రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం--78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న
దశరథుడు చంపిన ముని కుమారుడి పేరేమిటి?
-----------------------------------------------------------

నారదుడు తను చెప్పేది మళ్లీ ఇలా కొనసాగించాడు.
‘రాజా! బాణంతో నా కొడుకుని చంపి నన్ను కొడుకులు లేని వాడినిగా చేసావు కదా? నన్ను కూడా ఇప్పుడు చంపు. మరణం గురించి నాకు బాధలేదు. నువ్వు పవిత్రుడైన నా కొడుకుని తెలీక చంపినా సరే, నీకు చాలా విచారం కలిగించే భయంకరమైన శాపాన్ని ఇస్తాను. రాజా! ఇప్పుడు నేను పుత్రశోకంతో బాధపడుతున్నట్లే నువ్వు కూడా పుత్రశోకంతో బాధపడుతూ మరణిస్తావు. క్షత్రియుడవైన నువ్వు మునిని తెలీక చంపావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటదు. నీ జీవితాన్ని అంతం చేసే ఘోరమైన ఇలాంటి పుత్రశోకం దాతని ఫలం చేరినట్లుగా నిన్ను చేరుతుంది.’
‘సంతానం లేని నాకు మీ శాపం వరం. నాకు సంతానం కలగబోతోందన్నమాట’ దశరథుడు సంతోషించాడు.
దశరథుడు ఏడుస్తూ మళ్లీ కౌసల్యతో చెప్పాడు.
‘ఆ దంపతులు నన్నీ విధంగా శపించి చాలా దీనంగా ఏడ్చి, తమ శరీరాలని చితి మీద ఉంచి ప్రాణత్యాగం చేసి స్వర్గానికి వెళ్లారు. కౌసల్యా! ఆనాడు శబ్దవేధిని ప్రయోగించి నేను అజ్ఞానంతో చేసిన పాపం గురించి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఇది గుర్తుకు వచ్చింది. ‘అపత్యమైన పదార్థాలని కలిపి అన్నం తింటే తర్వాత వ్యాధి వచ్చినట్లుగా, నేను ఎప్పుడో చేసిన కర్మకి ఫలంగా ఇది వచ్చింది. కాబట్టి నేను పుత్రశోకంతో మరణిస్తాను’ అని ఆ మునీశ్వరుడు చెప్పిన మాట నాకు ఈ రోజు గుర్తుకు వచ్చింది. నా దృష్టి మందగించింది. నువ్వు నాకు కనపడటం లేదు. నన్ను ముట్టుకో.
‘కౌసల్యా! రాముడి విషయంలో నేను చేసిన పని పాపబుద్ధిగల నాకు తగినట్లే ఉంది. నేను చేసిన పాపపు పని రాముడికే తగింది. ఈ లోకంలో తెలివి గలవాడెవడైనా ఎంత చెడ్డవాడైనా సరే, తన కొడుకుని విడిచిపెడతాడా? ఏ కొడుకైనా తనని ప్రవాసానికి పంపే తండ్రి మీద కోపగించకుండా ఉంటాడా? నేను మరణించేలోపు రాముడు నన్నొక్కసారి తాకినా, లేదా నా దగ్గరికి వచ్చినా బావుండేది. మరణం తర్వాత మానవులు తమ బంధువర్గాన్ని చూడలేరు కదా? నా కళ్లకి నువ్వు కనపడటం లేదు. నా జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. ఇదిగో, యమదూతలు నన్ను తొందరపెడుతున్నారు. ధర్మవేత్త, సత్యపరాక్రముడైన రాముడు నా మరణ సమయంలో దూరమైపోయాడు. ఇంతకంటే అధికమైన దుఃఖం ఏదైనా ఉంటుందా? సాటిలేని మహాకార్యాలు చేయగల నా కొడుకు కనపడక పోవడంతో కలిగిన శోకం, స్వల్పంగా ఉన్న నీటిని ఎండ ఎండింప చేసినట్లు నా ప్రాణాలని తీసేస్తోంది. నేటికి పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాముడి అందమైన మొహాన్ని ఎవరు చూస్తారో వారు మానవులు కారు. దేవతలే. తామర రేకుల్లాంటి కళ్లు, అందమైన కనుబొమలు, చక్కటి పలువరుస, అందమైన ముక్కుతో, చంద్రుడితో సమానమైన రాముడి మొహాన్ని ధర్మాత్తులు అతను తిరిగి వచ్చాక మళ్లీ చూడగలరు. నా రాముడి మొహాన్ని ఎవరు చూడగలరో వాళ్లు ధన్యాత్ములు. వనవాసం ముగించుకుని అయోధ్యకి తిరిగి వచ్చిన రాముడ్ని, ఆకాశ మార్గంలోని శుక్రుడ్ని చూసినట్లు సుఖవంతులు చూడగలరు.
