ప్రకాశం కథలు

రైతుజన బాంధవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశంగారు రాజకీయ రంగంలో ప్రవేశించిన క్షణం నుంచి గ్రామాభ్యుదయం కోసం రైతు జన సంరక్షణ, సౌభాగ్యమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకొని తన సర్వస్వాన్ని అంకితం చేశారు. ఆ రోజులలో దక్షిణ భారతంలో దాదాపు 80 శాతం ప్రజానీకం వ్యవసాయ రంగం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉండేది. ఈ బృహత్తర వాస్తవాన్ని ప్రకాశంగారు గ్రహించి ఎన్ని మార్గాల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలో, ఏ విధంగా ఆదుకోవాలో, ఎలాంటి సంస్కరణలను చేపట్టాలో అన్ని మార్గాలను అనే్వషించారు, పరిశీలించారు. సూత్రీకరించారు. అధికారాన్ని సాహసంతో, నిస్వార్థంతో, వేగవంతంగా అమలుపరిచారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రభుత్వాలను, గ్రామాభివృద్ధికై రైతన్న సంక్షేమానికై ఉద్యమించారు. పోరాడారు. విజయం సాధించారు. అన్నింటికంటె ముఖ్యంగా కర్షకుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించి కారణజన్ములైనారు.
1920ల్లో మద్రాస్ ప్రభుత్వం రీసెటిల్‌మెంట్ చేస్తూ కృష్ణా గోదావరి జిల్లాల్లో రూపాయికి మూడు అణాల చొప్పున భూమి శిస్తును పెంచింది. సాధారణ ధరలు పెరిగాయని, ఇందుకు కుంటిసాకు చెప్పింది అప్పటి సర్కారు. ఈ శిస్తు పెంపులకు రైతులు ఆందోళన చెందారు. వారి జీవితాలు అతలాకుతలమైనాయి. ఇలాంటి విషమ పరిస్థితులలో ప్రకాశంగారు కలత చెంది డెల్టా ప్రాంతాలన్నీ అహోరాత్రాలు పర్యటించి రైతుల ఇబ్బందులకు సంబంధించిన సమగ్ర, వాస్తవ సమాచారాన్ని సేకరించారు. ‘రీ సెటిల్‌మెంట్’కు వ్యతిరేకంగా తీవ్రాందోళన గావించారు. ఇటువంటి భూమి శిస్తు పెంపకాన్ని ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘమే కాకుండా గాంధీ కూడా వ్యతిరేకించారు. ఈ అంశం మీద ప్రకాశంగారు తమ ‘స్వరాజ్య’ పత్రికలో అనేకానేక వ్యాసాలలు రాశారు. వాస్తవంగా వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోతున్న తరుణంలో భూమి శిస్తులను పెంచే నైతిక హక్కు ప్రభుత్వానికి ఎంత మాత్రమూ లేదని ఆయన విమర్శించారు. అప్పటి వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు ఏ విధంగానైనా కారణం కాదని సుస్పష్టంగా పేర్కొన్నారు. పరిపరి విధాల ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. జిల్లాల్లోని యావత్ రైతాంగాన్ని ప్రముఖంగా మహిళలను సైతం చైతన్యవంతులను గావించి ఉద్యమింపచేశారు. ఆబాలగోపాలం, నారీజనం తండోపతండాలుగా వచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొని ప్రకాశంగారి బోధనలతో విజయవంతం చేయసాగారు.
చిట్టచివరికి ప్రకాశంగారు గావించిన ఆందోళనల కారణంగా ప్రభుత్వం దిగి వచ్చి అదనపు శిస్తు వసూళ్లను ‘సస్పెండ్’ చేయక తప్పింది కాదు. ఈ విషయాన్ని సాకల్యంగా పరిశీలించేందుకు ఆచార్య ఎన్.జి.రంగా కార్యదర్శిగా ఒక అనధికార విచారణ సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రకాశంగారి అవిరళ కృషిని కొనియాడారు. వారు చేపట్టిన ఆందోళన గ్రామాభివృద్ధికి అత్యంత అవసరమని, సబబని ఇలాంటి ఉద్యమం ప్రకాశంగారు తప్ప మరే నేత వల్ల సాధ్యం కాదని విచారణలో పేర్కొన్నారు. మరో చారిత్రాత్మక విశేషమేమంటే అటు తరువాతనే రంగాగారు రాజకీయాల్లో ప్రవేశించడం జరిగిందని ఉప్పులూరి రామశాస్ర్తీగారు రాశారు.
తరువాతి కాలంలో పంతులుగారు మద్రాస్‌లో రాజాజీగారి సర్కారులో రెవిన్యూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమేమిటి మరుక్షణంలోనే తమ దృష్టి రైతుల, నాటి ఆర్థిక మాంద్యం మీద సారించారు. వెంటనే రుణ విముక్తిని పరిష్కార దిశలో మారిటోరియం బిల్లును ఆమోదింపచేశారు. ఈ బిల్లు వలన రుణగ్రస్తులైన రైతులు ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని, రుణ విముక్తులై శ్వాస పీల్చుకోగలిగారు.
గాంధీగారి పిలుపు నందుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడంలోనూ, తన సర్వస్వాన్ని త్యాగం చేయడంలోనూ, రైతన్నలను ఆదుకోవడంలోనూ, ముఖ్యంగా గాంధీగారి ఆశయసిద్ధి కోసం ఆజన్మాంతం కృషి చేసిన ఏకైక నేత ప్రకాశంగారు. కాంగ్రెస్‌లో ఉన్నా లేకున్నా అధికారంలో ఉన్నా లేకున్నా ఠీవిగా హుందాగా ప్రజలలోకి స్వయంగా చొచ్చుకొని పోయి గాంధీయిజంను సంపూర్ణంగా ప్రచారం చేయడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు అనేది కూడా మరో నిజం.
రాజాజీగారి ప్రభుత్వం 14, జూలై 1937న కొలువుతీరింది. ప్రకాశంగారిని రాజాజీగారు అసెంబ్లీ స్పీకర్‌గా ఉండాలని కోరారు. కానీ ప్రకాశంగారు ఒప్పుకోలేదు. ప్రకాశం గారికి రెవిన్యూ శాఖను అప్పగించారు. ప్రకాశంగారు గ్రామ అభివృద్ధికి రెవిన్యూ శాఖ వెనె్నముక వంటిదని ఒప్పుకున్నారు. పంతులుగారు మంత్రిగా ఉన్న సమయంలో దీనావస్థలో కష్టాలలో ఉన్న రైతులు గ్రామాధికారులు తహసీల్‌దార్లందరూ తమ ఆపద్బాంధవునిగా చూసుకునేవారు. తన శాఖకు సంబంధించిన, సంబంధించక పోయినా తన సహాయం కోరి వచ్చిన వారి ఆర్తిని హరించడానికి పూనుకునేవారు పంతులుగారు.
