రచ్చ బండ

ఏమి సాధించినట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి సారి ప్రధాని నరేంద్ర మోదీ అడుగు పెట్టడంతో పార్టీ భవిష్యత్తుకు బాట పడుతుందన్న ఆ పార్టీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. ప్రధాని మోదీ రాకతో తెలంగాణలో బిజెపికి దశ తిరుగుతుందని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరారు. కొత్త రాష్ట్రానికి భారీగా నిధులు సమకూరుతాయని ప్రజలు ఆశించారు. కానీ ఈ రెండూ జరగలేదు. ప్రధాని ప్రసంగం చాలా సాదా, సీదాగా జరిగింది. రాష్ట్రానికి కొత్త వరాలు ఏవీ రాలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శంకుస్థాపనలు, ఇటు పార్టీ ‘మోదీతో మనం..మహా సమ్మేళనం’ పేరిట ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరై వెనుదిరిగారు. మోదీ తన ప్రసంగంలో ఎప్పటిలా గత యుపిఎ ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించారు. కానీ 2019 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్న బిజెపి నాయకులకు, కార్యకర్తలకు ప్రధాని ప్రసంగం రుచించలేదు. ప్రధాని తన ప్రసంగంతో అధికార పార్టీపై యుద్ధం ప్రకటిస్తారని, తద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతారని ఆశించిన వారి ఆశలు ఆవిరయ్యాయి. తెలంగాణలో బిజెపి బలోపేతానికి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన ఎటువంటి దిశా నిర్దేశం చేయలేదు. పార్టీ కార్యకర్తల సమావేశం కాబట్టి ప్రధాని తప్పని సరిగా దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు ఆశించారు.
పైగా ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పరస్పరం సహకరించుకుందామని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ ఆరంభమైంది. నిజం గా వ్యూహాత్మకంగానే ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదా? ఏమై వ్యూహం ఉంటుంది? అని వివిధ పార్టీల నాయకులు విశే్లషించుకుంటున్నారు. తెలంగాణలో ఆశించిన స్థాయలో పార్టీ బలంగా లేదు కాబట్టి, పార్టీ బలోపేతానికి ఒక బలమైన రాజకీయ పార్టీ అండ ఉండాలని ప్రధాని మోదీ భావించారా? కేంద్ర నిఘా విభాగాలతో అటువంటి సమాచారాన్ని ఏదైనా అయినా తెప్పించుకుని జాగ్రత్తగా మాట్లాడారా? అనే కోణంలో చర్చ ప్రారంభమైంది. లేదా అధికారిక కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసి రాజకీయాలు మాట్లాడడం భావ్యంగా ఉండదని భావించారా? కనీసం పార్టీ కార్యకర్తల సమావేశంలోనైనా టిఆర్‌ఎస్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులనైనా ఒక్క మాటైనా మాట్లాడలేదని పార్టీ నాయకులు అంటున్నారు.
తెలంగాణలో పార్టీ ఒంటరిగా బలోపేతం కావడం దుర్లభం కాబట్టి భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏమీ అనలేదా? అని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ బాగా బలహీనపడినందున ఆ పార్టీతో కలిసి నడిచే పరిస్థతి లేనందువల్ల కొత్త పొత్తు కోసం ఎత్తుగడ అయి ఉంటుందా? అని నేతలు ఆలోచనలో పడ్డారు. ప్రధానిగా ఉంటూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం భావ్యం కాదనుకున్నారా? అంటే అదీ అనుకోవడానికి వీల్లేదు. గత యుపిఎ ప్రభుత్వం అవినీతిపై విరుచుకుపడ్డారు. ప్రధాని రాకతో తెలంగాణలో బిజెపి భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందనుకుంటే, మరింత అయోమయం కలిగిందన్న బాధ పార్టీ నేతలకు లేకపోలేదు. పైగా బిజెపి-టిఆర్‌ఎస్‌ల మధ్య వివాహబంధం కుదిరినట్లేనని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ పార్టీ ఇతర నాయకులూ విమర్శలు కురిపించారు. ఇలాంటి విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తోందని, భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదన్న ఆందోళన, ఆవేదన బిజెపి నేతల ముఖాల్లో కనిపిస్తున్నది.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, చేపట్టిన పథకాలను పొగడడంతోనే ఇబ్బంది పడిన బిజెపి రాష్ట్ర నాయకులకు ఇప్పుడు ప్రధాని కూడా కెసిఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తే ఇక తెలంగాణలో పార్టీ బతికేదెలా? చేసే పోరాటాలకు అర్థం లేకుండా పోతుందన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, రైతుల మూడో విడత రుణ మాఫీ చేయకపోవడంతో, రైతులు కుదేలవుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రైతుల ఆత్మహత్యలే ఉండవని ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ చెప్పినా, ఆత్మహత్యలు ఆగలేదని ఇలా ప్రతి రోజూ విమర్శిస్తూ, ఆందోళనలు చేస్తున్న నాయకులకు ప్రధాని ప్రసంగం నిరాశను మిగిల్చింది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తే, ప్రధాని, కేంద్ర మంత్రులు పొగడడాన్ని టిఆర్‌ఎస్ ప్రజల ముందు పెడుతుంది. అప్పుడు సమాధానం చెప్పుకోవడం బిజెపి నేతలకు కష్టతరమవుతుంది. దళితుల అంశాన్ని ప్రధాని మోదీ పదేపదే ప్రస్తావించారు. దళితులు బిజెపికి దగ్గర అవుతున్నారన్న బాధతోనే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. దళితులను అవమానించే విధంగా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నందున, ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన సభకు సదరు ఎమ్మెల్యేను వేదికపైకి ఆహ్వానించలేదు. వేదికపై ప్రధాని ఉన్నప్పుడే రాజాసింగ్‌పై చర్య తీసుకోవాలనో లేదా వేదికపై నుంచి దించేయాలనో ఎవరైనా నినాదాలు చేస్తే పార్టీ పరువు పోతుందని భావించి ముందు జాగ్రత్తగా వేదికపైకి ఆహ్వానించలేదు.
దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయం అనే భావనతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా భావిస్తున్నారు. అందుకే రెండు నెలల క్రితం పక్షం రోజుల గడువులోనే రెండు సార్లు అమీత్ షా తెలంగాణలో పర్యటించి తన ప్రసంగాలతో పార్టీ శ్రేణులను ఉర్రూతలూగించారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఎందుకు అలా చేయలేదంటే వేరే వ్యూహం ఉందా? లేక దేశంలోని అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూస్తూ ఒక టీం లీడర్ తరహాలో అందరినీ కలుపుకుని పోవాలనుకున్నారా? అనే సందిగ్ధంలో పార్టీ నేతలు ఉన్నారు. పైగా ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉన్నందున, ఇప్పటి నుంచే విమర్శలు గుప్పించడం భావ్యం కాదని భావించారేమోనని పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి