ప్రార్థన

పరలోకమందున్న మా తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేతను భక్తుల చేతను నిత్యము కొనియాడబడుచున్న తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు దహించు అగ్నియైన దేవుడు సమీపించరాని తేజస్సుతో ఉన్న దేవుడు ఆత్మస్వరూపియైన దేవుడు వాక్యమై యున్న దేవుడు మనలను కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని, తన జనితైక కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి మానవాకారములో పంపెను. ఈ యేసుక్రీస్తును అంగీకరించిన వారందరు దేవుని కుమారులగుటకు కుమార్తెలగుటకు అధికారమిచ్చాడు. - యోహాను 1:12.
దేవుని కోరిక మానవమాత్రులమైన మనలను దుమ్ము ధూళి వంటి వారమైన మనలను ఆయన పరిశుద్ధ రాజ్యములో చేర్చుకోవాలని. ఆయన కుటుంబములో కుమారులుగా కుమార్తెలుగా చేసికోవాలని.
క్రీస్తు చేసిన ప్రార్థనలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. మరియు నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రీ నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమై ఉండవలెనని, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరు ఏకమై ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాలో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలెనని కోరుచున్నాము. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసితిని. ఇంకను తెలియజేసెదెనని ప్రార్థించెను -యోహాను 17:17-26.
పరలోకపు బ్రాంచీలుగా క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్న దేవునికి వందనాలు. తండ్రి చిత్తము ఈ లోకములో నీ ద్వారా నా ద్వారా జరిగించాలని దేవుడు కోరి మనలను ఎన్నుకొంటున్నాడు. పరిశుద్ధమైన పరలోకపు బ్రాంచ్‌గా మనము ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని సందేశాలను లోకానికి తెలియజేయాలి, మనుషుల అవసరాలను దేవునికి తెలియజేయాలి. ఒక్కసారి యేసు రక్షకుడని అంగీకరిస్తే, పరలోకపు తండ్రికి కుమారులము కుమార్తెలముగా అవుతాము. మన స్థాయి ఉన్నట్టుండి పెరిగిపోతుంది. లోకములో అత్యుత్తమ స్థాయి పొందుకుంటాము.
ఇక భూసంబంధమైన వాటి మీద నుండి మనస్సును పైనున్న వాటి మీదకు మరల్చాలి. కావున, భూమి మీదనున్న మీ అవయవములను ఇక మీద జారత్వమును, కామాతురతను దురాశను విగ్రహారాధనయైన ధనాపేక్ష అను వాటిని చంపివేసి, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి. వీటికి పైన పరిశుద్ధతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము హృదయములను ఏలుచుండనీయాలి.
అమెరికా బ్రాంచీలు లోకములో ఎక్కడ పెట్టినా యుఎస్ స్టాండర్డ్‌తోనే ఉన్నట్టు పరలోకపు బ్రాంచీలు కూడా ‘హెవెన్’ని ప్రతిబింబింపచేయాలి కదా! దేవుని ప్రేమను చూయించాలి.
ప్రభువు చెప్పిన మాట - నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. నాయందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకనుగ్రహింపబడును. -యోహాను 15:7. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్యజీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. -యోహాను 3:36.
దేవుని ఆలోచన అంతా మన గురించే. క్రీస్తు ప్రార్థన చేసేది కేవలము మన కోసమే. ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు చేసుకుంటూ చెల్లాచెదరైన మనలను తిరిగి దేవుని కుటుంబములో చేర్చాలని, ఈ లోకానికి మానవునిగా వచ్చి శోధనలు శ్రమలు సహించి సిలువలో ప్రాణాలిచ్చి మనలను విమోచించాడు. అంతటితో ఆగక తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపనములు చేస్తున్నాడు. శరీరములో ఉన్నంతకాలము యేసు ప్రభువు ప్రార్థనే ఊపిరిగా వేకువ జామున ప్రార్థన, సాయంత్రపు వేళ ప్రార్థన, రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దుఃఖముతో ప్రార్థనలు సలిపాడు. గెత్సెమనె తోటలో ప్రార్థించునప్పుడు ఆయన చెమట రక్తముగా మారిందిట. ఎంత ప్రేమ మనపైన చూపిస్తున్నాడో చూడండి.
బిల్లీ గ్రాహమ్‌గారి జయ జీవితానికి రహస్యమేమని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం - ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పౌలు థెస్సలోనియులకు ఇచ్చిన సూత్రము కూడా ఇదే. ఎడతెగక ప్రార్థన చేయమని. మనము శోధనలలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రభువు ఇచ్చిన సలహా. ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇంక కొంచెం నిద్ర ఇంక కొంచెం కునుకుపాటు. పరుండుటకై ఇంక కొంచెం చేతులు ముడుచుకొనుట వీటి వలన దరిద్రత పరుగెత్తి వస్తుందట. ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. -సామెతలు 24:33-34.
శరీరము బలహీనము. నేత్రాశ శరీరాశ జీవపు డంబము. నేత్రాలు మిరుమిట్లు గొలిపే దృశ్యాలు ఎన్నో మనలను పడవేసి పతనానికి ఈడ్చుకొని వెళ్తాయి. మన అమూల్యమైన సమయాన్ని దోచేస్తున్నాయి. ఏదో ఒకటి చూస్తూ నిలిచిపోతున్నాము. చూచిన వానిని బట్టి కోరికలు పుడ్తాయి. దానిని ఎలాగైనా పొందాలనే తపన ఆరాటం ఎక్కువౌతుంది. ఆదిలో హవ్వ పడిపోవటానికి కారణము మనకు తెలుసు. తన అతిక్రమమునకు ప్రతిఫలముగా లోకానికి పాపము అంటుకుంది. ఇప్పుడు ఈ లోకమంతా ఎటు చూసినా ఆకర్షించే విషయాలే. జాగ్రత్త. నేత్రాశకు అడ్డుకట్ట వేయాలి. ఇటువంటి శోధన సమయాల్లో ప్రభువును ప్రార్థిస్తే ఆశను అధిగమించే శక్తి ప్రభువు ఇస్తాడు. నేత్రాశ శోధనలో హవ్వ ఒక్కసారి ప్రభువు వాక్యాన్ని జ్ఞాపకము చేసికొని, ఆ పండును తినకపోతే లోకము వేరే తీరుగా ఉండేదేమో. ఇప్పుడు మన విధేయత వల్ల అనేక తరాలు ఆశీర్వదించబడేటట్లు నేత్రాశలో ప్రభువును ప్రార్థించి శక్తిని పొందుకొని నేత్రాశను అధిగమిస్తాము. అన్ని వయసుల వారు ఆడ మగ తేడా లేకుండా నేత్రాశలో పడిపోయి బాధలలో పడిపోతున్నారు. ఒక్క పాప శాపము మన ముందు మూడు నాలుగు తరాలు ఉంటుందట. అయితే ప్రార్థనా శక్తితో శోధన జయించువారిని వేయి తరాలు దీవిస్తాడట. అలాగే శరీరాశ. ఒక హద్దూ పద్దూ లేదు. అన్నీ కావాలని కోరుకుంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణమని బైబిల్ చెబుతోంది. చాలా విషయాలలో ఆత్మ సిద్ధమే - ఉదయానే్న ప్రభువు సన్నిధిలో ప్రార్థించాలని, వాక్యాన్ని ధ్యానించాలని ఉంటుంది గానీ శరీరము సహకరించదు. మార్టిన్ లూథర్ ప్రతి ఉదయం రెండు మూడు గంటలు ప్రార్థించి ఆ దినము ఎదురయ్యే సాతాను శోధనను ఎదుర్కొనేవాడట. సర్వాంగ కవచం ఉన్నా వాక్య ఖడ్గమున్నా ప్రార్థన లేకుంటే ఓడిపోతాము.
మనకు ఎంత జ్ఞానమున్నా సర్వాంగ కవచముతో కప్పబడి ఉన్నా యోహాను 15:4లో ప్రభువు చెప్పినట్లు, ప్రభువులో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. ప్రభువులో నిలిచి ఉన్నప్పుడే ఫలితం దొరుకుతుంది. ప్రభువుకు దూరముగా ఉండి మనము చేయగలిగింది ఏమీ లేదు.
తండ్రి మన మాట వినాలంటే, ముందు ఆయన మాట మనము వినాలి. మన ఇష్టమొచ్చినట్లు మనము చేసుకుంటూ మనము అడిగినదంతా దేవుడు ఇవ్వాలంటే ఎలా? మన దేహము ఆయనకు నిలయమై యున్నది.
ఎడతెగని ప్రార్థనతో మనము తండ్రితో సహవాసము చేయాలని ఆయన కోరిక. క్రీస్తులో మనకు ఇచ్చిన ఈ గొప్ప మార్గాన్నిబట్టి దేవునికి నిండు వందనాలు.
దేవుని వాక్యములో నింపబడి ఎడతెగని ప్రార్థన జీవితముతో, తండ్రితో సహవాసము కలవారు ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగినవి.
ఏలియా భక్తుడు ప్రార్థించగా, మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షాలు లేవు. మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చెను. భూమి తన ఫలము ఇచ్చెను.
మోషే ప్రార్థించగా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఎడారిలో సెలయేరులు ప్రవహింపజేశాడు. యెహోషువా ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపాడు. హిజ్కియా ప్రార్థన వల్ల పదిహేను సంవత్సరములు జీవితం పొడిగించబడినది.
మన దేహాలను దేవునికి ఆలయములుగా ఉండాలని కోరుకున్నాడు. మలినమైన ఈ దేహాలను ప్రభువైన యేసు రక్తములో శుభ్రపరిచాడు. కావున ఇప్పుడే మనము దేవునికి పరిశుద్ధమైన ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ఆరాధనలు, విజ్ఞాపనములుగా ఉండి ఆయన చిత్తాన్ని ఈ లోకములో జరిగించే కేంద్రాలుగా ఉండాలి. ప్రార్థనే ఊపిరిగా ఉంటూ, దేనిని గూర్చియు చింత లేకుండా ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. -్ఫలిప్పీ 4:6
క్రీస్తును అంగీకరించి, మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉంటే మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు యాచనలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఉండే పరలోకపు కేంద్రాలుగా ఈ లోకములో దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256