మంత్రివర్గం ఏర్పడిన రెండు నెలలకే జమీందారీ రద్దు బిల్లు చర్చకు వచ్చింది. ప్రకాశంగారికి జమీందారులతో ఉన్న సంబంధాల కారణంగా ప్రకాశంగారి ఊరు కూడా, వెంకటగిరి ఎస్టేట్‌లో కావడం మూలాన ప్రకాశంగారు జమీందారుల వ్యక్తిగత లాయర్‌గా ఒకటిన్నర దశాబ్ద కాలం పనిచేసిన వారు కావటం చేత రైతు జమీందారీ సంబంధాలలోని లొసుగులు, తీరుతెన్నులు, ఒడిదుడుకులు క్షుణ్ణంగా అవగాహన ఉంది. పైగా ప్రకాశంగారు ప్రజల మనిషి అని ఖ్యాతి గడించి యున్నారు కాబట్టి ఒక సమావేశంలో ఈ బాధ్యతను తమను తీసుకోమని మంత్రివర్గం కోరటం జరిగింది. ప్రకాశంగారికి అత్యంత సన్నిహితుడూ, అనుచరుడూ, హితుడూ అయినటువంటి తెనే్నటి విశ్వనాథంగారు పంతులుగారికి అన్ని విధాలా, సర్వ కాలాలలోనూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రకాశంగారి పక్షాన నిలబడ్డారు. ఒక ఉపసంఘాన్ని నియమించి ప్రకాశంగారిని అధ్యక్షులుగా నియమించింది. ప్రకాశంగారి సంఘం 15 నెలలపాటు అహర్నిశలు పర్యటించి, శ్రమించి, శోధించి 18 సంపుటాల రిపోర్టు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. సంఘానికి అక్షరాలా ఆరువందల మెమొరాండాలను జమీందారులు, ఇనామ్‌దారులు, అష్మ్‌ల్రు, జాగీర్‌దారులు, మొఖసర్‌దారులు ఇలా అనేక రైతు సంఘాలతో సైతం సమర్పించారు. కాంగ్రెస్ కమిటీలు, కౌలుదారులు కూడా వారి నివేదనలు సమర్పించుకున్నాయి. పంతులుగారు స్వయంగా సమావేశాలు జరిపారు. 400పైచిలుకు సాక్ష్యాలను విశాఖపట్నం, రాజమండ్రి, తిరుచినాపల్లి, కోయంబత్తూర్, మద్రాస్ మరియు మధురై ప్రాంతాల నుంచి విచారించింది. మద్రాస్ రికార్డ్ ఆఫీసులో నుంచి ఏకంగా ఇరవై ఆరు చారిత్రాత్మక డాక్యుమెంట్లను తన అపెండిక్స్‌లో జత చేసింది.
ఒక ప్రముఖ చరిత్రకారుడు ఈ నివేదికను మహాభారతంతో పోల్చాడు. ఇది సామాన్యమైన విచారణ కాదు, పైగా ఇతరుల కెవరికీ ఇది సాధ్యపడదు అని రాశారు. ‘అటు బ్రిటిష్ పాలకులు, ఇటు జమీందారులు కేవలం శిస్తు వసూలు చేసే స్వార్థపరులు మాత్రమే కానీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడేవారు కాదు. కనుక రైతే నిజమైన హక్కుదారు. అతనే స్వయంగా భూమి దున్నుకుంటాడు. శిస్తు ప్రభుత్వానికి తనే స్వయంగా చెల్లించాలి. దునే్నవాడిదే భూమి’ అని రిపోర్టు సమర్పించింది. శాసనసభలో జమీందారి బిల్లు రిపోర్ట్ సమర్పించే రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి జమీందారులు తండోపతండాలుగా వచ్చారు. హాలు ప్రాంగణమంతా జనమయమయింది. ఇసుక వేస్తే రాలలేనంత సామాన్య ప్రజలతో సహా నిండిపోయి బయటకు బారులు తీరి కూర్చున్నారు. రాజాజీగారు చర్చను ఆహ్వానించడంతో ప్రకాశంగారు ఉపన్యాసం ఇవ్వడానికి లేచి నిలబడగానే ప్రజల చప్పట్లు గట్టిగా నిర్విరామంగా ఆరంభమైనాయి. కొద్దిసేపటి తరువాత స్పీకర్ బులుసు సాంబమూర్తి గారు చప్పట్లు నినాదాలు అసెంబ్లీలో నిషిద్ధం అని చెప్పి, వారించి ఆపించారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. తరువాత ప్రకాశంగారి ఉపన్యాసం తనదైన శైలిలో ముందు నెమ్మదిగా, ఆగి ఆగి మాట్లాడి, తరువాత వేగం పుంజుకొని మాట్లాడారు. ఒక్క పరుష వాక్యం కానీ, ఉద్రేకం కానీ, ఆందోళన కానీ చూపించక ఏకధాటిగా రెండు రోజులు ఉపన్యాసాన్ని కొనసాగించి చరిత్ర సృష్టించారు. ఎట్టకేలకు రాజాజీగారు ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో తన సమ్మతాన్ని తెలియజేశారు. బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ప్రభుత్వానికి రాజీనామాలు ఇవ్వడం జరిగింది. కానీ తరువాత జమీందారీ రద్దు కార్యరూపం దాల్చడానికి ఆంధ్ర కేసరి వేసిన పునాది అని ప్రజలు హర్షించారు. అంతేకాదు అటు తరువాత ముస్లింలీగ్ మంత్రివర్గం కూడా తమ ప్రతినిధులను ప్రకాశం కమిటీ రిపోర్టును సంప్రదించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది.
రెవిన్యూ మంత్రిగా ప్రకాశంగారు రైతాంగాన్ని ఆదుకున్న మరో సాహసోపేత నిర్ణయం ఉంది. అది ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొన్నది. రాయలసీమలో కరువు ప్రబలినపుడు మరుక్షణమే ప్రకాశంగారు ఆ ప్రాంతమంతా పర్యటించి అక్కడక్కడే ఎవరైతే పంటలు కోల్పోయారో వారికి సత్వర సహాయాన్ని అందించారు. మరోమాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొన్న మహానేత ప్రకాశం. ఈ మాటకు సజీవ తార్కాణం మద్రాస్ నగరంలో ఇద్దరు వ్యక్తుల అరవంలోని సంభాషణ. ‘ఒరే! మన ప్రకాశం ఎన్నికలలో గెలిచారురా! మనకింక తిండికి కరువు లేదురా!’ రెండో వ్యక్తి చేతులు జోడించి ఆకాశంవైపు చూస్తూ ‘ఔనురా! నిజమే! గింజలకు మనకు ఢోకా లేదురా!’
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేవలం 13 నెలల వ్యవధిలో 10 సం.ల వ్యవధిలో చేయగలిగిన సంక్షేమ పనులు చేయగలిగింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా రైతన్నకు, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటిలో ప్రముఖమైనవి. 13, 14 నీటిపారుదల ప్రాజెక్టులు స్థాపించారు. నాగావళి, వేగావతి, స్వర్ణముఖి (శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో రెండు) గంభీరం గెడ్డ, పాలేరు, పగిలేరు, పెన్నారు, ఏలూరు నదులపై కోట్లు ఖర్చు చేసి లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం గావించడానికి స్కీములను ప్రవేశపెట్టారు. నందికొండ వద్ద దాదాపు 50 లక్షల ఎకరాలు సాగుకు అనుగుణంగా మార్చడానికి నూతన స్కీములను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపడం వీరి హయాంలోనే జరిగింది. భారతదేశానికి వ్యవసాయం వెనె్నముక అయినట్లే రెండవ శ్రేణి వ్యవసాయ రంగంగా పేరొందినది చేనేత పరిశ్రమ.

దాని మీద కూడా ప్రకాశంగారు శ్రద్ధ వహించారు. చేనేత మగ్గాలపై వేసిన పన్ను రద్దు చేశారు. రెండు ఎడ్లబండ్లపై పన్ను రద్దు చేశారు. 10 రూపాయలకన్నా తక్కువ శిస్తు కట్టేవారికి శిస్తు రద్దు చేశారు. కృష్ణానదిపైన ఆనకట్ట కట్టి 1953 నాటికి వంద సం.లు. కుడి ఒడ్డు దగ్గర కొంత భాగం తెగిపోవడంతో అదీ అర్ధరాత్రి వేళ అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ఇంజనీర్లు, కళాసీలు మరో ఇద్దరు ఉద్యోగులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. విషమ పరిస్థితిని తెలుసుకొని, ప్రకాశం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర అనుమతి లేకపోయినప్పటికీ ధైర్యంగా దగ్గరుండి పునాది రాయి వేసే శుభ ముహూర్తం నిర్ణయించి, పని మొదలుపెట్టారు. తక్కిన పనులు తన్నుకుంటూ వచ్చి పని పూర్తయింది. చారిత్రాత్మక ప్రాజెక్టులయిన నందికొండ, నాగార్జునసాగర్ పనుల శుభారంభం అంకురార్పణ ఘనత మన ప్రకాశం ప్రభుత్వానికే దక్కింది.
