రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..66 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్ముడు, నిజమైన పరాక్రమం గల శూరుడైన రాముడు వనవాసానికి వెళ్తూండగా అతని మీద ప్రేమతో పౌరులంతా దశరథుడితో పాటు రాముడ్ని అనుసరించి వెళ్లారు. రాముడి రథం వెంట వెళ్లే ప్రజలు వెనక్కి తిరగలేదు. గొప్ప కీర్తిగల, సద్గుణ సంపన్నుడైన రాముడు అయోధ్యలో నివసించే ప్రజలందరికీ పూర్ణచంద్రుడిలా ప్రియమైన వాడు, తన ప్రజలంతా ఎంత ప్రార్థించినా వినక, రాముడు తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి అడవికి బయలుదేరాడు. రాముడు ఆ ప్రజలని తన బిడ్డల్లా ప్రేమగా చూస్తూ స్నేహపూర్వకంగా ఇలా చెప్పాడు.
‘అయోధ్యా వాసులైన మీకు నా మీద ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో అదే ప్రేమ భరతుడి మీద చూపించండి. అలా చేస్తే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. కైకేయి కొడుకైన భరతుడు మంచి చరిత్ర కలవాడు. అతను మీకు ఇష్టమైన క్షేమమైన మంచిని చేసే పనులని చక్కగా చేస్తాడు. రాజగుణాలతో కూడిన భరతుడు యువరాజుగా నియమించబడ్డాడు. నేను, మీరు కూడా ప్రభువైన దశరథుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. మీరు నాకు సంతోషం కలిగించాలి అనుకుంటే, నేను వనవాసానికి వెళ్లాక మహారాజు విచారించకుండా చూసుకోండి.’
రాముడు ధర్మం మీద స్థిరంగా నిలిచిన కొద్దీ, ప్రజలు కూడా అతనే తమ రాజవాలని కోరసాగారు. కన్నీరు కారుస్తూ దీనంగా ఏడ్చే ఆ పౌరులని లక్ష్మణుడితో కూడిన రాముడు తన గుణాలు అనే తాళ్లతో కట్టి ఆకర్షించాడు. వృద్ధులైన బ్రాహ్మణులు వృద్ధాప్యంతో తలలు వణుకుతూండగా, దూరం నించే ఇలా చెప్పారు.
‘ఉత్తమ జాతిలో పుట్టి, మంచి వేగం కలిగి, రాముడ్ని తీసుకెళ్లే ఓ గుర్రాల్లారా! ముందుకి వెళ్లకుండా వెనక్కి మళ్లండి. మీ ప్రభువైన రాముడికి మంచి చేయండి. జంతువులు అన్నిటికీ చెవులుంటాయి. అందులో గుర్రాల చెవులకి అధికమైన గ్రహణ శక్తి ఉంటుంది. అందువల్ల మీరు మా ప్రార్థనని విని వెనక్కి మళ్లండి. ధర్మంతో పరిశుద్ధమైన మనసుతో, మంచి పనుల్లో స్థిరంగా ఉండే వీరుడైన, మీ ప్రభువుని మీరు పట్టణంలోకి తీసుకురావాలి కాని, పట్టణం నించి అడవికి తీసుకెళ్లకూడదు’
ఇలా విచారంతో కూడిన మాటలు చెప్పే ఆ వృద్ధ బ్రాహ్మణులని చూసి మంచి చరిత్ర, ప్రేమ, దయతో కూడిన కళ్లు గల రాముడు నడిచి వచ్చే బ్రాహ్మణులని వదిలి తను రథం మీద వెళ్లలేకపోయాడు. రాముడు వెంటనే రథం దిగి, సీతాలక్ష్మణులతో అడవి వైపు మెల్లగా నడిచాడు. రాముడు అతని వైపు వెళ్లడం చూసి బ్రాహ్మణులు మరింత విచారిస్తూ చెప్పారు.
