రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 89 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌరవనీయమైన జనాలతో నిండిన సభ బుద్ధిశాలైన భరతుడికి పూర్ణచంద్రుడు ఉత్తమ గ్రహాలతో కూడిన రాత్రిలా తోచింది. సభ్యులంతా ఎవరికి తగ్గ ఆసనాలలో వాళ్లు కూర్చుంటూంటే వారి బట్టలకి పూసుకున్న సుగంధ ద్రవ్యాల కాంతి చేత ఆ సభంతా కళకళలాడుతోంది. పండితులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువులో పూర్ణచంద్రుడితో కలిసి రాత్రిలా కళకళలాడింది. వాళ్లని చూసి ధర్మవేతె్తైన వశిష్ఠుడు భరతుడితో మృదువుగా ఇలా చెప్పాడు.
‘నాయనా! దశరథ మహారాజు ధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పాలించి ధనధాన్య సమృద్ధమైన ఈ విశాలమైన భూమిని నీకు ఇచ్చి స్వర్గస్థుడయ్యాడు. సత్యం మీద స్థిరమైన మనసు గల రాముడు కూడా సత్పురుషులు పాటించే ధర్మాలని పాటిస్తూ, ఉదయించిన చంద్రుడు వెనె్నలని విడవనట్లు తండ్రి ఆజ్ఞని విడవలేదు. ఇలా మీ తండ్రీ, సోదరుడు నీకు ఇచ్చిన ఏ బాధలూ లేని ఈ రాజ్యాన్ని సంతోషించే మంత్రులతో అనుభవించు. వెంటనే రాజ్యాభిషిక్తుడివి అవు. ఉత్తర, పశ్చిమ, దక్షిణ దేశపు రాజులు, సింహాసనం లేని రాజులు, సరిహద్దుల్లోని రాజులు, సముద్ర ద్వీపాల్లోని రాజులు నీకు కోట్లాది ఉత్తమ వస్తువులని కానుకలుగా తీసుకొచ్చి సమర్పిస్తారు.’
ధర్మజ్ఞుడైన భరతుడు ఆ మాటలు విని శోకంతో ధర్మమార్గాన్ని అవలంబించాలని కోరుకుంటూ రాముడ్ని మనసులో స్మరించాడు. కలహంస స్వరం లాంటి స్వరం గల యువకుడైన భరతుడు సభ మధ్యలో గద్గద స్వరంతో విలపిస్తూ పురోహితుడ్ని నిందించాడు.
‘బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి, సకల విద్యలూ నేర్చుకుని, ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న రాముడి వంట వాడికి చెందాల్సిన రాజ్యాన్ని అపహరించాలని నాలాంటి వాడు ఎవడైనా ప్రయత్నిస్తాడా? దశరథుడికి పుట్టిన వాడు ఎన్నడైనా రాజ్యాన్ని అపహరిస్తాడా? ఈ రాజ్యం, నేను కూడా రాముడికి చెందినవాళ్లం. ఈ విషయంలో ధర్మమేమిటో నువ్వే చెప్పు. పెద్దవాడు, శ్రేష్ఠుడు, ధర్మాత్ముడైన రాముడికే ఈ రాజ్యం పైన దశరథుడిలా అధికారం ఉంది తప్ప మరెవరికీ లేదు. చెడ్డవాళ్లు చేసే నరకహేతువైన ఈ పాపాన్ని చేస్తే నేనీ లోకంలో ఇక్ష్వాకు వంశానికి కళంకం తెచ్చిన వాడిని అవుతాను. నా తల్లి చేసిన పాపకార్యాన్ని నేనే మాత్రం ఇష్టపడను. దుర్గమమైన అడవిలో ఉన్న అన్నగారికి దోసిలి కట్టి ఇక్కడ నించే నమస్కరిస్తున్నాను. నేను రాముడ్ని అనుసరించి వెళ్తాను. మనుషుల్లో శ్రేష్ఠుడైన ఆ రాముడే రాజు. ఇంకెవరూ కారు. రాముడు మూడు లోకాల్లో రాజ్యం ఏలడానికి కూడా తగిన వాడు’
సభలోని వారంతా ధర్మబద్ధమైన భరతుడి మాటలు విని రాముడ్ని స్మరిస్తూంటే ఆనంద భాష్పాలు వచ్చాయి.
‘గుణవంతులు, సత్పురుషులు, పూజ్యులైన మీ అందరి ఎదుట రాముడ్ని ఎలాగైనా వెనక్కి తీసుకురావడానికి అన్ని ఉపాయాలు ప్రయోగిస్తాను. మార్గాన్ని వెదికే వాళ్లు, రక్షించే వాళ్లైన వెట్టి వాళ్లని, కూలి వాళ్లను నేను ముందుగానే పంపాను. ఇప్పుడు నేను కూడా బయలుదేరాలని అనుకుంటున్నాను.’
ధర్మాత్ముడు, సోదరుడి మీద ప్రేమగల భరతుడు ఇలా చెప్పి పక్కనే ఉన్న ఆలోచనలో నేర్పరైన సుమంత్రుడితో ఇలా చెప్పాడు.
‘సుమంత్రా! వేగంగా లేచి వెళ్లి నా ఆజ్ఞగా చెప్పి ప్రయాణ ఏర్పాట్లు చెయ్యి. వెంట సైన్యాన్ని కూడా తీసుకురా’
మహాత్ముడైన భరతుడి మాటలు విని సుమంత్రుడు సంతోషించి ఆ ఆజ్ఞ ప్రకారం తనకి ఇష్టమైన పని చేయడంలో చేసే శ్రద్ధతో ఆ పనిని చేసాడు. రాముడ్ని వెంట తీసుకుని రావడానికి సైన్యాన్ని కూడా తీసుకువెళ్లాని ఆజ్ఞ ఇచ్చినట్లు విని ప్రముఖులు, సైన్యాధ్యక్షులు సంతోషించారు. సైనికుల భార్యలంతా భరతుడు సంకల్పించిన యాత్రని గురించి విని సంతోషిస్తూ ప్రతీ ఇంట్లో తమ భర్తలని తొందరపెట్టారు. గుర్రాలు, వేగంగా నడిచే ఎడ్లబళ్లు, గొప్ప వేగం గల రధాలు, యుద్ధ్భటులున్న సైన్యాన్ని సైన్యాధ్యక్షులు ముందుకి నడిపించారు. భరతుడు సిద్ధమైన ఆ సైన్యాన్ని చూసి, గురువైన వశిష్టుడి ఎదుట, తన పక్కనే ఉన్న సుమంత్రుడితో ‘నా రథాన్ని త్వరగా సిద్ధం చేయి’ అని ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు సంతోషంతో ఉత్తమమైన గుర్రాలు కట్టిన రథాన్ని తీసుకువచ్చాడు.
సత్యమైన చిత్తస్థైర్యం కలవాడు, ప్రతాపవంతుడు, నిజమైన పరాక్రమం కలవాడు, సమయస్ఫూర్తితో మాట్లాడేవాడు, రఘువంశంలో పుట్టిన భరతుడు మహారణ్యంలో ఉన్న కీర్తివంతుడైన అన్నగారిని అనుగ్రహింప చేసుకోవడానికి వెళ్తూ చెప్పాడు.
‘సుమంత్రా! వెంటనే వెళ్లి సైన్యాన్ని సమకూర్చుకోమని సైన్యాధిపతులకి చెప్పు. అడవిలోని రాముడ్ని ఒప్పించి ప్రపంచానికి మంచి చేయడానికై తీసుకురావాలని కోరుకుంటున్నాను.’
