రచ్చ బండ

మళ్లీ సున్నా నుంచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి)ని బలోపేతం చేసుకునేందుకు మళ్లీ ‘సున్నా’ నుంచి కార్యాచరణ మొదలు పెట్టింది. 2014లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విస్తుపోయిన టి.కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి జిల్లాలో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు రోజుల పాటు సమావేశమై, తర్జన-్భర్జన పడి, చివరకు పలు తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు ఏమయ్యాయో, ఆ నిర్ణయాలు ఏమయ్యాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వాటి సంగతి అక్కడే మరిచారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతున్నదే తప్ప వ్యతిరేకత రావడం లేదన్న బాధ మరో పక్క పీడిస్తున్నది. పాలేరు ఉప ఎన్నిక ఫలితంతో కూడా కాంగ్రెస్ నేతలు కుదేలయ్యారు. మరోవైపు ఎమ్మెల్యేలు ‘చే’జారుతున్నారు. ఈ రోజు టి.పిసిసి అధ్యక్షుని పక్కనే కూర్చొని మాట్లాడిన ఎమ్మెల్యే లేదా మరో ముఖ్య నేత తెల్లారే సరికి అధికార పార్టీలో దర్పంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి.పిసిసి అధ్యక్షున్ని మార్చితే ఫలితం ఉంటుందా?, సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను మారిస్తే ప్రయోజనం ఉంటుందా? అనే తర్జన-్భర్జన కూడా పార్టీ అధిష్టానంలో జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి టి.పిసిసి అధ్యక్షునిగా నియమితులైన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పని తీరు పట్ల ఫిర్యాదులు పెల్లుబికడంతో ఆయన్ను మార్చి కెప్టెన్ ఉత్తమ్‌ను కూర్చోబెట్టారు. కెప్టెన్‌కు టీం లేకపోవడంతో తాజాగా అధిష్టానం చొరవ తీసుకుని 105 మందితో జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. వీరిలో 30 మందికి జోడు పదవులు లభించాయి. అంటే సమన్వయ కమిటీతో కలిపి 135 మంది సభ్యులయ్యారు. ఏదైతేనేం, కెప్టెన్‌కు ఓ జంబో టీం లభించింది.
ఈ జంబో టీంను ప్రకటించి, పదవులు పంపిణీ చేయడంతో సరిపోదని, వీరికి పదవులే కాదు, పనులు, బాధ్యతలు అప్పగించాలని భావించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను, ఎఐసిసి నాయకులు కుంతియా, శ్రీనివాసన్, ఎస్‌సి సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజును పంపించారు. దీంతో ఈ నెల 17న గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ తొలి సమావేశం జరిగింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ‘మిషన్-2019’తో ముందుకు వెళ్ళాలని సమావేశం నిర్ణయించింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. పార్టీ భవిష్యత్తు, టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై, కరవు పరిస్థితులపై ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. జోడు పదవులపైనా చర్చ జరిగింది. కొంత మంది మాజీ మంత్రులు ఇంకా అధికారంలో ఉన్నట్లే భావిస్తున్నారని, పార్టీ కార్యకర్తలకు చేరువ కావడం లేదన్న విమర్శలూ వచ్చాయి. ఇది విమర్శలు చేసుకునే సమయం కాదని, పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని దిగ్విజయ్ హితవు చెప్పారు.
పార్టీని పోలింగ్ కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సారథ్యంలో పది జిల్లాకు 10 సబ్-కమిటీలు ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు రెండో రోజు (18న) జరిగిన సమావేశంలో అన్ని జిల్లాలకు ఇన్‌ఛార్జీలను నియమించారు. ఒక్కో జిల్లాకు టి.పిసిసి ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. ఈ ఇన్‌ఛార్జీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటు ప్రక్రియను జూన్ 30వ తేదీలోగా పూర్తి చేసుకుని, చివరి రోజున వారికి అప్పాయింట్‌మెంట్ లెటర్లు ఇప్పించాలని నిర్ణయించారు. తద్వారా స్థానిక నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు, చురుకైన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని వారి భావన. ప్రతి నియోజకవర్గానికి 30 మంది చొప్పున చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి వారందరికీ (3600) ఒకే రోజున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శిక్షణ పొందిన వారు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది.
పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారు ఎంతో మంది ఉన్నా, ఎన్నికల సమయంలో వారికి పోటీ చేసేందుకు అవకాశం రాకుండా, ఢిల్లీకి వెళ్ళి పైరవీ చేసుకునే వారికి, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో అసంతృప్తి చోటు చేసుకుంటున్నదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు టిక్కెట్ల కోసం ఢిల్లీకి పరుగులు తీయడం, పైరవీ చేయడం వంటి వాటికి తెర దించి కొత్త పద్ధతిని అవలంభించాలని నిర్ణయించారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే నాయకులను ఎంపిక చేసి ఏడాది ముందే వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని, తద్వారా పైరవీలకు ఛాన్స్ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారు. అభ్యర్థులను జిల్లా కమిటీలు సిఫార్సు చేయాల్సి ఉంటుందని, ఆ పేర్లను టి.పిసిసి పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుని ప్రకటించేందుకు మాత్రం ఎఐసిసికి పంపించాలనుకున్నారు. ఇటువంటివి ఎన్ని అనుకున్నా, ఎన్నికలకు ముందు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, వత్తిళ్ళు సహజం. అయినప్పటికీ ఏదో ప్రయత్నం చేయాలన్న తపన. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైన అయినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని విస్తృత స్థాయి సమావేశం భావించి తీర్మానించింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే కాదు పార్టీ నేతలెవ్వరూ ఫిరాయింపులకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవశ్యకతపైనా టి.పిసిసి విస్తృత స్థాయి సమావేశం దృష్టి సారించింది. నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా, ఆచరణ లేకుండా మళ్లీ వచ్చేసారి సమావేశమైనప్పుడు కూడా ‘సున్నా’ నుంచి మొదలెడదమా! అని అనుకుంటూ పోతే ఎన్నికల వరకూ ‘సున్నా’ వద్దే ఉంటూ, అక్కడే కథ ముగుస్తుంది.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి