ప్రార్థన

ప్రేమ వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరు లోకమునకు వెలుగై యున్నారు. కొండ మీదనుండు పట్టణము మరుగై యుండనేరదు’ - మత్తయి 5:14
మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది ఇంటనుండు వారందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని ప్రేమ కలిగి చేసే సత్క్రియలే వెలుగు ప్రకాశము.
సాతాను లోకాన్ని మోసముతో వశపరచుకొని అంధకారము కలుగజేశాడు. ఆత్మీయ అంధత్వానికి గురి చేశాడు. లోకాన్ని దేవుని నుండి దూరపరచి చీకటి రాజ్య సంబంధులుగా చేసి అక్రమమునకును అపవిత్రతకు గురిచేసి ప్రేమను చెరిపి పగ ద్వేషాలతో నింపాడు. అబద్ధాలకు జనకుడు గనుక అబద్ధాలకు మోసాలకు అలవాటు చేశాడు. వాస్తవానికి సాతానుడు భయంకరముగానో వికృతముగానో ఉండడు. వాడు వేషధారి. కనుక మామూలు మనిషిగానే ఉంటూ లేక వెలుగు వేషము కూడా వేసుకుంటూ మనుషులను మోసము చేసి చిన్నచిన్న అబద్ధాలు సుళువుగా చెప్పించి అది అంత తప్పేమీ కాదన్నట్లు భ్రమింపజేస్తాడు. చిన్నచిన్న దొంగతనాలు అలవాటు చేస్తాడు. జాగ్రత్త. ఒక్క రూపాయి అయినా కోటి రూపాయలు అయినా అది దొంగతనమే. చిన్నచిన్న చినుకులే నదులై వరదలై మనుషులను ముంచివేసినట్టు, చిన్నచిన్న అబద్ధాలు దొంగతనాలే మనుషులను ముంచుతాయి.
లోకములో ఎటు చూసినా చీకటిమయము. కనుచూపు మేరకు మంచి అనేది కనబడుట లేదు. ఒకవేళ మంచిగా కనపడినా నిజమో కాదో తెలియటం లేదు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావటంలేదు. ఒక మంచి వార్త వినపడటం లేదు. ఉదయం నుండి నరహత్యలు, మానభంగాలు, కక్షలు, కుట్రలు, అల్లర్లు, విభేదాలు, ద్వేషాలు, కలహాలు, లంచాలు, దురాశలకు సంబంధించిన విషయాలే వింటున్నాము. ఆశలకు దురాశలకు హద్దులు లేవు. ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా ఎదుటివాని ఇల్లు కారు పొలాలు నగలు దాసదాసీల మీదనే చూపు. తృప్తి లేదు. చూపులన్నీ పొరుగింటి మీదనే ఉంటున్నాయి. నీ పొరుగువానిదగు దేనిని ఆశించకు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
సర్వాన్ని సృష్టించి ఏ కొదువ లేకుండా సమస్తాన్ని కలుగజేసి అవ్వ ఆదాముల చేతిలో పెడితే, తోటలోని చెట్ల ఫలాలన్నీ వదిలి తినవద్దన్న పండునే ఆశపడి తిని పాపములో పడి దేవునికి దూరమై సాతాను చేతిలో బానిసలయ్యారు. అధికారాన్ని కోల్పోయారు. రక్షించుకోలేని పరిస్థితి. చుట్టూ అప్పులు. అవి తీర్చటానికి అనేక తప్పులు. దేవుని మరిచిపోయారు. నిరాశ, అసంతృప్తి. ప్రేమ లోపించింది. ఎలాగైన ఈ పాపపు ఊబి నుండి, చిక్కుల నుండి బయటపడాలని సొంత ప్రయత్నాలతో విఫలమై, ఏ దిక్కా తోచక చివరకు ప్రాణాలు తీసుకొంటున్నారు. సాతాను ఉద్దేశమే అది. జాగ్రత్త. మనలో ఉన్న జీవం దేవునిది. ఆ జీవాన్ని వద్దనుకొంటున్నావంటే దేవుడు వద్దని చెప్పటమే. అలా చేస్తే దేవునితో సంబంధం తెగిపోయి, దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు. కటిక చీకటి పాలౌతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటాయి. అగ్ని ఆరదు పురుగు చావదు. నిత్య జీవితాన్ని కోల్పోతారు.
దుష్టకార్యాలకు ఫలితం వెంటనే రావటంలేదు కనుక భయాన్ని విడిచి దుష్టత్వంలో ఉన్నారు. పెద్దవారికి చిన్నవారికి భయం లేదు. చీకటి బ్రతుకులయ్యాయి. ఏది మంచో ఏది పాపమో ఏది దుష్టత్వమో తెలుసు, తమ పిల్లలు ఈ చీకటి బ్రతుకుల్లోకి రాకూడదు అనే ఆశ ఉంది. అయినా ఈ బానిసత్వము నుండి బయటకు రాలేక పోతున్నారు. తాగుడు జూదము వ్యభిచారము లంచగొండితనములో పడిపోయి, ఇల్లూ వాకిలీ భార్యాబిడ్డలను పోగొట్టుకొని ఆరోగ్యం పోగొట్టుకొని చివరకు వీధిన పడుతున్నారు. అప్పుడప్పుడు ఈ మైకం నుండి బయటపడాలి. ఈ చీకటిని ఛేదించాలని, ఆశ అయితే ఉంది గాని కుదరటంలేదు.
ఈ చీకటిని ఛేదించాలనే ఆశ. బంధకాల నుండి విడుదల కావాలని కోరిక. వ్యాధి బాధలు దిగులు, విచారముతో ఏ దిక్కూలేని పరిస్థితి. నలుదిక్కుల్లో సాతాను శోధనలో అగుపించింది ఒక ఆశాకిరణం. అది శ్రీయేసు జననం.
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు హృదయాలలో ప్రకాశించెను. చీకటిలో నడచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యెషయా యొక్క ప్రవచనం క్రీస్తు రాకతో నెరవేరింది. క్రీ.పూ.700 సం. క్రితపు ప్రవచనము. ‘కాబట్టి ప్రభువు తానె యొక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును’ - యెషయా 7:14 అనే ప్రవచనం నెరవేరింది.
దైవ కుమారుడు తన్నుతాను తగ్గించుకొని మహిమను వదలుకొని దీనదాసునిగా ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. సమీపింపరాని తేజస్సుతో ఉండే దేవుడు దహించు అగ్నియైన దేవుడు ‘నిన్ను నన్ను ప్రేమించి మన మధ్యకు వచ్చాడు.’ ఆయన యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్యజీవము పొందుకుంటారు. యేసునందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. వెలుగైయున్న దీని అంగీకరించిన మనము ప్రేమ వెలుగును పొందుకుంటాము. ఆయన ప్రేమతోపాటు ఆయన శక్తిని కూడా పొందుకుంటాము గనుక దుష్కార్యము చేయము. స్వలాభము కోరము. స్వనీతి ఉండదు, చీకటి కార్యాలకు మనలో తావు ఉండదు. నిజమైన వెలుగును అంటే క్రీస్తు ప్రేమను చీకటి బంధించలేదు.
నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ప్రవచనానుసారంగా పుట్టిన రక్షకుడైన ఈ యేసుక్రీస్తును అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము కలదు. ఈ అధికారముతో యేసు పునరుత్థాన శక్తితో సాతానును ఎదిరించి పారద్రోలగలము. చీకటి మయము నుండి విడుదల, బంధకాల నుండి, వ్యాధి బాధల నుండి, అప్పుల బాధ నుండి తప్పుల బాధ నుండి విడిపించబడతాము. అదే శక్తితో బాధింపబడుచున్న వారిని, కాడి మాను మోకులతో కట్టబడిన వారిని విడిపించి, దిక్కుమాలిన వారిని, ఆకలిగొనిన వారిని, వస్తహ్రీనులను ఆదరించగలుగుతాము.
పూర్వము చీకటియైన వారు ఇప్పుడు ప్రభువైన క్రీస్తును స్వీకరించి వెలుగై యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనపడుచున్నది. నిష్ఫలమైన అంధకార సంబంధమైన కార్యాలలో ఇక పొత్తు ఉండదు. చీకటి కార్యాలకు అలవాటు పడి అదే ప్రపంచం అనుకుంటూ ఈ లోక సుఖభోగాలు తాత్కాలికమైనవని ఎరుగక అల్ప సంతోషాలతో ఉన్నవారికి ఒక ప్రేమ పిలుపుతో కూడిన హెచ్చరిక. ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుమని, ఈ లోకాన్ని ప్రేమించేవారిలో తండ్రి ప్రేమ ఉండదు. స్వార్థమైన ప్రేమ బ్రతుకును నిరర్థకము చేస్తుంది. ఈ స్వార్థము మరల చీకటిలో పడవేస్తుంది. స్వార్థంలో ఉన్నవారు సేవకు పనికిరారు. ఇతరులకు సేవ చేయలేరు. ఈ లోకము దాని ఆశ గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలుచును.
సర్వశక్తిగల ప్రభువును అంగీకరించిన మనలో ప్రభువు ఉంటాడు. మనలో ఉన్న వాడు లోకములో ఉన్న సాతాను కంటె గొప్పవాడు కనుక, లోక పరిస్థితులు ఎలా ఉన్నా మనము సమాధానముగా ఉంటాము. ఈ సమాధానాన్ని, దేవుని ప్రేమను, ఆయన ఇచ్చిన సంతోషాన్ని ఈ లోకములో వ్యాపింపజేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై యుండునుగాక.
దేవుడు వెలుగై యున్నాడు.
ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు.

-మద్దు పీటర్ 9490651256