అమృత వర్షిణి

సంగీత లోకానికి వెలుగు దివ్వెలు (అమృతవర్షణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలుపు తీయగానే సోదరులిద్దరినీ చూసి అన్నగారైన వెంగు భాగవతార్ నిశే్చష్టుడై ‘ఏరా! ఏమైంది?’ అని గట్టిగా అడిగాడు. త్యాగరాజ స్వామి వద్ద బుద్ధిగా సంగీతం నేర్చుకుని పైకొస్తారనుకున్న కృష్ణన్, సుందరంలు కనిపించగానే నిర్ఘాంతపోయి ‘ఏం? మాట్లాడరే!’ అని గద్దించినా వౌనమే సమాధానమయ్యింది. ముఖం చాటేసుకుని సోదరులిద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయారు.
* * *
ఉమయాల్పురం తిరువయ్యారుకు అతి సమీపంలో వున్న ఓ చిన్న గ్రామం. శ్రీనివాసయ్యర్, అలమేలు దంపతులకు ఎనిమిది మంది సంతానంలో వెంగు భాగవతార్ పెద్దవాడు. ఆయన్ని వెంకట రమణ అని కూడా పిలుస్తారు.
తమిళం, సంస్కృత భాషల్లో అపారమైన ప్రజ్ఞా ప్రాభవాలు కలిగి, అనర్గళంగా ప్రవచనాలు ఇవ్వగల సమర్థుడు. సంగీతంపై ఎంతో మక్కువ. సద్గురు త్యాగరాజ స్వామిపై విశేషమైన గౌరవం, ఒక్కటే కాదు. భక్తి వేదాంత వైరాగ్య విషయాలపై ఉభయులూ చర్చించుకుంటూ వుండేవారు.
వెంకటరమణ ఏడాదిలో 6 మాసాల పాటు తిరువయ్యారులోనే ఉండి త్యాగయ్య సన్నిధిలో రామాయణ ప్రవచనం చేస్తూండేవాడు. రామభక్తుడైన త్యాగయ్య, వెంకటరమణ పాండిత్యాన్ని, ప్రవచన వైభవాన్ని ప్రశంసిస్తూ ఉండేవాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటంతో, శ్రుతి లయ జ్ఞానం కలిగి సంగీతాభిరుచి కలిగిన తన సోదరులైన సుందరం, కృష్ణన్‌లకు సంగీత భిక్ష పెట్టమని కోరాడు వెంగు భాగవతార్. త్యాగయ్య సరేనని పంపమన్నాడు.
అప్పుడు కృష్ణన్ వయస్సు 11 ఏళ్లు. సుందరం వయస్సు తొమ్మిది. వెంగు భాగవతార్ ఆనందానికి అవధుల్లేవు.
1839 సం. ఏప్రియల్‌లో త్యాగయ్య కంచి యాత్రకు బయలుదేరి అక్టోబర్ మాసంలో తిరిగి రాగానే ‘ఈ ఇద్దరు సోదరులకు’ సంగీత శిక్షణ ప్రారంభించాలని సంకల్పించాడు.
తన శిష్యులలో సీనియర్ జగద్రక్షక భాగవతార్‌కు ఇద్దరినీ అప్పగించాడు. ఆరు మాసాల పాటు శిక్షణ సాగింది.
సుందరం, కృష్ణన్ కలిసి నేర్చుకున్న మొదటి త్యాగరాజ కీర్తన ‘ఈశ మనోహరి’ రాగంలోని ‘జానకీ మనోహర’.
త్యాగయ్యకు ‘సద్గురువు’ అనే పేరు రావటానికి కొన్ని కారణాలున్నాయి. ఆషామాషీగా వుండేది కాదు ఆయన శిక్షణ. ఎవరెవరు ఎంతసేపు సాధికం చేయాలో, ఏయే శిష్యులు ఎవరెవరి దగ్గర కూర్చుని పాఠాలు వల్లించాలో, మొదలైనవన్నీ ఒక పక్కా ప్రణాళికతోనే వుండేవి. పైగా త్యాగయ్య ఎప్పుడూ తన శిష్యులలో కొందరు ప్రధాన శిష్యులకు తప్ప, మిగతా వారికి అసలు కనిపించటమే తక్కువ.
ఆయన పూజా కార్యక్రమాలను దూరంగా కూర్చుని తిలకించటమే తప్ప, ఎదురుబడి ఎవరుబడితే వారు సంభాషించటం చాలా అరుదు.
ఆయనకు ఒక్కోసారి శిష్యుల పేర్లు కూడా తెలిసేవి కావు. ఆశ్చర్యమేమంటే, ఏణ్ణర్ధంగా ప్రతిరోజూ ఉదయం పూజా సమయానికి, తులసీదళాలను తెచ్చే బాధ్యత వాలాజీపేట వెంకటరమణ భాగవతార్‌దన్న సంగతి వెంకటరమణకి జ్వరం రావడం వల్ల ఆవేళ తులసీ దళాలు కనిపించకపోయేసరికి వివరాలు అడిగితేనే త్యాగయ్యకు తెలిసింది.
త్యాగయ్య క్రమశిక్షణ, సాధనా పద్ధతులకు భయపడి చెప్పాపెట్టకుండా ఓ రాత్రి స్వగ్రామానికి వెళ్లిపోయారు, సుందరం, కృష్ణన్ సోదరులు. విషయం తెలిసిన త్యాగయ్య ఖంగారుగా ఈ సోదరుల కోసం తానే స్వయంగా ఉమయాల్పురం వెళ్లి వెంగూ భాగవతార్ తలుపు తట్టాడు. దీంతో వెంగూ భాగవతార్ ఆశ్చర్యపడి జరిగిన సంగతి తెలుసుకుని నచ్చజెప్పి మళ్లీ ‘ఈ యిద్దరినీ త్యాగయ్య’ వెంట పంపించాడు.
ప్రాప్తమున్నచోట ఫలం దక్కకుండా పోతుందా? అంతే. అలా గురువును చేరిన సోదరులు 80వ ఏట త్యాగయ్య సమాధి పొందే వరకూ ఆయనతోనే ఉండిపోయారు. యుగళ గానం వీరిద్దరితోనే త్యాగయ్య ఆరంభించి దానికి తగ్గట్టుగా శిక్షణనిచ్చారు.
త్యాగరాజ కీర్తనలు లోకంలో విస్తృతంగా ప్రచారమవ్వటానికి ఈ ఉమయాల్పురం శిష్య పరంపర ప్రధాన కారణమైతే, వాలాజిపేట, తిల్లస్థానం శిష్య పరంపర కూడా వీరికి తోడైంది.
ఇద్దరేసి శిష్యులకు పాఠం చెప్పి శుద్ధంగా పాడించే ప్రయత్నంలో త్యాగరాజు 120 జోడీలను (డ్యూయెట్ సింగింగ్) తయారుచేస్తూ, ఇద్దరేసి శిష్యులకు 200 కీర్తనలు చొప్పున నేర్పినట్లు చెప్తారు - అంటే త్యాగయ్య తన జీవిత కాలంలో మొత్తం 24000 కీర్తనలు పాడి వుండి వుండాలి. కానీ కొన్ని వందల కీర్తనలే లభ్యమవడం మన దురదృష్టం కాక మరేమిటి? దొరికిన కీర్తనలు పాడి ప్రచారం చేయగలిగితే చాలు. అదే ఆయనకు మనమిచ్చే కృతజ్ఞతా పూర్వకమైన నివాళి.
త్యాగయ్య ఆఖరి రోజుల్లో తన శిష్యులందరూ తన కీర్తనలు పాడుతూంటే వినాలనే కోరిక పుట్టింది. అంతే శిష్యులందరికీ కబురు పంపారు.
ఒక్కొక్కరూ వచ్చి పాడేసి వెళుతున్నారు. వాలాజిపేట, తిల్లస్థానం, శిష్య వర్గంలో ప్రధానమైన సీనియర్ శిష్యులు కొందరు అప్పటికే గతించగా వారి శిష్య ప్రశిష్యులొక్కొక్కరే వచ్చి తమ గానంతో తమ గురువుని సంతృప్తిపరిచి వెళ్లారు. త్యాగయ్య వింటూ ఆనందబాష్పాలతో తడిసిపోయాడు. ఆ కీర్తనలన్నీ త్యాగయ్య పక్కనే ప్రత్యక్షంగా కూర్చుని విన్నవి విన్నట్టుగా ఉమయాల్పురం సుందర భాగవతార్, ఉమయాల్పురం కృష్ణ భాగవతార్ సోదర ద్వయం పదిలపరచి, ఎంతో కట్టుదిట్టంగా వాటికి స్వరం కూడా సిద్ధం చేసి పెట్టి, సంగీత లోకానికి అందించారు.
మనం వింటున్న ఈ కీర్తనలన్నీ వారి పుణ్యం వల్ల లభించినవే. అన్నమయ్యను గురించి మనవడు చిన్నన్న వల్ల తెలిసినట్లుగా, వాలాజీపేట వెంకటరమణ భాగవతార్, శిష్య వర్గం వల్ల మనకు త్యాగయ్య జీవిత విశేషాలు తెలిశాయి. మిగతా వారి వల్ల కీర్తనలు తెలిశాయి. సంగీత సద్గురువుల గొప్పతనం శిష్యుల వల్లే జగద్విదితమై ప్రకాశిస్తుంది. సంస్కారం కలిగిన శిష్యులు మాత్రమే ప్రశంసాపాత్రులౌతారనటానికి త్యాగయ్య శిష్య ప్రశిష్య వర్గమే సాక్ష్యం.
ఉమయాల్పురం వాలాజీపేట, తిల్లస్థానం శిష్య వర్గం కుంభకోణం, మద్రాసు, మైసూర్, బెంగుళూర్, ఆంధ్రప్రదేశాల్లోని శిష్యులకు విస్తారంగా చెప్పి ప్రచారం చేశారు.
1933 సం.లో వాలాజీపేట వెంకట రమణ భాగవతార్ పుత్రుడైన కృష్ణస్వామి శిష్యుడైన తిరువత్తియూర్ ఎస్.ఎ.రామస్వామి అయ్యర్ ‘త్యాగరాజ స్వామి కీర్తనలు’ కొన్ని అచ్చువేశాడు.
త్యాగరాజ విరచితమైన నౌకాచరిత్రం, ప్రహ్లాద భక్తి విజయం రూపకాలలోని కీర్తన పాఠాంతరాలను తనకు సమీపబంధువైన ప్రొ. పి.సాంబమూర్తికి స్వయంగా అందజేశాడు.
ఉమయాల్పురం సుందర భాగవతార్ మనవడైన మంజక్కుడి రామచంద్ర భాగవతార్ వద్ద త్యాగరాజ కీర్తనలు ఆరు వందల వరకూ ఉన్నాయి.
ఉమయాల్పురం సోదరుల శిష్యులలో బాగా పేరున్న మరో శిష్యుడు ఉమయాల్పురం స్వామినాథయ్యర్. మహారాజపురం విశ్వనాథయ్యర్ ఈయన శిష్యుడే. విశ్వనాథయ్యర్ సెమ్మంగుడికి గురువని అందరికీ తెలిసిన విషయమే. ఉమయాల్పురం స్వామినాథయ్యర్, 72 మేళకర్త రాగమాలికను రచించిన మహావిద్వాంసుడైన మహావైద్యనాథ శివన్ దగ్గర నాలుగేళ్లు కఠోర సాధన చేశాడు.
త్యాగయ్య శిష్య వర్గంలోని వాలాజీపేట వెంకటరమణ భాగవతార్ తిరువయ్యార్‌కు కేవలం పది మైళ్ల దూరంలో వున్న అయ్యంపేటలో ఉండేవాడు.
వెంకటరమణ భాగవతార్ కొడుకైన కృష్ణస్వామికి త్యాగరాజంటే అమితమైన భక్తి గౌరవాలుండటమే కాదు, ప్రతిరోజూ 10 త్యాగరాజ కీర్తనలు పాడుకున్న తర్వాతనే భోజనం చేసేవాడు. (పాడినవి మళ్లీ పాడకుండా).
బట్టీ పట్టేస్తే వచ్చే విద్యలు చాలా వున్నాయి. కానీ సంగీతం, అలాంటి విద్య కాదు.
ఎంతో నిగ్రహంతో అన్నకోశాన్ని అదుపులో ఉంచుకుని ప్రాణాలకు ఎలాంటి ఒడిదుడుకులూ రాకుండా జీవించే సద్గురువుల మనస్సు ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. అటువంటి మనస్సులో విజ్ఞానం సులువుగా ప్రవేశిస్తుంది.
ఆ విజ్ఞానమే పరిపక్వతను పొంది ఆనందప్రాప్తి నిస్తుంది. అప్పుడే పంచకోశాలు పంచామృతాలై పోతాయి. పంచ తత్త్వాలన్నీ పంచామృతాల్లో వున్నవే. వీటికి అధిపతి శ్రీమన్నారాయణుడే.
ఈ రహస్యం తెలిసిన వారే కాబట్టి, ఈ మహనీయులు మనకు చిరస్మరణీయులై, వంద్యనీయులై పోయారు.
త్యాగయ్య హృదయం నుంచి ఉప్పొంగిన సంగీత గంగ అలా ఎల్లలు దాటి శాఖోపశాఖలై ఎంత మందిని పునీతుల్ని చేసిందో చూశారా? అందుకే భగవద్భక్తులు, వైరాగ్య సంపన్నులు, సాధువులు, సంగీత కోవిదులు లోకంలో అందరికీ ఆప్తులే. వారందరిలో త్యాగరాజు మనకు పరమ ఆప్తుడవటం తెలుగువారు చేసుకున్న పుణ్యం కాదా?
లోకంలో గురువుకున్న స్థానం, ఇంతని చెప్పలేం. చెప్పలేనిది కూడా. అజ్ఞానాంధకారానికి గురువే భాస్కరుడై వెలుగునిచ్చి కళ్లు తెరిపిస్తాడు.
ఇండుప గింజ నీటిలోని మాలిన్యాన్ని క్షణంలో తొలగిస్తుంది. అలాగే గురువు తలుచుకుంటే శిష్యుడి హృదయంలోని మాలిన్యాన్ని తొలగించి కడిగిన ముత్యంలా మార్చేస్తాడు. అందుకే తెలివిగా త్యాగయ్య ఇలా అంటాడు.
‘‘రామా! నీ దయ నా మీద లేకుండా పోతోందే! ఇలాగైతే నీకూ, నాకూ ఋణం లేదనుకుంటారు. ఎందుకంటే నీకూ నాకూ ఋణం లేకపోవటం గానీ, ఋణం తీరిపోవటం కానీ వుండదు. చిన్నప్పటి నుంచే నా హృదయంలో తిష్ట వేసుక్కూర్చున్నావు. ఈ జన్మలో నేను చేసిన పూజలతో ప్రకాశించి నువ్వు నన్ను మరిచిపోతే నువ్వు నాకు ఋణపడి ఉన్నట్లు సుమా!’’ అంటూ అప్పిచ్చిన వాడు అప్పు పుచ్చుకున్న వాణ్ణి నిలదీసినట్లుగా ‘నీ బాకీ తీరలేదని’ డబాయిస్తాడు.
సంగీత లోకంలో విద్వాంసులంతా ఆయన కీర్తనలు పాడిన కొద్దీ ఋణం పెరుగుతూనే ఉంటుంది. తరిగిపోవటం, తీరిపోవటమంటూ ఉండదు - అలా పాడుతూనే ఉంటాం. కీర్తి శరీరంతో ఆయన వింటూనే ఉంటాడు.

*
‘‘రామా!
నీ దయ
నా మీద లేకుండా పోతోందే!
ఇలాగైతే నీకూ, నాకూ ఋణం లేదనుకుంటారు. ఎందుకంటే నీకూ నాకూ ఋణం
లేకపోవటం గానీ, ఋణం తీరిపోవటం కానీ వుండదు. చిన్నప్పటి నుంచే నా హృదయంలో తిష్ట వేసుక్కూర్చున్నావు. ఈ జన్మలో నేను చేసిన పూజలతో ప్రకాశించి నువ్వు నన్ను మరిచిపోతే నువ్వు నాకు ఋణపడి ఉన్నట్లు సుమా!’’
- త్యాగయ్య
**
మహావైద్యనాథయ్యర్
(1844-1893)
తంజావూరు సమీపంలోని ‘వాయచెరి’ స్వగ్రామంలో జరిగిన ఆయన గాత్ర సంగీత కచేరీకి సుమారు ఇరవైవేలమంది హాజరై మైకులు లేకపోయనా హాయగా విని ఆనందించారు. అటువంటి దివ్యమైన శారీరం ఆయనది. 72 మేళకర్త రాగాలలో 72 చరణాలు రచించిన ఏకైక సంగీత విద్వాంసుడు. ఈ ‘మహా మేళరాగ మాలిక’ను పాడేందుకు సుమారు 45 నిమిషాలు పడుతుంది. భారతరత్న శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఈ మేళరాగ మాలిక పాడి రికార్డు ఇచ్చారు. భారతీయ సంగీత చరిత్రలో అతి దీర్ఘమైన సంగీత రచన ఇది.

చిత్రాలు.. త్యాగయ్య శిష్యులు కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్

- మల్లాది సూరిబాబు 9052765490