భరతుడు ఇలా చెప్పగానే సుమంత్రుడు తన కోరిక తీరిందని సంతోషిస్తూ ప్రధానమైన వారిని, సేనాధిపతులని, మిత్రులని ఆ ప్రకారం ఆజ్ఞాపించాడు. తర్వాత ప్రతీ ఇంటి నించి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, ఒంటెలు, గాడిదలు, రథాలు, ఉత్తమ జాతికి చెందిన ఏనుగులు, గుర్రాలని సిద్ధం చేసారు. (అయోధ్యకాండ 82వ సర్గ)
భరతుడు తెల్లవారుఝామునే లేచి, మంచి రధాన్ని ఎక్కి రాముడ్ని చూడాలనే కోరికతో త్వరగా వెళ్లాడు. మంత్రులు, పురోహితులు గుర్రాలు కట్టిన సూర్యరథంతో సమానమైన రథాలని ఎక్కి భరతుడి ముందు వెళ్లారు. ఇక్ష్వాకు వంశానికి ఆనందాన్నిచ్చే భరతుడు ముందు వెళ్తూండగా, అతని వెనక లక్ష ఏనుగులు అనుసరించాయి. ఆ వెనక అరవై వేల రథాలు, అనేక రకాల ఆయుధాలు ధరించిన సైనికులు వెళ్లారు. వారిని లక్ష మంది గుర్రాల మీద అనుసరించి వెళ్లారు. కైకేయి, సుమిత్ర, కీర్తివంతురాలైన కౌసల్య కూడా రాముడు తిరిగి వస్తాడనే ఆనందంతో కళకళలాడే వాహనాలెక్కి వెళ్లారు. ప్రజలు గుంపులు గుంపులుగా రాముడికి సంబంధించిన విశేషాలని చెప్పుకుంటూ రామలక్ష్మణులని చూడటానికి సంతోషంగా వెళ్లారు.
‘మేఘశ్యాముడు, మహాబాహు, స్థిరమైన బలం, దృఢమైన నిశ్చయం గలవాడు, ప్రపంచంలోని శోకాన్ని నశింపచేసే రాముడ్ని ఎప్పుడు చూస్తామో కదా? ఉదయించిన సూర్యుడు సకల లోకాల్లోని చీకటిని తొలగించినట్లు రాముడు మనల్ని చూడగానే మన శోకాలన్నీ తొలగింపబడతాయి.’
పట్టణంలోని ప్రజలంతా ఇలా మంచి మాటలు చెప్పుకుంటూ, సంతోషంగా వెళ్లారు. పట్టణంలోని రాజకుటుంబానికి దగ్గరగా ఉండేవాళ్లు, వర్తక సంఘానికి చెందిన వాళ్లు, సమస్తమైన ప్రముఖులు సంతోషిస్తూ, రాముడ్ని చూడటానికి వెళ్లారు. భరతుడి వెంట రత్నాలు సానపట్టేవాళ్లు, అందమైన కుండలు తయారుచేసేవాళ్లు, సాలె వాళ్లు, ఆయుధాలతో జీవించే వాళ్లు, నెమలి పింఛాలతో అలంకరణ చేసే వాళ్లు, రంపపు పనిచేసేవాళ్లు, అలంకరణలు చేసేవాళ్లు, రంధ్రాలు చేసేవాళ్లు, దంతపు పనిచేసే వాళ్లు, సున్నం వేసేవాళ్లు, సుగంధ ద్రవ్యాలు చేసి జీవించేవాళ్లు, ప్రసిద్ధులైన కంసాలులు, కంబళ్లు ఉతికేవాళ్లు, స్నానాలు చేయించేవాళ్లు, వేడి నీళ్లు అందించే వాళ్లు, వైద్యులు, సుగంధ ధూపాలు వేసే వాళ్లు, చాకళ్లు, కుట్టు పనివాళ్లు, గ్రామాల్లో, గొల్లపల్లెల్లో ఉండే పెద్దవాళ్లు, స్ర్తిలతో కూడిన నటులు, చేపలు పట్టేవాళ్లు వెళ్లారు.
నిశ్చయమైన మనసు కలవాళ్లు, మంచి నడవడిక చేత పూజ్యులు, వేదవేత్తలైన వేలాది బ్రాహ్మణులు భరతుడి వెనక ఎడ్ల బళ్లెక్కి వెళ్లారు. వాళ్లంతా మంచి వేషాలు, శుభ్రమైన బట్టలు ధరించి, ఎర్రటి మంచి సుగంధ ద్రవ్యాల లేపనాలని ఒంటికి పూసుకుని, అనేక రకాల బళ్లెక్కి భరతుడ్ని అనుసరించారు. బాగా సంతోషిస్తూ, ఆనందిస్తూ ఆ సైన్యం సోదరుడి మీద ప్రేమతో అతన్ని తిరిగి తీసుకు రావడానికై వెళ్తున్న భరతుడి వెంట వెళ్లారు. వారంతా రథాల మీద, బళ్ల మీద, గుర్రాలు, ఏనుగులు మీద చాలా దూరం ప్రయాణం చేసి రాముడి మిత్రుడు, వీరుడైన గుహుడు ఏమరుపాటు లేకుండా తన బంధువులతో కలిసి పరిపాలిస్తూ నివసించే భృంగిబేరపురం దగ్గర గంగానదిని సమీపించారు. భరతుడి వెనక ప్రయాణించే ఆ సేన చక్రవాక పక్షులతో అందంగా ఉన్న గంగాతీరాన్ని చేరి నిలిచిపోయారు. తన వెనక వచ్చిన సేనని, ముందున్న పవిత్ర గంగని చూసి మాటల్ల నేర్పరైన భరతుడు మంత్రులతో చెప్పాడు.
‘మీ సౌకర్యం ప్రకారం సైన్యాన్ని ఆయా స్థానాల్లో విడిది చేయించండి. ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపీ గంగానదిని దాటుదాం. నేను గంగానదిలో దిగి స్వర్గస్థుడైన నా తండ్రికి పారలౌకిక శరీరానికి శుభం కలగడం కోసం జల తర్పణాలు చేయాలని అనుకుంటున్నాను.’
‘అలాగే చేస్తాం’ అని చెప్పి వాళ్లు తమ ఇష్ట ప్రకారం ఆ సేనని అక్కడక్కడా విడిది చేయించారు. భరతుడు అనేక విధాలైన పరికరాలతో అందంగా ఉన్న ఆ సేనని గంగానది ఒడ్డున విడిది చేయించి మహాత్ముడైన రాముడ్ని ఎలా వెనక్కి తీసుకురావాలి అని ఆలోచించసాగాడు. (అయోధ్యకాండ 83వ సర్గ)
హరిదాసు ఆ రోజు చెప్పిన కథ విన్నాక ఆరుగురు శ్రోతలు ఆరు తప్పులని కనుక్కుని హరిదాసుకి చెప్పారు. ఆయన వెంటనే అయోధ్య కాండ పుస్తకం తెరిచి తన తప్పులని ఒప్పుకున్నాడు. మొదటి తప్పుని ఆశే్లష కనుక్కున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
నిషాద రాజ్యం
ఎక్కడుంది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
భరతుడు అంటే అర్థం ఏమిటి?
భరతుడు అంటే అశేషమైన భూమిని పోషించే (్భరించే)వాడు.
*
1.పధ్నాలుగో రోజున రాజ్యాభిషేకం చేసుకోమని భరతుడ్ని కోరడానికి రాజుని చేసే అధికారం గల మంత్రులతో పాటు ‘కైకేయి’ వెళ్లలేదు. హరిదాసు తప్పుగా కైకేయి కూడా వెళ్లినట్లు చెప్పాడు.
2.‘నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో వుంటాను’ అని భరతుడు మంత్రులకి చెప్పిన మాటలని హరిదాసు విస్మరించాడు.
3.దారి చేసే చోట కొందరు బావులని, లోతైన గోతులని బూడిదతో కప్పేసారు అని వాల్మీకి చెప్పింది హరిదాసు చెప్పలేదు.
4.సైనిక శిబిరాలు గంగానది వరకు వ్యాపించి ఉన్నాయి అని వాల్మీకి రాస్తే, హరిదాసు గంగానది పేరు చెప్పకుండా ఓ నది అని మాత్రమే చెప్పాడు.
5.దుందుభుల మోతకి భరతుడు మేలుకోగానే ‘నేను రాజుని కాదు’ అని చెప్పి ఆ ధ్వనిని నిలిపేశాడు. భరతుడి ఔన్నత్యాన్ని తెలియజేసే దీన్ని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి