ప్రార్థన

క్రీస్తు సిలువపై పలికిన రెండవ మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను’ -లూకా 23:43
దేవుని క్షమాపణ గుణాన్ని తెలియజేసే ఇంకొక మాట ఇది. అంత ఘోర వేదన సమయములో కొనఊపిరితో ఉండి తండ్రి అప్పగించిన పని చేస్తూనే ఉన్నాడు. మనము కూడా ప్రాణమున్నంత వరకు దేవుని సేవ చేయుట ఆశీర్వాదకరము. ప్రభువు గాయపరచబడి అలసిపోయినా సరే దేవుని పని చేస్తూనే ఉన్నాడు. దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఒక సామాన్య మానవునిగా ఒక సేవకునిగా అయ్యాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మాటతో సర్వాన్ని సృష్టించిన దేవుడు ఇప్పుడు మన కోసము బలహీనుడయ్యాడు. ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు. అయినా తనకు అప్పగించిన పనిని మాత్రము ఆపలేదు.
మనకు ఏదైనా పని ఇస్తే, అన్ని సదుపాయాలు ఉంటేనే అంతంతగా చేస్తుంటాము. తొమ్మిది గంటలకు వెళ్లవలసిన పనికి పది గంటలకు వెళ్తాము. ఐదు గంటల వరకు చేయవలసిన పనిని మూడు గంటలకే ముగించి ఇక సొంత పనుల మీద ఇష్టానుసారముగా తిరుగుతూ ఉంటారు. అలా ఆలస్యముగా పనికి వెళ్లడం, పని నుండి సమయానికన్నా ముందే బయటపడటం చాలా గర్వంగా చెప్పుకుంటారు.
ఒక్కొక్కసారి పనులలో పడి దేవుని పనిని బొత్తిగా పట్టించుకోరు. ఇవి దేవుడు ఇచ్చిన పనులు. దేవుని మర్చిపోవటానికి ఇచ్చినవి కాదు. దేవుని మహిమ కొరకు ఇచ్చినవి. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగి, దేవుడు నన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు అని సాక్ష్యమిచ్చాడు. మరి ఏ సంఘానికి వెళ్తున్నారంటే -చాలా బిజీ వర్క్ కదా. ఆదివారం విశ్రాంతి తీసుకుంటాను కాబట్టి ఎక్కడికీ వెళ్లను అన్నాడు. జాగ్రత్త! పనులు ఇచ్చింది దేవుడు. ఆస్తి, అంతస్తులు ఇచ్చింది దేవుడు. ఆయనకు తెలుసు. మనకు ఎంత సమయము పడుతోందో? అయితే అనవసరమైన పనులూ పార్టీలూ పెట్టుకుని బిజీగా ఉండి చివరికి దేవునికి ఇవ్వవలసిన సమయములో విశ్రాంతి తీసుకొంటే జాగ్రత్త.. ఉన్న ఉద్యోగం కూడా పోవచ్చు. ఉద్యోగాలు వివాహాలు కావలసినప్పుడు మాత్రము తెగ ప్రార్థనలు చేస్తుంటారు. తెలిసిన ప్రేయర్ టవర్‌లోకి రిక్వెస్ట్‌లు పంపుతారు. ఎవరెవరితోనో ప్రార్థనలు చేయించుకుంటారు. ఆ ప్రార్థనలు ఆలకించిన ప్రభువు ఉద్యోగం ఇస్తే, ఇక ఉద్యోగమే దేవుడు అన్నట్లు చేస్తూ బిజీగా ఉంటూ బిజీ బిజీ అని పాట పాడుతూంటారు. దేవునికి సమయమివ్వరు. తల్లిదండ్రులను పట్టించుకోరు. ఇల్లు వాకిలీ కూడా గుర్తుకు రాదు.
సిలువలో ప్రభువును చూస్తే- అంత ఘోర బాధలో కూడా పనిని నిర్వర్తిస్తూనే ఉన్నాడు. సిలువ మీద ఉన్న దొంగను క్షమించి రక్షణ మార్గము చూయించాడు. చివరి క్షణాన కూడా పనిలోనే ఉన్నాడు.
వీడు ఇతరులను రక్షించెను తన్ను తాను రక్షించుకొనలేడా అని శాస్త్రులు పెద్దలూ హేళన చేస్తున్నారు. పరిహసిస్తున్నారు. ప్రభువుతోపాటు సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయనను నిందించారు.
దేవునికి ఎంతటి పరాభవమో చూడండి. అదే మనమైతే చిన్న అవమానాన్ని కూడా తట్టుకోలేము. గొడవలు చేస్తాము. ఇప్పటికీ దేవుని శక్తినీ ఆయన త్యాగాన్నీ ఎరుగని వారు ఎందరో. నిజమైన రక్షణ అంటే ఏంటో తెలియని వారు కూడా ఆయనను దూషిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎగతాళి చేస్తూనే ఉన్నారు.
సిలువలో వ్రేలాడుచున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు, ‘నీవు క్రీస్తువు కదా! నిన్ను నీవు రక్షించుకో. మమ్మును కూడా రక్షించుమ’ని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను.
ఇదే మాట ప్రభువును తీర్పు తీర్చిన పిలాతు కూడా చెప్పాడు. మరణమునకు తగిన కారణమేమీ యేసు ప్రభువులో కనపడలేదు గనుకనే అలా చెప్పాడు. అయినా యూదా మత పెద్దలూ జన సమూహమూ సిలువ వేయవలసిందేనని కేకలు వేశారు. సత్యాన్ని అణగద్రొక్కటానికి ఆనాడూ ఈనాడూ రాబోయే కాలములో కూడా సాతానుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనుషులను ప్రేరేపిస్తూనే ఉంటాడు. మనము ఎందుకు కేకలు వేస్తామో ఆలోచించాలి. ఇష్టమొచ్చినట్లు కేకలు వేస్తే మనము దేవుని దృష్టికి నేరస్థులవౌతాము.
రోమా అధికారులు ప్రభువును విచారించి మరణశిక్షకు తగిన నేరమేమియు చేయలేదని నిర్ధారించారు. ఆరు మారులు విచారించి యేసును నిర్దోషిగా నిర్ధారించారు.
దొంగలు చురుకుగా తెలివిగా ఉంటారు. వారికి సమాజములో ఎవరు ఏంటో బాగా తెలుసు. యేసు ప్రభువును గూర్చిన సంగతి తెలిసిన ఈ దొంగ - ఈయన ఏ తప్పిదము చేయలేదని గ్రహించాడు. ఎందుకంటే ప్రభువు పరిచర్యలో ఎక్కడా కూడా డబ్బుల వసూళ్లుగానీ, భూముల ఆక్రమణ గానీ చేయలేదు. ఇవి ఈ దొంగ గమనించే -ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పగలిగాడు. అంతేకాదు ప్రభువు బోధలు కూడా విన్నట్టున్నాడు. కనుకనే నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికోమని ప్రార్థించాడు. అందుకు యేసు దొంగ పశ్చాత్తాపము గ్రహించి ‘నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాన’నెను. యేసయ్య రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పాపము లేని రాజ్యము. పరిశుద్ధ రాజ్యము. నీతిగల రాజ్యము. సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఆ రాజ్యములో ఉండును.
‘పాపమెరుగని ప్రభువు మన కొరకు పాపియాయెను’ -2 కొరింథీ 5:21.
అంతేకానీ ఆయన ఎటువంటి పాపము చేయలేదు.
‘మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గానీ సమస్త విషయములలో మన వలెనే శోధింపబడిననూ ఆయన పాపము లేనివాడుగా ఉండెను’ -హెబ్రీ 2:18.
ఈ లోకము పాపముతో నిండి ఉంది గనుక పాపము లేని రాజ్యము కూడా ఒకటి ఉంటుంది అని గ్రహించిన రెండవ దొంగ - నీ రాజ్యము లోనికి వచ్చినపుడు నన్ను జ్ఞాపకముంచుకోమని ప్రార్థింపగా వెంటనే ప్రభువు జవాబిచ్చాడు. ఆయన మన ప్రార్థనలు వినటానికి ఎల్లప్పుడూ సిద్ధమేనని మనము గ్రహించాలి. పాప ఊబి నుండి పైకి లాగి బండ మీద నిలువబెట్టుటకు సిద్ధమే. ఆ బండ క్రీస్తే. ఆయన రక్తములో మన పాపపు మరకలు కడిగి దేవుని రాజ్య వారసులుగా చేయుటయే విమోచన.
ఒకప్పుడు నిజముగానే ఏదేను తోటలో పాపము లేదు. పాపము మొలిచి లోకమంతా వ్యాపించింది. సిలువ కార్యము ద్వారా పాపము లేని రాజ్యము మొదలైంది. త్వరలో ఆ రాజ్యము పూర్తిగా రానై ఉంది. సిద్ధపడు.
దొంగ పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన వెంటనే ఆలకించి జవాబిచ్చిన ప్రభువు అసలు రక్షణ ఏంటో తెలియజేశాడు. కానీ వారికి బోధపడలేదు. ఇప్పటి రక్షణను అర్థము చేసికోనివారు ఈ పాప ఊబిలోనే ఆనందిస్తున్నారు. రక్షింపబడిన వారైతే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొఱ్ఱెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని ఎరుగుదురు.
ఈ లోకములో జబ్బులు తగ్గటం, ఆర్థిక ఇబ్బందులు తొలగటం, కష్టాలు తీరుట, బాధలు లేకపోవుట రక్షణ కానే కాదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలు క్షమించబడి దేవుని రాజ్యానికి వారసులమగుటయే అసలు రక్షణ. దానిని రెండవ దొంగ వెంటనే పొందుకొని ప్రభువుతోపాటు పరదైసులో ఉన్నాడు. మన తప్పులు తెలుసుకొని, ప్రభువును ప్రార్థిస్తే ప్రభువు సిద్ధముగా ఉన్నాడు.
ప్రభువు ఉచితముగా ఇస్తున్న ఈ రక్షణను లోకమంతా పొందుకోటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256