సెంటర్ స్పెషల్

రణక్షేత్రం 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం
కౌంటింగ్ మొదలయి రెండున్నర గంటలయింది.
మూడు రౌండ్లు ఓట్లను లెక్కించటం పూర్తయింది.
వసుంధర శిబిరంలో టెన్షన్ ఇంకా పెరిగింది. రెండో రౌండ్లో కూడా ఎక్కువ ఓట్లు ఎదుటి పక్షానికే వచ్చాయి. మూడో రౌండ్ ఫలితం ఏ నిమిషమయినా బయటకు రావచ్చు.
‘మంచితనానికి విలువ లేదమ్మా! లేకపోతే ఇంత సేవ చేసిన నీకు ఓట్లు వేయటానికి ఈ నాయాళ్లకి చేతులు రాలేదంటే ఏమి చెప్తాం తల్లీ...’ ఆవేదనగా అన్నాడు రామభద్రం.
వసుంధర ప్రస్తుతం పోటీకి నిలబడిన ఈ నియోజకవర్గంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆమె పుట్టిన ప్రాంతం కాదు. పెరిగిన ప్రాంతం అసలే కాదు. అయినా ఆమె ఇక్కడ నుండి పోటీ చేయవలసి వచ్చింది. పోటీకి దిగే ముందు ఆమె చాలా ఆలోచించింది. ఎలాంటి సంబంధం లేని ఈ నియోజకవర్గంలో తనకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అనుకుంది. కానీ అపుడు ఆమెకున్న బ్యాకింగ్ వేరు. ఆమె వెనుక నిలబడ్డ మనిషి సామాన్యుడు కాదు. సపోర్ట్ దానంతట అదే వచ్చింది. రాత్రికి రాత్రి అనుచరులు పుట్టుకు వచ్చారు. ఆమె చేసింది ఏమీ లేకపోయినా ఎదురు లేకుండా పోయింది. ఇంట్లో నుండి బయటకు రాకుండా కాలు మీద కాలు వేసుకుని గెలవగలిగింది. ఇప్పుడు ఆమె క్యాబినెట్ మంత్రి. అయినా ఆమె గెలుపునకు గ్యారంటీ లేకుండా పోయింది. కారణం... అప్పుడు ఉన్న బ్యాకింగ్ ఇప్పుడు లేకపోవడమే! ఇంకా సరిగ్గా చెప్పాలంటే అప్పుడు ఆమె వెనుక దన్నుగా నిలబడ్డ వ్యక్తే ఇప్పుడు ఆమెకు వైరిపక్షం అయ్యాడు.
కాలం మారినా, తన పరిస్థితి తలకిందులయినా ఆమె అండ వదలని అతి కొద్దిమందిలో రామభద్రం ఒకడు.
‘పోటీ చేసేది ఇద్దరయినా గెలిచేది ఒక్కరేగా పెద్దాయనా!’
‘అదేనమ్మా! ఆ గెలుపేదో మంచోళ్లకి ఎందుకు రాదా... అని’
‘గెలిచినవాడినే మంచివాడనుకుంటే పోలా...’
‘పోదమ్మా! ఇక్కడ వెనుకబడిన కులాలు గత అయిదేళ్లలో కాస్త అభివృద్ధి చెందాయలంటే దానికి కారణం నువ్వు. వేరే వాళ్లు గెలిస్తే, ముందుకెళ్లటం సంగతి అటుంచు. నువు చేసిన అభివృద్ధిని కూడా వెనక్కి తీసుకువెళ్తారు’
‘ఆ బాధ వాళ్లకే లేనప్పుడు మనమేం చేస్తాం పెద్దాయనా?’
‘వాళ్లు మూర్ఖులు తల్లీ! వాళ్లకేం కావాలో వాళ్లకే తెలియదు’
ఇంతలో మూడో రౌండ్ ఫలితం వచ్చింది. అదే రిజల్ట్. ఆధిక్యం ఎదుటి వారిదే!
ప్రస్తుతం వసుంధర 2315 ఓట్ల తేడాతో వెనుకబడి ఉంది.
విషయం తెలుసుకున్న వసుంధర నిస్త్రాణగా కుర్చీలో వెనక్కి వాలింది.
* * *
అదే సమయంలో ఒక కారు వేగంగా కౌంటింగ్ జరుగుతున్న ఊరి వైపు దూసుకు వస్తోంది. దానిలో ఉన్నది ప్రముఖ సినీ హీరో చంద్రం.
అతను ఫోను చేసి ఎన్నికల ఫలితాలు తెలుసుకున్నాడు. అతను ఎవరి ఫలితం కోసం ఆత్రుత పడుతున్నాడో వాళ్లు వెనుకమడి ఉన్న విషయం అతనికి కూడా తెలిసింది.
రాజకీయాల గురించి అతనికి తెలిసింది చాలా తక్కువ. కానీ ఒక విషయం అతనికి బాగా తెలుసు...
కోట్ల మంది మనుషుల్లో ఎక్కడో కొందరు ఉంటారు. వారిని ఎంత అణగదొక్కితే అంత పైకి లేచి వస్తారు. వాళ్లు ఎవరినీ లెక్క చేయరు. ఎవరికీ భయపడరు. గమ్యమే లక్ష్యంగా దూసుకుపోతారు. వాళ్లని కొంతమంది మొండి వాళ్లనవచ్చు. మరి కొంతమంది మెటీరియలిస్ట్‌లనవచ్చు. అలాంటి మనుషుల్లో ప్రథములు ఎవరయ్యా అంటే అది తన నేస్తం. ఇంత త్వరగా తన నేస్తం ఓటమి గురించి ఒక అవగాహనకు రావటం పెద్ద తప్పని అతనికి తెలుసు.
ఆ విషయం అంత కచ్చితంగా అతనికి తెలియటానికి ఒక కారణం ఉంది - అతను కూడా ఆ జాతికి చెందినవాడే!... మొండివాడు.
* * *
చంద్రం
నేను ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. నా తరువాత మా ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది. మా చెల్లిని అందరం ముద్దుగా చూసుకునేవాళ్లం.
నా తండ్రికి రెండెకరాల పొలం, ఊరి నడిబొడ్డున మెయిన్ రోడ్డు మీద ఒక కిళ్లీ కొట్టూ ఉండేవి.
రెండెకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లల సంసారాన్ని గపడటం కష్టమే కాదు, అసాధ్యం. అలాంటిది నా తండ్రి ఇద్దరు పిల్లలనూ మంచి కానె్వంటుకి పంపి చదివిస్తున్నాడంటే కారణం ఆ కిళ్లీకొట్టే!
కిళ్లీ కొట్టు మీద కనపడకుండా ఆదాయం వచ్చేది. పేరుకు కిళ్లీకొట్టే కానీ, అక్కడ అవి ఒక్కటే అమ్మరు. సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, సోడాలు, కూల్‌డ్రింక్‌లు అన్నీ అమ్మేవాడు.
మెయిన్ రోడ్డు మీద ఉండడంతో ఉదయం దుకాణం తెరిచిన దగ్గర నుండి రాత్రి సెకండ్ షో వదిలే వరకూ అమ్మకాలు ఉండేవి.
రెండెకరాల వ్యవసాయ పనులు చూసుకోవటానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉండేవాడు. నాన్న. నాకే చదువు మీద పెద్దగా ఇష్టం ఉండేది కాదు. తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా నాన్న నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని చదువు ఎంత ముఖ్యమో చెప్తుండేవాడు. మనలాంటి వాళ్లకి ఈ పేదరికం నుండి బయటపడటానికి చదువుకోవటమొక్కటే మార్గం అని ఎంత చెప్పినా నాకు చెవికి ఎక్కేది కాదు. నా ధ్యాస అంతా ఆ ఊళ్లో ఉన్న రెండు థియేటర్లలో ఏ సినిమా ఆడుతుందా, దేనికి వెళ్దామా అని తప్ప మరి దేని మీదా ఉండేది కాదు. డబ్బులు ఇవ్వకపోతే తిండి మానేసి మరీ ఇంట్లో వాళ్లని సాధించి పని సాధించుకునేవాడిని. ఏదో ఒకటి చేసి రోజూ సినిమాకి వెళ్లవలసిందే.