‘కౌసల్యా! చిత్తమోహంతో నా మనసు కృంగిపోతున్నట్లుంది. నా అవయవాలకి దగ్గరగా వచ్చిన శబ్దం, స్పర్శ, రూపం మొదలైన వాటిని గ్రహించలేక పోతున్నాను. మనసు నశించడంతో నా అవయవాలన్నీ నూనె లేకపోవడంతో దీపకిరణాలు నశించినట్లుగా నశిస్తున్నాయి. నీటి ప్రవాహ వేగం తీరాన్ని కూలదోసినట్లు పుత్రవియోగం వల్ల కలిగిన ఈ శోకం అనాథుడ్ని, కదలికల్లేని నన్ను క్షీణింపజేస్తోంది. అయ్యో రామా! అయ్యో మహాబాహు! అయ్యో నా దుఃఖాన్ని రూపుమాపేవాడా! అయ్యో తండ్రికి ఇష్టమైనవాడా! నన్ను కాపాడేవాడా! అయ్యో కుమారా! ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయావు? అయ్యో కౌసల్యా! అయ్యో దీనురాలివైన సుమిత్రా! అయ్యో క్రూరురాలివి. నా శత్రువు, నా కులాన్ని అపవిథం చేసిన దానివైన కైకేయి! నేను ఇప్పుడు చావబోతున్నాను’ దశరథ మహారాజు ఇలా కౌసల్యా, సుమిత్రల దగ్గర ఏడుస్తూ మరణించాడు.
చూడటానికి ఆనందం కలిగించే ఆ దశరథ మహారాజు కొడుకు అడవికి వెళ్లటం వల్ల దుఃఖంతో దీనంగా మాట్లాడుతూ అర్ధరాత్రి గడిచాక విచారం అధికం అవడం వల్ల దాన్ని భరించలేక ప్రాణాలు విడిచాడు (అయోధ్యకాండ సర్గ 64)
ఈ విధంగా విలపించి వౌనం వహించిన దశరథుడు నిద్రపోయాడని భావించి, విచారంలో ఉన్న కౌసల్య ఆయన్ని లేపలేదు. పుత్రశోకంతో అలసిపోయిన కౌసల్య భర్తతో ఇంకేమీ మాట్లాడకుండా పడుకుంది. రాత్రి గడిచింది. తెల్లారుఝామునే మంగళ వాక్యాలని పలికే ఉత్తమ విద్యాసంస్కారాలు గల సూతులు, స్తోత్రపాఠకులు, పొగడ్త పాటలని పాడే గాయకులు పొగడ్తలు చేస్తూ రాజగృహాన్ని చేరారు. పెద్ద కంఠాలతో ఆశీస్సులు పలికే వాళ్ల స్తోత్ర ధ్వని ప్రాసాదమంతా వ్యాపించింది. సూతులు స్తోత్రం చేస్తూండగా చప్పట్లు చరిచేవారు. దశరథుడు పూర్వం చేసిన ఉత్తమ పనులని చెప్తూ చప్పట్లు చరుస్తూ పాడారు. కొమ్మల మీద పంజరాల్లో ఉన్న రాజగృహానికి చెందిన పక్షులన్నీ ఆ శబ్దానికి మేలుకుని రొద చేయసాగాయి. వందిమాగధులు పలికే మాటలు, వీణాధ్వనులు, ఆశీర్వచనాలుగా పాడే పాటలు ఆ ఇంటిని నింపేసాయి.
తర్వాత సదాచారులు, రాజసేవలో నిపుణులైన ప్రజలు పూర్వం లానే దశరథుడ్ని సేవించడానికి వచ్చారు. వారిలో స్ర్తిలు అధికంగా ఉన్నారు. స్నానం చేయించడంలో నేర్పుగల పరిచారకులు కాలానుగుణంగా, నియమం ప్రకారం బంగారు కుండల్లో మంచి గంధం కలిపిన నీటిని తీసుకువచ్చారు. కూతుర్లున్న అనేక మంది స్ర్తిలు శరీరానికి రాసుకునే సుగంధ ద్రవ్యాలని, తినే వస్తువులని, బట్టలని, ఆభరణాలని తీసుకువచ్చారు. రాజు కోసం తెచ్చిన ఆ పదార్థాలన్నీ మంచి లక్షణాలతో యధాప్రకారం అమర్చిబడి సుగుణ సంపత్తుతో ప్రకాశిస్తున్నాయి.
ఆ సేవకులంతా రాజుకి దగ్గరగా మాత్రం వెళ్లక ఆసక్తితో ‘ఏమైందా?’ అని అనుమానిస్తూ సూర్యోదయం దాకా వేచి ఉన్నారు. ఆ తర్వాత స్ర్తిలు దగ్గరికి వెళ్లి మేలుకొలిపారు. వినయంతో తగిన విధంగా ఆ స్ర్తిలు దశరథుడి పడకని ముట్టుకున్నా ఏం తెలుసుకోలేక పోయారు. చేష్టలని, కదలికలని బట్టి వారు నిద్రా స్వభావాన్ని గుర్తించగలవారు. అలాంటి స్ర్తిలు రాజు ప్రాణాల విషయంలో అనుమానంతో ప్రవాహానికి ఎదురుగా నిల్చిన గడ్డిపోచ చివరి భాగాల్లా వణికిపోయారు. రాజుని చూసాక అంతవరకూ సందేహించిన స్ర్తిలు దేన్ని అనుమానించారో అది నిజమైంది. పుత్రశోకం ఆవహించగా నిద్రించే కౌసల్య, సుమిత్రలు మరణించిన వారిలా మేలుకోలేదు. కౌసల్య శోకంతో కాంతివిహీనురాలై శరీర రంగు మారిపోయి కృంగి, కృశించి ఉండటంతో, చీకటి కప్పిన నక్షత్రంలా ప్రకాశించడంలేదు. రాజు పక్కనే కౌసల్య, ఆమె పక్కనే ఉన్న సుమిత్ర దుఃఖం వల్ల కలిగిన కన్నీళ్లతో, మలినమైన మొహాలతో ప్రకాశహీనులుగా ఉన్నారు.
ఆ విధంగా నిద్రించే రాణులు ఇద్దర్నీ, ఆ రాజుని చూసిన అంతఃపుర జనులు రాజు నిద్రలోనే మరణించారని తెలుసుకున్నారు. వారంతా అరణ్యంలో తమ గుంపునకు నాయకుడైన ఏనుగు దూరమైనప్పుడు ఆడ ఏనుగులు ఏడ్చినట్లుగా బిగ్గరగా, ఏకకంఠంతో ఏడ్చారు. వారి ఏడుపులకి హఠాత్తుగా కౌసల్య, సుమిత్రలకి మెలకువ వచ్చింది. వారు మహారాజుని చూసి ‘హా నాథా!’ అని అరుస్తూ నేల మీద పడ్డారు.
నేల మీద దొర్లుతూ బూడిదతో కప్పబడ్డ కౌసల్య ఆకాశం నించి కిందపడ్డ నక్షత్రంలా కాంతిహీనమై ఉంది. దశరథుడు మరణించగా నేల మీద పడి ఉన్న కౌసల్య ఆ స్ర్తిలు అందరికీ చంపబడి, నేల మీద పడి ఉన్న ఆడ ఏనుగులా కనిపించింది. కైకేయి మొదలైన రాజ భార్యలందరూ ఏడుస్తూ దుఃఖంతో స్పృహ తప్పి నేల మీద పడ్డారు. విలపించే ఆ స్ర్తిలు చేసే ధ్వని ప్రతిధ్వనులతో ఇంకా అధికమై ఇల్లంతా నిండిపోయింది. దశరథుడు మరణించగానే ఆ ఇంట్లోని ఆనందం తొలగిపోయింది. భయంతో ఉన్న సేవకులకి ఏమి చేయడానికి తోచలేదు. నాలుగు మూలల నించి ఏడుపులు వినపడుతున్నాయి. బంధువులంతా దుఃఖంతో బాధపడసాగారు. ఎటు చూసినా విషాదం, దైన్యం కనపడుతున్నాయి. కీర్తివంతుడు, రాజుల్లో శ్రేష్ఠుడైన దశరథుడు మరణించినట్లు తెలియగానే భార్యలు అతన్ని చుట్టుముట్టి చాలా ఏడుస్తూ జాలి కలిగేలా పెద్దగా ఏడుస్తూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అనాథల్లా విలపించారు. (అయోధ్యకాండ -65వ సర్గ)
ముగింపుగా హరిదాసు ఇలా చెప్పాడు.
‘అయ్యా! దశరథుడి మరణంతో ఓ ముఖ్యఘట్టం ఇవాళ్టితో ముగిసింది. రేపు మళ్లీ సర్గ అరవై ఏడు నించి చెప్పుకుందాం. ఓం లోకాస్సమస్తా సుఖినో భవంతు’
ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా ఆయన చెప్పిన కథలు ఐదు తప్పులు ఉన్నాయి అని కొందరు అనుకుంటూ వెళ్లడం విన్నాడు. అది నిజం కూడా.
ఆ ఐదు తప్పులని మీరు కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
----------------------------------------
దశావతారాల్లో ఏకకాలంలో జీవించిన
ఇద్దరు అవతార పురుషులు ఎవరు?
పరశురాముడు, శ్రీరామచంద్రుడు
================================================

1. మానవుడు పుణ్యమైనా, పాపమైనా ఎలాంటి కర్మ చేస్తాడో దానికి తగ్గ ఫలానే్న పొందుతాడు అని దశరథుడు ఉపోద్ఘాతంగా చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని వివరించే మాటలని హరిదాసు చెప్పలేదు.
2. కుండలో మంచి నీళ్ళు నింపుకుని దశరథుడు ఆశ మానికి చేరాడు. కాని హరిదాసు కుండలో మంచి నీళ్ళు నింపుకుని అన్నది చెప్పలేదు.
3. మునికుమారుడి తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు. చెవిటి వాళ్ళు కారు. 4. సరయూ తీరానికి వచ్చాను అని దశరథుడు మునికుమారుడి తల్లిదండ్రులతో చెప్పాడు. కాని నదీ తీరానికి2అని హరిదాసు చెప్పాడు.
5. ఏనుగు అనుకుని దశరథుడు కొట్టానని చెప్పాడు. కాని హరిదాసు తప్పుగా సింహం అని చెప్పాడు.
6. నీ తల లక్ష ముక్కలయ్యేది అని తల్లిదండు లు చెప్పారు. కానీ వెయ్యి ముక్కలు అని హరిదాసు తప్పుగా చెప్పాడు.
7. ఆరు పేర్లని, అంటే సగరుడు పేరుని కూడా వాల్మీకి రాశాడు. కానీ హరిదాసు అది చెప్పలేదు.

--మల్లాది వెంకట కృష్ణమూర్తి