ప్రార్థన

యేసు క్రీస్తు నమ్మదగిన సహాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యేసు ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మనుషులు నమ్మదగని వారైనను ప్రభువు నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన వాడు. నమ్మదగినవాడు. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. తలవెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొను వాడను నేనే. నేనే చేసి యున్నాను. చంకపెట్టుకొను వాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.’ - 2 థెస్సలొనికయులకు 3:3
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.
మనకు తెలిసిన ఆపదలు.. తెలియనివి ఎనె్నన్నో. ప్రయాణాలలో వచ్చే ఆపదలు... ఈ రోజులలో ప్రయాణాలు భయకంపితులను చేస్తున్నాయి. అది బస్సు కావొచ్చు. రైలు కావొచ్చు. మరి ఏ ఇతర వాహనాలైనా కావొచ్చు. ఫుట్‌పాత్ మీది ప్రయాణం కూడా ప్రమాదమే. నిలువనీడ లేనివారు ఫుట్‌పాత్‌పై పండుకొంటే.. ఏ వాహనము వల్లనో వారు మరణఛాయలకు నెట్టివేయబడటం రోజూ చూస్తున్నదే. దొంగల వల్ల ఆపదలు.. ఈ రోజుల్లో దొంగ ఎవడో? దొర ఎవడో? తెలియటంలేదు. సొమ్ము దొంగిలించటమే కాకుండా ప్రాణహాని కూడా తలపెడుతున్నారు. స్వజనుల వల్లనైన ఆపదలు.. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ద్వేషం అసూయలతో సొంత వారి వలననె అనేక నష్టాలు జరుగుతున్నాయి. పట్టణాలలో ఆపదలు.. ఇవి మరీ ఘోరం. పల్లెటూళ్ల నుండి వచ్చారంటే వారిని ఏదో ఒకరీతిన మోసం చేస్తున్నారు. కపట సహోదరుల వలన ఆపదలు.. యోసేపును సొంత అన్నలే అసూయతో ద్వేషంతో చంపనుద్దేశించి కొట్టి గోతిలో వేసినపుడు ప్రభువు ఆయనకు తోడుగా ఉండి రక్షించి కాపాడాడు. నీతిగా ఉండటం వల్ల యోసేపునకు ప్రమాదం ఎదురైంది. అన్యాయంగా చేయని దోషానికి చెరసాలలో వేయబడ్డాడు. ఐతే అక్కడ కూడా ప్రభువు యోసేపును విడువలేదు. చివరకు ఆయనను ఉన్నత పదవిలో కూర్చుండబెట్టాడు.
ప్రభువు నమ్మదగిన వాడు గనుక ఎటువంటి ప్రమాదం నుండైనా ఎటువంటి పరిస్థితులలో నుండైనా తప్పించి, మన నమ్మకానికి ఫలితం ఇస్తాడు.
మోషే పుట్టినప్పటి నుండి ప్రమాదం పొంచి ఉంది. పుట్టిన మగపిల్లలందరినీ చంపమని ఫరో ఆదేశం. అయినా దేవుడు ఫరో ఇంటిలోనే మోషేను పెంచే ఏర్పాటు చేయటం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించే సమయంలో అనేక రకాలైన అపాయాలు ఎదురైనా ప్రభువు కాపాడుతూనే ఉన్నాడు. ముందు సముద్రం - వెనుక ఫరో సైన్యం. ప్రభువు సముద్రములో మార్గము కలుగజేసి వారిని రక్షించటం చూశాం. ఒకపక్క అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు... ఈ దినాలలో ఎక్కువగా ఉంటున్నాయి. అయినను ఆయన నమ్మదగిన దేవుడు. స్వజనుల వలనైన ఆపదలు అనేకం. మోషే మీద స్వజనులే తిరుగబడటం చూస్తాం. అరణ్యంలో అనేక రకాలైన ఆపదలు రావటం చూశాం.
దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. అయినా ప్రభువు చాలిన దేవుడిగా ఉండి దావీదును విమోచించాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును అని నమ్మకంతో 27వ కీర్తన వ్రాసుకొన్నాడు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి. వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱ పెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మకముంచి విడుదల నొందిరి. ఖడ్గము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోట నుండి నన్ను తప్పించి రక్షించుము అని ప్రార్థించాడు.
సింహాలు, గురుపోతులు, ఎలుకబంట్లు లేకున్నా అలాంటి మనస్తత్వం గల మనుషులు మన మధ్యన ఉన్నారు కనుక మనము కూడా ఈ ప్రార్థన చేయవలసి ఉంది. యెహోవా నా బలము నా శైలము నా కోట నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము. మరణ పాశములు నన్ను చుట్టినప్పుడు భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి నన్ను వేధించినప్పుడు మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో యెహోవాకు మొఱపెట్టితిని. నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నాకు కలిగిన భయములన్నింటి నుండి ఆయన నన్ను తప్పించెను అని దావీదు మహారాజు స్తుతి కీర్తనలు వ్రాసుకొన్నాడు.
పేతురు సముద్రము మీద నడుస్తూ మునిగిపోసాగి ప్రభువును రక్షించమని కోరగా ప్రభువు తప్పించెను.
సిలువ మీద నుండి దొంగ యేసును చూసి ‘నీ రాజ్యములోనికి వచ్చునపుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమ’ని ప్రార్థించగా ‘నిశ్చయముగ నీవు నాతో కూడ ఉందువ’ని ప్రభువు సెలవిచ్చెను.
అసలైన అపాయము నరకము. అయితే ప్రభువు నరకము నుండి తప్పించటానికి శక్తి గలిగినవాడు. నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు -2 తిమోతి 2:13.
వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు -హెబ్రీ 10:23
యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక యుంచువారిని ఆయన ఎరుగును - నహూము 1:7.
యెహోవాను నమ్ముకొనినవాడు ధన్యుడు. ఆయన వానికి ఆశ్రయముగా ఉండును - యిర్మియా 17:7
ఉత్తముడైన యెహోవాను నమ్మి ఆశ్రయించి అపాయ సమయాలలో, ఆపత్కాలములలో ధైర్యము కలిగి ముందుకు సాగుటకు, నమ్మకమైన ప్రభువును నమ్మే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256