ఇలా చెప్తూ పోతూ ఉంటే పంతులుగారి కార్యదీక్షకు చాలా ఉదాహరణలున్నాయి. చివరిగా ఒక మరపురాని సంఘటన వివరించాలని ఉంది. ‘పాడిపంటలు’ ఎడిటర్ భాగవతుల విశ్వనాథంగారిని పిలిపించుకొని ఇలా అన్నారు.
ప్రకాశం: ‘ఎక్కడికి వెళ్లినా నీ పాడిపంటల గోలేనయ్యా. గ్రామస్థులంతా ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు. ఒక లక్ష కాపీలు ముద్రించి రైతులందరికీ అందించగలవా?’
బి.వి.నాథ్: పంతులుగారూ.. దానికి ఒక జీవో ఇప్పిస్తే సాధ్యమవుతుంది.
ప్ర: ఈ జీవోలు, రెడ్‌టేపిజంలు నాకు నచ్చవు. కాలహరణం వాటితో. వాటికి కాలం చెల్లింది. నా మాటే ఒక జీవో - అంటూ నవ్వుతూ సెలవిచ్చి పంపించారు.
మరో చిరస్మరణీయ, ఆచరణీయ సంఘటన. ప్రకాశంగారు స్వయంగా వెళ్లి బాధితుల స్థితిగతులను విచారించి, వారి దుస్థితికి కారణాలైన, నీటి సరఫరా, వరద బీభత్సం, కరువులు మొదలైనవి అని తెలుసుకొని వారికి సత్వర న్యాయాన్ని అందించడానికి గాను సదరు అధికారిని పిలిపించి, వెంటనే తగు చర్యలు తీసుకోమని ఆదేశాలిచ్చారు. ఆ సదరు ఆఫీసరు ‘ఇది ఎలా సాధ్యమండీ? ఇంజనీర్లు, గ్రామాధికారులు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి సర్వే చేసి, రిపోర్టు ఇచ్చిన తరువాత సెక్రటేరియట్ నుంచి ఆర్డర్లు రావాలి సార్!’ అనేశాడు. ప్రకాశంగారు తోకతొక్కిన త్రాచులా పైకి లేచారు. ‘నేను స్వయంగా కళ్లారా చూసి చెప్తున్నాను. ఇది కాదని వాళ్ల రిపోర్టు నిజమని నమ్ముతారా? నా మాట నీ రిపోర్టుగా రాసుకో! వెంటనే పని మొదలుపెట్టించు’ అని గద్దించారు. అంతే పనులు ప్రారంభమయ్యాయి.
ఆంధ్రకేసరి ఉగాది సందేశం
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలుగు కొత్త సంవత్సరాదినాడు తమ ఉగాది సందేశాన్ని ఈ విధంగా తెలియజేశారు.
‘ప్రజలందరూ ఒక్కటే. అధికారులు అనధికారులు అనే భేదం, వ్యతిరేక దృష్టి పోవాలి.. మన కర్తవ్యం అంతా మన ముందే ఉంది. మన అభ్యుదయం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధిపై ఉంటుంది. జాతిపిత కలలైన జాతీయ విస్తరణ కార్యక్రమం ద్వారా నవీన వ్యవసాయ, శాస్ర్తియ విధానాలను మన రైతాంగం తెలుసుకో గలుగుతుంది.. పల్లెలన్నీ మళ్లీ కళకళలాడాలి. గ్రామగ్రామాన దేశ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంగా మారాలి. ప్రతి వ్యక్తీ ప్రజాస్వామ్యానికి సజీవ చిహ్నం కావాలి.. జయభేరిని మోగించండి. ఇది జయ సంవత్సరానికి నా సందేశం. మీ ‘ఆంధ్రకేసరి’ సందేశం.
ఆంధ్రకేసరి సదా స్మరామి.

-టంగుటూరి శ్రీరాం.. 9951417344