జాతీయ వార్తలు

పార్లమెంటులో అదే రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరేంద్ర సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన సభాకార్యక్రమాలకు అంతరాయం.. వాకౌట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాపై బిజెపి సభ్యుడు వీరేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఎన్‌డిఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్పు పట్ల తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీరేంద్ర సింగ్‌ను సభను బహిష్కరించాలి లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి పట్టుపట్టటంతో సభ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ప్రభుత్వం వారి డిమాండ్‌ను తిరస్కరించటంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభను బాయికాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ వాకౌట్ చేసిన అనంతరం లోక్‌సభ జీరో అవర్ నుంచి ప్రశాంతంగా కొనసాగింది.
లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే లేచి వీరేంద్రసింగ్ బుధవారం చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ అతడిని సభనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బిజెపి సభ్యులు ఇలా వ్యవహరించినంత కాలం లోక్‌సభ నడిచే ప్రసక్తే లేదన్నారు. వీరేంద్రసింగ్‌ను బహిష్కరించాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుంటూ సభ్యులు ఒకరినొకరు కించపరచుకోవటాన్ని పార్టీ, ప్రభుత్వం ఎంత మాత్రం సమర్థించదని ప్రకటించారు. ప్రతిపక్షం తమ ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ తప్పంతా అధికార పక్షానిదేనని విమర్శించడం కూడా మంచిది కాదని కాదని ఆయన హితవుచెప్పారు. పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతోపాటు డిప్యూటీ స్పీకర్ తంబిదురైపై కాగితాలు చింపి పడవేసిన ప్రతిపక్షం సభ్యులపై కూడా చర్య తీసుకోవాలని వెంకయ్య డిమాండ్ చేశారు. అయితే సింగ్‌ను సభ నుంచి బహిష్కరించడంపై ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ దశలో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇవ్వడంతో సభ స్తంభించిపోయి, స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను 11.45కు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా మల్లిఖార్జున ఖర్గే లేచి వీరేంద్ర సింగ్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. సుమిత్రా మహాజన్ కాంగ్రెస్ సభ్యులను శాంతింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. కాంగ్రెస్, బిజెపి సభ్యులు వాగ్వాదం మధ్య సభలో గందరగోళం ఏర్పడింది. ఖర్గే మళ్లీ లేచి ఎన్‌డిఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని,
ప్రతిపక్ష పార్టీల నాయకులను అవమానించే విధంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము సభలో ఉండటం కష్టమని అంటూ దీనికి నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేస్తోందని ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తమ పార్టీ కూడా వాకౌట్ చేస్తోందని ప్రకటించిన అనంతరం ఆ పార్టీ సభ్యులు సభ నుండి బయటకు వెళ్లిపోయారు.
రాజ్యసభ యథాతథం..
నేషనల్ హెరాల్డ్ వివాదంలో తమ నాయకురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వేధింపేనని ఆరోపిస్తూ మూడు రోజులుగా కాంగ్రెస్ నిరసనలతో స్తంభించిపోతున్న రాజ్యసభలో గురువారం కూడా యధాతధ స్థితి కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాన్ కాంగ్రెస్ ప్రతిపక్ష సభ్యులు మాత్రం పెదవి విప్పకుండా కూర్చుండిపోయారు. సభ మొదటిసారి వాయిదా పడిన తరువాత ప్రధాని మోదీ సభకు వచ్చారు. ఆయన కొంత సేపు సభలో ఉండి వెళ్లిపోయారు. 12 గంటలకు చైర్మన్ అన్సారీ సభను నడిపించే ప్రయత్నం చేశారు. సభ్యుల ప్రాథమిక హక్కయిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని చేసిన అభ్యర్థన ఫలించలేదు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి జోక్యం చేసుకుని ప్రతిపక్షాలు లేవదీసే ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని మరోసారి ప్రతిపాదించారు. కాంగ్రెస్ సభ్యులకు మతి స్థిమితం తప్పిందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. సభలో ఉండటం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని ఆయన కాంగ్రెస్ సభ్యులకు సలహా ఇచ్చారు. ఇంతలో కొందరు పిల్లి కూతలు కూశారు. ఆ కూతలను ఆపివేయాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. ప్రశ్నలు అడిగే అవకాశాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవటం చట్టవిరుద్ధమే కాక సహచర సభ్యుల ప్రాథమిక హక్కును హరించటమే అవుతుందని నఖ్వీ చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరుకోవటంతో డిప్యూటీ చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.