రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం--92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రితో కలిసి భరతుడు ఆ మాటలన్నీ శ్రద్ధగా విని వృక్షం దగ్గరికి వెళ్లి రాముడి పడకని చూసి తల్లులందరితో చెప్పాడు.
‘మహాత్ముడైన రాముడు ఆ రాత్రి ఇక్కడ నేల మీద పడుకున్నాడు. అతను పడుకోగా నలిగిన పక్క ఇది. గొప్ప భాగ్యమైన కులంలో పుట్టినవాడు, గొప్ప భాగ్యం కలవాడు, దశరథుడి కొడుకైన, బుద్ధిమంతుడు రాముడు నేల మీద పడుకోడానికి తగడు. మృగచర్మాలు, మంచి దుప్పట్లు కప్పిన పక్క మీద పడుకోడానికి అలవాటు పడ్డ పురుష శ్రేష్ఠుడైన రాముడు నేల మీద ఎలా పడుకున్నాడో? శత్రు భయంకరుడైన రాముడు ఎల్లప్పుడూ విమానాల్లో, ఇళ్ల పైభాగాల్లో, అతి శ్రేష్ఠమైన ప్రాసాదాల్లో నివసించేవాడు. అవి అక్కడక్కడా ఉంచిన వివిధ రంగుల పువ్వులు, చందనం, అగరు సుగంధాలతో నిండి ఉండేవి. బంగారు గోడలతో కట్టబడి, మేరు పర్వతంలా ఉన్న ఆ ప్రాసాదాల్లో నివసించేప్పుడు రాముడ్ని గీతాలు, వాద్యాలతోను, ధ్వనులతోను, మధురమైన మృదంగ శబ్దాలతోను మంచిగా అలంకరించుకున్న పరిచారికలు మేలుకొలుపు పాడేవారు. చాలామంది వందిమాగధులు కథలు పాడుతూ స్తోత్రం చేస్తూ ఆయా కాలాల్లో వచ్చి రాముడికి నమస్కరించేవారు. లోకంలో ఇది నమ్మేలా లేదు! ఇది నిజమని నాకు అనిపించడంలేదు. నా మనసు మోహం చెందుతూ, ఇదంతా కలా అనిపిస్తోంది. ఇది నిజం. చూసే వారికి ఆనందాన్ని కలిగించేది, జనకుడి కూతురు, దశరథుడి ఇష్టమైన కోడలైన సీత కూడా నేల మీద పడుకుంది కదా! ఇది నా అన్నగారి పడక. ఆయన పొర్లిన చోటిది. కఠినమైన నేల మీద పరిచిన ఈ గడ్డంతా అవయవాల రాపిడితో నలిగిపోయింది. ఇక్కడ తగులుకుని ఉన్న పట్టుదారాలు మెరుస్తున్నాయి. అందువల్ల అప్పుడు సీత ఉత్తరీయం ఈ ప్రదేశంలో తగులుకుందని తెలుస్తోంది. చిన్నది, దీనురాలు, సుకుమారి, పతివ్రతైన సీత ఇలాంటి పరిస్థితుల్లో కూడా దుఃఖంగా లేదు. అంటే, ఆమెకి భర్త ఉన్న పడకే సుఖమైందని అనుకుంటున్నాను. అయ్యో! ఎంత కష్టం వచ్చింది. నేను చాలా క్రూరుడ్ని ఎందుకంటే నా మూలంగా భార్యతో కలిసి రాముడు అనాథలా ఇలాంటి పక్క మీద పడుకోవాల్సి వచ్చింది.
‘చక్రవర్తి వంశంలో పుట్టి ప్రజలందరితో ఆదరించబడేవాడు. వారికి ఇష్టుడు. సుఖాలకి తగినవాడు, చూసేవారికి ఆనందాన్ని కలిగించేవాడు, దుఃఖాలకి తగనివాడైన రాముడు రాజ్యాన్ని, అత్యుత్తమమైన సుఖాన్ని కూడా విడిచి నేల మీద ఎలా పడుకున్నాడో? మహా భాగ్యవంతుడు, ఉత్తమ లక్షణాలు కలవాడైన లక్ష్మణుడు చాలా ధన్యుడు. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయంలో సోదరుడైన రాముడి వెంట వెళ్లాడు. భర్త వెంట అడవికి వెళ్లిన సీత కృతార్థురాలు. మహాత్ముడైన రాముడికి దూరమైన హీనులైన మనందరం అసహాయ స్థితిలో ఉన్నాం. దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. రాముడు అడవికి వెళ్లిపోయాడు. అందువల్ల ఈ రాజ్యం నాకు చుక్కాని పట్టుకునే వాడు లేని ఓడలా కనిపిస్తోంది. రాముడు అరణ్యంలో ఉన్నా అతని పరాక్రమం ఈ భూమిని రక్షిస్తూనే ఉంటుంది. అందువల్ల దీన్ని ఆక్రమించాలని ఎవరూ మనసులో కూడా అనుకోలేరు. ఇప్పుడు మన అయోధ్యలో ప్రాకారాలకి రక్షణ లేదు. గుర్రాలు, ఏనుగులు యుద్ధ సన్నద్ధంగా లేవు. పట్టణ ద్వారాలన్నీ తెరచి రక్షణ లేకుండా ఉన్నాయి. సైనికులంతా విచారంగా ఉన్నారు. కష్టాల్లోని ఈ నగరం శూన్యమై, బయట కూడా రక్షణ లేకుండా ఉన్నా శత్రువులు విషంతో చేసిన పిండి వంటల గురించి ఎలా తలచుకోరో అలాగే ఈ నగరాన్ని గురించి మనసులో కూడా తలచుకోరు. నేను ఈ రోజు నించి జటలని, నార చీరలని ధరించి, పళ్లు, దుంపలు తింటూ, నేల మీద లేదా గడ్డి మీద పడుకుంటాను. రాముడు చేసిన వనవాస ప్రతిజ్ఞని ఆ రాముడికి బదులు నేను చేస్తూ మిగిలిన కాలం అడవిలో సుఖంగా నివసిస్తాను. అందువల్ల రాముడి ప్రతిజ్ఞ కూడా అసత్యం కాదు. సోదరుడైన రాముడికి బదులు అరణ్యాల్లో నివసించబోయే నాతో కలిసి శతృఘు్నడు ఉంటాడు. పూజ్యుడైన రాముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యని పాలిస్తాడు. బ్రాహ్మణులు అయోధ్యలో రాముడికి రాజ్యాభిషేకం చేస్తారు. నా ఈ కోరికని దేవతలు సఫలం చేస్తారా? నేను స్వయంగా తల వంచి నమస్కరిస్తూ అనేక విధాల బతిమాలినా రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా అడవుల్లో తిరిగే రాముడితో కలిసి అక్కడే నివసిస్తాను. రాముడు నన్ను కాదనలేడు.’
సీత పడుకున్న పక్క మీది ఆమె చెవి నించి రాలిన ఓ దిద్దుని భరతుడు చూశాడు. (అయోధ్య కాండ 88వ సర్గ)
భరతుడు ఆ రాత్రి ఆ గంగా తీరంలోనే విడిది చేశాడు. మర్నాడు ఉదయమే లేచి సుమంత్రుడు శతృఘు్నడితో చెప్పాడు.
‘శతృఘూ్న! లే. ఎందుకు ఇంకా పడుకునే ఉన్నావు? లే. నీకు క్షేమమగు గాక! బోయరాజైన గుహుడ్ని త్వరగా తీసుకుని రా. అతను సేనని నది దాటిస్తాడు.’
‘పూజ్యుడైన రాముడ్ని గురించి ఆలోచిస్తూ నేను మెలకువగానే ఉన్నాను. నిద్ర పోవడం లేదు’ శతృఘు్నడు బదులు చెప్పాడు.
భరత శతృఘు్నలు ఇలా ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూండగా గుహుడు వచ్చి భరతుడ్ని అడిగాడు.
‘్భరతా! నదీ తీరంలో రాత్రి నీ నివాసం సుఖంగా ఉంది కదా? సైన్యంతో కలిసి నీకు ఎలాంటి బాధలూ కలగలేదు కదా?’
రాముడి ఆధీనంలో ఉన్న భరతుడు, గుహుడి స్నేహపూర్వక మాటలు విని చెప్పాడు.
‘రాజా! రాత్రి మాకు సుఖంగా గడిచింది. నువ్వు మాకు అనేక విధాలుగా సేవ చేసావు. ఇప్పుడు ఓడల మీద మమ్మల్ని గంగానదిని దాటించమని నీ సేవకులని ఆజ్ఞాపించు’
బాగా తొందరపడే భరతుడి ఆజ్ఞని విని గుహుడు నగరాని తిరిగి వెళ్లి తన బంధుజనంతో చెప్పాడు.
‘మేలుకోండి. లేవండి. మీ అందరికీ క్షేమమగు గాక! ఓడల్ని లాక్కుని రండి. సైన్యాన్ని గంగ దాటిద్దాం’
గుహుడి మాటలు విన్న వాళ్లు వెంటనే నాలుగు మూలల నించి ఐదు వందల ఓడలని తెచ్చారు. స్వస్తికాలు అనే పేరుగల మరి కొన్ని ఓడలని కూడా తెచ్చారు. వాటికి పెద్ద పెద్ద గంటలు కట్టి ఉన్నాయి. గాలికి అనుకూలంగా నడిచే ఆ ఓడలు చిన్న జెండాలతో మెరుస్తున్నాయి. వాటి తాళ్లు దృఢంగా ఉన్నాయి. గుహుడు స్వయంగా తెల్లటి కంబళ్లు కప్పిన మంగళకరమైన శబ్దం చేసే స్వస్తికం అనే ఓడని తెచ్చాడు. ముందుగా వశిష్ఠుడు, పూజ్యులైన బ్రాహ్మణులు ఆ ఓడని ఎక్కారు. భరత శతృఘు్నలు, కౌసల్య, సుమిత్ర, ఇతర రాజస్ర్తిలు ఓడని ఎక్కిన తర్వాత రాజభార్యలు, బళ్లు, అంగళ్లు ఎక్కాయి. కొందరు తాము విడిది చేసిన స్థానాలని కాల్చేస్తూంటే, కొందరు రేవులో దిగుతున్నారు. కొందరు ఓడలో చేర్చడానికి వస్తువులని తెస్తున్నారు. వీరంతా చేసే శబ్దాలు స్వర్గం దాకా వ్యాపించాయి. జెండాలతో అలంకరించిన ఆ నావలని పల్లెవారు స్వయంగా నడుపుతున్నారు. అవి జనాన్ని మోసుకుని అతి వేగంగా ప్రయాణించాయి. వాటిలో కొన్ని గుర్రాలకే ప్రత్యేకించబడ్డాయి. కొన్నిటి మీద రథం మొదలైన వాహనాలు, బళ్లని లాగే ఎడ్లు, చాలా ధనం ఎక్కించారు. ఆ ఓడలు అవతలి ఒడ్డుకి చేరి జనాలని దింపి తిరిగి వచ్చాయి. కొందరు పల్లెవారు నీటి మీద ఆ నావలతో రకరకాల చిత్రాలని చిత్రించారు. మావటి వారు ప్రేరేపించగా జెండాలు కట్టబడి, ఈదుతూ నది దాటే ఏనుగులు జెండాలున్న పర్వతాల్లా కనిపించాయి. కొందరు నావల మీద, కొందరు తెప్పల మీద ఎక్కారు. పల్లె వారు స్వయంగా దాటించగా ఆ సేన పవిత్రమైన గంగానదిని దాటి మైత్రముహూర్తంలో శ్రేష్ఠమైన ప్రయాగవనాన్ని చేరింది. పూజ్యుడైన భరతుడు మంచి మాటలతో సేనకి విశ్రాంతినిచ్చి, అది సుఖంగా ఉండేలా చూసి, ఋషుల్లో శ్రేష్ఠుడైన భరద్వాజుడ్ని చూడటానికి ఋత్విక్కులని వెంట తీసుకుని వెళ్లాడు.
దేవ పురోహితుడు, మహాత్ముడైన ఆ భరద్వాజాశ్రమాన్ని సమీపించిన భరతుడు అందమైన పర్ణశాలలు, వృక్ష సముదాయాలు గల ఆ బ్రాహ్మణోత్తముడి సుందరమైన వనాన్ని చూశాడు.
(అయోధ్యకాండ 89వ సర్గ)
ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓ సారి రామాయణంలోని తను చెప్పిన కాండలని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో 7 తప్పులు చెప్పాను. క్షంతవ్యుణ్ణి అవి చెప్తాను. వినండి.’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*

1.హరిదాసు 86, 87 సర్గలు చెప్పాడు. కాని తప్పుగా తను 85, 86 సర్గలు చెప్తున్నానని చెప్పాడు.
2.గుహుడు భరతుడికి చెప్పిన వాటిలో ముఖ్యమైన దీన్ని హరిదాసు చెప్పలేదు. ‘మర్నాడు సూర్యోదయం తర్వాత వాళ్లిద్దరూ ఈ గంగానదీ తీరంలో జటలు కట్టించుకున్నారు.’
3.‘ఓ స్నేహితుడా! మేము సదా ఇతరులకి ఇవ్వాలి కాని, ఇతరుల నించి తీసుకోకూడదు’ అని రాముడు ప్రేమపూర్వకంగా గుహుడితో అన్న మాటలని హరిదాసు చెప్పలేదు.
4.రాముడు పడుకున్నది ఇంగుదీ వృక్షం కింద. హరిదాసు దాని పేరు చెప్పలేదు.
*
మీకో ప్రశ్న:
========
సీత తల్లి పేరేమిటి?
*

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
----------------------------------------
ఇంగుదీ వృక్షాన్ని తెలుగులో ఏమంటారు? గార చెట్టు

-మల్లాది వెంకట కృష్ణమూర్తి