ప్రార్థన

నమ్మకము - నమ్మకత్వము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ దేవుడైన యెహోవాతో తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను. - ద్వితీ. 7:9
ప్రభువు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన క్రియలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నీతిమంతుడు యధార్థవంతుడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింప గలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును. -1 కొరింథీ 10:13
మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. -2 తిమోతి 2:13.
కావున ప్రజల పాపములకు పరిహారము చేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను - హెబ్రీ. 2:17.
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులలో సొంతదారుని నమ్మలేము. బయట వారిని నమ్మలేము. నమ్మి కాలేజీకి పంపితే ఇష్టమొచ్చిన దగ్గరకు వెళ్లి చదువులో వెనుకబడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నమ్మి యాభై లక్షలు ఇచ్చి బంగారము కొరకు పంపిన యజమానుని మోసము చేయటానికి పనిమనుషులు పూనుకొన్న సంఘటన ఈ మధ్యనే వార్తల్లో విన్నాము. నమ్మకముగా ఉన్నాడు కదా అని వృద్ధాప్యములో తన తల్లిని చూసుకోమని ఉంచితే ఎవరూ లేనప్పుడు ఆ వృద్ధురాలిని చంపి పారిపోయాడు. పిల్లలను నమ్మి తాళాలు ఇచ్చిన తల్లిదండ్రులను మోసము చేసిన పిల్లలు ఎందరో ఉన్నారు.
నమ్మకముగా ఉన్నారు కదా అని ఇల్లు వదిలి వెళితే గుల్లచేసిన సంగతులు ఎన్నో విన్నాము. చూస్తున్నాము. నీళ్లు కల్తీ, నూనె కల్తీ, పాలు కల్తీ, బంగారము కల్తీ, తినుబండారాలు కల్తీ. ప్రతి వస్తువులో కల్తీ. దేనిని నమ్మాలో తెలియటం లేదు. పని చేస్తామని నమ్మకద్రోహం చేసేవారు, సహాయము చేస్తామని నమ్మించి మనుషులను వాడుకొని చేసే మోసం, ఎక్కడా నమ్మకం లేదు. నమ్మకద్రోహము. అవసరంలో ఉన్నాము ఆర్థిక సహాయం చేయండి వెంటనే ఇస్తామని నమ్మించి, డబ్బులు తీసుకొని ఇక కనపడరు. ఫోన్లు ఎత్తరు. విదేశాల నుండి వారు కష్టపడి పంపిన సొమ్మును నమ్మించి మోసం చేస్తున్నారు. అది కొన్నాం. ఇది కొన్నాం చివరకు వారు వచ్చి చూస్తే ఏదీ ఉండదు. కాపరులు కొంతమంది గొర్రెలను మేపటం లేదు. గొర్రెలే కాపరులను పోషించి కాపాడవలసి వస్తోంది.
ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో నుండి మొఱ పెట్టినప్పుడు వారిని అద్భుతముగా వెలుపలికి నడిపించి మార్గములో వారికి మన్నా ఇచ్చి, బండ నుండి నీళ్లు ఇచ్చి తృప్తిపరచి పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెనె్నల దెబ్బ కానీ తగులకుండా మేఘ స్తంభములా అగ్ని స్తంభములా అడ్డు నిలిచి ఎన్నో ఆశ్చర్య కార్యములు అద్భుతాలు చేసినా, దేవుని నమ్మని జనులు వాగ్దాన దేశము చేరలేక పోయారు.
ఈనాడు, రోషము గల దేవుడు, గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువు తన్నుతాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఒక సేవకునిలా ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో ఉండి మనలను రక్షించటానికి తన ప్రాణమునే అర్పించిన యేసు ప్రభువును నమ్మలేక నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు.
అప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రభువు యొక్క బల పరాక్రమములు చూయించాడు. ఇప్పుడు సిలువలో ఆయన ప్రేమను చూయించాడు. ఆయన శక్తి చూసినా నమ్మలేదు. ఆయన ప్రేమను నమ్మలేదు. అందుకే నమ్మని వారు నమ్మి నమ్మకముగా లేనివారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. దేవుని నమ్మినవారు నమ్మకమైన జీవితం జీవించాలి.
మీరనుకొనని గడియలోనే మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండాలి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడు బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తనతోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచు ఉంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పును ఉండును. -మత్తయి 24:44-51.
నమ్మిన యజమానుని పట్ల నమ్మకత్వము చూయించాలి. మనకు అప్పగించిన పనులు నమ్మకముగా పూర్తి చేయాలి, ఎవరు చూసినా చూడకున్నా, దేవునికి మరుగైనదేది లేదు ఆయన అన్ని గమనిస్తున్నాడన్న సంగతి మరువకూడదు. ఎక్కడికి వెళ్లమంటే అక్కడకు వెళ్లాలి. ఏమి చేయమంటే అదే చేయాలి. మన ఇష్టమొచ్చిన పని కాదు. ఆయాను నమ్మి చిన్న బిడ్డను చూసుకోమని తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్తే ఆ చిన్నబిడ్డను ఇష్టమొచ్చినట్టు కొట్టి విసరివేసిన సంగతి సిసి ఫుటేజ్ ద్వారా లోకమంతా చూశారు. అదే నమ్మకముతో ఇంటి బాధ్యతను అప్పగించి వ్యాపారము నిమిత్తము దూర ప్రాంతము వెళ్లిన పోతీఫర్ ఇంటిలో జరిగిన సంగతి మనందరికీ తెలుసు. పోతీఫర్ భార్య యోసేపును మోహించి కూడమన్నప్పుడు అతడు ఒప్పక, తనపై యజమానునికి ఉన్న నమ్మకాన్ని కాపాడి దేవుని యందలి భయమును కనుపరిచాడు. దానికి ప్రతిఫలముగా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు.
మరణపు అంచుల్లో కూడ నమ్మకముగా ఉన్న మామూలు కార్యకర్తను, తన నమ్మకాన్నిబట్టి యజమానుడు ఇచ్చిన గౌరవము చేసిన మేలు మనము చూశాము. సాధారణమైన వ్యక్తి తన నమ్మకాన్ని బట్టి ఆశీర్వదించబడి పార్లమెంట్ సభ్యుడుగా అయ్యాడు.
లోకానికి తెలిసినా తెలియకపోయినా మన జీవితము ఎంత నమ్మకముగా జీవిస్తున్నామన్నది ప్రభువు చూస్తున్నాడని నమ్మాలి. ఆయనకు మరుగైనదేదీ లేదు. పైన ఆకాశమందైన క్రింద పాతాళమందైన సముద్ర అగాధమైనా సమస్తము చూస్తున్న దేవుడని నమ్మాలి. నమ్మకమైన జీవితము జీవించాలి. ఇంటిలో ఎవరూ లేనప్పుడు కూడా నమ్మకముగానే ఉండాలి. చెయ్యద్దన్న పని చేయకు. చూడొద్దవి చూడకు. మనుషులెవరూ లేకపోయినా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుని శక్తి నెరిగినటువంటి వారు ఆయనను నమ్మిన వారు నమ్మకముగా జీవించాలి.
భళా! మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. ఆయన అప్పగించిన చిన్నచిన్న ఆజ్ఞలను నమ్మకంగా నెరవేర్చాలి. దొంగిలించకు సమృద్ధి నిస్తాడు. అబద్ధమాడకు నిన్ను గొప్ప చేస్తాడు. నరహత్య చేయకు నిత్య జీవమిస్తాడు. వ్యభిచరించకు మంచి కుటుంబ జీవితమిస్తాడు. పొరుగువానిదేదీ ఆశించకు తృప్తినిస్తాడు. చిన్నచిన్న విషయాలలో నమ్మకముగా ఉంటే గొప్పగొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు.
మన నమ్మకత్వాన్ని పాడుచేయటానికి సాతానుడు అనేక రీతులుగా ప్రయత్నిస్తాడు. ఏవేవో ఎరలు వేస్తాడు. అందాలు చూయిస్తాడు. అందలమెక్కిస్తాడు. ధనాశ చూపెడతాడు. చివరకు భయపెడతాడు. ఇటువంటి వాటికి లొంగక మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రభువు జీవ కిరీటమిస్తాడు. నిత్య రాజ్యానికి చేరుస్తాడు. చాలామంది అల్పమైన విషయాల కోసం ప్రభువిచ్చే గొప్ప వరాలు, వాడబారనివి నిత్యముండే వాటిని పోగొట్టుకుంటున్నారు. చిన్న సిగరెట్ కోసం దేవుని గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. ఎవరికీ కనపడలేదనుకున్నా ప్రభువుకు తెలుసు. నలిగిపోతున్న నీ ఊపిరితిత్తులకు తెలుసు.
మన జీవితము ఎంతో అల్పమైనది. వెళ్లి మరలి రాని గాలి వంటిది. భూనివాస కాలము నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉండగలిగిన వాడెవడును లేడు. నరుని ఆయుష్కాలము దేవుని దృష్టిలో లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మన జీవమేపాటిది. కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదే గదా!
సమస్త శరీరులు గడ్డి వంటివారే. గడ్డి ఎండును దాని పువ్వు వాడును. అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును. తృణప్రాయులము. అయితే ఇంత స్వల్పమైన విషయాల కోసం నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. నిర్జీవమైన విషయాల కోసం జీవముగల దేవుని పోగొట్టుకుంటున్నారు.
ప్రభువు మనలను ప్రేమించి మన మీద ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకొనకుండా మనకు అప్పగించిన పనులను నమ్మకముగా చేసి ప్రభువిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాము. ప్రభువు ఆశీర్వాదము ఆకాశమంత ఉన్నతమైనది. మన ఆలోచనలు చాలా అల్పమైనటు వంటివి.
మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుని నమ్ముట నమ్మకముగా ఉండుట ఆత్మఫలమే. ఎందుకంటే శరీరానుసారమైన నమ్మకము ఒక రోజు ఉంటుంది. ఒకరోజు ఉండదు. చూడకూడనిది చూసినా వినకూడనిది విన్నా మనకున్న నమ్మకము చెదిరిపోతుంది. మరలా ఆ నమ్మకము రావచ్చు రాకపోవచ్చు. మనుషుల మధ్య ఆఫీసులలో గుడిలో బడిలో నమ్మకమును ప్రదర్శిస్తాము. బయట ఎవరి ఇష్టం వారిది.
అదే ఆత్మఫలములో వచ్చిన నమ్మకము నమ్మకత్వము అగ్నిలో వేసినా నీళ్లలో వేసినా మారదు. కరవులో మారదు. ఖడ్గానికి మారదు. జైల్లో మారదు. అధికారము ఉన్నా మారదు. లేకపోయినా మారదు. ‘గన్ పాయింట్’లో మారదు. చివరకు మరణ సమయములో కూడా మారదు. ఈ లోకాధికారులే నమ్మకముగా ఉన్నవారికి ఎంతో గొప్ప ఈవులు ఇస్తే పరలోకపు తండ్రి ఇంక ఎంత ఉన్నతమైన బహుమానమిస్తాడో గదా! ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మిమ్మును చెరలో వేయించబోతున్నాడు. పది దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. -ప్రక.2:10.
ఆత్మఫలము ఎందుకు ఫలించాలంటే - మనలో ఫలించిన ఈ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వీకము ఆశానిగ్రహమును లోకము చూసినప్పుడు దానిని ఆస్వాదించి ఇంత నమ్మకముగా నేను ఉండాలి అనే ఆశ మొదలౌతుంది. ఈ ఫలములో ఉన్న విత్తనము దేవుని వాక్యమే. వాక్యమైయున్న ఆ విత్తనము ఒకనాటికి మొలిచి నూరంతలుగా అరువదంతలుగా ముప్పదంతలుగా ఫలిస్తుంది. దేవుడు మహిమ పరచబడతాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. బహుగా ఫలించి అనేకులకు ఆశీర్వాదముగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256