రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..94 మీరే డిటెక్టివ్....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ చుట్టుపక్కల భూమి చదును చేయబడి, అంతటా ఇంద్ర, నీల, వైఢూర్యాలు, మాణిక్యాల్లా ఉన్న అనేక పచ్చిక బీళ్లు వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రదేశంలో పళ్లతో నిండిన మారేడు, వెలగ, పనస, మాదీఫలం, ఉసిరి, మామిడి, జామ, సీతాఫలం చెట్లు వెలిసాయి. ఉత్తర కురుదేశం నించి దివ్యమైన భోగ్య వస్తువులు గల వనం, అనేక వృక్షాలతో నిండిన తీరాలు గల దివ్యమైన నది అక్కడికి వచ్చాయి. పరిశుభ్రమైన నాలుగు అంతస్థుల భవనాలు, గజశాలలు, అశ్వశాలలు, మేడలకి, ప్రాసాదాలకి శుభకరమైన ముఖద్వారాలు ఆవిర్భవించాయి. మంచి ముఖ ద్వారాలతో తెల్లటి మేఘంలా ఉన్న అందమైన రాజగృహం ఒకటి అక్కడ వెలిసింది. అందులో దేవలోకానికి చెందిన సుగంధ ద్రవ్యాలని చల్లి, తెల్లటి పూలమాలలతో అలంకరించారు. నలుచదరంగా ఉన్న విశాలమైన ఆ రాజభవనంలో పడకలు, ఆసనాలు, వాహనాలు, ఇంకా దివ్యమైన సమస్త రసాలతో కూడిన భోజనం, బట్టలు సిద్ధంగా ఉన్నాయి. అనేక విధాలైన ఆసనాలు, అందమైన దుప్పట్లు కప్పిన మంచి పడకలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి.
మహర్షి అనుమతితో మహాబాహువైన భరతుడు ఉత్తమమైన వస్తువులతో నిండిన ఆ రాజభవనంలోకి ప్రవేశించాడు. పురోహితులు, మంత్రులు భరతుడి వెంట వెళ్లి ఆ భవనంలోని ఏర్పాట్లని చూసి చాలా సంతోషించాడు. మంత్రులతో కలిసి భరతుడు రాజుకి ప్రదక్షిణం చేసినట్లు అక్కడి దివ్యమైన సింహాసనానికి, ఛత్ర చామరానికి ప్రదక్షిణం చేశాడు. రాముడికి నమస్కరించి ఆ సింహాసనాన్ని పూజించి, వింజామరని చేతిలో పట్టుకుని మంత్రి కూర్చో దగ్గ ఓ ఆసనం మీద కూర్చున్నాడు. తర్వాత మంత్రులు, పురోహితులు అంతా యథాక్రమంలో కూర్చున్నారు. తర్వాత సేనాపతి, అతని వెనక కింది అధికారి కూర్చున్నారు. తర్వాత భరద్వాజుడి ఆజ్ఞతో క్షణకాలంలో కొన్ని నదులు భరతుడి దగ్గరికి వచ్చాయి. వాటిలో బురదకి బదులు పాయసం ఉంది. ఆ నదుల రెండు తీరాలలో బ్రహ్మ అనుగ్రహంతో తెల్లటి మట్టి పూతపూయబడ్డ అందమైన ఇళ్లు వెలిశాయి.
ఇదే సమయంలో బ్రహ్మ పంపిన స్ర్తిలు దివ్యమైన ఆభరణాలు అలంకరించుకుని వచ్చారు. నందనవనం నించి కుబేరుడు పంపిన స్ర్తిలు బంగారం, రత్నాలు, ముత్యాలు, పగడాలు మొదలైన వాటితో మెరిసిపోతూ వచ్చారు. వారి చేతిలో చిక్కిన పురుషుడు ఉన్మత్తుడై, మైమరిచిపోతాడు. నారదుడు, తుంబురుడు, సూర్యుడి వంటి కాంతిగల శ్రేష్ఠుడైన గంధర్వ రాజు గోపుడు, భరతుడి ఎదుట గానం చేశారు. ఆ తర్వాత భరద్వాజుడి ఆజ్ఞ మీద నలుగురు అప్సరసలు భరతుడి ఎదుట నృత్యం చేశారు. భరద్వాజుడి ఆజ్ఞతో దేవలోకంలోని పుష్పమాలలు, కుబేరుడి చైత్రరథ వనంలోని పుష్పమాలలు ప్రయాగ క్షేత్రంలో వెలిసాయి. భరద్వాజుడి ఆజ్ఞతో మారేడు చెట్లు మృదంగం వాయించే వాళ్లుగా, తాండ్ర చెట్లు తాళం వేసేవారిగా, రావిచెట్లు నృత్యం చేసేవారిగా మారాయి. తర్వాత సరళ వృక్షాలు, తాళ వృక్షాలు, తిలక వృక్షాలు, కానుగ చెట్లు అంతఃపురంలో సంచరించే కుబ్జలుగాను, వామనులుగాను మారి సంతోషంతో అక్కడికి వచ్చాయి. అడవుల్లోని శింశుపా, జంబూ వృక్షాలు, ఉసిరి, నేరేడు చెట్లు, ఇతర చెట్లు; మాలతి, మల్లిక, జాజి మొదలైన పూలతీగలు స్ర్తి శరీరాలని ధరించి భరద్వాజుని ఆశ్రమానికి వచ్చి చెప్పాయి.
‘మద్యం తాగే వారంతా ఎంత కావాలో అంత మద్యం తాగండి. ఆకలిగా ఉన్నవారంతా పాయసం, పవిత్రమైన మాంసాలని తినండి’
ఒక్కొక్క మగాడ్ని ఏడుగురు లేదా ఎనిమిది మంది స్ర్తిలు నదీ తీరానికి తీసుకెళ్లి ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయించారు. అందమైన కళ్లు గల కొందరు స్ర్తిలు వాళ్ల ఒళ్లు పట్టడానికి త్వరగా వచ్చారు. మరి కొందరు ఉత్తమ స్ర్తిలు వాళ్ల శరీరాలని తుడిచి ఆప్యాయంగా మద్యాన్ని తాగించారు. గుర్రాలు, ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులకి వాహనాలని నడిపే జంతువుల పనులు చూసేవారు, వాటిని సంరక్షణ చేసేవారు వాటివాటి ఆహారాన్ని యథావిధిగా తినిపించారు. మహా బలశాలులైన వారు భరతుడి సైన్యంలోని వీరులు ఎక్కి వచ్చిన జంతువులని, ‘తినండి, తినండి’ అని ప్రేరేపిస్తూ వాటికి చెరకు గడలు, తేనె కలిపిన పేలాలని తినిపించారు. గుర్రాలలని కట్టేవాడు గుర్రాలని, ఏనుగులని పాలించేవాడు ఏనుగులని గుర్తించలేదు. అక్కడి సైనికులంతా మదించి, ఒళ్లు తెలీక ఆనందంతో ఉన్నారు. సమస్త భోగాలతో తృప్తి చెంది ఎర్రటి చందనాన్ని శరీరాలకి పూసుకుని అప్సరస స్ర్తిలతో కూడి ఉన్న ఆ సైనికులు, భరద్వాజుడు చేసిన సత్కారాన్ని పొందిన కాలిబంట్లు, గుర్రాలు, ఏనుగులు ఎక్కేవారు, వాటిని సంరక్షణ చేసేవారు తమని నియంత్రించే ప్రభువు లేడనుకుని స్వతంత్రుల్లా ఇలా చెప్పారు.
‘మేం అయోధ్యకి కాని, దండకారణ్యానికి కాని వెళ్లం. ఇక్కడే ఉండిపోతాం. భరతుడికి క్షేమమవుగాక! రాముడు కూడా సుఖంగా ఉండుగాక!’
