ప్రార్థన

దేవుని యందు భయము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. - కీర్తనలు 34:7.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఆయన దూత కావలి యుండి వారిని రక్షించును. దేవుని దూత అంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువే. తాను ఈ లోకములోనికి నరావతారునిగా రాక మునుపు అనేకసార్లు దేవుని దూతలా వచ్చి దైవజనులను ధైర్యపరచి నడిపించిన విధానము పాత నిబంధనలో అనేకసార్లు చూడవచ్చు. దైవభక్తుల చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఏ అపాయము కలుగకుండా కాపాడుతాడు.
దేవుని యందు భయభక్తులు ఉంటే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. ఆయన మాటలకు లోబడతారు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. ఆయనను మాత్రమే సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తారు. అట్టి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు. భద్రపరుస్తాడు.
అయితే ఈ లోక భయమున్న వారి చుట్టూ ఈ లోకాధికారి చుట్టుముట్టి, భయాన్ని పెంచి మరణానికి గురి చేస్తాడు. అనేక మంది లోక భయాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. సాతానుడు చుట్టుముట్టితే అంధకారమే. ఏ దిక్కూ తోచదు. ఏ మంచి మార్గమూ కనబడదు. ఏమి చేయాలో పాలుపోదు. చివరకు ప్రాణాలు తీసివేసుకుంటాడు.
అసలు ఏ భయము మనలో ఉంది. దేవుని యందా లేక లోకమందా? ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి? ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ జబ్బు ఎలా తగ్గుతుంది అనే భయాలు కొన్నియైతే, చేసిన తప్పులను గురించిన భయాలు కొన్ని. దేవుని యందు భయము లేనివారు ఏదో ఒక తప్పు చేస్తారు. వారికి ఒక క్రమముండదు. కనుక అక్రమమే చేస్తారు. చేసిన తరువాత అర్థమవుతుంది అది తప్పని. ఆ తప్పుల భయం మనుష్యులను వేధిస్తుంది. ఆ భయం నరకప్రాయమే.
కావున యెహోవాను ఆశ్రయించుటయే ధన్యత. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదము. దీనిని ఎవరి జీవితములో వారనుభవించాల్సిందే. తేనె తీపి గురించి అనేక పుస్తకాలు చదివి ఉండవచ్చు. అనేక ఉపన్యాసాలు విని ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక చుక్క తేనె నాలుకను తాకుతుందో అప్పుడే ఆ రుచి తెలుస్తుంది. కనుక యెహోవాను ఆశ్రయించినప్పుడే ఆయన కాపుదల మనకు తెలుస్తుంది. దేవుడు ఉత్తముడని అర్థవౌతుంది. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని అర్థవౌతుంది.
కానీ మానవ బలహీనతను బట్టి సృష్టికర్తను ఆశ్రయించక, తమ సొంత బలాన్ని నమ్ముకుంటారు. ఇతరుల బలాన్ని ఆశ్రయిస్తారు. మనము చూస్తున్నాము. మనుష్యులు వారి చుట్టూ బలాఢ్యులను పెట్టుకొని ధైర్యంగా ఉన్నామనుకుంటారు. అయితే ఆ కాపలా కాస్తున్నవారే ఒక్కొక్కసారి వారికి శత్రువు లవ్వొచ్చు. కానీ దేవుని కాపుదల చాలా బలమైనది. మరణాన్ని గెల్చిన శక్తి గల ప్రభువు మన కాపరిగా ఉంటే ఇంకా ఈ లోకములో ఏ శక్తికి మనము భయపడనవసరము లేదు.
దేవునికి భయపడేవారు ఆయన మాటలు వింటారు. ఆయన ఆజ్ఞలు పాటిస్తారు. వారికి అవమానము కలుగనేరదు. ఆయన మాటలు బ్రతికిస్తాయి. చేయకూడని పని చేయము. వెళ్లకూడని స్థలాలకు వెళ్లము. కాబట్టి మన ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. వ్యసనముల చేత నీరై పోయిన ప్రాణం దేవుని మాటల చేత స్థిరపరచబడుతోంది. దేవుని మాటలు మనలను సిగ్గుపడనియ్యవు. సిగ్గుతో తలదాచుకోవాల్సిన పని లేదు. దేవుని మాటలు మనకు నెమ్మది కలుగజేస్తాయి. దేవుని మాటలు శత్రువుకు మించిన జ్ఞానము మనకు కలుగజేస్తాయి. మన శత్రువు సాతానే. వాడి శక్తిని వాడి జ్ఞానమును మానవులెవరూ ఎదుర్కోలేరు. మన సొంత శక్తి ఏ మాత్రము పనికిరాదు జాగ్రత్త. దేవుని జ్ఞానము దేవుని శక్తి కావాల్సిందే. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు వినే వారిలో ఆయన జ్ఞానము శక్తి నిండుగా ఉంటాయి. దావీదు తన నిజ జీవితములో దేవుని శక్తిని బలాన్ని కాపుదలను భద్రతను అనుభవించాడు. ఎన్నో మారులు పడిపోయి తిరిగి ప్రభువు మాటలను బట్టి నిలువబడ్డాడు. గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.
ఆయన యందు భయభక్తులున్న వారికి ఏ కొదువా ఉండదు. అనేకులు ఈ ఆశీర్వాదము పొందుకున్నారు. అంతేకాదు వారి పిల్లలకు కూడా ఏ కొదవ ఉండనీయడు.
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ యుండదు. - కీర్తనలు 34:10.
గొప్ప గొప్పవారు కొన్ని అననుకూల పరిస్థితిలో లేమిలో ఉండి ఆకలి గొని ఉండవచ్చు కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. 23వ కీర్తనలో చూసినట్లయితే అవసరమైతే శత్రువుల ఎదుట కూడా భోజనము సిద్ధపరచే దేవుడు మన దేవుడు.
అసలు దేవుని భయమంటే ఏమిటి?
పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైన నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైన ఉన్నాడా? చెడ్డమాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము. - కీర్తన 34:11-14.
దీని ప్రకారము దేవుని యందలి భయమంటే చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా పెదవులను కాచుకొనవలయును.
ఇక నాలుక విషయానికి వస్తే మనకు తెలియనిదేముంది. నాలుక అగ్నియేనని యాకోబు తాను వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయములో వివరించాడు. ఒక్క మాటను అదుపులో ఉంచగలిగినవాడు సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడని వ్రాయబడి ఉంది. అంటే మన జీవితములో నాలుక ఎంత ముఖ్యమైనదో అర్థవౌతుంది. ఎవడైన తన మాటను అదుపు చేసుకోగలిగితే అట్టి వానిలో ఏ లోపము ఉండదని వాక్యం సెలవిస్తుంది. నాలుక చిన్న అవయవమే గానీ బహుగా అదిరిపడుతుంది. మాటలు కోటలు దాటుతాయనే సామెత ఎంతైనా సత్యమే. ఎన్ని కోతలు కోస్తుందో? వాళ్లనే మనం కోతలరాయుళ్లంటాము. చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని తగులబెట్టగలదు. అలానే ఒక చిన్న మాట కుటుంబాల మధ్య, సంఘాల మధ్య ఊళ్ల మధ్య చివరకు దేశాల మధ్య కూడా తగవులు పెట్టి యుద్ధాల వరకు తీసుకెళ్లగలదు. అసలు ఈ యుద్ధానికి కారణమైన ఆ మొదటి మాటలో ఎంత సత్యముందో లేదో ఎవరికీ తెలియదు. అందుకే ప్రభువు అంటాడు క్షమించమని. కోపతాపాలు మాని క్షమించగలిగితే ఎంత నెమ్మది సంతోషాలుంటాయో. అందుకే దేవుని మాట జీవపు మూట. దేవుని నోట నుండి వచ్చే మాటలు మనలను బ్రతికిస్తాయి. దీవిస్తాయి. మంచి మార్గాన్ని చూయిస్తాయి.
చిన్న మాటలు ఒక్కొక్కసారి స్నేహితుల మధ్య సొంతవారి మధ్య పందెములుగా మారి ఎంత పెద్ద గొడవలుగా మారతాయో. అంతేకాదు. చాలా నష్టాన్ని కలుగజేస్తాయి. ఇక కొంతమంది మాట్లాడుట మొదలుపెట్టితే ఎదుటివారి సంగతి కూడా పట్టించుకోరు. వారికేమైనా అత్యవసరమైన పనులున్నాయా? ఎక్కడికైనా వెళ్లాలా? ఇవి ఏమీ పట్టవు. అయితే బైబిల్ చెబుతున్న మాట విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడని. - సామెతలు 10:19.
అంతేకాదు విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కుమాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అని ప్రసంగి 5:3లో తెలియజేయబడినది.
జ్ఞానుల నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. అయితే బుద్ధిహీనుని నోరు వానినే మ్రింగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకపోయిన బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుతారట. ఇదీ సంగతి. దీనినిబట్టి నోటిని నాలుకను ఎంత భద్రముగా ఉంచుకోవలయునో అర్థవౌతుంది. కానీ ఇష్టమొచ్చినట్లు వాడి లేనిపోని కష్టాలలో పడతారు.
అసలు మాటల విషయములో యేసు ప్రభువు చెప్పిన మాట మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెనని. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునదని. -మత్తయి 5:37.
గమనించాలి. దుష్టుడు మన నోటికి ఎంత దగ్గరగా ఉంటాడో, హృదయము దేనితో నిండి ఉంటుందో దానినే పైకి మాట్లాడుతారట. అంటే హృదయానికీ దగ్గరగా ఉంటాడు. అంటే హృదయాన్ని దేవుని మాటలతో నింపాలి, లేకపోతే సాతానుడు మన హృదయాన్ని కూడా వాడి అనవసరమైన ఆలోచనలు, మాటలు పుట్టిస్తాడు, సమస్యలు తెచ్చి పెడతాడు.
వాస్తవానికి నోటిని నాలుకను భద్రము చేసుకోవటమే దైవ భయము. దేవుని యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. అంతేకాదు దీర్ఘాయువు కూడా ఉంటుంది. ఈ రహస్యాన్ని ఎరిగిన దావీదు మనకు చెప్పకనే చెబుతున్నాడు. ‘నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండునని’ నిత్యము దేవుని కీర్తి మన నోట ఉంటే, ఇక వేరే మాటలు వచ్చే అవకాశమే లేదు. అయితే దేవుని కీర్తి ఉంటుంది లేకపోతే దేవుని పోలికగా పుట్టిన మానవుని దీవించుచు క్షమించుచు సమాధానముగా ఉండవచ్చు.
దేవుని భయములో సగము నోటిని మాటను కాచుకోవటము, రెండవ భాగము కీడు చేయుట మాని మేలు చేయాలి. సమాధానము వెదకి వెంటాడాలి. కొంతమంది సగములోనే ఆగిపోతారు. నేను కీడు చేయుట లేదు. తప్పు చేయుట లేదు. చెడు చేయుట లేదు కాబట్టి మంచిగానే ఉన్నామని అంతవరకు తృప్తిగా ఉంటారు. మేలు చేయుట మొదలుపెట్టాలి. సమాధానము వెదకి వెంటాడాలి.
చేయకూడనిది చేయుట పాపము
చేయగలిగినది చేయకుండుట పాపము
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు - సామెతలు 8:13.
దేవుని యందు భయభక్తులు గలవారికి దీర్ఘాయువు. జ్ఞానము, దేవుని దూత కాపలా ఏ కొదువలేని జీవితముంటాయి. అంతేకాదు లోక భయముండదు.
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయము లన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను - సామెతలు 34:4.
అంతేకాదు మన ప్రార్థనలు ఆలకిస్తాడు.
ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమ లన్నిటిలో నుండి అతని రక్షించెను. రక్షించటమే కాదు జీవితాన్ని స్థిరపరుస్తాడు.
దేవుని భయము లేనివారు వారిష్టమొచ్చినట్లు వారు మాట్లాడి వచ్చే పరిణామాల వల్ల భయముతోనే జీవిస్తుంటారు. దేనికి భయపడుతున్నావో దాని శక్తి గొప్పదని నమ్ముతున్నావన్నమాట. అంటే లోకానికి దేవుని కంటె ఎక్కువ శక్తి ఉందని, మనుషులకు దేవునికంటె ఎక్కువ శక్తి ఉందని, జంతువులకు ఎక్కువ శక్తి ఉందని నమ్ముచున్నావన్న మాట. జాగ్రత్త! సర్వసృష్టి కర్తకు భయపడి నోటిని నాలుకను అదుపులో ఉంచుకుంటే అది ఆశీర్వాదము, లేదా లోక భయము మనలను ఇంకా భయపెట్టి మరణ ద్వారము చూపిస్తుంది. దేవుని భయము మనలను ధైర్యపరచి నిత్య జీవానికి నడిపిస్తుంది.
లోక భయము భయాన్ని పెంచుతూనే ఉంటుంది. కానీ దేవుని భయం ధైర్యాన్ని శక్తిని బలాన్నిస్తుంది. ఆ ధైర్యంతోనే దావీదు యుద్ధ ప్రావీణ్యుడైన గొల్యాతును సంహరించగలిగాడు. తన దేశానికి గొప్ప జయము సంపాదించి చివరకు రాజు అయ్యాడు. సౌలు రాజేమో భయపడి రాజరికాన్ని కోల్పోయాడు. వాస్తవానికి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని బలమెక్కడ? ఆరు మూరల జానెడు ఎత్తుగల గొల్యాతు ఎక్కడ? మనుష్యులతో పోలిస్తే గొల్యాతు గొప్పవాడే కానీ గొప్ప దేవుని ముందు ఒక గడ్డిపువ్వు లాంటి వాడే అని గమనించాలి. అంతేకాదు కొన్ని సమస్యలు కూడా ఎంతో పెద్దవిగా కనపడుతుంటాయి. లోకానికి భయపడే వారికి ఆ సమస్యలు గొల్యాతులా కనపడతాయి. సాతానుడు భూతద్దం ఇచ్చి వాటిని ఇంకా పెద్దవిగా చూయిస్తాడు. దేవుని యందలి భయము వల్ల వచ్చే జ్ఞానమును బట్టి చూస్తే అసలు అది పెద్ద సమస్య కానే కాదు, గడ్డిపువ్వు లాంటిదిగానే ఉంటుంది. గమనించాలి. దేవుని భయము వలన జ్ఞానము బలము శక్తి కూడా వస్తుంది.
దైవ భయము లేనివారు చివరకు దేవుని విషయములో కూడా పలుకకూడని మాటలు పలుకుతారట. బహు గర్వపు మాటలు పలుకుతారట. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్థిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మాట్లాడుతారని మలాకీ 3:13-15లో చెప్పబడి ఉంది.
అంతేకాదు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలానుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఈ ప్రవచనము మలాకీ 3:16లో వ్రాయబడి ఉంది.
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సముఖము నందున్న గ్రంథములో మన పేర్లు కూడా వ్రాయబడునట్లు, జ్ఞానవంతులముగా బలవంతులముగా శక్తిమంతులముగా జీవించునట్లు నోటిని నాలుకను అదుపులో ఉంచుకొని నిత్యము ప్రభువుని స్తుతిస్తూ, పరిశుద్ధులతో కూడి ఆయనను ఘనపరచుచు ఆయన పరిశుద్ధ నామమును గొప్ప చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.
ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకముతో నశింపజేయగల ప్రభువుకు మిక్కిలి భయపడుడి. -మత్తయి 10:28.

- మద్దు పీటర్ 9490651256