రాజమండ్రి

సిసి కెమెరా (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లంచం ఇవ్వడం నేరం- లంచం తీసుకొనుట నేరం’ అని అంతంత అక్షరాలతో బోర్డులు పెట్టిమరీ దండిగా లంచాలు దండే ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగిరీ ఉద్యోగం చేస్తోన్న సుబ్రావ్‌కి ఎంతటివాడైనాసరే తనకి లంచం ముట్టజెప్పందే చిన్న పని కూడా చేసిపెట్టడం అలవాటు లేదు. పైపెచ్చు ఎప్పుడూ అందరికీ నీతి కబుర్లు చెప్తూ హితబోధలు చెయ్యడంలో అతనో దిట్ట! జీతం రాళ్లతో జీవితాన్ని నెట్టుకురావడం కంటే దుర్భరం, దుర్లభం మరోటి లేదని అతని ప్రగాఢ నమ్మకం. స్వతహాగా లౌక్యం- సమయస్ఫూర్తి ఎరిగినవాడు కనుక తన పై అధికారులందరితోనూ ఎప్పటికప్పుడు సత్సంబంధాలు ఏర్పర్చుకుంటూ ఉద్యోగంలో చేరిన అతి తక్కువ కాలంలోనే అడపా దడపా బినామీ పేర్లతో ప్లాట్లూ- ఫ్లాట్లూ, నగానట్రా బాగానే కొనుక్కోగలిగాడు.
నిత్యం ఇలాంటి ఏవో లావాదేవీలతో తలమునకలుగా వుండే మన సుబ్రావ్ ఆ రోజు ఆదివారం ఆఫీసుకి సెలవు కావడంతో ఇంట్లో మహా బోర్‌గా ఫీలయ్యి తన ఆరేళ్ల కూతుర్ని వెంటేసుకుని షాపింగ్‌కని దగ్గర్లోనే ఉన్న మార్కెట్‌కి బయలుదేరాడు తన కూతురు చెప్తోన్న ముద్దుముద్దు అమాయకపు మాటలను ఎంజాయ్ చేస్తూ...
కూతురంటే ప్రాణం తనకి. కూతుర్ని చూస్తే చాలు అన్నీ మరచిపోయి తనూ ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడు సుబ్రావ్. అందుకే ఎక్కడికి వెళ్లినా తనని కూడా వెంటబెట్టుకుని పోతూంటాడు.
ఇద్దరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ‘నమస్కారం బాబూ’ అంటూ పలకరిస్తూ ఎదురుపడ్డాడు సుబ్రావ్‌కి ఆ ముందురోజే ఒకానొక పనిమీద ఆఫీసుకొచ్చి తనని కలసిన రాఘవయ్య అనే రిటైర్డు ఉద్యోగి. అత్యంత క్రమశిక్షణగల వ్యక్తిగా నీతికీ నిజాయితీకి మారుపేరుగా రాఘవయ్యకి మంచి పేరుంది గానీ ఉద్యోగంలో వున్నన్నాళ్లూ చాలీచాలని జీతంతో కుటుంబ భారాన్ని, బాధ్యతల్నీ మోయలేక అవస్థపడుతూ బాగా చితికిపోయాడు పాపం! ‘ఏం రాఘవయ్యా... బాగున్నావా... ఏం చేశావు నేను చెప్పింది’ అంటూ అడిగాడు సుబ్రావ్. అలవాటు ప్రకారం అందరి ప్రభుత్వ ఉద్యోగులలాగే తనకన్నా చిన్నవాళ్లయినా పెద్దవాళ్లయినా ఏక వచనంలోనే సంభోదిస్తూ...
‘ఏం చెప్పమంటారు బాబూ... కుటుంబ బాధ్యతలేవీ పూర్తి చేయకుండానే రిటైరైపోయాను. ఇప్పుడు కూడా రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం నాది. మీరడిగినంత ఇచ్చుకోలేనుగానీ, మీరా పని పూర్తి చేసిన తర్వాత సంతోషం కొద్దీ సమర్పించుకుంటాను లెండి’ అంటూ ప్రాధేయపడసాగాడు రాఘవయ్య.
‘అదిగో మళ్లీ అదే వరస... మరో మాట లేదు... మీరు మార్రంతే! నేనడిగింది నాకోసం కాదంటే వినవేం? నువ్విచ్చేది నా పై ఆఫీసర్లకే నేనివ్వాలి తప్ప, నాదంటూ అందులో ఏమీ వుండదంటే అర్థంకావట్లేదా’ అంటూ చిరాగ్గా మొహంపెట్టి ‘నీ పని పూర్తికావాలంటే ఇలాంటివి తప్పదు మరి... అంతా నీలాగే వుంటారనుకున్నావా... సర్సరే... బాగా ఆలోచించుకుని రేపోసారి ఆఫీసుకొచ్చి కనబడు’ అంటూ కూతురు చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు సుబ్రావ్, రాఘవయ్య ప్రాధేయపడుతున్నా వినకుండా.
వాళ్లిద్దరి సంభాషణను విన్న తన ఆరేళ్ల కూతురు సుబ్రావ్‌ని అడగసాగింది... ‘ఏంటి నాన్నా ఆ తాతయ్య నిన్ను ఏదో అడుగుతూ వుంటే మధ్యలోనే వచ్చేస్తున్నావు’ అంటూ అమాయకంగా.
‘మా పెద్దోళ్ల సంగతులు నీకెందుకురా చిట్టితల్లీ., నీకేం అర్ధం అవుతాయని... పదపద’ అంటూ ఎదురుగావున్న డిపార్టుమెంటల్ స్టోర్సులోనికి దారితీశాడు సుబ్రావ్ కూతురి చెయ్యి పట్టుకుంటూ.
ఇసుకేస్తే రాలని జనంతో కిటకిటలాడిపోతోంది బాగా పేరొందిన ఆ డిపార్టుమెంటల్ స్టోర్సు. ఎంట్రన్స్‌లో వున్న షాపింగ్ ట్రాలీనొకదాన్ని తీసుకుని లోపలికి నడుస్తూ ఇంటికి కావాల్సిన సరుకుల్ని ఒక్కొక్కటీ అందులో వేయసాగాడు సుబ్రావ్. తన కూతురు కూడా షాపింగ్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తూ తనకి కావాల్సిన ఆటబొమ్మలూ, చాక్లెట్స్ గట్రా ఆ ట్రాలీలో వెయ్యసాగింది. కూతురి ఆనందాన్ని చూస్తూ సుబ్రావ్ కూడా మురిసిపోతూ కాసేపట్లో షాపింగ్ పూర్తిచేసుకుని కౌంటర్‌లో బిల్లు చెల్లించి బయటపడ్డాడు కూతురి చెయ్యి పట్టుకుంటూ.
ఇద్దరూ నడుస్తోంటే తన కూతురుకోడౌటొచ్చి సుబ్రావ్‌ని ఇలా అడగసాగింది...
‘అవును నాన్నా... అలా అన్ని ఐటమ్సూ ఆ షాపువాళ్లు షాపులో అంత మంది జనం మధ్య వదిలేశారు... కాపలాగా ఎవ్వరూ లేరు కూడా... నా చాక్లెట్ షాపులోనే తినేసేననుకో... ఎవరికి తెలుస్తుంది. ఎంచక్కా బిల్లు కట్టక్కర్లేదుకదా’ అంటూ అక్కడికేదో తను గొప్ప విషయాన్ని కనిపెట్టినంత ఆనందంతో చెప్పసాగింది.
‘చూడు చిట్టితల్లీ... అదే నీకు చెప్పేది... నువ్వు చాలా చిన్న పిల్లవనీ, నీకేమీ తెలియదని! షాపువాళ్లు తమ షాపులో మనకి కనబడకుండా ప్రతిచోటా సిసి కెమెరాలు వుంచుతారు. సిసి కెమెరా అంటే క్లోజ్డు సర్క్యూట్ కెమెరా అని అర్థం. వాటి ద్వారా వారు మనం షాపింగ్ ఎలా చేస్తున్నామా అని దూరంనుంచే గమనిస్తూవుంటారు. ఎవ్వరూ చూడట్లేదులే ఫర్వాలేదని నువ్వు చాక్లెట్ ఓపెన్‌చేసి నోట్లో వేసుకున్నావే అనుకో... అంతే! వెంటనే వచ్చి నిన్ను పట్టుకుంటారు’ అంటూ నవ్వుతూ చెప్పాడు సుబ్రావ్ తన ముద్దుల కూతురికి తెలీని విషయం తానొకటి సందర్భోచితంగా చెప్పినందుకు మురిసిపోతూ.
‘ఓ అదా నాన్నా! అవునవును నాకిప్పుడు గుర్తొచ్చింది. మొన్ననే మా స్కూల్లో మా టీచర్ చెప్పార్లే. ఈ క్లోజ్డు సర్క్యూట్ కెమెరాల గురించి. మనకి తెలీకుండా వీటిని పోలీసులు ప్రతి చోట వుంచుతారని... మనమేం దొంగపనులు చేసినా... మనమెలాంటి వెధవ్వేషాలేసినా వెంటనే వచ్చి మనల్ని పట్టుకుంటారని’ అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు నాన్నా...
‘దేవుడు కూడా మనకి కనబడకుండా ఇలాంటి సిసి కెమెరాలోనుంచే మనం చేసిన తప్పుడు పనుల్నీ, పాపపు పనుల్నీ గమనిస్తుంటాడనీ... మనం పైకెళ్లాక మన తాట వలిచి సలసలా కాగుతున్న నూనెలో మనల్ని వేసి వేపుతాడనీ, పొడవాటి గొలుసుల్తో కట్టి మనల్ని తల్లక్రిందులుగా వేలాడదీస్తాడని...’
ముద్దుముద్దు మాటల్తో ఇలా చెప్పుకుపోతూన్న కూతుర్ని చూసి సుబ్రావ్ ఒకింత షాకయ్యి ఈసారి కూతురికి ఏం సమాధానం చెప్పాలో తెలీక సిగ్గుతో తలదించుకున్నాడు. నిజానికి పిల్లలే పెద్దలకు గురువులనీ, ఎలాంటి తారతమ్యాలుగానీ, ఎలాంటి మర్మంగా ఉండని పిల్లల నుంచే పెద్దలు చాలా నేర్చుకోవాలనీ, లేనిపోని భేషజాలతో ఒక రకంగా పెద్దలే పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తూ వారి జీవితాల్ని అగమ్యగోచరం చేస్తున్నారని తొలిసారి రియలైజ్ అవుతున్నాడు.
‘లాభం లేదు... నా గారాలపట్టి మాటలకైనా విలువిచ్చి నేను మారాలి... ఇకపై ఎవ్వరినీ లంచం అడక్కూడదు ఛీఛీ..’ అనుకుంటూ ఆ క్షణంలో ఒక నిర్ణయానికొచ్చాడు సుబ్రావ్!

- వందన శ్రీనివాస్
సెల్: 9989198970.

వెంటాడే పద్యం

పలుకుబడుల ‘్ధనకుధర రామాయణం’

‘సీతారామ పదారవింద భజనాశేష ప్రభాభాసివై
ఖ్యాతింగాంచుమరణ్య దేశము నయోధ్యంగా, మహీజాతయున్
మాతృశ్రీగ, రఘూద్వహుం దశరథంగానెంచుమయ్యా! త్రిలో
కాతీతస్థిత భోగివౌదరిగి రమ్మా! సర్వ కల్యాణవౌ’
ఇది సుమిత్ర - అరణ్యాలకు వెళ్తున్న లక్ష్మణునితో పలికిన మాట. సీతారాముల పాదపద్మాలను సేవిస్తూ ఖ్యాతిని పొందుము. అరణ్యాన్ని అయోధ్యగా, సీతను తల్లిగా, రాముణ్ణి తండ్రి దశరథునిగా భావించి క్షేమంగా తిరిగిరా. నీకు శుభం- అని భావం. ఈసందర్భంలో వాల్మీకి రామాయణంలో ఉన్న ‘రామం దశరథం విద్ధి! మాంవిద్ధి జనకాత్మజామ్! అయోధ్యా మటవీం విద్ధి! గచ్ఛ! తాత! యథా సుఖవౌ’ అనే శ్లోకం సుప్రసిద్ధం. ఈ శ్లోకానికి పైపద్యం యథాతథానువాదం కాదు. ఆ శ్లోక భావానే్న అనుకరిస్తూ సర్వలోకాలలోనూ అతీతమైన స్థిరమైన వైభవాలను పొందే భోగివవుతావు అని లక్ష్మణుణ్ణి సుమిత్ర దీవిస్తున్నట్లుగా చెబుతూ ‘్భగి’ శబ్దాన్ని కవి ప్రయోగింపజేయడంలోని స్వతంత్రాంధ్రీకరణ రూపమైన ప్రతిభ కనిపిస్తోంది. భోగి అంటే భోగాలు గలవాడు. పడగగల సర్పము అని అర్థాలున్నాయి. లక్ష్మణుడు భోగియైన శేషుడే గదా! ఈ అవతార స్ఫూర్తిని సుమిత్ర నోట మూర్తి కట్టించారు- కవి. ఆమె కూడా సుతుని గొప్పతనాన్ని గుర్తించి పలికిందన్నమాట. ఇలా ‘్భగి’ అన్న పలుకు ఇక్కడ పలుకుబడిని పొందింది. అలా సమకూర్చిన కవి శ్రీ ధనకుధరం వెంకటాచార్యులుగారు. కావ్యం ‘్ధనకుధర రామాయణం’. వీరు గుంటూరు ఏసి కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా ఉద్యోగించిన కవిత్వ మర్మజ్ఞులు. సంప్రదాయ పండితులు.
‘చిటికవైచి, మోము చిట్లించి, కనుబొమ లెగురవైచి, యంగలేసికొనుచు పోయిపోయి నిలిచిపోయె హఠాత్తుగా! కైకయెదుట బొమ్మ కట్టినట్లు!!’
రాముని పట్ట్భాషేకం భగ్నం అయ్యేలా దుర్బోధ చేయడానికి కైక దగ్గరికి వెళ్తున్న మంధర చేష్టలను ఈ కవి - దర్శకుడై నటికి సూచిస్తున్నట్లుగా పైపద్యంలో తెలుపుతున్నాడు. ఇదొక నాటకీయత. మంధర చేత ముందుగా చిటిక వేయించారు. దుష్ట స్ర్తిల చేష్టలిలాగే ఉంటాయి. ఈ వర్ణన ద్వారా కవి లోకజ్ఞత వ్యక్తం. ‘చిటిక వైచి’ అనడం ద్వారా ఒక్క చిటికలో రామ పట్ట్భాషేకాన్ని మంధర ఆపు చేయించబోతోందన్న భవిష్యత్ కథ ధ్వనిస్తోంది. ‘చిటికవైచి’ అన్న తెలుగు పలుకునకు ఇలా అక్షరమైన పలుకుబడి కలిగింది. ఇదీ కవి ప్రతిభ.
స్ర్తి సహజమైన అసూయా రూపాన్ని ఈ సందర్భంలోనే కైక మాటల్లో ఈ కవి ఎలా వ్యక్తం చేశారో చూడండి.
‘మీసటలింక చెల్లవిట; మ్రింగిన చేదిది చాలు; మున్నుదే
వాసుర యుద్ధమందు తమకై తమరిడ్డ వరాల జంటకున్
నా సుతు రాజుసేయుడు; వనమ్ములలో పదనాలుగేడులా
కోసల రాజపుత్రి కొడుకున్ జటివృత్తి చరింపబంపుడీ!’
సటలంటే కపట వర్తనలని అర్థం. రాముణ్ణి ఎంతోప్రేమతో పెంచింది గదా కైక. అటువంటి ఆమె ఆ కోసల రాజపుత్రి కొడుకును అడవులకు పంపండి అన్నది. రాముని పేరు పలుకలేదు. అసూయ కలిగినప్పుడు ప్రేమాస్పద వస్తువును కూడా తృణీకరిస్తారు స్ర్తిలు సహజంగా. ఆ సహజత్వాన్ని ఈ కవి ఇక్కడ చూపారు. తద్వారా ‘కోసలరాజు పుత్రి కొడుకు’ అన్న పలుకులకు పలుకుబడి ఏర్పడింది. పలుకుబడులు అంటే కేవలం తెలుగు జాతీయాలూ, సామెతలే కానక్కరలేదు. అవికూడా ఈ కావ్యంలో సందర్భోచితాలుగా ఉన్నాయి. మామూలు పదాలను గూడా సందర్భోచిత సుందరంగా ప్రయోగించి వాటికి పలుకుబడిని సమకూరుస్తాడు - నిజమైన కవి.
సీతనపహరించాలనే భావనను రావణునికి బలంగా సమకూర్చే సందర్భంలో అకంపనుడనే రాక్షసుడు ‘మరచితి నొక్కమాట’ అనే పద్యంలో ‘ఆ మెఱపున కంద్రియాదులకు మేలగు రూపము గల్గెనేని ఆ మెఱపు పడంతి సీతయె సుమీ! సతి- మేఘ వినీల పంక్తికిన్’ అన్న పద్యంలో సీతను ‘మెఱపు కాంత’ అని అంటాడు. ఆ భావన బలపడిన రావణుడు సన్యాసి రూపంలో భిక్షకై వచ్చి సీతను ‘జంకుంగొంకును మానియో మెఱపు చానాలంక వెల్గింపుమా!’ అని మెరుపుకాంతగానే సంభోధిస్తాడు. ఇలా కథలో ఏకోవాక్యతకై ఈ కవి తగిన జాగరూకత వహించడం ఓ ప్రతిభా విశేషమే!
భవిష్యత్క్థా సూచకంగా సూర్యోదయాన్ని వర్ణించిన తీరు చూడండి.
‘ఒక దురిత స్వభావమెదియో నిశిచారిణి, పెన్‌దుషారమై
ప్రకృతిని రూపుమాపుటకు రా-గమనించి సహస్రభాను నా
మకము సుదర్శనమ్మున విమర్శన చేసెడు పురుషుండు పో
లికహరి తూర్పుదిక్కున వెలింగె నవారుణ కాంతిసంపదన్!
ఇక్కడ మంచు కమ్మిన ప్రకృతి - కామదృష్టి గలిగిన శూర్పణఖకు ప్రతీక. హరియే రాముడు గదా! ఆయనే ఇక్కడ తూర్పుదిక్కున ఉదయించిన సూర్యుడు. సౌందర్యం గలిగి సుదర్శనుడైన రాముని ఆయుధం ‘సుదర్శనం’ ఇక్కడి పదం ద్వారా కవి సూచిస్తున్నారు. రాముడు సూర్యవంశీయుడే గదా! కనుక శూర్పణఖ వధను సూచించబోయే ఈ సూర్యోదయ వర్ణనం సాభిప్రాయం, సందర్భోచిత సుందరం. ఇక్కడ హరి, సుదర్శనం అన్న పలుకులు భవిష్యత్ కథాసూచకములై పలుకుబడిని పొందాయి. మొత్తమీద సర్వజనామోదమై, జాతికి అభ్యుదయాన్ని కల్గించే పలుకుబడి కలిగిన కావ్యం - శ్రీ ధనకుధర రామాయణం.

- డా.రామడుగు వేంకటేశ్వరశర్మ,
చరవాణి : 98669 44287

మనోగీతికలు

నేను నిష్క్రమించలేను...

మిత్రులారా...
నా పేరు హేవలాక్
నేను మీ గోదావరి పాత వంతెని
మీ చిరకాల నేస్తాన్ని
చిన్నప్పటి మీ ఊహల పల్లకిని
బ్రతుకు బాటలో
మీ హృదయాల్లో గిలిగింతలు పెట్టిన
నెరజాణను...
ఎన్నిసార్లు మీరెక్కిన రైలును
ఈవలి నుండి ఆవలికి చేర్చానో గుర్తుందా?
పది పుష్కరాలుగా
ఈ పవిత్ర గోదావరీ జలాల్ని
అంటిపెట్టుకొని
మీకు సేవలందిస్తూనే వచ్చాను
క్రొత్త బ్రిడ్జి మొలకెత్తినప్పటి నుండి
దాని సోయగాల్ని
ఏమాత్రం అసూయ పడకుండా
వివరించి చూపాను
ప్రతి ఎన్నికల ముందూ
నేతల వాగ్దానాలతో
నాలో కొంతంత ఆశ మొలకెత్తుతూనే ఉంది
తిరిగి నాలో జవసత్వాలు పుంజుకొంటాయని
మళ్లీ చిరకాలం మీకు సేవలందించగలనని
తూకానికి అమ్మేయడానికి
నేనొక ఇనుప ముక్కను కాను
ఒక శతాబ్దపు అనుబంధాన్ని
ఒక ఆత్మీయతా స్పర్శని
నా సృష్టికర్త
హేవలాక్ స్మృతి చిహ్నంగా
ఇంకో పది కాలాలపాటు మీకు
సేవలందించాలన్న తహతహతో
తపించిపోతున్నాను
ఆదికవి నన్నయ అడుగుజాడలతో
నవయుగ వైతాళికుడు
కందుకూరి సాంఘిక యుద్ధంతో
పునీతమైన
ఈ పవిత్ర తీరం నుండి
శాశ్వతంగా నిష్క్రమించడం
నా వల్లకాదు
మిత్రులారా!
ఈ ప్రభుత్వాలు, ఈ నేతలు కళ్లు తెరవాలి
మళ్లీ పుష్కరాలకన్నా మనం కలవాలి
మీ పాద ముద్రలతో
నా మేనంతా పులకించాలి
అప్పటిదాకా
అంపశయ్యపై భీష్ముడిలా
ఇలా మీకోసం
నిరీక్షిస్తూనే ఉంటా!
(రాజమండ్రి పాత రైలు వంతెన కోసం)

- డా. జోశ్యుల కృష్ణబాబు
పెద్దాపురం, సెల్:98664 54340

ప్రతీకారము

అద్దంపై వాలెనొక్క అమాయకపు పక్షికూన
విలాసంగ నలుచెరగుల దృష్టిని సారించి చూడ
అద్దంలో పక్షి కూన ప్రతిబింబం గోచరించె
తన ప్రతిబింబాన్ని తాను తదేకంగా చూడసాగె
తన్ను లక్ష్యపెట్టకుండ ప్రతిబింబం తన్ను చూడ
పక్షికూన అహంతోన దాని నొక్క పోటు పొడిచె
ముక్కు అద్దమును తాకి పక్షి కూన ముక్కు నొచ్చె
తన ప్రతి రూపాన్ని తాను ప్రత్యర్థిగా భావించి
కోపంతో చిందులేస్తు చురచురమని దాన్ని చూచె
తన హావభావాలే ప్రతిబింబంలోన గాంచి
పగశగయై ఎగిసి పడగ గుండెలు భగభగమండెను
ప్రతీకార రూపంగా ఎగిరి ఎగిరి పొడవ సాగె
పొడిచి పొడిచి పక్షికూన ముక్కు పగిలి రక్తమోడె
ముఖమంతా రక్తంతో తడిసి ముద్దయి పోయెను
గుండె అలసి ఆయాసం శరీరాన్ని ఆవహించె
రెక్కల్లో శక్తి తగ్గి పక్షికూన నేలకూలె
మాయలోన చిక్కుకొన్న మానవుడీ పక్షివోలె
అహంతోటి విర్రవీగి మనసు సంకుచితము కాగ
తనవారు పరవారను భేదము కల్పించుకొని
బుద్ధి మందగించిపోవ మానవతను మరచిపోయి
ఎదుటి మనిషి శత్రువని భ్రమను చెందుచున్నాడు
తన ప్రతిబింబంతో తానే పోరు సల్పు కూన వోలె
వ్యితిరేకపు భావనలే మనసులోన బుసలు కొట్ట
ఫేక్షనిజం వ్యాప్తి చేస్తు టెర్రరిస్టుననుకొంటు
తన వారిని తానే తుదముట్టిస్తూ ఉన్నాడు
తనకు తాను వినాశాన్ని కోరి కొని తెచ్చుకొని
తన మూలాలను తానె తెగ నరక్కొంటు ఉన్నాడు
నీటి బుడగవంటి బ్రతుకు నిత్యమని తలపోస్తూ
ప్రతీకారమనుకొంటు మధ్యలోనె పగుల్చుకొంటు
తన సుఖ సంతోషాలను కాలరాసుకొంటున్నాడు

- వెలగల ప్రదీప్ శంకర్‌రెడ్డి, కొంకుదురు, బిక్కవోలు మండలం

ఓ పిచ్చుకల్లారా!
ఏమైపోయిరి?
కిచకిచమనే చప్పుళ్లతో
చూడముచ్చట గొలిపే
ఓ పిచ్చుకల్లారా!
ఇళ్ల పంచలకూ
మట్టి మిద్దెలకూ వేళ్లాడదీసే
వరికంకుల గుత్తులను
తినుటకు రాలేదేం?
ఎటు వైపు చూసినా
మీ జాడ కనిపించదేం?
పర్యావరణ కాలుష్యం
మీ ఉనికినే కనుమరుగు చేసిందా?
ప్రపంచీకరణ వేగంలో
మీరేమైపోయిరో
ఓ పిచ్చుకల్లారా?

- బుద్దా రామారావు,
ఫోన్ : 08854-256886.

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

email: merupurjy@andhrabhoomi.net

- వందన శ్రీనివాస్