భరతుడి అనుచరులైన ఆ వేల మంది సైనికులు సంతోషంతో ‘ఇదే స్వర్గం’ అని పెద్దగా కేకలు వేశారు. పూలమాలలు ధరించిన ఆ వేలాది సైనికులు నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ నాలుగు వైపులా పరిగెత్తారు. అమృతంతో సమానమైన అన్నం తిన్న ఆ సైనికులకి అక్కడి దివ్యమైన వంటకాలని చూసి వాటిని తినాలనే కోరిక మళ్లీ మళ్లీ పుట్టింది. అక్కడున్న వేలకొద్దీ నౌకర్లు, దాసీలు, స్ర్తిలు, సైనికులు అందరూ నలగని బట్టలని ధరించి గర్వపడ్డారు. అక్కడ ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గుర్రాలు, మృగాలు, పక్షులు అన్నిటికీ ఇష్టమైన ఆహారం లభించడంతో అవి ఒకదాన్ని మరొకటి బాధించలేదు. ఆ సైన్యంలో తెల్లటి దుస్తులు ధరించనివాడు కాని, ఆకలి గొన్నవాడు గాని, మురికిగా ఉన్నవాడు గాని, చెదిరిన వెంట్రుకలు కలవాడు కాని లేడు. అక్కడ నాలుగు వైపులా పైన పువ్వులు కప్పిన వేల కొద్దీ లోహపాత్రల్లోని తెల్లటి అన్నాన్ని ఆ సైనికులంతా ఆశ్చర్యంగా చూశారు. ఆ పాత్రలు మేక, పంది మాంసాలతో, మంచి శాకాహార పదార్థాలతో, అనేక పళ్ల రసాలతో, మంచి సువాసన రుచితో కూడిన రసాలతో నిండి ఉన్నాయి. ఆశ్రమం పక్కనే పాయసం బురదగా గల బావులు ఏర్పడ్డాయి.
అక్కడున్న ఆవులు కోరిన వస్తువులని ఇచ్చాయి. వృక్షాల నించి తేనె స్రవిస్తోంది. మద్యంతో నిండిన దిగుడు బావులు, వాటి చుట్టూ పరిశుద్ధమైన లేడి, నెమలి, కోడి మాంసాలు కుండలతో వండి రాసులుగా పోయబడి ఉన్నాయి. వేల కొద్దీ చిన్న పాత్రలు, లక్షల కొద్దీ గినె్నలు, పది కోట్ల బంగారు పాత్రలు, పెరుగు నిండిన గినె్నలు, చిన్న కుండలు, వెడల్పైన మూతులు గల పాత్రలు ఉన్నాయి. పాతది కాని, కొత్తది కాని కాక మధ్యరకంగా ఉండి, సువాసన వేసే వెలగపండు రంగులోని పెరుగుతో నిండిన సరస్సులు, ‘రసాలం’ అనే పెరుగున్న సరస్సులు, తెల్లటి పెరుగుతో నిండి సరస్సులు, పాయసంతో నిండిన సరస్సులు ఏర్పడ్డాయి. చక్కెర కలిపిన యవల పిండి రాసులు కూడా ఏర్పడ్డాయి. నదుల రేవుల్లో ఉసిరి కాయ మొదలైన వాటితో చేసిన లేహ్యాలు, చూర్ణాలు, కషాయాలు, పాత్రల్లో ఉంచిన అనేక విధాలైన స్నానద్రవ్యాలని ఆ సైనికులు చూశారు. ఆ ప్రాంతమంతటా తెల్లటి కుచ్చులుగల పళ్లు తోము పుల్లలు, దొప్పల్లో ఉంచిన తెల్లటి గంధం ముద్దలు, శుభ్రంగా తుడిచిన అద్దాలు, బట్టలు, వేలకొద్దీ తొడుక్కునే చెప్పుల జతలు, కట్టుకునే చెప్పుల జతలు, కాటుక భరిణెలు, దువ్వెనలు, మీసాలు దువ్వుకునే దువ్వెనలు, ధనస్సులు, కవచాలు, చిత్రమైన పడకలు, ఆసనాలు ఉన్నాయి. గాడిదలు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు తాగడానికి నీళ్ల గుంటలు, దిగడానికి అనువైన రేవులు, కలువలు, పద్మాలు ఉన్నాయి. ఆకాశపు నీలిరంగు గల స్వచ్ఛమైన నీటితో సుఖంగా స్నానం చేయడానికి అనుకూలమైన సరస్సులు, పశువుల మేత కోసం నీప వృక్షాలు, వైఢూర్య మాణిక్యాల వంటి రంగుగల మృదువైన గడ్డి ఉన్నాయి.
భరద్వాజుడు భరతుడికి చేసిన ఆ అద్భుతమైన ఆతిథ్యం కల్లో జరిగినట్లుంది. దాన్ని చూసిన అక్కడి మనుషులంతా ఆశ్చర్యపోయారు. ఇలా వాళ్లు నందనవనంలో దేవతలు విహరించినట్లు అందమైన భరద్వాజాశ్రమంలో విహరిస్తూండగానే ఆ రాత్రి గడిచిపోయి ఆ నదులు, గంధర్వులు, ఆ ఉత్తమ స్ర్తిలంతా భరద్వాజుడి అనుమతితో వచ్చినట్లుగానే తిరిగి వెళ్లిపోయారు. వాళ్లంతా తిరిగి వెళ్లిపోయాక కూడా ఆ సైనికులంతా తాగిన మద్యం మత్తులో అలాగే పడున్నారు. వారి ఒంటికి పూసుకున్న దివ్యమైన అగరు, చందనాలు అలాగే ఉన్నాయి. వారు నలక్కొట్టిన అనేక విధాలైన దివ్య పూలమాలలు అక్కడక్కడా పడున్నాయి. (అయోధ్యకాండ 91 సర్గ - 29వ శ్లోకం నించి)
ఓ వైష్ణవుడు మంగళహారతి తర్వాత హరిదాసుతో చెప్పాడు.
‘దాసుగారూ! మీ గాత్రం అద్భుతం. మీ మాట వినసొంపుగా ఉంది. అంతా చక్కగా చెప్పారు. కాని ఐదు చిన్న తప్పులని చెప్పారు’
ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
*

1.భరతుడు భరద్వాజాశ్రమానికి వెళ్లబోయే ముందు పట్టుబట్టలు ధరించాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
2.అతను దశరథుడి కొడుకని భరద్వాజుడు గ్రహించాడు తప్ప వశిష్టుడు చెప్పలేదు.
3.దశరథుడు మరణించాడని తెలుసు కాబట్టి ఆయన గురించి భరద్వాజుడు అడగలేదు. ఐతే దశరథుడి క్షేమం గురించి అడిగినట్లుగా హరిదాసు తప్పుగా చెప్పాడు.
4.ఆతిథ్యం కోసం ఇల్లు మొదలైనవి నిర్మించడానికి భరద్వాజుడు విశ్వకర్మని ఆజ్ఞాపించాడు. అగ్నిని కాదు.
5.భరద్వాజుడు ఆహ్వానించిన వారిలో రంభ లేదు.
6.భరద్వాజుడు తుంబురుడ్ని కూడా ఆహ్వానించాడు. ఆ పేరు హరిదాసు చెప్పలేదు.
*
మీకో ప్రశ్న:
=======
భరద్వాజుడి తండ్రి ఎవరు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
======================
మలయ పర్వతాలు ప్రస్తుతం ఎక్కడున్నాయని భావిస్తున్నారు?
పశ్చిమ కనుమల్లోని మంగుళూరు ప్రాంతం నించి దక్షిణంగా ఉన్న
పర్వతాలు మలయ పర్వతాలని భావిస్తున్నారు.

--మల్లాది వెంకట కృష్ణమూర్తి