కథ

రాబందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?’ అడిగాను నాతో ఆఫీసులో పని చేస్తున్న రమని.
‘కర్నూలు జిల్లాలో మా అన్నయ్యని ప్రత్యర్థులు చంపేశారు. బాధతో కుంగిపోయిన మా అమ్మానాన్నలను చూసుకోవాలంటే ఏ మగవాడూ ఒప్పుకోలేదు. నాకు మగజాతిపై నమ్మకం లేక పెళ్లి చేసుకోలేదు. మా అమ్మానాన్నలకు మేము లేటుగా పుట్టాం. ముసలితనంలో వాళ్లను వదిలి, నా దారి నేను చూసుకోలేక పోయాను. రిటైరయ్యాక ఏదో ఒక ఓల్డేజ్ హోమ్‌లో చేరిపోతాము’ కన్నీళ్లతో చెప్పింది రమ లంచ్ అవర్లో.
అందరితో సరదాగా మాట్లాడే అందమైన రమలో ఇంత బాధ గూడుకట్టుకుని ఉందా అని విస్తుపోయాను.
‘ఏదైనా ఆర్ఫనేజ్ నుండి ఓ ఆడపిల్లని దత్తత తీసుకోవాల్సింది, మీ ఓల్డేజ్‌లో ఆధారంగా ఉండేది...’ ఉచిత సలహా ఇవ్వబోయి ప్రభ రాకతో ఆ టాపిక్ అక్కడితో ఆపేశాను. సుడిగాలిలా వచ్చిన ప్రభ, గేటెడ్ కమ్యూనిటీ ఎంత కంఫర్టబుల్‌గా ఉంటుందో గడగడా వివరిస్తోంది. ఒంటరి ఆడవాళ్లకు, టీనేజ్ అమ్మాయిలున్న వాళ్లకు, అమెరికాలో పిల్లలున్న ముసలి వాళ్లకు, సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉంటుందో గంగా హారతిలో గంట వాయించినట్లుగా చెప్తూంటే, ఎంసెట్ ఫలితాలు వచ్చిన వెంటనే టీవీ ఛానెల్స్ చేసే హడావిడి గుర్తొచ్చింది. అంతా విన్నాక, ఒక ఫ్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుందో అందరూ చర్చించుకున్నారు.
ఓల్డేజ్ హోమ్ కంటే ఓ ఫ్లాట్ తీసుకుంటేనే నయమనిపించింది రమకు కూడా. ఇంకో సంవత్సరంలో రిటైర్ అయ్యాక అందులో సేఫ్‌గా ఉండవచ్చనుకుంది. తన సేవింగ్స్‌తో ఓ ఫ్లాట్ బుక్ చేసుకుని, అంచెలంచెలుగా చెల్లిస్తూ ఓ రెండేళ్లలో తనూ ఓ ఇంటిని సొంతం చేసుకోవచ్చని ఆశపడింది. ఎనభై ఏళ్ల పైబడిన తల్లిదండ్రులనూ సుఖపెట్టవచ్చని సంతోషించింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఓ సంవత్సరంపాటు కడుతూ పోతే, తరువాత రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా కొంతవరకు ఇంటి కోసం వాడుకోవచ్చని లెక్కలేసుకున్నది. ఆ తరువాత వచ్చే పెన్షన్ తమ ముగ్గురికీ సరిపోతుందని ఆలోచించుకుంది. ప్రభ మార్కెట్ మాయాజాలానికి తను ప్రలోభపడుతున్నానేమోననే శంక ఓ వంక వేధిస్తూనే ఉంది. కాని, అలనాడు చంద్రునిపై కాలుమోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌లా తనూ ఒకనాటికి తన స్వంత ఇంట్లో అడుగిడుతున్న అందమైన అనుభూతి, అనుమానాలన్నింటినీ అణచివేసింది. కొద్దిరోజుల్లోనే రమ పదిహేను లక్షలు సమకూర్చి ప్రభ వాళ్లాయనకిచ్చి రసీదు తీసుకుంది. బేస్‌మెంట్ పూర్తయ్యాక ఇంకో పదిహేను లక్షలు ఇస్తేగాని పని కొనసాగదంటే, అవీ అందజేసింది. గోడలు లేచి గదులు రూపుదిద్దుకుంటుంటే తన కల నిజమవుతున్నందుకు ఆనందించింది. ముప్పై సంవత్సరాల సర్వీసులో
కూడబెట్టిన డబ్బు సక్రమంగా వినియోగ పడుతున్నందుకు తన బాధ్యత తీర్చుకుంటున్నట్లు తృప్తిగా ఉంది రమకు. ఎనిమిది నెలలు గడిచిపోయాయి. మరో ఇరవై లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి తీసి ఇచ్చింది.
