ప్రసాదం

శ్రీరాముని రాజధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదులు పర్వతాలు ఉండే పర్యంతం రామాయణ కావ్యం ఉంటుందని, రామకథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామ, అయనం రామాయణం. అంటే రాముని ప్రయాణం. రాముని మార్గమంతా, ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం. ప్రజాహితం. జాతి హితం. ధర్మనిష్ఠని కార్యదీక్షని తను తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. అందుకే రాజ్యం ‘రామరాజ్యం’ కావాలన్నాడు మహాత్మాగాంధీజీ. పైగా ఈనాడు అంతా ‘రామరాజ్యం’ కావాలి అంటుండడం మనం వింటుంటాం, కంటుంటాం. కలలు కంటుంటాం. అదీ రామాయణం విశిష్టత. అదీ రాముని పరిపాలనా ప్రత్యేకత. అదే.. ‘రామరాజ్యం’ పరమోత్కృష్టత.
అంతటి రాజనీతిజ్ఞత రామునిది. ఇక్ష్వాకుల వంశానిది. ఉత్తమోత్తమ రాజనీతిజ్ఞతతో, ధర్మాన్ని అడుగడుగునా, అణువణువునా పాటిస్తూ ప్రజాహితంగా, ప్రజామోదంగా పరిపాలన అందించిన పరిపూర్ణ ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. అందుకే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడ్ని కొలుస్తున్నాం. కొనియాడుతున్నాం. ‘రామరాజ్యం’ అని వేనోళ్ళ పొగడుతున్నాం. పొగుడుకుంటున్నాం.
పితృవాక్య పరిపాలనకోసం శ్రీరాముడు వనవాసానికి కొచ్చేడు. భరతుడు రాముడిని వెదుక్కుంటూ మందీ మార్బలంతో, పరివారంతో రాముడ్ని కలవడానికి వస్తాడు. భరతుడు రాముడు కలుసుకుంటారు. ఆ సందర్భంలో- భరతుడు రాజు కాబట్టి రాజనీతిజ్ఞతని, ఎన్నో రాజధర్మాలని శ్రీరాముడు భరతునికి చెప్తాడు.
రాముడు భరతునికి వివరించిన ఆ రాజ ధర్మాలను ఓసారి పరిశీలిద్దాం. రాజధర్మాను అవగతం చేసుకుందాం. రాముని రాజనీతిజ్ఞతను తెలుసుకుందాం.
భరతునికి రాముడు చెప్పిన రాజధర్నాలు: రాజ్యాన్ని పాలించే రాజు- దేవుడు లేడు, పరలోకం పర జన్మ లేదు. విశృంఖలత్వంతో ఇంద్రియములు ఏ రకంగా చెబితే ఆ రకంగా భ్రష్టుడేయ్య నాస్తికత్వాన్ని విడనాడాలి. ఆడిన మాట తప్పకూడదు. అసత్యాన్ని పలకరాదు. క్రోధము విడనాడవలెను. క్రోధమువల్ల అనరాని మాటలు మాట్లాడ్డంవలన పాపము వచ్చును. పెద్దలవలన పొరపాటు సంభవించినను తొందరపడి క్రోధము, కోపం తెచ్చుకోకూడదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు. వ్యసనాలకు బానిసైపోకూడదు. అలసత్వమును వదులుకోవాలి. అంటే సోమరితనాన్ని, మందబుద్ధిగా మత్తు మత్తుగా ఉండకూడదు. తర్వాత నేను, చక్రవర్తి అనే అహంకారం ఉండకూడదు. తత్ఫలితంగా నేనే అధికుడ్ని అనుకుని జ్ఞానుల్ని, సిద్ధుల్ని దర్శించకుండా ఉండకూడదు. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే వెంటనే చేయాలి. తర్వాత్తర్వాత చేద్దామనే అశ్రద్ధ వదులుకోవాలి. రాజు ఎప్పుడూ అతి జాగరూకుడై ఉండి అప్రమత్తతతో మెలగవలెను. అప్పుడే రాచకార్యాలు సవ్యంగా సాగును. కాబట్టి మరపున కొనితెచ్చే ‘ప్రమాదము’ను వదులుకోవాలి. ఇవీ రాజు ఆచరించవలసినవి.. రాజు వదులుకోవలసినవీ. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, పైన చెప్పిన వాటిలోని అవలక్షణాలను వదులుకుని సుగుణాలతో తను పాలన సాగించాలి.
ఇక రాజ్యపాలనలో చేయాల్సి ఇతర అంశాలు పరిశీలిద్దాం-
రాజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు మంచిని దృష్టిలో పెట్టుకునే ఉండాలి. ప్రజలమీద ఎనలేని భారాన్ని మోపే అధికమైన పన్నులు వేసి, ప్రజలను పీడనకు గురిచేయకూడదు. రాజు యజ్ఞయాగాదులు చేసి దేవ, పితృ, రుషి రుణాలను తీర్చుకోవాలి. గురువులను మహర్షులను ఆచార్యులను, పెద్దలను పూజించాలి. గౌరవించాలి. రాజ్యములోనున్న దీనుల, హీనుల, అనాథల, అన్నార్తుల, వృద్ధుల యోగక్షేమములు చూస్తూ మెలగాలి. అలా మెలగటం రాజధర్మం. తల్లిదండ్రుల్ని, ప్రజల్నీ ప్రేమతో చూసుకోవాలి. సదాచార సంపన్నత, సత్ప్రవర్తన లోకహితం గావించేవారిని పురోహితులుగా నియమించి యజ్ఞ హోమ ఆధ్యాత్మిక కర్మలు జరిగితే చూడాలి.
బుద్ధి కుశలతలోను ఆలోచన శక్తిలోను ఉన్నతంగా ఉండేవారిని, తనతో సమానమైన వారిని, పరాక్రమంలో, రాజుకి తగ్గ జోడి అయ్యేటటువంటి యోధులైనవారిని మంత్రులుగా నియమించాలి. విశ్వసనీయతగలవారిని మాత్రమే మంత్రాంగం చేసేందుకు నియమించుకోవాలి. ప్రలోభాలకు, ఆశలకు, భౌతిక సుఖలాలసకు, వ్యసనాలకు దూరంగా ఉండేవారిని, ఈ దౌర్భల్యాలకు లొంగని దృఢ మనస్తత్వం గలవారిని మాత్రమే ఉద్యోగిగా తీసుకోవాలి. అక్రమాలకి, అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడేవారిని, ధనాశాపరులను దూరంగా ఉంచాలి. ఉంచగలగాలి. అక్రమార్కుల్ని, నేరస్థుల్ని, చెడ్డవాళ్ళను, నేరం రుజువు అయిన తర్వాత మాత్రమే శిక్షించాలి. తప్పులు చేయని, దుర్మార్గులు కాని నిరపరాధులు ఒక్కరైనా శిక్షింపబడకూడదు. ఆ రకంగా నిరపరాధుల్ని శిక్షిస్తే దారిద్య్రం కలుగుతుంది. ఉద్యోగులకు, మంత్రులకు వారు చేసే విధులన్నీ వారికి నిర్దేశించాలి. నిర్దేశించి వారు వారికి అప్పగించిన విధులు, బాధ్యతలు సరిగా సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి. రాజు ఎల్లప్పుడు ప్రజలకు అనువుగా అందుబాటులో ఉండాలి.
నిజాయితీ స్వచ్ఛత ఉన్నవారినే, దేశ రక్షణకు బాగా పాటుపడే సేనాపతులుగా, సంబంధిత మంత్రులుగా నియమించి, దేశ రక్షణ పటిష్టంగా, భద్రంగా ఉండేలా చూసుకోవాలి. శత్రువుల, శత్రురాజుల జాడల్ని, ఎత్తుగడల్ని పసికట్టేందుకు చారుల్ని, గూఢచారుల్ని ఏర్పాటుచేసుకోవాలి. దేశభక్తిపరులను, జన్మభూమిమీద నిబద్ధత కలిగినవారినే రాయబారులుగా, ఇతర రాజ్యాలకు నియమించుకోవాలి. అన్నివర్ణములవారు వారి వారి విధుల్ని, ధర్మాల్ని ఆచరించేలా నడిపించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులందరూ ధర్మబద్ధులై ఉండేలా సత్యవర్తనులై ఉండాలి. అలా వారంతా రుజుమార్గంలో ఉంటూ ప్రజలను ధర్మపథంలో, సత్యమార్గంలో నడిచేలా చూడాలి. ప్రజలను నడిపించేలా చేయాలి. ప్రజల అభిమానాన్ని, ఆదరణని తన పరిపాలనా విధులతో విధానాలతో రాజు పొందగలగాలి. ఇవీ సంక్షిప్తంగా శ్రీరాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు. రాజనీతిజ్ఞతలు. ఈ విధులను, విధానాలను, ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతల్ని రాజు అనేవాడు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఆచరించాలి. అమలుచేయాలి. అమలు అయ్యేలా చూడాలి. ఆచరణలో రాజు సఫలీకృతుడు కావాలి. రాజ్యం సుభిక్షం కావాలి. సౌఖ్యవంతం కావాలి. సమృద్ధివంతం కావాలి. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభోగ్యాలతో సిరిసంపదలతో తులతూగాలి. రామరాజ్యం నేపథ్యంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పాలకులు సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడే శ్రీరాముడు అందించిన అసలు సిసలైన రామరాజ్యం మళ్లీ ఆవిష్కృతమవుతుంది.
*