నా గురించి ఇంట్లో వాళ్లకి బాధ తప్ప నాకే బాధా లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అయితే రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవనటానికి నిదర్శనంగా, నేను ఏడో క్లాసులో ఉండగా మొదటి విపత్తు మా కుటుంబం మీద పడింది.
ఆ రోజు స్కూలు అయిపోయిన తరువాత సినిమాకి వెళ్లటానికి డబ్బుల కోసం నాన్న కొట్టు దగ్గరకు వెళ్లాను.
అక్కడంతా హడావుడిగా ఉంది. రెండు మూడు గవర్నమెంటు జీపులు రోడ్డు పక్కన ఆపి ఉన్నాయి. సూటూ బూటూ మనుషులు ముగ్గురు అక్కడ హడావుడి చేస్తున్నారు.
నాన్న వాళ్ల చుట్టూ తిరుగుతూ ఏదో అడుగుతున్నాడు. వాళ్లు ఆయన ఉనికిని కూడా పట్టించుకోవటం లేదు.
నాకు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు.
నాన్న ఏమి అడిగినా మాట్లాడే పరిస్థితుల్లో లేడు కాబట్టి ఆయనలానే ఆందోళనలో ఉన్న మరో తెలిసిన వ్యక్తిని అడిగాను కథ ఏమిటని.
‘ఈ రోడ్డు మద్రాసు నుంచి కలకత్తా పోయే నేషనల్ హైవే అంటరా నాయనా! దీనిని ఇప్పుడున్న దానికంటే డబల్ చేస్తారంట...’ తనకు తెలిసింది చెప్తున్నాడతను.
‘అయితే?’
‘అదిగో! గోడల మీద రంగుతో గుర్తులు పెడుతున్నారు చూడు. అక్కడ వరకు ఉన్న షాపులూ, ఇళ్లూ అన్నీ పడగొట్టాలంట’
‘అదేమి అన్యాయం? రోడ్డు వేయటానికి మన ఇళ్లు పడగొట్టటమేమిటి?’
‘ఇదంతా ప్రభుత్వ భూమే అంట’
‘అలా అయితే మరి ఇళ్లు కట్టుకునేటప్పుడు ఎందుకు ఊరుకున్నారు?’
‘అవన్నీ అడిగేదెవరురా? రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా?’
‘మరి పోలీసులకి చెప్తే?’
‘ఇయ్యన్నీ నీకు తెలిసే విషయాలు కాదులేరా? ఆ కొలతలేస్తన్న మారాజులు పోలీసులకంటే పెద్దోళ్లు. పడగొట్టే ఇళ్లకి యాల్యుయేషన్ కట్టి డబ్బులిస్తారంట...’
‘మరయితే ఇంకేం? వీళ్లందరి బాధేంటి?’
‘ఉరేయ్! గవర్నమెంట్ ఇచ్చే డబ్బెంత ఉంటుందిరా? ఇట్టాంటి రోడ్డు మీద స్థలం వదులుకుని డబ్బులు తీసుకుంటే తరవాత యాపారం చేసుకునేదెట్టా?’
‘అందుకేనా నాన్న ఆళ్ల చుట్టూ అట్టా తిరుగుతున్నాడు?’
‘మీ నాన్నది ఇంకో బాధరా! మీ నాన్న కొట్టు పూర్తిగా ప్రభుత్వ స్థలంలో ఉందంట. దాన్ని పడగొట్టినందుకు డబ్బులు కూడా ఇయ్యరంట’
అదన్నమాట నాన్న బాధ అనుకున్నాను నేను. అంత బాధలో ఉన్న నాన్నని సినిమాకి డబ్బులు అడగలేక పోయాను.
ఆ పూట నేను కూడా చాలా బాధపడ్డాను. మొదటిసారి సినిమా చూడకుండా ఇంట్లోనే ఉన్నందుకు.
తరువాత చాలా రోజులు పెద్ద బజారులో దుకాణాలు ఉన్న అందరి ఇళ్లల్లో ఈ పడగొట్టటం గురించే చర్చ. అందరూ కలిసి ఎమ్మెల్యేని కలిశారు. తను పదవిలో ఉండగా ఎవరి దుకాణాలూ పడగొట్టటం జరగదనీ, ఎవరూ భయపడవద్దని ఆయన భరోసా ఇచ్చాడు. అంతటితో కూడా ఆగలేదు మా వాళ్లు. ఎన్నో చర్చల తరువాత అందరూ కలిసి చందా వేసుకుని జిల్లా కోర్టులో ఒక లాయరు చేత స్టే తెప్పించుకున్నారు.
మళ్లీ ఒకసారి అధికారులు వచ్చి దుకాణాలు ఎప్పుడు పడగొడుతున్నారని అడిగారు.
స్టే ఆర్డరు చూపించారు వీళ్లు.
అధికారులు చాలాసేపు వీళ్లకి సర్ది చెప్పటానికి ప్రయత్నించారు. కానీ ఎవరూ వాళ్ల మాటలు వినలేదు. న్యాయం తమ పక్షాన ఉందని వాదించారు. ఇంతలో ఎమ్మెల్యే వచ్చాడు. అక్కడ దుకాణాలు పడగొట్టాలంటే తన శవం మీదుగా పడగొట్టాలని భీకర ప్రతిజ్ఞ చేశాడు.
ఏమీ చెయ్యలేక అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.
తరువాత చాలా నెలలు ఎవరూ దుకాణాలు పడగొడతామని రాలేదు. దానితో ఇక ఆ గొడవ గురించి అందరూ మరచిపోయారు.
ఇక ఆ విషయం అందరి దృష్టి పథం నుండి తప్పుకున్నాక, ఒకసారి మూడు రోజులు వరుసగా సెలవలు వచ్చాయి. రెండవ శనివారం, ఆదివారం, తరువాత వచ్చిన సోమవారం పండుగ సెలవు.
ఆ శనివారం ఉరుములేని పిడుగులాగా అధికారులు మళ్లీ ఊడిపడ్డారు. ఈసారి వాళ్ల వెనుక పోలీసు బలగాలు దిగాయి. వారితోపాటు ప్రొక్లెయినర్లు కూడా వచ్చాయి.
ఊరి వాళ్లు స్టే ఆర్డర్ చూపించారు.
అది రెండు రోజుల క్రితమే వెకేట్ అయిందని వేరే పత్రాలు అధికారులు చూపించారు.
లాయర్ని సంప్రదిస్తే నిజమేనని చెప్పాడు. మంగళవారం దాకా కోర్టు సెలవలు కాబట్టి ఏమీ చెయ్యలేమని అతను చెప్పాడు.
ఎమ్మెల్యేని కాంటాక్ట్ చెయ్యబోతే అతను ఢిల్లీలో ఉన్నాడు. తను కూడా రెండు రోజుల్లో వస్తున్నాననీ, అధికారుల అంతు చూస్తానని చెప్పాడు.
అందరి కళ్ల ముందే అధికారులు కూలగొట్టటం ప్రారంభించారు.
మా కొట్టు పరిస్థితి మరీ దారుణం. ప్రొక్లెయినర్ కొట్టిన ఒక దెబ్బకి సామాను సహా నాశనం అయిపోయింది.
టీవీ వాళ్లు వచ్చారు. ఒక అరగంట టీవీలలో చూపించారు. ఇంతలో ఒక రాజకీయ నాయకుడి మీద ఎవరో చెప్పు విసిరిన విషయం దొరికింది. అది కెమెరాల ముందు జరగటంతో చూపించటానికి దృశ్యం కూడా దొరికింది. దీనిని వదిలి టిఆర్‌పి ఎక్కువ ఉండే ఆ విషయం మీద పడ్డారు.
ఆ విధంగా నాన్న జీవనాధారం పోయింది. ఇంకొక చోట కొట్టు పెట్టుకోవటానికి స్థలం దొరకలేదు. ఇక మిగిలింది వ్యవసాయ భూమే! దానికీ రెక్కలొచ్చే రోజు దగ్గరలోనే ఉందనీ, దానికి కూడా ఈ హైవేనే కారణమవుతుందనీ అప్పుడు నాన్నకి తెలియదు.
రోడ్డు వెడల్పు చేసిన తరువాత కానీ ప్రభుత్వానికి ఆ వెడల్పు చాలదని తెలియలేదు. మా ఊరికి బైపాస్ రోడ్ వేయాలని సంకల్పించారు.
సరిగ్గా అది మా పొలం మీదుగా వెళ్తోందంట. మా రెండెకరాలూ రోడ్డుకి అర్పణం అయిపోయాయి. కాంపనే్సషన్ ఇవ్వటానికి పొలం కాగితాలు తెమ్మన్నారు.
ఆ పొలం కాగితాలకి టైటిల్ సరిగ్గా లేదని మాకు డబ్బులేమీ రావన్నారు.
నాన్న హతాశుడయ్యాడు. అన్ని రకాల ఆదాయ మార్గాలు పోవటంతో కూలీగా మారాడు.
చక్కగా చదువుకుంటున్న మా చెల్లెల్ని స్కూలు మాన్పించాడు. కానీ, నన్ను స్కూలు మాన్పించటానికి నాన్న ఒప్పుకోలేదు. నేను బాగా చదువుకుని కుటుంబాన్ని ఉద్ధరిస్తానని నాన్న ఊహ. నేను కూడా అంతే పట్టుదలగా సినిమాలు మానకుండా చూస్తూనే ఉన్నాను.
ఇంతలో మా ఏరియాలో కరువొచ్చింది. వ్యవసాయ భూములు బీళ్లు పడి నెర్రెలిచ్చిపోయాయి. రైతులు వ్యవసాయం చేస్తే కదా నాన్నకి కూలి దొరకటానికి. ఫీజులు కూడా కట్టకపోవటంతో నన్ను స్కూల్లో నుండి పంపించి వేశారు. ఇక ఆ ఊర్లో బ్రతకలేమనే నిర్ణయానికి వచ్చాడు నాన్న.
మా ఊరికి చెందిన ఒక మేస్ర్తి పక్క జిల్లాలో కట్టుబడి పనులు చేయిస్తుంటాడు. అతను ఒక ఐడియా ఇచ్చాడు. కుటుంబం మొత్తం వస్తే తీసుకు వెళ్లి కూలి పనిలో పెట్టుకుంటానన్నాడు. ఉండటానికి చోటు కూడా తనే చూపిస్తానన్నాడు.
ఆ విధంగా మేము కోస్తా ప్రాంతంలోని ఒక మధ్యతరగతి నగరానికి చేరుకున్నాము. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆ నగరంలో కట్టుబడి పనులు విపరీతంగా జరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కాబట్టి వాటి నిర్మాణం అధికంగా జరుగుతోంది.
మమ్మల్ని తీసుకువెళ్లి ఒక నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ సెల్లార్‌లో ఉండమన్నాడు.
నాలుగుపక్కలా ప్లాస్టిక్ పరదాలు కట్టటంతో మరుగు ఏర్పడింది.
ఏమీ లేని స్థాయి నుండి ఏదో ఒకటి ఉన్న స్థాయి చాలా సంతోషం కలిగించింది. మనసులో కోరిక ఉన్నా నన్ను స్కూల్లో చేర్చే ధైర్యం నాన్న ఇక చెయ్యలేడు.
మొదట్లో అలవాటు లేని పని చేయటానికి మా అందరికీ కష్టం అనిపించేది. అయితే మనిషి శరీరం ఎంత గొప్పదంటే దానికి ఏది అలవాటు చేస్తే దానికి అతి త్వరగా అలవాటుపడుతుంది. నెమ్మది నెమ్మదిగా అందరం కాయకష్టానికి అలవాటుపడ్డాం.
నాకు కూడా ఇప్పుడే బాగుంది. ఇంతకు ముందు ఉన్న ఊర్లో రెండు థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇక్కడ పదికి పైగా థియేటర్లు ఉన్నాయి. తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ, ఇంగ్లీషు సినిమాలు కూడా ఆడతాయి. కాబట్టి నాకు సినిమాలు చూడటానికి ఛాయిస్ పెరిగింది. రాత్రి చూడబోయే సినిమా ఉత్సాహంతో పగలు చేసే పని శ్రమ అనిపించటంలేదు.
మేస్ర్తి మాకు దినకూలీ లెక్కకట్టి ఇచ్చేవాడు కాదు. కుటుంబ అవసరాలకు సరిపోనూ ఇచ్చేవాడు. నాన్న కూడా ఆ లెక్కలు అడిగేవాడు కాదు. ఇల్లు కట్టుకోవాలన్నది నాన్న కోరిక. ఇల్లు అనేది మరీ పెద్ద పేరు అనుకుంటే... కనీసం ఒక గుడిసె కట్టుకోవటం ప్రస్తుతం నాన్న కల. దానికి సరిపడే డబ్బు పోగయ్యే వరకు మేస్ర్తి దగ్గరే వాటిని ఉంచటం క్షేమమని ఆయన భావించాడు. నేను కూడా మేస్ర్తి దగ్గర రోజూ నా ఖర్చులకి సరిపడే డబ్బులు తీసుకునేవాడిని. నా దృష్టిలో ఎప్పుడో కట్టుకునే గుడిసె కంటే ప్రతి రాత్రీ చూసే సినిమా చాలా ముఖ్యం. మేస్ర్తికి కూడా ఎవరికి ఏమి విదిలించాలో బాగా తెలుసు. అందుకే నాకు కావలసింది నాకు ఇచ్చేవాడు.
రోజులు ఆనందంగా, ఆహ్లాదంగా కాకపోయినా తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నాయి.
మాకు పని ఇప్పిచ్చిన మేస్ర్తి కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. తనే స్థలం కొని ఒక అపార్ట్‌మెంట్ కటేట స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం అందరం దాని సెల్లార్‌లోనే నివాసం ఉంటున్నాం.
నాకు ఇరవై ఏళ్లు వచ్చాయి.
నాన్న ఆశించిన గుడిసె ఏర్పడలేదు. ఇప్పుడు నాన్న ప్రయారిటీ గుడిసెకి బదులు చెల్లి పెళ్లి అయింది.
ఆ రోజు కూడా ప్రతిరోజులానే పొద్దుగూకేసరికి ఒక థియేటర్ నేల క్లాసులో సెటిలయ్యాను. వెయ్యబోతున్న సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆలస్యానికి ఆగలేనట్లు నేల క్లాసులో కూర్చున్న నా తోటి వాళ్లతో కలిసి ఈలలు వేసి గోల చేస్తున్నాను.
ఇంతలో హాలు లోపలకు వచ్చాడు మల్లికార్జున.
అతనికి నేను కనిపించాను. ఆనందంగా నా దగ్గరకు వచ్చాడు.
‘ఓరిఓరి చంద్రమా..? నువు కూడా సినిమాకొచ్చేవేంట్రా?’ అంటూ నన్ను పలకరించాడు.
మా ఇద్దరిదీ ఒకటే ఊరు. ప్రస్తుతం ఇద్దరం వేరేవేరే మేస్ర్తిల దగ్గర పని చేస్తూ ఇదే ఊళ్లో ఉంటున్నాం.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002