, నిజాం రాష్ట్రం గుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని ప్రకాశంగారిని వెళ్ళొద్దని నివారించారు. అది ఆత్మహత్యతో సమానమని సాహసించవద్దని చెప్పారు. ప్రకాశంగారందుకు అంగీకరించలేదు సరికదా, పైగా ఇలా అన్నారు. ‘‘... అక్కడ మనవాళ్ళు అగచాట్లు పడుతూ ఉంటే మనం ఇక్కడ కూర్చొని ఉబుసుపోక మాటలు చెప్పుకుంటూ ఉంటామా? వెళ్లితీరాల్సిందే.. రాజా! తాలూకా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌వుగా! నీవు వస్తావా? నీకు గుండె దడగా ఉందా? నేను ‘‘పంతులుగారూ! ఇంత వృద్ధులు, మీరే వెళ్తూ ఉంటే యువకులమెలా ఉపేక్షించి ఉంటాము?’’ నేను వస్తాను.
కారు బయలుదేరింది. రోడ్డుకు అడ్డంగా లావాటి మోకును బిగించి ఉంచారు కార్లు పోకుండా. రజాకార్లు తల్వార్లతో, విచ్చుకత్తులతో పచార్లు చేస్తున్నారు. డ్రైవర్‌ను హెచ్చరించారు ప్రకాశంగారు- ‘‘నీ తెలివి చూపించవలసిన సమయమిది. ఒక్క ఊపుతో ఎక్కడా ఆపకుండా, విసురుతో రజాకార్లకందకుండా వారిమధ్యనుంచే పోనీ’’ అన్నాడు. డ్రైవర్ కూడా చాలా తెలివిగా సమర్థవంతంగా, తెగింపుతో డ్రైవ్ చేశాడు. మెరుపు వేగంతో రివ్వున పోయి ఆ మోకును ఢీకొట్టగా అది తెగి పడిపోయింది. రజాకార్లు కత్తులు చూపిస్తూ హాహాకారాలు చేస్తూ భయంకరంగా కొంత దూరం వెంబడించి ఆగిపోయారు. మొదటి గండం గడిచింది. కోదాడ చేరారు. రజకార్లు కారుని ముట్టడించారు. కారులోనుంచి ఆంధ్రకేసరిని దిగమన్నారు. పంతులుగారు దిగలేదు. రజాకార్లు ఏ క్షణంలోనైనా తలకాయలను తెగనరికేలా ఉన్నారు. సినిమా ఫక్కీలో జరిగే ఈ సీనంతా పక్కనే వున్న బంగళాలో మకాం పెట్టిన నైజాం జిల్లా కలెక్టర్ గమనిస్తూ ఉన్నాడు. జవానును పంపి వారిని విచారించి వివరాలు తెమ్మన్నాడు. జవాను ప్రకాశం పేరు చెప్పిన మరుక్షణమే వారిని తీసుకురమ్మని.. టీ కోసం ఆహ్వానిస్తున్నానని చెప్పి తీసుకురమ్మన్నారు. రజాకార్లకు ఆ జవాను ‘‘వీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారని, వీళ్ళదగ్గర కీలక పత్రాలున్నాయని, సిఐడిలని’’ నచ్చచెప్పి కారును బంగళా దగ్గరకు తీసుకొచ్చాడు. నిజాం కలెక్టరు మర్యాదపూర్వకగా ‘‘అయ్యా! నేను మీ శిష్యుడను. నాది కర్నూలు జిల్లా. మీరు ప్రాక్టీస్ చేసే కాలంలో కొన్నాళ్ళు మీ దగ్గర పనిచేశాను. బ్రతుకుతెరువుకోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను..’’ అని సలాం చేసి టీ అందించారు. ‘‘దమ్ముంటే సైన్యంతో పోరాడండి. సామాన్య ప్రజలను హింసించొద్దు’’ అని పంతులుగారంటుండగా- ఇది రజాకార్లు చూసి కారుపైకి దూసుకొస్తున్నారు. పోలీసులు, రజాకార్లు ఘర్షణపడుతూ ఉంటే ప్రకాశంగారి కారు మళ్లీ రివ్వున మెరుపులా మాయమైంది. మునగాల అతి కష్టంమీద రాత్రికి చేరుకున్నారు. ఆ రాత్రికి రాత్రే అక్కడివారిని పిలిపించి వివరాలు సేకరించి వ్రాసుకున్నారు. త్వరలో హైదరాబాద్ కేంద్రంగా విశాలాంధ్ర ఏర్పడనున్నది. మీకు త్వరలో మంచి రోజులొస్తాయి అని వారికి ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణం చేశారు. ఇంతటి వాత్సల్యం చూపించిన మరో నాయకుడు మనకు కానరారు కదా!
శ్రీ పట్ట్భాగారి మాటల్లో - నూటికి నూరుపాళ్ళు నిజమని రుజువు చేస్తాయి ఇలాంటి అన్ని సంఘటనలు. పట్ట్భాగారు ప్రకాశంగారి గురించి ఈ విధంగా అన్నారు. ‘‘ప్రకాశంగారు ఉత్తర ధృవము, నేను దక్షిణ ధృవము. ప్రకాశంగారికి రేపటి చింత లేదు. నేను ఎల్లుండి విషయం కూడా ఆలోచిస్తాను.. ఎచట ప్రమాదమున్నా అచట ప్రకాశం ప్రత్యక్షమగును.. నేనొక చిన్న వేదాంతిని, ప్రకాశంగారొక సైనికుడు, వీరుడు. ప్రకాశంగారిని ఆపదలాకర్షించును. క్షేమ పద్ధతి ఆకర్షింపదు. తెగింపు ఆయన నైజం. సలహాలను స్వీకరించడు. లేమిడికాశపడును, సంపదను అసహ్యించుకొనును. హెచ్చరికలను వినడు. ఇంత పట్టుదలతో, ఉత్సాహంతో ఇన్ని ఏళ్ళుగా సేవ చేసిన వ్యక్తి చరిత్రలో లేడు. ఆయనకు చేయెత్తి నమస్కరించుట మన విధి’’.