* * *
‘మీరు రావడం చాలా ఆలస్యమయింది. కేన్సర్ నాల్గవ స్టేజ్‌లో ఉన్నది. అర్జంటుగా గర్భసంచి తీసేయాలి. రేపే అడ్మిట్ అవ్వాలి’ డాక్టర్ మాటలకు రమ హతాశురాలయ్యింది. ప్రక్కనే ఉన్న నేను ధైర్యం చెప్పాను.
‘నాకే జబ్బూ రాదు. నేను ఏ డాక్టర్‌ని కలవనక్కర్లేదు...’ అని మొండిగా నాతో వాదించిన రమ కన్నీళ్లు కారుస్తూ, దిగులుగా చూస్తున్న నా చేయి పట్టుకుని ‘మీరెంత చెప్పినా నా సమస్య సకాలంలో డాక్టర్‌కి చెప్పకపోవడం వలనే జబ్బు ముదిరిపోయింది. రేపు హాస్పిటల్‌కి వస్తారా?’ అంటే తప్పక వస్తానని ఓదార్చాను.
నెల రోజుల తరువాత రమ, ప్రభకి ఫోన్ చేసి, చివరగా ఇచ్చిన ఇరవై లక్షల్లో కొంతైనా వెనక్కిస్తే తన మెడికల్ బిల్స్ క్లియర్ చేస్తానని ప్రాధేయపడిందట. వాళ్లాయనకు మిగిలిన ఫ్లాట్ ఓనర్స్ మూడవ దఫా డబ్బు ఇంకా ఇవ్వలేదని, వేరే ప్రయత్నించుకోమని జవాబిచ్చిందట ప్రభ. గతంలో రమ నుండి అప్పు తీసుకున్న వాళ్లు తప్పించుకు తిరుగుతూంటే ఆమె కష్టకాలంలో అప్పు తీర్చమని ప్రాధేయపడ్డాను. ఫలితం లేకపోయింది. ప్రభ వాళ్లాయన దగ్గర ఫ్లాట్స్ బుక్ చేసుకున్న లంచ్ అవర్ ఫ్రెండ్స్ చాలా నిస్పృహతో ఉండి రమ తరఫున వాదించి డబ్బు వెనక్కిప్పించే పరిస్థితిలో లేరు. అగ్రిమెంట్ చేసుకునే సమయంలో వాళ్ల కన్‌స్ట్రక్షన్ నాణ్యత చాలా గొప్పగా ఉంటుందని ప్రలోభపెట్టాడు. కాని, ఇల్లు స్వాధీనం చేసుకునే ముందు చాలా విషయాల్లో మోసం జరిగిందని గుర్తించారు. నాలుగు వేల ఖరీదు చేసే నిరాలీ కంపెనీకి చెందిన వంట గది సింక్ పెడతామని చెప్పి పధ్నాలుగు వందల తక్కువ క్వాలిటీ సింక్ పెట్టాడు. గోద్రేజ్ తాళాలు పెడతామని చెప్పి, ఎనిమిది వందల చీప్ రకమైన తాళాలు బిగించాడు. ఈ రకంగా అగ్రిమెంట్ పేపర్లలో ‘... లేక ఈక్విలెంట్’ అనే వాక్యం చూపి అతని మోసపూరిత నైజాన్ని చాటుకున్నాడు. బిజినెస్‌లో బాగా లాభాలు గడించి ప్రభకి కూడా హోండా సిటీ కారు, డ్రైవర్‌ని ఏర్పాటు చేశాడు. త్వరలోనే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసేసుకుంటున్నానని చెప్తున్న ప్రభతో ఫ్లాట్స్ బుక్ చేసుకున్నవాళ్లు తప్పనిసరై డిప్లమేటిక్‌గా వ్యవహరించసాగారు.
రేడియం ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరో రెండు నెలలు సెలవు పొడిగించింది రమ. రిటైర్‌మెంట్‌కి నెల ముందుగానే డ్యూటీలో జాయిన్ అవుతుందనుకుంటున్న తరుణంలో ఒక ఫోన్‌కాల్.. ‘నాకు కేన్సర్, ఊపిరితిత్తుల వరకూ పాకిందట. చాలా ఆయాసంగా ఉంటున్నది. మీరోసారి వచ్చి అమ్మకి ధైర్యం చెప్పండి. నాన్న గుండె జబ్బుతో ఉన్నారని వివరాలు చెప్పడం లేదు’ వెంటనే నేను రమ ఇంటికి వెళ్లి ఆమె సెలవు పొడిగిస్తూ రాసిన దరఖాస్తుపై సంతకం చేయించాను. ఫ్యామిలీ పెన్షన్ గురించి రమకి, వాళ్ల అమ్మగారికి వివరించి ధైర్యం చెప్పి వచ్చిన రాత్రి, నిద్ర కరువైన కాళరాత్రి అయ్యింది.
