రాష్ట్రీయం

రంగంలోకి దళపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ప్రతిష్ఠాత్మక గ్రేటర్ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని వేడెక్కించేందుకు సిఎం కె చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దాలన్న అంశాలపై బహిరంగ సభ, మీడియా భేటీలో వివరించాల్సిన విషయాలను కెసిఆర్ సోమవారం పార్టీ ముఖ్యులతో క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచార తీరు, పార్టీ పరిస్థితి ఎలాఉందనే దానిపైనా సమీక్ష జరిపారు. రెండు మూడు బహిరంగ సభలు, వినూత్న తరహాలో ఈ-సభలు నిర్వహించేందుకు తొలుత ప్రయత్నించారు. అయితే సిఎం బహిరంగ సభలు ఎక్కువైతే ట్రాఫిక్ చిక్కులు తలెత్తి ప్రయోజనం కన్నా విమర్శలు ఎక్కువ వస్తాయనే అభిప్రాయం చర్చలో వ్యక్తమైంది. దీంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చారు. ఇక జర్నలిస్టులు, మీడియా రంగంలోని ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించి తెలంగాణ భవన్‌లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో కెసిఆర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికను సుదీర్ఘంగా వివరిస్తారు. ప్రతి ఇంటా టీవీ ఉంటుంది కనుక, ఆ మాధ్యమాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటే పార్టీ వాదన బలంగా ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ నేతలు అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే బహిరంగ సభలు ఎక్కువగా నిర్వహించడంకన్నా ముఖ్యమంత్రి టీవిలో మాట్లాడడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. 27న తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తరువాత 30న సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. పెరెడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహణకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలవల్ల బహిరంగ సభకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు. 30నాటి సభకు 29న ఒక్కరోజులోనే ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. తెదేపా అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో తెదేపా- భాజపా ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు, లోకేశ్ ప్రసంగించారు. ఆ తరువాత లోకేశ్ ఉప్పల్‌లో జరిగిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు. మొదటి నుంచీ గ్రేటర్ ఎన్నికల వ్యూహ రచనలో ఉన్నప్పటికీ సిఎం కెసిఆర్ ఇప్పటి వరకు బహిరంగంగా ప్రచారం చేయలేదు. స్వచ్ఛ హైదరాబాద్ పేరిట ప్రభుత్వం వారంపాటు నిర్వహించిన కార్యక్రమం వల్ల హైదరాబాద్ నగరంలో తెరాస తనకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. గవర్నర్, సిఎం, ప్రధాన కార్యదర్శి మొదలుకొని ప్రతి అధికారికి గ్రేటర్‌లో ఒక భాగంలో స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించే బాధ్యత అప్పగించారు. చెత్త తొలగించి శుభ్రం చేసే కార్యక్రమాన్ని సైతం హైదరాబాద్‌లో ఉత్సవంగా నిర్వహించారు. ఈ ప్రభావం నగరవాసులపై బాగానే పడింది. మొదటి నుంచీ వ్యూహాత్మకంగా తెరాస హైదరాబాద్‌లో అడుగులు వేసింది. గ్రేటర్ నోటిఫికేషన్‌కు ముందునుంచే వ్యూహాత్మక ప్రచారాన్ని నిర్వహించిన తెరాస, ప్రచారానికి ఫినిషింగ్ టచ్‌లా కెసిఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో తెరాస సర్కారు ఏం చేసింది, ఏం చేయబోతోంది వివరిస్తూ, ఇప్పటి వరకు పాలించిన వాళ్లు ఏంచేశారో కెసిఆర్ వివరించే అవకాశం ఉందని అంటున్నారు.