ప్రార్థన

శాశ్వతమైన క్రీస్తు ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్ర్తి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.’ -యెషయా 49:15
దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమలేని వారు దేవుని ఎరుగరు. అలాగని లోకములో ప్రేమ లేదని కాదు. కాని ఈ లోక ప్రేమలు మారుతూనే ఉంటాయి. ప్రేమ యొక్క హెచ్చుతగ్గుల స్థాయిని బట్టి ఈ లోక ప్రేమ ఏదో? దేవుని ప్రేమ ఏదో మనకు అర్థవౌతుంది.
క్రీస్తే ప్రేమ అనటానికి సిలువ యాత్ర మనకు ప్రామాణికము. ఆయనను దూషించారు. గేలి చేశారు. తిరస్కరించారు. అనరాని మాటలు అన్నారు. కొరడాలతో కొట్టారు. మోయలేని సిలువను మోయించారు. తలకు ముళ్ల కిరీటము పెట్టారు. కాళ్లల్లో, చేతుల్లో మేకులు గుచ్చారు. అయినను ఆయన బదులు దూషించలేదు. కోపపడలేదు. కక్ష కట్టలేదు. అలుగలేదు. అంతటి శ్రమను అనుభవిస్తూ కూడా ‘వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించమని’ కోరింది ఆయన ప్రేమ. శత్రువులను ప్రేమించండి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభువు.. తన మాటలను అక్షరాలా చేసి చూపించి మనకు మాదిరియైనాడు.
కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లలు క్షమించలేక పోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులను క్షమించలేక పోతున్నారు. భార్యాభర్తల ప్రేమ కూడా అంతంతగానే ఉంటోంది. రాన్రాను ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడున్న ప్రేమ కొంచెంసేపటి తరువాత ఉండటంలేదు.
‘అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ చల్లారును.’ - మత్తయి 24:12
ఈ రోజుల్లో ‘ప్రేమ’ అన్న మాటకు అర్థం పూర్తిగా మారిపోయింది. నిజానికి స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ ఎప్పుడో చల్లారిపోయింది. మన పూర్వీకులలో ఉన్నంత ప్రేమ మనలో లేదు. మనలో మిగిలి ఉన్న ప్రేమ మన పిల్లల్లో లేదు. లేదూ అంటే ఉండాల్సినంత లేదు అని. ఆస్తుల పంపకాలకు ముందున్న ప్రేమ పంపకాల తర్వాత ఉండటం లేదు. ఇక ఈ లెక్కన మన ముందు తరాల వారికి ప్రేమంటే ఏమిటో తెలీని స్థితి రావచ్చు. వాస్తవానికి మనలను అందరూ ప్రేమించాలనీ, గౌరవించాలనీ ఆశపడతాం. మనం ఏవి విత్తుతామో అదే పంట కోస్తాము గనుక ప్రేమ విత్తనాలు చల్లుకొంటూ పోతే కొంతకాలానికి మంచి పంటను చూడగలము. అందరిలోనూ ప్రేమను వెతకాలి. ప్రభువే మనకు మాదిరి. దేవుని ప్రేమ మనుష్యులందరినీ ప్రేమించింది. కోపాన్నీ ద్వేషాన్నీ అసూయ లాంటి విత్తనాలు చల్లుకుంటూ పోతే అవే ఫలిస్తాయి. చిన్న పొరపాటు జరిగితే పగ, కోపం వరదలుగా పారటం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. ద్వేషానికి బదులు ప్రేమ ప్రవహించాలని ప్రభువు కోరిక. ఈ లోక ప్రేమలు వివిధ రకాలు. తల్లిదండ్రుల ప్రేమ, ఆలుమగల ప్రేమ, సహోదర ప్రేమ. అయితే ఇవి మారుతూనే ఉంటాయి. క్రీస్తు ప్రేమ మారనిది. మార్పు లేనిది. ఆరనిది. ఆర్పజాలనిది. విలువైనది. వంచనలేనిది. కల్మషం లేని మధురమైనది. మరణం లేనిది. శాపం లేనిది. ఎడబాటు లేనిది. అద్భుతమైనది. అరమరికలు లేనిది. నిజమైనది.
నిజమైన ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. అనేక పాపాలను క్షమిస్తుంది. కీడు చేయదు.
‘ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించును. మత్సరపడదు. డంబముగా ప్రవర్తింపదు. ఉప్పొంగదు. అమర్యాదగ నడవదు. స్వప్రయోజనము విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. సత్యమందు సంతోషించును. అన్నిటిని తాళుకొనును. అన్నిటిని నమ్మును. అన్నింటినీ నిరీక్షించును. అన్నిటిని ఓర్చును.’ - 1 కొరింధీ 13:4-7
ప్రేమ సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమైనది. ప్రాణ త్యాగము కంటె శ్రేష్ఠమైనది. అన్ని దానాల కంటె మిన్న అయినది. మనకంటె ముందు మనలను ప్రేమించునది యేసు ప్రేమ. ఈ ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ. భయమును వెళ్లగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. దేవుని ప్రేమను కలిగినవారు తోటివారిని ద్వేషించిన యెడల అతడు అబద్ధీకుడగును. తోటి వారిని ప్రేమించని వాడు దేవుని కూడ ప్రేమించనట్టే. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెను.. అను ఆజ్ఞను మనము ఆయన వలననె పొందియున్నాము. బైబిల్‌లో ముఖ్యమైనది ప్రేమ, శ్రేష్ఠమైన ప్రేమ.
‘మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.’ - యోహాను 13:34. అంటే సిలువలో చూపిన ప్రేమను మనమంతా కలిగి ఉండాలి. దేవుని రాజ్యము ప్రేమ రాజ్యము. క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే మరణము నుండి జీవమునకు దాటిపోవుదురు. ‘మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నామని ఎరుగుదుము’ - యోహాను 3:14. ప్రేమలేని వాడు మరణమందు నిలిచియున్నాడు. దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు స్థిరపడాలి. క్రీస్తు ప్రేమ నుండి వేరుపడకూడదు. క్రీస్తు ప్రేమలో స్థిరపడి వెలుగులో ఉంటూ సహోదరులను క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ పరిశుద్ధ జీవితం జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించునుగాక.

-మద్దు పీటర్ 9490651256