ఒక నర్సు సాయంతో కీమోథెరపీకి వెళ్తున్న రమను పరామర్శించడానికి ఆఫీసు నుండి వెళ్లిన లంచ్ అవర్ స్నేహితులందరితో... ‘మీరంతా చెప్పినా నేను నా సమస్యను డాక్టర్‌కు వెంటనే చెప్పక పోవడం వలన ఇలా త్వరగా మంచం పట్టాను. కీమో థెరపీకి డబ్బు కట్టాలి. మీరు తలో పదివేలు సర్దితే నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుండి వెనక్కిచ్చేస్తాను. మీరెవరెంత ఇచ్చారో లిస్ట్ రాసి అమ్మకివ్వండి.. నేను పోయినా ఆమె తప్పక ఇచ్చేస్తుంది’ అంటూ కన్నీళ్లతో అర్థించింది.
అందరి సాయంతో కీమో థెరపీ తీసుకుంటూ రమ పరలోకంలో తన స్వగృహ ప్రవేశం చేసింది. రెండు రోజుల్లోనే రమ తండ్రి కూడా ఈ ఈతిబాధలన్నింటికీ అతీతంగా సుదూర లోకాలకు చేరాడని తెలిసింది. రమ మాత్రం ‘కొంతైనా డబ్బు మా అంత్యక్రియలకు వెనక్కిస్తారా...’ అంటూ ప్రభని ప్రాధేయపడుతున్నట్లుగా మాకందరికీ తోచి, మేమే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము.
* * *
నెల రోజుల తరువాత వాళ్ల బంధువుల సాయంతో పెన్షన్ పేపర్లు తీసుకుని వాళ్ల అమ్మగారు ఆఫీసుకు వచ్చారు. ఇ.వో.యల్ తీసుకోవడం వలన అది మంజూరయ్యే వరకు పెన్షన్ పేపర్లు కదలవని చెప్పి పంపేశారు. ఎనభై సంవత్సరాలు దాటిన పండు ముదుసలి ఒంటరిగా తిరుగుతున్నా ప్రభ ఏ మాత్రం చలించలేదు. రమ ఇంతవరకూ ఇచ్చిన పైకం చాలదని, మొత్తం కడితేగాని వాళ్లమ్మగారికి ఫ్లాట్ ట్రాన్స్‌ఫర్ చేయలేమని ప్రభ వాళ్ళాయన నిక్కచ్చిగా చెప్పాడు. అప్పు తీసుకున్న వాళ్లెవరూ ఏ పత్రాలూ రమకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ల నుండి డబ్బు రాబట్టడం అసాధ్యమే అయింది. ఆరు నెలలపాటు తిరిగాక రమ ఫ్యామిలీ పెన్షన్ మంజూరయింది. వాళ్ల అమ్మగారు అందరి డబ్బు అంచెలంచెలుగా వెనక్కిచ్చేసి ఆమె నిజాయితీని నిరూపించుకున్నారు.
మగజాతిని అసహ్యించుకుని, అమ్మానాన్నల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన రమ అంతులేని కథ అందరి హృదయాలనూ కలచివేసింది. ముప్పది సంవత్సరాల సేవింగ్స్‌ని ఒక్క సంవత్సర కాలంలోనే కర్పూరంలా కరిగించేసిన ప్రభ వాళ్లాయనకు కఠిన శిక్ష ఆ భగవంతుడే విధిస్తాడనుకుంటున్న క్షణంలో ఒక శ్లోకం గుర్తుకు వచ్చింది...
‘అహింసా ప్రథమం పుష్పం పుష్ప మిన్ద్రియనిగ్రహః సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషతః/ శాన్తి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవచ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరంభవేత్
బాహ్య పుష్పాలతో పాటు ఎనిమిది రకాల సద్గుణ రూప మనః పుష్పాలతో గూడా భగవానుని ఆరాధించి దుష్టశక్తుల బారి పడకుండా కాపాడమని వేడుకోవడమే మనం చేయగలిగినదని నిట్టూర్చాను. తక్కువ కాలంలోనే ఈజీ మనీ దండుకోవాలనుకున్న ప్రభ అమానుషత్వం రమ చరమ దశలో తోటివారి దయాభిక్ష నర్థించవలసిన దీనస్థితికి గురిచేసింది.
యుగయుగాల నుండి స్నేహితులు, బంధువులలో కూడా రాబందుల్లాంటి వారున్నారన్న నిజం మనుషులలోని నిజాయితీని దెబ్బతీస్తూనే ఉంది. అందుకే కృష్ణపరమాత్మ అన్నాడు...
‘నేను లోక సంహారకుడనై విజృంభించిన కాలుడను. దుష్ట ప్రాణులను సంహరించు నిమిత్తము ఈ లోకమున ప్రవర్తించుచున్నాను’
బంధువుల సహాయంతో రమా వాళ్లమ్మగారు తనకు జరిగిన అన్యాయాన్ని మానవ హక్కుల సంఘానికి నివేదించి తీర్పు కోసం వేచి చూస్తున్నారు.
*

ముసునూరు ఛాయాదేవి
ప్లాట్ నెం.301, ఇం.నెం.ఎఫ్-32
మధురానగర్, హైదరాబాద్-38

-ముసునూరు ఛాయాదేవి