‘ఈ బ్రాహ్మణ సమూహమంతా బ్రాహ్మణుల మంచి కోరే నీ వెనకే వస్తోంది. ఈ అర్నులు కూడా బ్రాహ్మణుల భుజాల మీద ఎక్కి నీ వెనకే వస్తున్నాయి. నాయనా! మా బుద్ధి ఎప్పుడూ వేద మంత్రాల మీదే ఉంటుంది. అలాంటి మా బుద్ధి నీ కోసం వనవాసం కోరుతోంది. మా ఉత్తమ ధనమైన వేదాలు మా హృదయాల్లోనే ఉంటాయి. మా భార్యలు పాతివ్రత్యంతో రక్షించబడుతూ ఇళ్లల్లో ఉంటారు. నువ్వు అయోధ్యకి తిరిగి రావాలని మేము నిర్ణయించాము. దీన్ని కాదనరు. ధర్మం మీద నీకు ఆపేక్ష లేకపోతే ఇంకెవరు ధర్మాన్ని ఆచరిస్తారు? నేల మీద పడటం వల్ల దుమ్ము తగిలిన హంసల్లా తెల్లటి వెంట్రుకలు గల తలలతో మేము ప్రార్థిస్తున్నాం. వెనక్కి మళ్లు. ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్లో చాలామంది యజ్ఞాలు ప్రారంభించారు. నాయనా! వాటి సమాప్తి నువ్వు తిరిగి రావడం మీదే ఆధారపడి ఉంది. ఓ రామా! భూమి మీది సకల ప్రాణులు నీపై భక్తితో నిన్ను ప్రార్థిస్తున్నాయి. నువ్వు వాటి మీద స్నేహం చూపించు. వాయువేగంతో లేచిన ఈ చెట్లు నిన్ను అనుసరించాలని కోరుకున్నా, వాటి వేగాన్ని వేళ్లు అడ్డుకోవడంతో నిన్ను అనుసరించలేక ఏడుస్తున్నట్లు ఉన్నాయి. పక్షులు కూడా కదలికలు, ఆహారం, సంచారం మాని చెట్ల మీద కూర్చుని సర్వ ప్రాణుల మీద జాలి గల నిన్ను వెనక్కి రమ్మని ప్రార్థిస్తున్నాయి.’
రాముడ్ని వెనక్కి మళ్లించడానికి బ్రాహ్మణులు అలా వేడుకుంటూండగా, ఇంతలో తను కూడా రాముడ్ని నివారిస్తోందా అన్నట్లుగా తమసానది కనిపించింది. తర్వాత సుమంత్రుడు అలసిపోయిన గుర్రాలని రథం నించి విప్పి వాటిని నేల మీద దొర్లించి, నీటిని తాగించి, వాటి శరీరాలని కడిగి, తమసా నదీ సమీపంలో వాటిని మేతకి వదిలాడు. (అయోధ్య కాండ సర్గ -45)
అందమైన తమసా నదీ తీరాన్ని చేరాక సీతని చూసి రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు.
‘లక్ష్మణా! మనం అడవికి పంపబడ్డాం కదా? ఈ రోజు ఇది మన వనవాసంలో మొదటి రాత్రి. నువ్వు దిగులు చెందకు. జంతువులు, పక్షులు వాటి వాటి స్థానాలకి చేరాయి. శూన్యమైన ఈ అడవులు నాలుగు వైపులా ఏడుస్తున్నట్లుగా ఉన్నాయి. చూడు. ఇప్పుడు నా తండ్రి రాజధానైన అయోధ్య నగరంలోని స్ర్తి, పురుషులంతా మనం వదిలి వచ్చినందుకు నిస్సందేహంగా విచారిస్తూంటారు. అనేక గుణాలని బట్టి పౌరులందరికీ రాజు మీద, నీ మీద, నా మీద, భరత శతృఘు్నల మీద చాలా ప్రేమ ఉంది. నా తండ్రి, కీర్తివంతురాలైన నా తల్లి నా కోసం ఎక్కువగా ఏడ్చి, ఏడ్చి గుడ్డివాళ్లై పోతారేమోనని బాధగా ఉంది. ధర్మాత్ముడైన భరతుడు ధర్మార్థ కామాలని బోధించే మాటలతో నా తల్లిదండ్రులని తప్పక ఓదార్చగలడు. లక్ష్మణా! మాటిమాటికీ భరతుడు మంచితనం గురించి తలచుకుంటే నాకు తల్లితండ్రుల విషయంలో ఎలాంటి బాధా కలగడం లేదు. నా వెంట వచ్చి నువ్వు మంచి పని చేశావు. సీతని రక్షించుకోవడానికి నాకు సహాయం కావాలి కదా? ఈ రాత్రి నేను నీళ్లు మాత్రమే తాగి ఉంటాను. అనేక విధాలైన వన పదార్థాలు లభిస్తున్నా నాకు ఇప్పుడు ఇలా ఉండటమే ఇష్టం.’
