అక్షర

ప్రశంస, విమర్శల కలబోత టాలుస్టాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలుస్టాయిపై సమగ్ర పరిశీలనం
టాలుస్టాయి జీవితమూ, సాహిత్యమూ
సంపాదకత్వం: రంగనాయకమ్మ
వెల: రు.100/-
పుటలు: 306
ప్రచురణ: ప్రగతి ప్రచురణలు,
హైదరాబాద్ 500 033
లభ్యం: నవోదయ బుక్ హౌస్,
హైదరాబాద్

రష్యన్లకు తోల్‌స్తోయ్ అయినా, ఆంగ్ల ఉచ్ఛారణతో పల్కే భారతీయులకు అతడెప్పుడూ టాల్‌స్టాయే. ఈ పుస్తకంలో ఐదు భాగాలున్నాయి. మొదటిది మహీధర రామమోహనరావు రాసిన టాల్‌స్టాయ్ జీవితం, రెండవ భాగంలో టాల్‌స్టాయ్‌ను గురించి లెనిన్ రాసిన వ్యాసాలు, మూడవ భాగంలో టాల్‌స్టాయ్ రాసిన పది కథలున్నాయి. వాటిల్లో ఏడు కథలను భమిడిపాటి కామేశ్వరరావు అనువదిస్తే మిగిలిన మూడింటిని మహీధర జగన్మోహనరావు, ఉప్పల లక్ష్మణరావు, ముక్తవరం పార్ధసారధి అనువదించారు. నాల్గవ భాగంలో ముక్తవరం పార్ధసారధి రాసిన టాల్‌స్టాయ్ రచనల పరిచయాలు ఉన్నాయి. ఐదవ భాగంలో టాల్‌స్టాయ్ నవలల్లో రెండింటికి రంగనాయకమ్మ రాసిన పరిచయాలు ఉన్నాయి.
మాస్కోకు 130 మైళ్ల దూరంలో వున్న తూలా నగరం సమీపంలోని, ‘యాస్నయా పోలియానా’ గ్రామ జమిందారు ఇంట 1828 ఆగస్టు 28న లియో టాల్‌స్టాయ్ జన్మించాడు. బాల్యంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అందరి జమిందారీ బిడ్డల్లాగానే అతి గారాబంగా పెరిగాడు. మాస్కోలో చదువయ్యాక, కాజాన్ విశ్వవిద్యాలయంలో కళాశాల చదువు కొనసాగించాడు. చదువై ఇంటికి తిరిగొచ్చిన టాల్‌స్టాయ్ బానిసల పరతంత్రపు బతుకులపట్ల కరుణా తరంగితుడవుతాడు. వారి పరాధీనత్వం పోగొట్టాలని భావించినా కుదరలేదు. అలాగే తన ఆస్తినీ విడనాడాలని భావించినా పడదు. తన రచనల మీద డబ్బు సంపాదించాలని అతడు కోరుకోలేదు. టాల్‌స్టాయ్ రచనలు, తత్త్వానే్వషణ, దైవ విశ్వాసం, ప్రభుత్వ నిర్బంధాల గురించి విపులంగా రాశారు మహీధర. టాల్‌స్టాయ్ 1910 నవంబర్ 20న మరణించాడు.
టాల్‌స్టాయ్ రచనలు రైతుల సామూహిక ఉద్యమ బలం-బలహీనత, శక్తి-పరిమితులను వ్యక్తం చేస్తాయని, ప్రభుత్వం, అధికారికి మత వ్యవస్థపట్లా టాల్‌స్టాయ్ నిరసన గురించి లెనిన్ రాస్తాడు.అతడు వదిలిపోయిన సాహిత్యం గతకాలానికే కాదు భవిష్యత్తుకు కూడ చెందిందని అంటాడు. టాల్‌స్టాయ్ రచనలు, సిద్ధాంతాలు, ఆలోచనా విధానంలో అంతర్వైరుధ్యాల గురించీ ప్రస్తావించాడు. వాటి కారణంగా టాల్‌స్టాయ్‌కి కార్మికవర్గ ఉద్యమం, సోషలిజం కోసమైన పోరాటంలో ఆ వర్గ పాత్రను, రష్యను విప్లవాన్ని అర్ధం చేసుకోవడం అసంభవం. మానవ జాతి మోక్షానికి కొత్త చిట్కాలు కనిపెట్టిన ప్రవక్తగా టాల్‌స్టాయ్ పరిహాసాస్పదుడు ఇలా లెనిన్ రాసిన ఐదు వ్యాసాల్లో టాల్‌స్టాయ్‌పై ప్రశంసలు, అభిశంసలు ఉన్నాయి.
మూడవ భాగంలోని ప్రతి అనువాద కథ తర్వతా సంపాదకురాలి విమర్శ ఉంది. ‘విందు తర్వాత’ ఉత్తమ కథ. ఆ కథ తర్వాత, తను జానకి విముక్తి నవలలో ఆ కథ గురించి చేసిన ప్రస్తావనను ఉటంకించారు సంపాదకులు. ‘ఖరీదయిన ఖైదీ’ గమ్మత్తయిన కథ. కథ విశే్లషణలో ‘దోచే వర్గంలో, పోరాటం హింస అవదని టాల్‌స్టాయి అర్ధం చేసుకోలేదు. టాల్‌స్టాయి సిద్ధాంతం మీద లెనిన్ చీవాట్లు పెట్టింది అందుకనే’ అంటారు రంగనాయకమ్మ.టాల్‌స్టాయ్ కథలు చాలావరకు అతడి ఆస్తికతనే ఫ్రదర్శిస్తాయి. ఆ మూలంతోనే విభేదించే సంపాదకురాలు ఆ మూలానే్న చీల్చి చెండాడినంత మాత్రాన కథలోని గొప్పదనం పోదు. రాసిన కథను విమర్శంచవచ్చు గానీ రచయిత కథను ఫలానా విధంగా రాయాలని నిర్దేశించడం సరైన పని కాదు.
నాల్గవ భాగంలో ముక్తవరం పార్ధసారధి రాసిన టాల్‌స్టాయ్ రచనల పరిచయాల తర్వాత వాటితో సంపాదకురాలి విమర్శ చేర్చడానికి అనుమతించారు ముక్తవరం. చివరగా టాల్‌స్టాయ్ రాసిన నవలల్లో రెండింటిని-అనాకెరీనినా (1877) గురించి విపులంగాను, నవ జీవనం (1899) గురించి రేఖామాత్రంగాను-రంగనాయకమ్మ పరిచయం చేసారు. ఆ నవలలపై తన అభిప్రాయాలనూ జోడించారు.
‘నికోలస్ తాతియానానే పెండ్లి చేసుకోగోరేడు. కాని ఆమె, తన తల్లిదండ్రుల దారిద్య్రమును తలపోసి, తన తోడి వివాహము నికొలస్ కార్యాభివృద్ధికి భంగకరం-అని నిశ్చయించెను’(8.పే) లాంటి మహీధర వాక్యాలు గ్రాంథిక, వ్యావహారిక భాషల సంధి కాలంలో రాసినవి కనుక, తను అనుకోకుండానే అలా వచ్చాయి. అలానే, ‘ప్రపంచం అంతా తమబోటి ధనవంతుల సుఖ విలాసాలకే సృష్టించబడ్డట్టు నేర్పబడ్డాడు’ అన్న మహీధర వాక్యంపై కామెంట్ చేస్తూ, ‘ఇంత చిన్న పదాల్లో (వాక్యాల్లో) రెండు ‘బడు’ క్రియలు! ఇలాంటి ‘బడు’ వాక్యాలు అనేకచోట్ల కనపడతాయి’’ (9.పే) అని సంపాదకురాలు రాశారు. అందుకు కారణం మహీధర ఆ రచనను మరో పుస్తకంనుండి అనువదించడమై ఉంటుంది. కర్మణి ప్రయోగం ఆంగ్లంలో సహజమైనా, తెలుగులో అది వికారంగా ఉంటుందనే వాస్తవం మహీధరకు తెలియకుండా ఉండదు. తను రాసిన కొల్లాయి గట్టితేనేమి? లో అలాంటి ప్రయోగాలు కనిపించవు. లెనిన్ వ్యాసాల అనువాదం సులభ గ్రాహంగా లేదు. గ్రంథంలో ఫుట్‌నోట్‌లు అధికమై పాఠకుడు చదువుకొనడంలో ఇబ్బంది కలిగించే ఆస్కారముంది. పండితుల పరిశీలన కోసం రాసే పరిశోధనా వ్యాసంలో వాటి అవసరం ఉంటుంది కానీ, పండితులనూ, సామాన్యులనూ ఉద్దేశించి రాసే ఇలాంటి పుస్తకాలలో ప్రతి చిన్న విషయానికీ వివరణ ఇవ్వడం అనవసరమేమోననిపిస్తుంది. చివరగా రంగనాయకమ్మ ప్రగతి ప్రచురణల గురించి చెప్పారు. ‘ఈ ప్రచురణలను వీలైనంత తక్కువ ధరకు ఇవ్వాలనేది మా ఉద్దేశం’ అన్నారు. అది పుస్తకం కొని చదివే అలవాటుకు దోహదం చేసే చర్య. ముదావహమైన విషయం. వారు ఇలాంటి మరిన్ని పుస్తకాలను వెలుగులోకి తెస్తారని ఆశిస్తూ...

-కాకాని చక్రపాణి