రజాకార్ల గౌరవ వందనం అందుకున్న తెలుగు తేజం చరిత్రలో మరొకరు లేరు.
భారతదేశంలోనే కాక బర్మాలోనూ యువజనోద్యమం ఉప్పొంగుతున్న రోజులవి. ధికిన్ - లే- మాంగ్ అనే యువకుడు ప్రభుత్వం నిర్బంధించేందుకు వస్తే వారినుంచి తప్పించుకొని ఎక్కడెక్కడో తిరిగి మద్రాస్ చేరుకున్నాడు. అప్పటికే మద్రాస్‌లో కూడా బర్మాలను కూడా ప్రభుత్వం కన్నువేసి ఉంది. ఆ యువకుడికి ఆశ్రయం కలిగించడానికి అప్పటి అక్కడి అయ్యర్లు, అయ్యంగార్లు, జాతీయ, రాజకీయ నాయకులకు దమ్ము చాలలేదు. ఈ యువకుడు చాలా ప్రమాదం అని తప్పించుకున్నాడు. చివరికి ప్రకాశంగారి దగ్గరకు రహస్యంగా తీసుకొచ్చి మీరే దిక్కు ఈ మనిషికి అని మొరపెట్టుకున్నారు. ప్రకాశంగారు జంకు, బెదురూ లేకుండా ఆ యువకుడికి ఏకంగా ఆరు నెలలపాటు తన వద్దే ఉంచుకొని పోలీసుల నుండి రక్షణ కల్పించాడు. పంతులుగా తీరికగా ఉన్నప్పుడు క్రింద కాళ్ళదగ్గర కూచొని, చాలా రాజకీయ, సాంఘిక, స్వాతంత్య్ర విషయాలతోపాటు ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకొనేవాడు. కొన్ని రోజుల తరువాత బర్మాలో యువజనుల సంఘాల మీద నిషేధాన్ని తొలగించి జైల్లో వున్న ఖైదీలందరినీ విడుదల చేయగా బర్మా జాతీయులు ఆ యువకుడ్ని పంపించమని ప్రకాశంగారిని అనుమతి అడిగారు.

ప్రకాశంగారు సంతోషించి సరే అన్నారు. వారందరూ ఎంతో ఆనందంతో వెండి పళ్ళెంలో పండ్లు, డ్రైఫ్రూట్స్ పెట్టి ప్రకాశం ముందు బుద్ధదేవుని రీతిగా కూర్చుని కొంతసేపు వౌనంగా ప్రార్థనలను జరిపి సాష్టాంగ నమస్కారాలు చేసి థికిన్‌ను తీసుకొని వెళ్లిపోయారు. ప్రకాశంగారు ఆ యువకుడి గడ్డంకింద చేయి పెట్టి తలపై నిమురుతూ వీడ్కోలు చెప్పగా, థికిన్ కంట కన్నీళ్లు ప్రవహించాయి. పంతులుగారి అరచేతులను కళ్ళకద్దుకొని నిశబ్దంగా శిక్షణ పూర్తిచేసుకొని ఆశ్రమాన్ని విడిచి వెళ్తున్న బ్రహ్మచారిలా అడుగులు బయటకు వేశాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం తరువాత తెలిసింది, అతనొక సిఐడి ఆఫీసరని. అలాగే తన జైలులో ఉన్నా కూడా నిజమైన విప్లవకారులను పంతులుగారు గౌరవించారు, అక్కున చేర్చుకున్నారు. వాళ్ల పక్షాన నిలిచి వాదించారు. అందుకే ఆంధ్రకేసరిని విప్లవకారులకు ఆశ్రయం ఇచ్చే ఆపన్నహస్తంగా చెప్పుకొనేవారు. ఇంతటి ఇతిహాస పురుషుడు డా. రేవూరి అనంత పద్మనాభరావుగారి ‘దివ్య స్మరణం’ కవితలో ఈ విధంగా ఏనాటికి ప్రకాశిస్తూనే ఉంటారు.
సత్యాగ్రహమ్ముల, స్వాతంత్య్రదీక్షల/ జయము సాధించిన శాంతమూర్తి
ఆంధ్ర ప్రజా హృదయాంతరమ్ములలోన/ ధన్యుడై నిలచిన త్యాగమూర్తి
రణరంగమున వోలె రాజకీయాలలో/ భీష్ముడై నిల్చు గంభీరమూర్తి
స్వార్జిత సంపదలాంధ్ర జనాళికే
ధారపోసిన మహోద్దండమూర్తి
తెల్లదొరల యాటలికపై చెల్లవనుచు
గుండెలిచ్చి నిల్చె తుపాకి గుండెకుదుర
నిందలను లెక్కసేయని నిర్భయుండు
సరిసములు లేని ఆంధ్రకేసరి మనీషి.

-టంగుటూరి శ్రీరాం.. 9951417344