రాముడు సుమంత్రుడ్ని గుర్రాలని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత సుమంత్రుడు మేసే గుర్రాలని కట్టేసి, వాటికి అధికంగా గడ్డి వేసి వాటి దగ్గరే ఉన్నాడు. సంధ్య వార్చి రాత్రి రావడంతో రామలక్ష్మణులకి పక్కని ఏర్పాటు చేశాడు. రాముడు తమసా నదీ తీరంలో చెట్ల ఆకులతో ఏర్పాటు చేసిన పక్కని చూసి సీతతో పడుకున్నాడు. లక్ష్మణుడు కూడా పడుకున్నాడు. రాముడు, సీత నిద్రిస్తూండగా, లక్ష్మణుడు రాముడిలోని అనేక సద్గుణాల గురించి సుమంత్రుడికి వర్ణించి చెప్పాడు. ఆ తమసా తీరంలో లక్ష్మణుడు సుమంత్రుడికి రాముడి గుణాల గురించి వర్ణిస్తూ మెలకువగా ఉండగానే రాత్రి గడిచి సూర్యుడు ఉదయించాడు.
రాముడు ఆ రాత్రి తన వెంట వచ్చిన ప్రజలతో, పశువులతో నిండిన తమసా తీరానికి దూరంగా ఉన్నాడు. మహాతేజశ్శాలైన రాముడు నిద్ర లేచి, ఆ ప్రజలని చూసి శుభ లక్షణాలు గల తమ్ముడు లక్ష్మణుడితో చెప్పాడు.
‘లక్ష్మణా! వీరంతా మన మీద ప్రేమతో, ఇళ్ల మీద ఆపేక్షని కూడా వదిలేసి చెట్ల కింద నిద్రిస్తున్నారు చూడు. మనల్ని వెనక్కి మరల్చే వీరి పట్టుదలని చూస్తే, వీళ్లు ప్రాణాల్నైనా విడుస్తారు కాని తమ నిశ్చయాన్ని మాత్రం విడవరు అనిపిస్తోంది. వీరు మేలుకోక మునుపే మనం రథం ఎక్కి వేగంగా ఎలాంటి భయం లేని దారిలో వెళ్దాం. అప్పుడు నా మీద ప్రేమ గల ఈ అయోధ్యా ప్రజలు చెట్ల మొదళ్లలో ఇప్పుడు నిద్రిస్తున్నట్లు మళ్లీ నిద్రించరు. పౌరులకి తమ వల్ల ఏదైనా విచారం కలిగితే దాన్ని రాజకుమారులు తొలగించాలి కాని స్వయంగా నగర వాసులకి దుఃఖాన్ని కలిగించకూడదు.’
మూర్త్భీరించిన ధర్మంలా కనిపించే రాముడితో లక్ష్మణుడు చెప్పాడు.
‘బుద్ధిశాలైన ఓ రామా! నువ్వు చెప్పింది నాకూ ఇష్టమే. వెంటనే రథాన్ని ఎక్కు’
తేజశ్శాలైన రాముడు సుమంత్రుడితో చెప్పాడు.
‘ఓ సమర్థుడా! రథాన్ని కట్టు. దాని మీద అడవికి వెళ్తాను. ఇక్కడ నించి వెంటనే బయల్దేరుదాం’
ఆ సారథి త్వరగా రథానికి గుర్రాలు కట్టి, రాముడికి నమస్కరించి చెప్పాడు.
‘రథికుల్లో గొప్పవాడైన రామా! ఈ రథం కట్టాను. ఓ ఆజానుబాహు! నువ్వు, సీతా, లక్ష్మణుడు దీని మీద ఎక్కండి. నీకు క్షేమమగు గాక’
రాముడు తన పరికరాలతో రథాన్ని ఎక్కి సుడులతో ప్రవహించే తమసా నదిని దాటారు. రాముడు తమసా నదిని దాటి మంగళకరం, బాధలు లేనిది, భయపడే వారికి కూడా భయాన్ని కలిగించనిదైన మహా మార్గంలోకి వెళ్లాడు. పౌరులని మోసగించడానికై రాముడు సుమంత్రుడితో ఇలా చెప్పాడు.
‘ఓ సుమంత్రా! నువ్వు రథం ఎక్కి కొంత దూరం ఉత్తరం వైపు వెళ్లి మళ్లీ రథాన్ని వెనక్కి తిప్పు. ప్రశాంతమైన మనసుతో ప్రజలకి నా విషయం తెలీకుండా చూడు’
సుమంత్రుడు రాముడి ఆజ్ఞ ప్రకారం అలా చేసి, తిరిగి వచ్చి రాముడికి రథం సిద్ధంగా ఉందని చెప్పాడు. సీతతో కలిసి రామలక్ష్మణులు గుర్రాలని కట్టిన ఆ రథాన్ని ఎక్కారు. సుమంత్రుడు గుర్రాలని తపోవనం వైపు వెళ్లే దారిలో నడిపించాడు. (అయోధ్యకాండ సర్గ -46)
‘అయ్యా! అది ఇవాళ్టి కథ. ఇవాళ 44, 45 సర్గలు చెప్పుకున్నాం. రేపు మళ్లీ 46వ సర్గలో కలుద్దాం’ హరిదాసు చెప్పాడు.
ఇంటి దగ్గర ఆ రెండు కాండలు చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఐదు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా?’
ఆ తప్పులని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*

గాంధీ రామాయణ మీద రాసిన
పుస్తకం పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
గాయత్రీ మంత్రంలోని ఐదో బీజాక్షరం ఏ సర్గలో వస్తుంది?
-అయోధ్యకాండ సర్గ -44లోని 5వ శ్లోకంలో వస్తుంది.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.‘దేవతలకి ఇవ్వాల్సిన భాగాన్ని రాక్షసులకి ఇచ్చినట్లుగా’ రాముడి రాజ్యాన్ని భరతుడికి ఇచ్చావు. అని కౌసల్య వాడిన ఉపమానాన్ని హరిదాసు చెప్పలేదు.
2.తన కొడుకు నించి తనని ‘సింహం ఆవు దూడని, తల్లిని వేరు చేసినట్లుగా వేరు చేసింది’ అని కైకేయి చెప్పిన ఉపమానం కూడా హరిదాసు చెప్పలేదు.
3.రాముడు చంపింది దానవరాజైన శంబరాసురుడి కొడుకుని. సహస్రముఖుడు తప్పు.
4.రాముడికి ‘భూమి, సీత, లక్ష్మి’ అనే ముగ్గురితో కలిసి రాజ్యాభిషేకం జరుగుతుంది అని సుమిత్ర చెప్పింది. కేవలం సీత పేరు మాత్రమే హరిదాసు చెప్పాడు.
5.అయోధ్య కాండ సర్గ 43, 44 హరిదాసు చెప్పాడు. కాని తప్పుగా ‘రేపు మళ్లీ 44వ సర్గలో కలుద్దాం’ అని తప్పు చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి